Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 5



    "నీ ఇష్టం వచ్చినట్లు చేస్తేనే నువ్వు సుఖంగా వుండేది. ఆ సంగతి తెల్సుకో! ఇంక నువ్వు నోర్మూసుకో. నే మాట్లాడ్తా" అంది మనస్సు.

    "అంటే నేను...." రిషి సణిగాడు.

    "ఇంక తర్వాత కథ నా ఇష్టం వచ్చినట్లు నడిపిస్తా చూడు ఎంత బావుంటుందో! ముందు పద బయటకెళ్దాం" అంటూ తొందరపెట్టింది.

    రిషి నోర్మూసుకున్నాడు. మనసే మాట్లాడటం ప్రారంభించింది.

    "తలుపు వేసుకోండి. అర్ధగంటలో వస్తా!"

    అమ్మాయి తల వూపింది.

    అతను వెళ్ళిపోయాడు.


       
                                                                *  *  *  *

    రిషి పాలప్యాకెట్ తో బాటు బిస్కెట్స్, బ్రెడ్ కూడా కొనుక్కొని ఇంటికి వస్తుంటే మనసు మొదలెట్టింది.

    'ఇప్పడు ఆ అమ్మాయి స్నానం చేస్తుంటుంది తెలుసా?'

    రిషి ఆ దృశ్యాన్ని వూహించుకో ప్రయత్నించాడు.

    గులాబిరంగు ఒంటిమీద వున్న బట్టలన్ని ఒక్కొటొక్కటిగా తీసి చలికి కొద్దిగా వణుకుతూ భుజాలు దగ్గరికి వేసి మొదటిసారిగా నీళ్ళు మీద పడగానే కళ్ళు మూసుకుని, పెదవులతో ఆ నీటి బిందువులని స్పృశించి, నెమ్మదిగా కళ్ళు తెరిచి.... ఆకాశాన్ని చూసి అమాంతం సిగ్గుపడి చేతులతో వక్షాన్ని కప్పుకుని, కొబ్బరాకులు చంద్రుడ్ని చాటు చెయ్యలేనట్లు ఆమె దాగనంటూ బయటపడిపోతుంటే....

    ఆ సమయంలో దడి తీసుకుని వడివడిగా దూసికెళ్ళి స్థాణువై నిలబడిపోయాడు రిషేంద్ర.

    లేచి నిలబడాలో, అలాగే వుండిపోవాలో తెలీని స్థితిలో ఆమె సగం వంగిన భంగిమలో నిలచిపోయింది!

    రిషి ఉద్విగ్నంగా ముందుకి వెళ్ళాడు!

    తలుపు నుదిటికి కొట్టుకొని బొప్పి కట్టింది. భ్రాంతి కరిగిపోయింది.

    'అబ్బా' అటు నుదురు పట్టుకుని నెమ్మదిగా తలుపుతోసి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.

    ప్రక్క ఇంటి హైమా ఆంటీ, ఆవిడ కూతురు శ్రీజా అక్కడ నేలమీద కూర్చుని అమ్మాయితో కబుర్లు చెప్తున్నారు.

    ఆ అమ్మాయి తలంటుకున్న కురులు ఆరబెట్టుకుంటూ వారి కబుర్లు చిరునవ్వుతో వింటోంది. ఆమె వంటిమీద గులాబీరంగు నైటీ వుంది.

    రిషిని చూస్తూనే శ్రీజ విజిల్ వేసి "వచ్చాడు హీరో!" అంది.

    అందరూ అతని కేసి చూసారు.

    శ్రీజ లేచి కన్నుకొడ్తూ "అమ్మాయి కనపడగానే తీసుకొచ్చెయ్యడమేనా? వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి వెతుక్కుంటారేమో ఎదురుచూడద్దూ!" అంది.

    రిషికి నిజమే అనిపించింది. "ఏమో! అర్ధరాత్రి అలా వదిలేసి రాలేకపోయాను. కాస్త టీ పెట్టు. నేనింకా మొహం కూడా కడుక్కోలేదు." అన్నాడు చేతిలో పాలప్యాకెట్లు బల్లమీద పెడుతూ.

