"అదేనా నీ రీసెర్చి?" అన్నాడు ఆనంద్ సరసంగా.
"అది నా మనసు విషయం. నా సబ్జెక్టు వేరే! మనుషులమీద టీవీ ప్రభావం ఎట్లా ఉంటుందని. ఆ రీసెర్చిలో మీరు నాకు వాలంటీర్. ఏకధాటిగా ఇరవైనాలుగు గంటలసేపు టీవీ చూస్తే, అది షుగరూ, బీపీ, డయోబెటిక్ రెటినోపతీ వల్ల కళ్ళు పాడయిపోతున్న వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయం మీద ప్రయోగం! యూ ఆర్ ఏ పర్ ఫెక్ట్ స్పెసిమెన్ ఫర్ బీయింగ్ ఏ వాలంటీర్ సర్!"
"రోగిష్టి వాణ్ణంటావ్!"
"మీ అసలు రోగానికి వేరే ఎక్స్ పెరిమెంట్సు ఉన్నాయి లెండి - ప్రేమరోగం!"
కులాసాగా నవ్వాడు ఆనంద్.
నాట్ బాడ్! - నాట్ బాడ్ అటాల్!
అరవై దాటినా ఇరవయ్యే అన్నట్లుగా ఉంది తన పని!
లేకపోతే -
'డబుల్ కా మీఠా' అనే బ్రెడ్డుతో చేసే స్వీటులాగా వున్న ఈ ఇరవయ్యేళ్ళ చిన్నది, తనతో డబుల్ మీనింగ్ డైలాగులా!
నక్కతోక తొక్కి వచ్చాడు తను ఇవ్వాళ!
స్త్రీ వ్యామోహంలో పడిపోవడం అనేది ఆనంద్ జీవితంలో అప్పటికి ఏ అరవయ్యోసారో అయి వుంటుంది.
తలలు బోడులయిన తలపులు బోడులా!
"టీవీకి బదులు నిన్నే ఇరవై నాలుగ్గంటలూ చూస్తూ కూర్చునే ప్రయోగం పెట్టరాదూ?" అన్నాడు సరదాగా.
"ఆ యోగం త్వరలోనే పడుతుంది సర్!" అంది శృతి కవ్వింపుగా.
"సీలు విప్పని షాంపేన్ సీసా!" అన్నాడు ఆనంద్ మళ్ళీ ఇంకోసారి - తమకంగా.
సీలు విప్పితే చాలు ప్రళయం సృష్టించే ఇంకో సీసా గురించే ఆలోచిస్తోంది శృతి.
ఇద్దరూ లాబ్ లోకి నడిచారు.
* * * *
ఆడపిల్లకి వయసు వచ్చినా, స్థలానికి విలువ హెచ్చినా ఇంక అందరి దృష్టీ అక్కడే! అది బాగా అర్థం అయింది జాహ్నవికి. మరీ ముఖ్యంగా - ఆ దాస్ గాడి మాటలతో!
వాడు నిన్న వచ్చాడు. అరుణ పక్కింట్లో డాక్టరు వెంకయ్యగారి మతిచలించిన భార్య శారదమ్మకి పేపర్లు చదివి వినిపిస్తున్న టైంలో -
వీలు చూసుకుని మరీ వచ్చాడు.
తను ఇంట్లో వంటరిగా వున్నప్పుడు.
పూజకోసం నందివర్ధనం పూలు కోస్తోంది జాహ్నవి. తన వెనకే ఎవరో నిలబడి వున్నట్లు అనిపించి చటుక్కున వెనక్కి తిరిగింది.
అక్కడ నిలబడి ఉన్నాడు దాస్!
అతను నల్లటి నలుపు. అ రోజే రంగు వేసినట్లున్న జుట్టు మొహం కంటే నల్లగా కనబడుతోంది. దానికి తోడు నల్ల కళ్ళద్దాలు! కాంట్రాస్టుగా ఫెళఫెళ్ళాడే లాగా గంజి పెట్టిన అతి తెల్లటి పొందూరు ఖద్దరు కుర్తా పైజమా! కాళ్ళకి తెల్ల రీబోక్ షూస్.
మొహమంతా పరుచుకుని ఉన్నట్లుగా కనబడుతున్న వెడల్పాటి ముక్కుని ఎగబీల్చడం అతనికి అలవాటులాగా వుంది. అతని హెయిర్ స్టయిల్ నుదుటికి రెండువైపులా కిందికి గుండ్రంగా వంపు తిరిగి వుండడం, అతను వేసుకున్న లాల్చీ అంచులు తమాషాగా తోకల్లాగా కత్తిరించి వుండడం చూస్తే ఒక్కటే అనిపించింది జాహ్నవికి.
