గట్టిమేలు తలపెట్టవోయ్
మంటలు...మంటలు నల్లని పొగలమధ్య నాల్కలు చాస్తున్న ఎర్రని మంటలు! ఆ మంటల మధ్య నిస్సహాయంగా తప్పించుకొనే దిరిలేనట్టు నిలబడిన బస్సు... కదలలేని బస్సుని మరింత ఆనందంగా మంటలు కౌగలించుకున్నాయి. కాలుతున్న బస్సులని. బాణాసంచా కాలుస్తున్నట్టుగా సంబరంగా చూస్తున్నారు భావిభారత పౌరులైన విద్యార్థులు కొందరు. ఇలాంటి దేశానికి భవిష్యత్తు అంధకారం అన్నట్టు చుట్టూ నల్లటి పొగ కమ్ముకొస్తోంది.
ఫైరింజను గణగణలు.. పోలీసుల విజిల్సు.. జనం హాహాకారాలు.. బూట్ల చప్పుడు.. లాఠీచార్జీలు.. టియర్ గ్యాస్ లు. అరగంటకి పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంటలు చల్లారి బస్సులు మాత్రం అస్థిపంజరాల్లా నిలబడ్డాయి. రోడ్డంతా పగిలిన సీసా పెంకులు. రాళ్లు, రప్పలు తప్ప మనుష్యులు లేరు.
ఎందుకు బస్సులు తగలెట్టారు? ఏమో దేనికోసం? తెలీదు.. తెలీదు.. జవాబు తప్ప అసలు సంగతి ఎవరికీ తెలీదు. ఏం లేదు! వడ్లగింజలో బియ్యం గింజ.. సిటీ బస్సెక్కిన విద్యార్థులలో కొందరి దగ్గిర టిక్కెట్ లేదు. కండక్టరడిగాడు... అయ్యా అదీ అపరాధం.. కండక్టరు అతని డ్యూటీ, అతను చెయ్యడం విద్యార్ధులని అవమానించడం.. ఉడుకు రక్తం పొంగింది. ఆఫ్టరాల్ ఓ కండెక్టరు స్టూడెంటుని బస్సు దిగమంటాడా? దిగం... అయితే బస్సు కదలదు.. మాటలు - చేతులు కలిశాయి. రెండు పార్టీలు రెచ్చిపోయారు. మేం లేని బస్సు ఎలా కదులుతుందో చూస్తాం? పంతాలు, పౌరుషాలు - ఫలితం.. బస్సు తగలెట్టారు... జనం పరిగెట్టారు.. ఒకటి.. రెండు... మూడు.. అందిన బస్సులు తగలెట్టి కండక్టరు మీద కక్ష తీర్చుకున్నారు.. బస్సులు తగలెట్టుకుంటే ఇబ్బందిపడేది తామేనని గుర్తించలేని దురహంకారంతో బాణాసంచా కాల్చినట్టు కాల్చారు.
సిటీ కాలేజి ముందు గంటనించి తెల్సిన ముఖం ఎవరిదన్నా కనిపిస్తుందేమోనని తచ్చాడుతున్న అవధానిగారు ఐదారుగురు కల్సి వస్తున్నవారిలో మురళీకృష్ణని గుర్తించి ముందుకెళ్ళారు. "బాబూ.. చిన్నమాట... నీపేరు మురళీ కదు నాయనా..." అనడిగారు.
"మీరా మాష్టారూ... ఏమిటిలా వచ్చారు ఏంకావాలి? ఒరేయ్... హైస్కూల్లో తెలుగు మాష్టారురా ఈయన" అన్నాడు తక్కిన వాళ్ళతో.
"బాబూ.. మీకిప్పుడు ఏం పనిలేకపోతే ఒక్క పదినిమిషాలు నాతో వస్తారా బాబూ చిన్న పనుంది..." అభ్యర్థించారాయన.. కుర్రాళ్ళు మొహాలు చూసుకున్నారు...
"ఏం పనో చెప్పండి మాష్టారూ. రండి ఎక్కడికి వెళ్ళాలి" అన్నాడు మురళీకృష్ణ.
"రండి బాబూ.. రండి.. నేను చెపుతాను రండి, మా యింటికెళదాం.... ఒక్క పదినిమిషాలు చాలు.." అంటూ ఆయన ముందుకు దారితీశారు.
పాతకాలం పెంకుటిల్లు. పెచ్చులూడి పోయిన నేల, సున్నంలేని గోడలు. పెంకులూడిన కప్పు ఆ యింటి శిధిలావస్థని సూచిస్తూంది.
"బాబూ యిదే మా యిల్లు.. ఈ అరుగు మీద కూర్చోండి బాబూ..." అన్నాడాయన ముందున్న వరండా చూపిస్తూ...
"నాన్నా.. నాన్నా.. బాబుని తెచ్చావా? తెస్తానన్నావు తేలేదేమిటి నాన్నా..." అవధాని గారి గొంతు విని చటుక్కున ఒక యువతి పైకి వచ్చి మాష్టారి ఉత్తరీయం లాగుతూ అంది. మాసిన చీర వేళ్ళాడుతున్న జాకెట్టు, తైలసంస్కారంలేని జుత్తు అదోరకం చూపులు.. ఆ మాట చూడగానే ఆమె మతిలేనిదని అందరికీ తెల్సిపోయింది.