    హైమ గంభీరంగా "ఇప్పుడెలా రిషీ? అమ్మాయికి ఏమీ గుర్తు లేదంటోంది. ఎవరి పిల్లో ఏమిటో ఎలా తెలుసుకోవడం?" అంది.

    రిషి ఆ అమ్మాయి వైపు చూశాడు.

    ఆమె కళ్ళ నిండా నీళ్ళు చేరాయి. బాధని మునిపంట బిగపెట్టి తలవంచుకుని కూర్చుంది.

    "నాలుగు రోజులుపోతే అదే గుర్తుకొస్తుందిలే అప్పటిదాకా నా బట్టలేసుకుంటుంది. ఏం రిషి? అంతేనా! తేలిగ్గా అనేసింది శ్రీజ.

    డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసిన శ్రీజ ఏదీ సమస్యగా అనిపించదు. అన్నీ తేలిగ్గానే తీసుకుంటుంది. వయసుకి తగ్గట్టు ఎదగకపోవడమో లేక వయసుకి మించి ఎదిగిపోవడమో అర్ధంకాదు రిషికి.

    హైమ మాత్రం ఆలోచనగా "అదిసరే.... నువ్వా ఒంటరివాడివి. ఆ అమ్మాయిని నీ ఇంట ఎలా పెట్టుకుంటావు? పోనీ మా యింట్లో పెట్టుకుందామా అంటే నీకు తెలియనిదేముంది? అయితే రోజూ తాగి వచ్చి నానా న్యూసెన్స్ చేస్తుంటాడు" అంది.

    "ఫరవాలేదు ఆంటీ. ఇక్కడే ఉంటుంది ఈలోగా వాళ్ళ వాళ్ళగురించి వాకబు చేస్తాను" అన్నాడు రిషి.

    "ఏమ్మా? వుంటావా?" అడిగింది హైమ.

    ఆ అమ్మాయి అంగీకారంగా తల వూపింది.

    రిషి మొహం కడుక్కోడానికి పెరట్లో వెళ్ళగానే వెనకాలే వచ్చింది శ్రీజ.

    "రిషి.... నా దగ్గర దాచాలని చూడకు. కథ?" అంది.

    "కథేం లేదు" చెప్పాడు రిషి.

    "ఇప్పుడు మొదలెడ్తావా?" కొంటెగా అడిగింది.

    "అరె. రైల్లో కలిసింది, దిక్కులేని స్థితిలో ఒక్కదాన్ని విడిచి పెట్టి రాలేక తీసుకొచ్చాను అంతే!" రిషి చిరాగ్గా అన్నాడు.

    "ఆ సంగతులన్నీ ఆ అమ్మాయి చెప్పిందిలే నాకు కావల్సింది అసలు సంగతి!" అదోరకంగా చూస్తూ అంది శ్రీజ.

    రిషి సీరియస్ గా జామచెట్టు నుంచి ఓ పుల్ల విరిచాడు. "ముందిక్కడ్నుంచి పోతావా పోవా?" అని అడిగాడు.

    "ఎప్పుడు మొదలెడ్తావో చెప్పు" శ్రీజ అంటూ వుండగానే ఆమె నడుంమీద మొదటిదెబ్బ పడింది.

    "అమ్మా.... మాటలతో చెప్పచ్చుగా" శ్రీజ అరిచింది.

    "మనిషికో మాట...." రిషి పూర్తి చెయ్యకముందే శ్రీజ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

    రిషి మొహం కడుక్కుని లోపలికి రాగానే టీ కప్పు అందిస్తూ అంది శ్రీజ "రిషీ! ఈ అమ్మాయిపేరు మనకి తెలీదు కానీ మన వీలు కోసం ఓ చక్కని పేరు పెట్టాను చెప్పనా?"

    "చెప్పు" అన్నాడు రిషి,

    "ఎవరో ఏమిటో తెలీకపోయినా ఆశ్రయం ఇచ్చావుగా ఆశ్రిత అని పెడదాం!" అంది.

    ఆ అమ్మాయి మెరిసే కళ్ళతో చూసింది.

 Previous Page Next Page