మృగం!
'బ్రుట్' అనే పేరుగల పెర్ ఫ్యూమ్ రాసుకుని ఉన్నాడు దాస్.
ఆ సెంటు మరీ ఎక్కువగా రాసేసుకోవడం వల్ల అది 'బ్రూట్' - అంటే మృగం తాలూకు గబ్బులాగా వుంది.
రెండు కాళ్ళు, నాలుగు తోకల మృగం!
ఆమెని మరీ తాకుతున్నట్లుగా నిలబడ్డాడు దాస్. నుదురు చిట్లించి, దూరంగా జరిగింది జాహ్నవి.
చాలా ఛీప్ గా చెప్పడం మొదలెట్టాడు దాస్ - చౌకబారు సినిమా డైలాగుల పరిభాషలో. అతనిమీద మాస్ సినిమాల ప్రభావం చాలానే వుంది. అతను అప్పటికే అరడజనుకి పైగా సినిమా పాటలు రాసి రెడీ చేసి పెట్టుకున్నాడు కూడా - రేపు తను తీసే మాస్ సినిమాలో పెట్టడానికి.
అదే ఊపులో అన్నాడు.
"ఇంతికి ఈడు వచ్చినా, ఇంటికి విలువ హెచ్చినా ఇంక అందరి చూపులూ అక్కడే! వింటున్నావా? మీ అమ్మాయ్ అరుణ ఈడొచ్చిన ఆడపిల్ల! ఇహ ఇల్లంటావా? ఎకరం పాతిక రూపాయలు ఖరీదు చేసే చౌకరోజుల్లో కొని అమ్మిన స్థలాలు ఇయి! ఇయాళ ఈ ఒక ప్లాటే కోట్లు చేస్తుందనుకో! ఇప్పటికే ఇంటికీ, ఇంతికీ కూడా బేరాలు వస్తూ ఉండి ఉండాల్నే! ఎంతమందిని కాదంటారూ? మగవాడిని ఛీ కొడితే పగవాడు అవుతాడు. ఈ ఆరొందల చెక్క నిలుపుకోవాలని ఆత్రపడితే బతుకు ముక్క చెక్కలయిపోతుంది. నా మాట వింటే మీ తల్లీ కూతుళ్ళిద్దరికీ ఇకనుంచి నేనే గార్డియన్! పన్నెత్తి పలకరించడానికీ, కన్నెత్తి చూడడానికీ కూడా హడలుకుని కొమ్మలు తిరిగిన మొగాళ్ళు, మొనగాళ్ళు కూడా మూగాళ్ళలా పడి వుంటారు. ఏవంటావ్?"
ప్రాస కోసం ప్రయాస పడుతూ, అరువు తెచ్చి పెట్టుకున్న పదాలతో, సినిమా ఫక్కీలో చెబుతున్న దాస్ మాటలు వింటుంటే వికారం కలిగింది జాహ్నవికి. చెట్ల మధ్యన ఇరుకు దారి. అక్కడ నిలబడి వుంది జాహ్నవి. ఎటు కదలాలన్నా దాస్ అడ్డంగా నిలబడి వున్నాడు.
"ఈ దారి తప్పిస్తే నీకు గోదారే! నేను దారికి అడ్డం అనుకోకు. దారి చూపించడానికి దేవుడు పంపిన వాణ్ణనుకో! నేను పక్కన వుండగా పక్కదార్లు పట్టాల్సిన పనిలేదు."
రక్తం సలసల మరుగుతున్నట్లయింది జాహ్నవికి. అయినా సరే, అట్లాంటి పరిస్థితులలో కూడా మౌనంగా ఉండిపోవడం ఆమెకి స్వతహాగా వచ్చిన స్వభావం.
కానీ -
కోపంతో ఆమె కళ్ళు మాత్రం పెద్దవయ్యాయి. ఆవేశం వల్ల వచ్చిన ఆయాసంతో నోరు కొద్దిగా తెరుచుకుంది. ఎద ఎగిరెగిరి పడుతోంది. ఉచ్చనీచాలు మరిచి, తమకంగా చూస్తున్నాడు దాస్!
"ఛీ!" అంది జాహ్నవి, ఆపాదమస్తకం కంపిస్తూ.
