ఆవేశంగా విదిలించుకుంది. ధీర. "లేదు ఆర్తీ! నేను రెస్ట్ తీసుకోలేను. అయినా ఎలానే....... ఇంత జరిగాక నేను దయాకర్ ని ఎలా మరిచిపోను?"
"తప్పదే.......మరిచిపోవాలి. నీ జీవితం పూర్తిగా అన్యాయం కాకముందే దేవుడు నీకు న్యాయం చేశాడని తృప్తిపడాలి. అవును దీరా! ఒకవేళ నువ్వు శ్యాంకి డైవర్స్ యిచ్చాక దయాకర్ యిలా నిన్ను కాదంటే మరింత షాక్ తినేదానివి కదూ! సో.... జరిగింది పీడకలనుకో, శ్యాంతో బుద్దిగా కాపురం చేసుకుంటూ బ్రతుకు."
విప్పారితంగా చూస్తూంది ధీర.
ఆమె చూపులు ఆర్తిని కంగారుపెడుతుంటే "నేను నిజాయితీగానే అంటున్నాను ధీరా!" అంది తొట్రుపాటుగా.
నిస్త్రాణగా నవ్వింది ధీర. "నేను నీ నిజాయితీని శంకించడంలేదు ఆర్తీ! నాలా ఊబిలో కూరుకుంటే తప్ప అర్ధంకాని స్థితి గురించి నువ్వు మాట్లాడుతుంటే ఈ ప్రపంచంలోని మనుషులు మరొకర్ని ఎంత సులభంగా ఓదార్చాలని ప్రయత్నించగలరో అర్ధంచేసుకుంటున్నాను"
ఆర్తి మనసు కలుక్కుమందేమో రిటార్ట్ లా అంది "ఇలాంటి ప్రమాదము గురించి నేను ముందే హెచ్చరించానే."
"నువ్వు హెచ్చరించావు. నేను విననని మొండికేశాను. అవునా?"
"కానీ ఇప్పుడు జరిగిందేమిటి?"
"నువ్వు ఎక్స్ పెక్ట్ చేసిందే కావచ్చు ఆర్తీ! కానీ నేను రిపెంట్ కాదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఆజాతికి చెందిన ఆడదాన్ని కాదు కాబట్టి" ధీర మళ్ళీ బాటిల్లంచి విస్కీ గడగడా తాగింది.
ఆమెకి తోచడంలేదు. ధీర ఆ తర్వాత ఏం చేసినాగానీ ఇప్పుడిలా కాన్ సెంట్రేటెడ్ గా డ్రింక్ ని తాగేస్తూ పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోతూంది.
"ఇక తాగడం మాని మామూలుగా ఆలోచించు ధీరా" అర్ధింపులా అడిగింది ఆమె.
"నీకు తెలీదు ఆర్తీ! బాధని తట్టుకోటానిగ్గాని, గుండెని దిటవుపర్చుకుని సమస్యని ఎదుర్కోటానిగ్గాని లిక్కర ఎంత సహకరిస్తుందో నువ్వు టేస్ట్ చేస్తేగాని అర్ధం చేసుకోలేవు"
"ఇప్పుడేం చేద్దామని?" ధీరని నిలదీసిందామె.
"దయాకర్ కి ఫైనల్ గా ఓ అల్టిమేటమ్ యివ్వాలనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్యా వున్న సంబంధాన్ని తెలియచెప్పే ప్రేమలేఖల్ని అతడికి చూపించి నన్నువదిలించుకోవాలని చూస్తే రచ్చకెక్కుతానని బెదిరిస్తాను. నేను సుఖపడలేనప్పుడు అతడూ సుఖపడకూడదని స్పష్టంగా చెప్పి నా దారికి మళ్ళించుకుంటాను" ధీర ఆవేశంగా ఫోన్ రిసీవరు అందుకుని దయాకర్ కి ఫోన్ చేసింది.
మరో అరగంటలో అతడిని హోటల్ కి రమ్మని ఓ ఆదేశంలా అంది.
ఏం జరగబోతూంది?
