Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 5


    జీవితంలో అక్కర్లేనివీ, అనవసరమైనవీ ఎన్నో భరిస్తూ వుంటాం ఎంతో అవసరమైనవీ, వ్యక్తిత్వానికి పరిపూర్ణత తెచ్చేవీ భరించడానికి నిరాకరిస్తూ వుంటాం.
    
    అవతలి వ్యక్తికి వున్న స్థానాన్నిబట్టీ, పరిస్థితులను బట్టీ ఒకమాట పడితే, అది మన వ్యక్తిత్వాన్ని కించపరచుకున్నట్టు కాదు, అవమానం పాలైనట్టుకాదు.
    
    మానను మనం పెంచుకున్నట్టవుతుంది.
    
    జీవితంనుంచి జారిపోతూన్న దాన్ని పదిలపరచుకున్నట్టవుతుంది.
    
వ్యంగ్యమా! తొలగిపో!
    
    ఈ మధ్య నన్ను కలుసుకునేందుకు ఓ చిరకాల స్నేహితుడు వచ్చాడు. నాకంటే ఏడెమినిదేళ్ళు వయసులో పెద్ద. జీవితంలో ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కున్నవాడు. అత్యున్నత పదవులు నిర్వహించి, రిటైరైన వ్యక్తి గొప్ప సంస్కారం కలవాడు కూడా.
    
    కొన్ని నెలలక్రితం ఆయనకు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. చాలావరకూ తగ్గి, కోలుకున్నాడు. ఇప్పుడు చేతికర్ర సాయంతో మామూలుగానే నడుస్తూ తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు.
    
    ఇద్దరం కొంచెంసేపు మనసారా గతం, వర్తమానం.... కలుపుకుంటూ కబుర్లు చెప్పుకున్నాం.
    
    ఆయన ముఖంలో మునపటి ఆత్మనిశ్వాసం తగ్గి ఒకింత బాధ, వేదన ద్యోతకమవుతున్నాయి.
    
    మాటల మధ్యలో అన్నాడాయన మనిషి వ్యంగ్యం అనే దురలవాటునుంచి తప్పించుకోలేకపోతున్నాడు. పక్కవాడి దుఃస్థితి హాస్యంగా వినోదంగా కనిపిస్తుంది. ఎంత చదువు, సంస్కారం వున్నవాళ్ళమైనా ఈ అసహ్యకర ప్రవృత్తిని మానలేక పోతున్నాం.
    
    ఆయన మనసులో సంఘర్షణ తెలుస్తోంది. "నా స్నేహితుడొకరికి బాగా డ్రింక్ అలవాటుండేది. ఆ మధ్య అతనికి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. అతన్ని గురించి చెబుతూ 'ఇదివరకూ గోడలు పట్టుకుని నడిచేవాడు. ఇప్పుడూ అలాగే నడుస్తున్నాడు. తేడా అల్లా ఏమిటంటే అప్పుడు ఆన్ మీద వుండి, ఇప్పుడు స్ట్రోక్ వచ్చి'అని వ్యంగ్యంగా అనేవాణ్ణి బహుశా అతన్ని గురించి అలా వ్యంగ్యంగా మాట్లాడినందువల్లే ఈరోజీస్థితి నాకు వచ్చిందనుకుంటాను."
    
    ఇలాంటి సెంటిమెంట్ వున్నధోరణి ఇదివరకెప్పుడూ ఆయనలో చూడలేదు. ఆయన మేధావి. భగవంతుడి మీద గొప్ప నమ్మకమూ లేదు, అపనమ్మకమూ లేదు. తనకొచ్చిన ఈ షాక్ వల్ల ఇప్పుడు ఇలాంటి భావాలు కలుగుతున్నాయి.
    
    ఇది ఎవరిమీదా విమర్శకాదు. బాధతో, వేదనతో కూడిన ఓ పరిశీలన.
    
    వ్యంగ్యం అనేదానికి మనం ఎంత సులభంగా లోనవుతున్నాం!
    