"పిల్లకంటే తల్లి బావుందనిపించే కేసు నీది. ఎంతయినా మా ఆనంద్ టేస్టుని మెచ్చుకోవాల్సిందే! పిట్టల్ని పట్టినట్లు పట్టేస్తాడు పిల్లల్ని! ఆ పంజాబీ కుడీ సితార గులాబీలాగా వుంటుంది. నువ్వు తక్కువ తిన్నావా? అది తెల్ల గులాబీ అయితే నువ్వు నల్ల గులాబ్ జాం! నలుపయితేనేం! రసాలూరిపోతున్నావు గదా? మొగుడి తోడు లేకపోయినా మొగాడి తోడు తప్పదు! ఆలోచించుకో! అల్లరిపెట్టి అల్లరైపోకు! కొత్తలో అందరికీ అట్లాగే వుంటుంది. ఆ తర్వాత అంతా అలవాటయిపోతుంది. నీ మానాన నువ్వు బతికేద్దామనుకుంటున్నావేమో! కుదరదు. నీమానాన్ని దోచుకోవడానికి దొంగలూ, దొరలూ అందరూ రెడీ! తొందరలేదు గానీ మళ్ళీ త్వరలోనే వస్తా!" అని ఒక వెకిలి చూపు చూసి వెళ్ళిపోయాడు దాస్.
అక్కడే కూలబడిపోయింది జాహ్నవి. మోకాళ్ళలో తల పెట్టుకుని వెక్కిళ్ళు పెట్టడం మొదలెట్టింది.
ఇప్పటికే పెళ్ళీడు వచ్చిన కూతురూ, ఇప్పుడు పెద్దరేటు పలుకుతున్న ఈ ఇల్లూ - తన గుండెలమీద రెండు కుంపట్లని భయపడుతూ ఉండింది తను. ఇప్పుడింక తన ఒళ్ళే తన పాలిట ఒక అగ్నిగుండం కాబోతోందా?
దిక్కులేని వాళ్ళనే కదా వాడు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు!
తమని దిక్కూ దివాణం లేనివాళ్ళగా చేసేసి, తనదారి తను చూసుకున్నాడు తన భర్త.
ఇంత చేసినా ఆయన మీద కోపం రాదేమి?
కోపం రాదుగానీ ఆయన తిరిగి వస్తాడని మాత్రం తన మనసు చెబుతోంది.
నిజంగా వస్తాడా ఆనంద్?
తన బతుకులోకి మళ్ళీ ఆనందం తెస్తాడా?
కూతురి పెళ్ళి చేస్తాడా?
కష్టాలు కడ తేరుస్తాడా?
తన భుజం మీద ఎవరిదో చెయ్యిపడితే, ఉలిక్కిపడింది జాహ్నవి.
వాడు -దాస్ మళ్ళీ వచ్చాడా?
వెనక నిలబడి వున్నది దాస్ కాదు.
అరుణ
తల్లి భుజం మీద వేసిన తన చేతిని ఆమె తల మీదికి పోనిచ్చి నిమురుతూ అభిమానంగా అంది అరుణ.
"ఎందుకమ్మా కళ్ళెంబడి నీళ్ళు?"
కళ్ళు తుడుచుకుంది జాహ్నవి.
"కాళ్ళు తడవకుండా సముద్రాన్ని అయినా దాటవచ్చుగానీ, కళ్ళు తడవకుండా సంసార సాగరాన్ని ఈదగలమా నాన్నా?" అంది వణుకుతున్న గొంతుతో.
"నాన్న గుర్తొచ్చాడా?" అంది అరుణ అనుమానంగా.
"మీ నాన్న చాలా మంచివాడమ్మా" అంది జాహ్నవి, కూతురి చేతిని మొహానికి రుద్దుకుంటూ.
నిన్ను నిండా ముంచేశాడుగా! నీకు మంచికీ చెడుకీ తేడా తెలియదు!"
"చెడు వేరు - బలహీనతలు వేరమ్మా! భోళాశంకరుడిలాంటివాడు. సినీ ఫీల్డులోకి వెళ్ళాక పాడు అలవాట్లు చేసుకుని పాడయిపోయాడు గానీ..."
"లేకపోతే మీ ఆయన బంగారం! అవునా? ఉత్త బంగారం కాదు.. కాకి బంగారం. పైపై మెరుగులు!" అంది అరుణ అసహనంగా. "చాల్లేగానీ, ఇకలే!"
"కాసేపు పడుకోవాలని వుంది" అంది జాహ్నవి. అంటూనే అక్కడే పడుకుండిపోయింది.