నిశ్చేష్టతగా చూస్తున్న ఆర్తి ధీరకి మరోసారి నచ్చచెప్పబోయింది. "ఆవేశంతోకాక కూల్ గా ఆలోచించు ధీరా! ఈ రాత్రికి యిక్కడే వుండి......"
"నో!" క్రోధావేశాలతో కంపించిపోయింది ధీర. "దయాకర్ తో తాడో పేడో తేల్చుకునేదాకా నేను రిలాక్స్ కాలేను"
"అదికాదే....." నచ్చచెప్పబోయిందామె.
"ఆందోళనగా వుంటే రెండు పెగ్గులేసుకుని పడుకో."
సగం తాగిన విస్కీ బాటిల్ ని అక్కడే విడిచి వెళ్ళిపోయింది ధీర.
ధీర కథ ఒక అనూహ్యమైన మలుపు తిరగటానికి కారణమైన రాత్రి అది.
* * *
ఏ అధ్యాయాన్నైనా రాయగల కలంలా, ఏ నినాదాన్నైనా పలకగల గళంలా అనిపించిన ధీర అంతపని చేయగలదని ఆ తర్వాత గాని ఆర్తికి అర్ధం కాలేదు.
కాలేజీ రోజుల్లో ముగ్ధ దరహాసంతో ప్రదర్శిస్తూ అవసరమైతే అణుబాంబులా బ్రద్దలు కాగలదనిపించే ధీర...... ఆశయాల శవపంజరంలో చిక్కి యిలా మహాభినిష్క్రమణానికి సిద్ధపడుతుందని ఆమె కూడా వూహించలేకపోయింది.
రెండు రోజుల తర్వాత ఉదయమే శ్యాం వచ్చాడు ఆర్తి ఇంటికి. ధీర హోటల్లోనే ఆత్మహత్య చేసుకుందనీ, ఆమె వాలెట్ లో దొరికిన అడ్రసుని బట్టి పోలీసులు శ్యాంని పిలిపించారని చెప్పాడు.
శవం యిప్పుడు ఉస్మానియా మార్చ్యురీలో వుంది.
శ్యాం కళ్ళలో నీళ్ళు చూస్తుంటే మబ్బుల చెదలు తినేసిన చందమామలా వున్నాడు.
అనూహ్యమైన విషయం విన్న ఆమె ముందు అవాక్కయింది. వెంటనే శ్యాంతోపాటు హాస్పటల్ కి వెళ్ళింది.
మార్చ్యురీలో వున్న ధీరని చూడగానే ఆమెకి దుఃఖం ఆగలేదు.
తన జీవితానికి తానే గాలం వేసుకుని కాలం ఎరచేత కొరుక్కుతినేయబడ్డట్టుగా వుంది. మనసు కాగితాలపై రాసుకున్న ప్రేమ కావ్యాల్ని అగ్ని నాలుకల ఆలోచనలతో తనకు తానే కాల్చుకున్నట్టు నిశ్శబ్దంలా నీరవంలా అనిపిస్తూంది.
విషం తాగి చనిపోయిందట.
పోస్ట్ మార్టం రిపోర్టులో విషం లిక్కర్ లో కలుపుకుని తాగినట్టు తేలింది.
శ్యాంని ఓదార్చడం ఆర్తికి సాధ్యపడలేదు.
ఏదో ఒకరోజుకి తన మనిషిగా తిరిగి వస్తుందనీ, గాయమైన ఆమె గుండెలకి ప్రేమని అరకుగా రాసి ఓదార్చాలనీ పాపం ఎంత తపించాడో. పసిపిల్లాడిలా వెక్కిపడుతున్నాడు.
అదికాదు ఆమెని కలవరపరిచింది.
సమీపంలో దయాకర్ జాడలేదు. అంటే తన దగ్గరున్న ప్రేమలేఖల్నిధీరముందే చింపేసిందా? ఒకవేళ అవి వుంటే దయాకర్ ని ఇంటరాగేట్ చేసేవారుగా.
మనసు మండుతున్న ఖాండన వనమై ఆమెని కలవరపెడుతుంటే - మరో గంటకల్లా టాక్సీని మాట్లాడుకున్న శ్యాం శవాన్ని వైజాగ్ తరలించటానికి ప్రిపేరయ్యాడు.