    ఇతరుల దుఃఖం మనకు వినోదంగా కనిపిస్తుంది.
    
    ఇప్పుడు మనం ఈ అంశాన్ని గురించి కొంచెం లోతుగా వెడదాం.
    
    ఒకరి బాధ ఇంకొకరికి వినోదం కలిగించటమేమిటి?
    
    ఒకరు ముద్దగానో, నత్తిగానో మాట్లాడితే మనకి వినోదం ఒకడు లావుగానో, మరీ పొడుగ్గానో వుంటే మనకి వినోదం ఒకడు వికృతంగా వుంటే మనకి వినోదం ఒకడు నడుస్తూ రోడ్డుమీద జారిపడితే మనకి వినోదం.
    
    వాళ్ళ బాధల్లోకీ, దుఃఖంలోకీ మనం ఎందుకు సానుభూతిగా జొరబడలేక పోతున్నాం?
    
    అది మనం హాస్యమనుకుంటున్నామా?
    
    మనసారా నవ్వుకునేది హాస్యమవుతుంది. పరిహసించేది హాస్యమెలా అవుతుంది? అందులో దుర్మార్గం మిళితమై వుంటుంది.
    
    అంటే మనలో దుర్మార్గం మిళితమై వుందా?
    
    ఈ నిజాన్ని మనం అంగీకరించలేకపోవచ్చు కాని ఇష్టపడుతున్నాం.
    
    ఒకరి బాధలకు సాయపడకపోతే పోనీ, స్పందించి సానుభూతి చూపించకపోతే పోనీ, ఎగతాళి దేనికి? అసలందులో ఎగతాళి చేయటానికేముంది? మానవత్వం మానవత్వం అని పదేపదే కబుర్లు చెపుతున్నా మనలో మానవత్వంలేదు. అలా జీవిస్తున్నందుకు సిగ్గనిపించటం లేదా?
    
    ఇందాక నా స్నేహితుడు పశ్చాత్తాపపడినట్లు ఒకరిగురించి వ్యంగ్యంగా మాట్లాడితే, ఒకానొకనాడు అలాంటి కష్టం మనకూ వస్తుందన్న భావనలో నిజమున్నదో లేదో నాకు తెలీదు. కాని ప్రతివారికీ ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో కష్టమొచ్చి తీరుతుంది. కష్టంనుంచి మనిషి తప్పించుకోలేడు.
    
    నీకొచ్చిన కష్టాన్ని నువ్వు భరించలేవు. విలవిల్లాడిపోతావు. కాని ఇతరుల కష్టాన్ని చూసి చలించకపోగా ఆనందిస్తావు. ఒక వ్యంగ్యోక్తి సంధిస్తావు. పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకోలేక ఒకడు ఇల్లమ్ముకుంటే, అతడు అపహాస్యాల పాలవుతాడో, వయసు మీరిపోతున్నా పెళ్ళి కాకుండా మగ్గిపోతున్న ఆడపిల్ల ఎన్ని వ్యంగ్యోక్తులు భరించాల్సి వస్తోందో, సినిమా నటులుగా ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగు ఆరిపోయిన తర్వాత అతడు లేక ఆమె విధి విన్యాసాలలో నలిగిపోతూంటే ఎన్ని పరిహాసాలకు గురవుతారో...ఎన్నిరంగాల్లో.... ఈ పరాజయాలతో ఒకపక్క సతమతమవుతూంటే మరోపక్క ఈ వ్యంగ్యంతో కూడిన చిత్రవధలు!    
    
    వ్యంగ్యం పక్కవాణ్ని ఎంత కాలుస్తుందో, మిమ్మల్నీ అంతే కాలుస్తూ వుంటుందనీ, ఆ కాల్పుల వల్ల మీరు వ్యక్తిత్వంలో, విశిష్టతలో, ఔన్నత్యంలో సమాజంలో మీకున్న స్థానంలో, ఇతరుల ముందు పొందే గౌరవంలో.... దిగజారిపోతున్నారనీ, మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటున్నారనీ, దానివల్ల జీవితవిలువల్లో చాలావాటికి దూరమవుతున్నారని తెలుసుకోండి.
    
