Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 43

    మెట్లు  దిగుతూంటే  గేటు బయటకు  నడుస్తున్న శివయ్య కనిపించాడు.

    "శివయ్య ఎక్కడికి  వెళుతున్నాడు తాయారూ?" అడిగింది హిమజ.

    "ఫోన్ వచ్చిందమ్మా! బంధువులెవరో  వూరి నుంచి వచ్చారట, స్టేషన్ కు వెళ్ళాలని  చెప్పాడు."

    వస్తానన్నట్లు  హిమజవేపు చూసి  స్కూటర్ స్టార్టు చేశాడు సాగర్.

    శివయ్య ఆటో ఎక్కుతున్నాడు. ఒక్కక్షణం  తటపటాయించి  వెనకే స్కూటర్ పోనిచ్చాడు  సాగర్. ఆటో స్టేషన్ వేపు వెళ్ళడంలేదు. చాలా చుట్టూ తిరిగి కొత్తగా కట్టిన కాలనీవేపు మళ్ళింది.

    సాగర్ కు అర్ధమైంది అతనెక్కడకు వెళుతున్నాడో.

    డాక్టర్ రామకృష్ణ ఈ మధ్యనే  రెండతస్తుల  ఇల్లు కట్టుకున్నాడీ  కాలనీలో. శివయ్య ఆటో దిగి ఇంట్లోకి  వెళ్ళడం చూడగానే సాగర్ స్కూటర్ వెనక్కి తిప్పాడు.

    అనుకున్న తీగ లాగితే ఒకోసారి అనుకోని డొంక కదలొచ్చు.


                                                                       11

    "నమస్తే అంకుల్!"

    మొక్కల దగ్గర చేస్తున్న పనిని ఆపి వెనక్కి  తిరిగి  చూశారు ప్రకాశరావు. సాగర్ నీ చూడగానే ఆయన ముఖం వికసించింది.

    "ఓ, సాగర్ రా, కూర్చో!" ఆప్యాయంగా ఆహ్వానించారు.

    కుర్చీలో కూర్చుని  తోటంతా  పరిశీలించి చూశాడు సాగర్. రకరకాల పూల చెట్లు  విరగబూసి ఉన్నాయ్.

    "చెప్పు నౌకరు తెచ్చిన టీ కప్పు అందిస్తూ  అన్నారు.

    "అంకుల్! మీరు పద్మజతో  చాలా సన్నిహితంగా  ఉండేవారు. తన మరణం మిమ్మల్ని  చాలా కృంగదీసిన విషయం నాకు తెలుసు. పద్మజ హత్య గురించి మీరేమనుకుంటున్నారు?" సూటిగా విషయంలోకి  వస్తూ అన్నాడు సాగర్. ప్రకాశరావుగారికి నాన్చడాలూ, ఉపోద్ఘాతాలూ  ఇష్టం ఉండవని  తెలుసతనికి.

    నిజం చెప్పాలంటే  అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నాకు ఈ దెయ్యాలమీదా, ప్రేతాత్మలమ్,మీదా నమ్మకం లేదు. పద్మజ మొదట గిరి గురించి చెప్పినప్పుడు  నమ్మలేకపోయాను. అంతేకాదు  పద్మజను మందలించాను కూడా. రామకృష్ణ కూడా అంత ఆలోచనా రహితంగా అలా చెప్పేడేమిటి అని కోప్పడ్డాను. కానీ నా కళ్ళు ఎదురుగానే జరిగిన కొన్ని సంఘటనలతో ఏదీ అర్ధం కాకుండా పోయింది. గిరి అచ్చం శేఖరంలా  ప్రవర్తించడం, పోనీ అది నటనేమో అనుకుంటే చేతి వ్రాతకూడా శేఖరం వ్రాతలా  మారిపోవడం, స్వరం కూడా ఉన్నట్లుండి  మారడం చాలా ఆశ్చర్యకరంగా  అనిపించేది. అందులోనూ  నాకు తెలిసినంత  వరకూ  వారిద్దరు అపరిచితులు. అందుకే  నేనేమీ చెప్పలేకుండా  ఉన్నాను. అదంతా  ఒక కలలా  అనిపిస్తోందిప్పుడు  ఆ విషయం ఆలోచించినకొద్దీ  మనస్తాపం తప్ప మరేం మిగలడంలేదు. అందుకే  ఆ ఆలోచన రాకుండా పనిలో మునిగిపోతున్నాను."

