నవ్వాడు ఆనంద్.
"టీవీ చూడడమా! అది నాకు ఇష్టమైన పనేగా!"
"ఇరవై నాలుగు గంటలు చూడాలి" అంది శృతి.
"చూడకపోతే మధ్యలో మానేసినా మానేయవచ్చుగానీ ఎంతసేపు చూడగలవన్నది ఎక్స్ పెరిమెంటు."
"ఓ యస్ గా!" అన్నాడు ఆనంద్.
"కమ్ డియర్!" అని అతన్ని అల్లుకుపోతున్నట్లుగా ఆనుకుని లోపలికి తీసుకెళ్ళింది శృతి.
ఆ ప్రయోగం కోసం ఆమె చేసిన ఏర్పాట్లు చిత్రంగానే వున్నాయి.
ఆ గదికి ఒకే ఒక్క తలుపు తప్ప వేరే కిటికీలూ అవీ ఏమీ లేవు. లైట్లు వేస్తే అది పగలో రాత్రో అంతుబట్టని పరిస్థితి!
అక్కడ చాలా సౌకర్యంగా వుండే సోఫా ఒకటి వుంది. ఆ పక్కనే కోక్ సీసాలు...కేకులు...చిప్సు...పేస్ట్రీలు.
"నువ్వు కూడా నా పక్కన వుంటే ఇంకా మజాగా వుంటుంది" అన్నాడు ఆనంద్.
"ఆశ! నేను పక్కగదిలో ఉండి రీడింగ్సు చూడవద్దూ?" అంది శృతి నవ్వుతూ, అని చెప్పి "ఇప్పుడే వస్తా!" అంటూ పక్క గదిలోకి వెళ్లింది శృతి.
కొద్ది నిముషాల తర్వాత తిరిగి వచ్చిన శృతి మొహంలో విపరీతమైన టెన్షను కనబడుతూ వుండడం గమనించాడు ఆనంద్. ఆమె అందమైన ముక్కు చివర చిన్న చిన్న స్వేదబిందువులు నిలిచి, వజ్రాల పొడిలాగా వెలుగు పడ్డప్పుడల్లా మెరుస్తున్నాయి. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు త్వరత్వరగా వస్తున్నాయి. ఆమె చేతిలో ఒక చిన్న బాటిలు వుంది.
ఆనంద్ తో అన్నది శృతి.
"ఇందులో ఇంకొక ఎక్స్ ట్రా టెస్టు ఏమిటంటే - ఇదిగో ఈ బాటిలు నీ జేబులో పెట్టుకోవాలి"
"ఇందులో ఏముందీ?" అన్నాడు ఆనంద్ అనుమానంగా.
"నేను సీలు ఓపెన్ చెయ్యని షాంపేన్ సీసాలాగా వుంటానంటావుగా! ఇది సీలు ఓపెన్ చేస్తే ప్రళయం సృష్టించే బాటిలు అనుకో!"
"అంటే"
"అది తర్వాత తెలుస్తుంది. దీనిని నువ్వు దొంగతనంగా బయటికి తీసుకురావాలని చెప్పాననుకో! అప్పుడు నీ బ్లడ్ ప్రెజర్ ఇంకా పెరిగిపోతుంది. అలా హై బీపీ ఉన్నప్పుడు టీవీ చూస్తుంటే రీడింగ్సు ఎట్లా వుంటాయన్నది నా రిసెర్చిలో ఒక భాగం!"
"బీపీ పెరగడానికి బాటిలే ఎందుకూ? నువ్వు పక్కన వుంటే చాలుగా!"
"చాల్లే! సరసాలకి ఇది సమయం కాదు!" అని సరదాగా చెప్పిం బయటికి వెళ్ళి తలుపేసుకుంది శృతి.
రిమోట్ కంట్రోలు చేతిలోకి తీసుకున్నాడు ఆనంద్.
టీవీ ఛానెల్సు సర్ఫింగ్ చేయడం మొదలెట్టాడు.
'రెస్ట్ రూం' అనబడే టాయిలెట్ లోకి వెళ్ళి సెల్ ఫోన్ తీసింది శృతి.