    మీరు మారటం ఇష్టంలేదా? గుర్తు తెచ్చుకోండి కొంచెం ఎదిగి ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు ఇతరుల్ని వేళాకోళానికి గురి చేశారో, ఇతరుల వేళాకోళానికి గురైనప్పుడు మీ మనసెంత వేదనకు చెందిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి వుంటారో గుర్తుచేసుకోండి.
    
    వ్యంగ్యాన్ని వృధా చేసుకున్న జీవితానికీ, వ్యంగ్యం లేకుండా నిర్మలంగా వున్న జీవితానికీ తేడా అందులోని మాధుర్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలా జీవించగలగటం మహాయజ్ఞమేం కాదు. కఠిన తపస్సేమీ కాదు. అసాధారణ సాధనేం కాదు.
    
    మీలో చిన్న ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఇష్టంగురించి ఆవిర్భవించే చిన్న కదలిక.
    
    ఇప్పుడు ప్రేమలోకి ప్రవేశిస్తున్నాం.
    
    ప్రేమ...

    ప్రతిక్షణం ప్రపంచంలో ప్రతిధ్వనిస్తూన్న శబ్దం.
    
    మా ఇంటికి ఒకాయన వస్తూ వుంటారు.
    
    ఆయన మహామేధావి. ఒక రోజాయన్ని "ప్రేమంటే ఏమిటి?" అనడిగాను.
    
    ఆయన నావంక...సూటిగా నా కళ్ళలోకి చూశారు. నా కళ్ళు చాలా నిశితంగా వున్నాయి కసిగా వున్నాయి.
    
    "ప్రేమ" అన్నారు. ఆ గొంతులో ఏవేవో భావాలు జీవితాన్ని తరచి చూసిన లోతులు ధ్వనిస్తున్నాయి. "ఏదైతే ఎల్లెడలా వ్యాపించివున్నదో, ఎల్లెడలా వ్యాపించి వున్నట్లు భ్రమింపచేస్తూ వుంటుందో, ఏదైతే అసలు లేదో, ఏదైతే అతితేలిగ్గా లభిస్తుందో, ఏదైతే ఎంత శ్రమించినా అసలు లభించదో, ఏదైతే ఎప్పటికప్పుడు అందినట్లు అంది జారిపోతూ వుంటుందో, ఏదైతే పరమ సంతోషమో, ఏదైతే ఘోరదుఃఖమో, ఏదైతే మహోన్నత సుఖమో, ఏదైతే హృదయవిదారక విషాదమో ఏదైతే శూన్యమో, ఏదైతే అనుభవించేవారికి గొప్పగా వుండి పక్కవారికి హాస్యస్పధంగా గోచరిస్తుందో, ఏదైతే నిరంతరమైన రంపపుకోతో, ఏదైతే మీ జీవితధర్మాల నుంచి దూరంగా విసిరేస్తూ వుంటుందో, ఏదైతే మిమ్మల్ని లేని అధికారాలను చలాయిస్తూ వుండేలా చేస్తుందో, ఏదైతే నిన్ను చేయని నేరానికి నిత్యం దోషిగా, పిరికివాడుగా నిలబెడుతూ వుంటుందో, ఏదైతే పొందినా తృప్తిలేకుండా చేస్తుందో, ఏదైతే తోడుగా భ్రమింపజేస్తూ ఆ తోడును జటిలంగా రూపొందిస్తూందో, ఏదైతే శాశ్వతమైన అశాశ్వతమో, ఏది గొప్పభావనో, ఏది ఆ భావనా బలంతోనే కాలభ్రమణాన్ని కదలింపజేస్తూ ఉంటుందో, ఏది నిరంతరం ఆత్మవంచనలకు గురిచేస్తూ వుంటుందో, అయినా వీటన్నిటి మేళవింపులతో ఏది సత్యమో... అదే ప్రేమ!"

 Previous Page Next Page