    "సారీ అంకుల్! మరచిపోతున్న విషయాన్ని గుర్తుచేసి మిమ్మల్ని  బాధ పెడుతున్నానని తెలుసు. కాని తప్పడం లేదు."

    "ఫర్వాలేదు సాగర్, నిస్సంకోచంగా  అడుగు" కాస్త తేరుకుని అన్నారాయన.

    "గిరిధర్ మీకు చాలా కాలంగా తెలుసా అంకుల్?"

    "లేదు, గిరితో  నా పరిచయం కొద్దికాలంగానే. వాళ్ళ అక్కయ్య సుందరి నాకు చాలా కాలంగా తెలుసు. అప్పట్లో గిరి హాస్టల్లో  ఉండి చదువుకునేవాడు. అతన్ని ఒకటి రెండుసార్లు  చూశానంతే. సుందరి ఉత్తరం వ్రాసిన మీదట గిరిధర్ ను మా ఇంటికి ఆహ్వానించాను. అప్పుడే అతనితో బాగా పరిచయమయింది. మంచి వ్యాపార దక్షత కలవాడు. చాలా కొద్దికాలంలోనే  బాగా పైకి వచ్చినవాడు. అతనంటే గౌరవం కలిగింది. అతని బుద్ధి కుశలతకు ముచ్చటేసింది. నీకు తెలుసా సాగర్? అతనికి రాధనిచ్చి  పెళ్ళి చేయాలనే ఉద్దేశ్యం  నాకుండేది. కాని ఈ లోపునే పద్మజకు అతనితో  పరిచయం కావడం, వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకోవాలనుకోవడం  జరిగిపోయింది. పద్మజ కూడా నాకు కూతురులాంటిదే. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. అంతకంటే  గిరి గురించి వివరంగా చెప్పడానికేం లేదు."

    "సరే అంకుల్! నే వస్తానింక  థ్యాంక్యూ" లేచి నిలబడ్డాడు సాగర్.

    "అలాగే సాగర్! అప్పుడప్పుడూ  వస్తూండు. నీకేం అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు."


                         *    *    *


    కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్టు అండ్ ఎక్స్ పోర్టు ఆఫీసు నించి  బయటకు వచ్చాడు సాగర్. అతడికి కావాల్సిన వివరాలు దొరికాయి.

    వీనస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ కంపెనీ  అయిదేళ్ళ క్రితం ప్రారంభించబడింది. హైద్రాబాద్, విశాఖపట్టణంలోనే  కాకుండా వాళ్ళ బ్రాంచీలు  గుజరాత్ లోని అహ్మదాబాద్ లో, రాజస్థాన్ శ్రీ గంగానగర్ లో కూడా వున్నాయి. రెడీమేడ్ దుస్తులు, టీ వగైరా ఎగుమతి చేస్తూ, కోకో, కొన్ని మెషిన్ పార్ట్స్ దిగుమతి చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ అంతా ఆఫ్రికన్ దేశాలలోనే  జరుగుతుంది. సంవత్సరంలో  టర్నోవర్ పాతిక లక్షల పైగా వుంది. కంపెనీ మంచి లాభంలో  వుంది. టాక్స్ రిటర్న్స్ అన్నీ సవ్యంగా సబ్మిట్ చేస్తున్నారు. కంపెనీ మీద ఇంతవరకూ  ఎలాంటి అభియోగం లేదు. గిరిధర్ కాకుండా మరో ఇద్దరు భాగస్తులున్నారు. అందులో  ఒకరు గుజరాతీ. గుజరాత్ లో బ్రాంచి వుండడానికీ  కారణం అదే కావచ్చు.

    ఇవీ వివరాలు.

    సాగర్ ఆలోచనలో పడ్డాడు. అఫీషియల్ గా తను కేసు పరిశోధించటానికి  అనుమతి  దొరకపోవచ్చు. స్వంతంగా బాధ్యత తీసుకుని చెయ్యాలనుకుంటే  తను కొన్ని న్యాయ విరుద్ధమైన  పనులు  చెయ్యక తప్పదు. సాగర్ కు నవ్వు వచ్చింది. తన చేతిలో  ఐడెంటిఫికేషన్ పట్టుకుని  చేసిన పని న్యాయసమ్మతం. అది లేకపోతే  న్యాయవిరుద్ధం. ప్రభుత్వము  న్యాయవిరుద్ధమైన  పనులు చేయడానికి  తనకో లైసెన్సు ఇచ్చింది.

 Previous Page Next Page