"అభిరాం?"
"చెప్పు" అన్నాడు అభిరాం. అతని గొంతులో ఆతృత వినబడుతోంది.
"బాటిలు ముసలాడి జేబులో పెట్టగలిగాను"
"ముసలాడు నీ జేబులో బొమ్మలాంటివాడే గదా!" అని నవ్వాడు అభిరాం.
"నాకు చాలా భయంగా ఉంది అభిరాం.
"ఇరుక్కుంటే వాడే ఇరుక్కుంటాడు! మనకేం భయం లేదులే!"
"అసలు మనం చేస్తున్నది కరెక్టేనా?"
"తప్పు మాత్రం కాదు. తప్పదు కూడా!"
"ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడించిన మహమ్మారి మశూచికం క్రిములు అందులో వున్నాయి అభిరాం!"
"అఫ్ కోర్స్! ఆ సంగతి నాకు తెలుసు!" అన్నాడు అభిరాం పైకి.
"అందుకే కదా ఆ బాటిల్ తేవాలని నీతో చెప్పిందీ!"
మనసులో మాత్రం ఇంకోలాగా అనుకున్నాడు అతను.
'ఎక్కడ ఆ బాటిలు సీలు ఓపెన్ చేస్తే, అక్కడ మశూచికం మళ్లీ ఉధృతంగా వ్యాపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా స్మాన్ పాక్స్ అనేదే లేకుండా చేశామని విర్రవీగుతున్నాడు సైంటిస్టులు, నమూనా కోసం మశూచికం క్రిములని కొన్ని వియాల్స్ లో వుంచి అక్కడక్కడా భద్రపరిచారు. ఒకటేమో ఈ శృతి, దాస్ గాడి కూతురు -రిసెర్చి చేసే ఇన్ స్టిట్యూషన్ లో వుంది. అది దాని డాడీలాగే పెద్ద కిలాడీ! దాన్ని దొంగిలించి ముసలాడి జేబులో పెట్టేయగలిగింది. ముసలాడు దాన్ని బయటికి తెస్తాడు. అది నా చేతిలో పడుతుంది. నేను గనక ఇండియాకి రాజుని కాలేకపోతే, మహమ్మారి మశూచికాన్ని మళ్ళీ వదిలి, ఇండియాని సర్వనాశనం చేస్తా! తప్పదుగాక తప్పదు! అనుకున్నాడు అభిరాం.
"నాకు భయంగా వుంది అభిరాం!" అంది శృతి మళ్ళీ.
"నేనున్నానుగా! నేను ఏం చేసినా కూడా అది విశ్వ మానవ కళ్యాణానికే అని నీకు తెలుసు!" అన్నాడు అభిరాం.
తను చేస్తున్నది తప్పో కాదో తేల్చుకోలేకపోతోంది శృతి.
ఒకదాని తర్వాత ఒకటిగా టీవీ ఛానెల్సు చూస్తున్నాడు ఆనంద్. కానీ అతని దృష్టి వేటిమీదా నిలవడం లేదు.
ఇప్పటివరకూ తను చేసిన తప్పులెన్ని?
తను చేసిన ఒప్పులెన్ని?
తాజాగా మళ్ళీ కొత్త తప్పులు చేస్తున్నాడా తను?
ఆలోచనలో పడ్డాడు ఆనంద్.
* * * *
"అమ్మకి బొత్తిగా బాగాలేదు. నువ్వు ఒక్క నిమిషం అమ్మ దగ్గర ఉంటే నేను ఆటో పిలుచుకుని వస్తాను" అంది అరుణ, పక్కింటి చీఫ్ ఇంజినీర్ గారి తోటమాలితో.
"మీరు వుండండి. నేను పరుగెత్తుకెళ్ళి ఆటో తీసుకువస్తాను" అంటూ గబగబ వెళ్ళిపోయాడు అతను.
ఆటో వచ్చింది.
ఆయాసపడుతూనే అతి కష్టం మీద ఆటో ఎక్కింది జాహ్నవి.