"పిచ్చిమొహందానా.. లోపలికి రావే.. ఆయనకి నీ కొడుకు గురించి, నా కాపురం గురించి చింత వుంటే మన బతుకులు ఇలా ఎందుకు తగలడ్తాయ్.. నడు లోపలికి" అంటూ విసురుగా వచ్చిన మరో యువతి వరండాలో వాళ్ళని చూసి మొహం చిట్లించి కొరకొరలాడుతూ తండ్రిని చూసి లోపలికి వెళ్ళిపోయింది.
అవధానిగారు విషాదంగా నవ్వుతూ.... "ఇదీ బాబూ నా బతుకు. కన్నకూతుళ్ళ చేత ఈసడింపబడే బతుకు బాబూ నాది. దౌర్భాగ్యుడిని నాయనా నేను. లాంఛనాలు సరిగా జరిపించలేదని కన్నబిడ్డని అట్టే పెట్టుకుని డబ్బు తెచ్చేవరకు గడప తొక్కొద్దని కూతురిని తరిమేస్తే, కొడుకు కోసం పిచ్చిదయిన ఒక కూతురు- తల తాకట్టు పెట్టి ఎలాగో పెళ్ళిచేస్తే ఇదితే, అదితే అని నిమిషానికోసారి పుట్టింటికి తరుముతుంటే యిక్కడ ఏ గనులూ లేని నేను అడిగినప్పుడల్లా డబ్బీయలేని నా అసమర్థత నా రెండో కూతురు కాపురాన్ని బలిచేసింది. బాబూ చేసే బడిపంతులుద్యోగానికి ముగ్గురాడపిల్లలు. ఇద్దరు మగపిల్లలని దరిచేర్చే శక్తి లేకపోయింది. పెద్దకూతురి పెళ్ళి ఎలాగో అయిందనిపించాను - రెండో కూతురి పెళ్ళికి అప్పు చేశాను - మూడోకూతురి పెళ్ళికి తాతలనాటి ఈ ఇల్లు తనఖా పెట్టాను - ఉన్న యిద్దరు కొడుకులు చావలేక బతకలేని గుమస్తా ఉద్యోగాలు చేసుకుంటూ తమ సంసారాలు ఈడుస్తూంటే యీ సంసారం బరువు వారి నెత్తిన ఎక్కడ పెట్టను. పెట్టినా వాళ్ళు బరువు మోయలేమని ఖచ్చితంగా చెప్పేశారు. యింక నేనేం చెయ్యను బాబూ... మళ్ళీ ఏడే రిటైరవుతాను - చేతికి రావాల్సిన ప్రావిడెంటు ఫండ్ వగైరాలు చేతికిరాక ముందే మూడొంతులు ఖర్చయిపోయాయి. ఏంపెట్టి, ఎక్కడ తెచ్చి యీ ఆడపిల్లల కాపురాలు నిలపను నాయనా.. ఆర్నెల్ల పాలుతాగే పసివాడన్న జాలికూడా లేకుండా డబ్బు తీసుకొస్తే యీ యింట్లో అడుగుపెట్టు అని పిల్లాడిని లాక్కుని పుట్టింటికి తరిమారు ఆ కిరాతకులు - ఆరోజు నుంచి మతి పోగొట్టుకుందీ కూతురు - అనుక్షణం పసివాడి కోసం కలవరిస్తుంది - తిండి, నిద్ర లేకుండా ఏడుస్తుంది. రెండేళ్ళనించి దాని దుఃఖం మాటలతో తప్ప చేతలతో తీర్చలేని అసమర్థుడిని - యింక ఆఖరి కూతురు వుంది నాయనా అది నాలుగు ముక్కలు చదువుకుందేమో.. కన్నతండ్రివి యింత చాతకాని వెధవ్వి ఎందుకు కన్నావు అని నిలేస్తుంది. కనిపిస్తే చాలు సూటిపోటి మాటలు విసురుతుంది. కళ్ళతో నిలువునా దగ్ధం అయ్యేట్టు చూస్తుంది. పాతికేళ్ళ కూతురు మొగుడుండీ మోడులా బతుకుతున్నందుకు నా బాధ దానికేం తెలుసు నాయనా.. డబ్బుండి వాళ్ళడిగింది మొహాన పారేసి కాపురానికి పంపలేదంటే కన్నతండ్రిని నిలువునా చీల్చాల్సిందే - నా బతుకు తెలిసి అదలా అందంటే దాని బాధ దానిది. ఇరుగుపొరుగు అనేమాటలు, చూపులు తట్టుకోడం ఒక ఎత్తు.. ఓ ఆడపిల్ల పుట్టింట్లో పడుండాలంటే పడే బాధ దానిది - ఏం చెయ్యను బాబూ అశక్తుడిని - నాన్నా బాబుని తెచ్చావా అనే ఆ కూతురు - మొగుడింటికి పంపవా అని చూసే యీ కూతురికి మొహం చూపలేక రోజులో పది పన్నెండు గంటలు బయటే తిరుగుతాను.. బాబూ యిదంతా మీకెందుకు చెపుతున్నాననుకుంటున్నారా.." శుష్కనసం చేశారాయన.