కానీ, ఒక కాలు మాత్రం ఆటో బయటే ఉండిపోయింది. అరుణ పాదం పట్టుకుని పైకి ఎత్తి సాయం చేస్తే తప్ప ఆమె తన కాలుని లోపలికి తీసుకోలేకపోయింది. ఆటో ఎక్కింది గానీ సరిగ్గా కూర్చోలేకపోతోంది జాహ్నవి.
"యాడికి?" అన్నాడు ఆటో వాలా.
చెప్పింది అరుణ.
"వందరూపాయలు ఇవ్వాల"
వళ్ళు మండింది అరుణకి.
"ఏం మీటరు లేదా?'
"మీటర్ తో నడిపిస్తే ఏం మిగుల్తదమ్మా!"
కోపాన్ని ఆపుకుంటూ అన్నది అరుణ.
"ఈమెకి వంట్లో బాగా లేదు. అర్జెంటుగా డాక్టరు దగ్గరికి వెళ్ళాలి."
"ఆటో ఉరికిస్తా! ఎక్కండ్రి"
"మీటర్ ప్రకారమే!"
"ఆఖరిమాట! ఇరవై ఇవ్వుండ్రి."
"వెళ్ళాక అయిదో పదో సంతోషంగా ఎక్కువ ఇచ్చేదాన్నేమో గానీ, ముందే బేరమాడితే ఇచ్చేరకాన్ని కాదు. మీటర్ వెయ్యి!"
"దిగు! దిగూ!" అన్నాడు ఆటోవాలా మొరటుగా.
"దిగను! నేరుగా పోలీసు స్టేషన్ కి పోనివ్వు" అంది అరుణ ఆగ్రహంగా.
పొగరుగా చూశాడు ఆటోవాలా.
"పోలీస్ స్టేషనుతో పనియేం వుంది! సక్కగా ఇన్ స్పెక్టరు సాబ్ సొంత ఇంటికె తీసుకెళ్త! ఈ ఆటో ఆయనదే! ఇదొక్కటే కాదు - ఇంకా ఇరవై ఉన్నయ్"
"పోలీసు ఇన్ స్పెక్టరు ఆటోలు అద్దెకు తిప్పుతున్నాడా?" అంది అరుణ ఆశ్చర్యంగా.
"మీటరు ఎక్కువ తిరిగేటట్లు ఫిక్స్ చేయించుకున్నాడు కూడా! గవర్నమెంటు జీతాలు తినేవాళ్ళే గిట్ల చేస్తుంటే, గరీబోళ్ళం కాసిని పైసలకోసం ఆశపడడం తప్పా? పోనీ యాభై ఇవ్వు. వెళ్ళిపోదాం"
"రిపోర్టు చేస్తాను" అంది అరుణ.
"దిక్కున్నచోట చెప్పుకో! వాళ్ళు నిన్ను చూసి నవ్వకుంటే నా పేరు నాగరాజే కాదు" అన్నాడు తను నిర్లక్ష్యంగా.
ఈ గొడవంతా చూస్తున్న జాహ్నవి, తను అలవికాని బాధలో ఉన్నా కూడా అప్పటికే ఆటో దిగేసింది.
ఇలాంటి విషయాల్లో అరుణ వెనక్కి తగదని ఆమెకి తెలుసు. ఎందుకొచ్చిన గొడవ!
ఈలోగా -
చాల పాతదిగా కనబడుతున్న ఒక డొక్కు ఆటో వచ్చింది. అక్కడ ఆగింది. అప్పటికే అందులో కొందరు పాసెంజర్లు ఉన్నారు.
ఏ నిమిషాన ఏ నట్టు ఊడిపోతుందో, ఏ క్షణాన ఏ బోల్టు వూడిపోతుందో అన్నంత శిథిలావస్థలో వుంది ఆ ఆటో.
అది అసలే ఎత్తుపల్లాల కొండ ప్రదేశం. బ్రేకు ఫెయిలయితే ఆటోలో ఉన్న వాళ్ళకేగాక బయటవున్న వాళ్ళకి కూడా ప్రాణాపాయం!


