Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 42

    సాగర్ ఆలోచనలోపడ్డాడు. డైరీలో అబద్ధంరాసి  వుండదు పద్మజ. అబద్ధమే అయితే రాయాల్సిన పనిలేదు. మరోచోట పద్మజ రాసింది ఆకర్షించిందతన్ని.

    మే 15 _ చండీఘర్ :

    గిరిధర్ ని నాతో రమ్మని  బ్రతిమాలినా  రాలేదు అర్జంటుగా బెంగుళూరు వెళ్ళాలంటూ  వెళ్ళిపోయాడు. ఇవ్వాళ మీటింగ్ లో సరిగ్గా మాట్లాడలేక పోయాను. అందరూ నావైపు వింతగా  చూస్తున్నారనిపించింది. శేఖరం గురించి ఏమైనా తెలిసిందేమోనని  అనుమానం వచ్చింది. అలాంటి విషయాలే అందరిలో ఆసక్తిని కలిగిస్తాయి. కానీ నిజం తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. తీవ్రవాదులకు సహాయం అందజేస్తున్న  వాళ్ళలో  గవర్నమెంటు ఆఫీసర్లు కూడా వున్నారట, స్త్రీలు కూడా. అందుకే అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారేమో? ఆ చూపులు నేను అర్ధం చేసుకోలేక పోయానేమో? ప్రభుత్వ యంత్రాంగం రోజు రోజుకీ దిగజారిపోతోంది. డబ్బుకోసం కన్నతల్లినే  అమ్ముకుంటున్నారు. ఎంత దారుణం! తలుచుకుంటేనే  తల తిరుగుతోంది. ఒక పక్క ఎంత త్యాగం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్నదీ  గొంతెత్తి  చెప్పుకుంటూ  అది సంపాదించుకుని  నలభై ఏళ్ళయినా  కాకుండానే దేశాన్నే  అమ్ముకునే స్థితికి దిగజారిపోయాం. నేనూ ఒక అనుమానితురాలినే అన్న ఆలోచనే భరించలేనిదిగా ఉంది.

    "శేఖరం" తో మాట్లాడాలనిపిస్తోంది. చచ్చిపోయాకే  శేఖరం ఇంకా దగ్గరయ్యాడు అనిపిస్తోంది. అతని ప్రేమను గుర్తించలేక పొరపాటు చెయ్యలేదు కదా? ఒకప్పుడు  శేఖరం డైరీలు చదువుతుంటే  కోపం వచ్చేది. ఇప్పుడు అవి చదువుకుంటే  మనశ్శాంతిగా ఉంటోంది. నేనేమైనా  తప్పు చేస్తున్నానా? ఇలా ఆలోచించడం తప్పేమో! గిరిధర్ కు అన్యాయం చేస్తున్నానేమో? త్వరలో ఫారిస్  ప్రయాణం ఉంది. స్థలం మార్పుతోనే మేము మరింత దగ్గరవ్వాలి.

    మే 10 :

    పంజాబ్ ఈస్టరన్ సెక్టారులో ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శేఖరం రాసి పెట్టారు రాత్రి. కాని ఆ సూచనలు పాటిస్తే తీవ్రవాదులకు  సహాయం చేసిన వాళ్ళమవుతామని  అనుమానంగా ఉంది. ప్రకాశరావు అంకుల్ కూడా అదే అన్నారు. ఫ్రాన్సు నుంచి రాగానే దీని విషయం ఆలోచించాలి.

    డైరీ మూసేసి  పేపరు, పెన్నూ తీసుకున్నాడు సాగర్, హిమజ ఉత్సాహంగా ముందుకు వంగింది. పద్మజ    డైరీలో ఆమె కూడా అతని భుజం వెనుక నుంచి చదివింది. చదివేకొద్దీ  అక్క నిర్దోషిత్వం బయట పడడం ఆమెకి సంతోషాన్నిచ్చింది. ఈ లోపులో సాగర్ రాయడం మొదలు పెట్టాడు.

    1. డైరీలవలన పద్మజ దేశద్రోహి కావడానికి వీల్లేదనిపిస్తోంది. అయితే ఆమెను దేశద్రోహిగా  రుజువు చేయడానికి ప్రయత్నాలు  జరిగాయి. వీటి వెనుక ఉంది ఎవరూ? లేక ఈ డైరీలు కూడా నాటకమా?

    2. ఒక వేళ గిరిధర్ కు ఇందులో భాగముంటే అతను పొందిన లాభం ఏమిటి? లాభం పొందుతున్నవాడు  హత్య ఎందుకు చేశాడు?

    3. గిరిధర్ పెళ్ళికి పూర్వం జీవితం గురించి ఎవరికీ తెలియదు. అతని గదిలో  ఎలాంటి వివరాలు దొరకలేదు. ఇది పరిశోధించాల్సిన విషయం.

    4. శేఖరం డైరీలు ఎక్కడా కనిపించలేదు. వాటిలో ఏదయినా దొరికే అవకాశముందా?

    గది బయట ఏదో నీడ పడినట్లనిపించి శబ్దం చేయకుండా లేచాడు సాగర్. అతని అనుమానం నిజమన్నట్లు శివయ్య మెట్లదగ్గర శుభ్రం చేస్తూ కనిపించాడు. సాగర్ అడుగుల చప్పుడు విని తలెత్తాడు అతను.

    "ఏం కావాలి సాగర్ బాబూ?" అడిగాడు అమాయకంగా.

    "ఏం లేదు" గదిలోకి వచ్చేశాడు.

    "శివయ్య కూడా కోర్టులో  దెయ్యం పట్టినట్లు మాట్లాడాడు. ఆ విషయం మనం మర్చిపోయాం. శివయ్యకూ ఇందులో భాగం ఉందేమో?" అతన్ని కాస్త కనిపెడుతుండు హిమా!"

    భయంగా అతనివేపు చూసింది హిమజ.

    "ఈ దుస్వప్నం ఇంకా పూర్తికాలేదంటే భయంగా ఉంది సాగర్! నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్ని ?"

    బేలగా మాట్లాడుతున్న ఆమెను దగ్గరగా తీసుకున్నాడు సాగర్.

    "ఈ బేలతనం, పిరికితనం పనికిరావు హిమా! పద్మజ విషయమే చూడు. మూర్ఖత్వంతో.  పిచ్చి నమ్మకాలతో  తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. అంత తెలివిగలది కదా, ఒకసారి ఆలోచించి ఉంటే తానెలాంటి ఉచ్చులో  యిరుక్కున్నదీ గ్రహించగలిగేది."

    "తరతరాల నుంచీ రక్తంలో జీర్ణించుకు పోయిన మూఢనమ్మకాలు అంత త్వరగా సమసిపోవేమో సాగర్."

    చిన్నగా నవ్వాడు సాగర్.

    "దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా హిమా! ఆలోచనారాహిత్యం మనం నమ్మే పిచ్చినమ్మకాలను, ఆచారాలను గురించి ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే మనకే అర్ధమవుతుంది.  లోపం ఎక్కడ ఉందో, పద్మజ విషయమే చూడు.
ప్రేతాత్మల గురించిన  పుస్తకాలతోపాటు  తను సైక్రియాట్రి పుస్తకాలలో  స్కిజో ఫ్రెనియా గురించి చదివి ఉంటే  గిరిధర్ విషయం  అర్ధమయిపోయేది. పద్మజేకాదు. చాలామందికి సినిమాలు చూడడానికీ - గంటల తరబడి పేకాటలతో  కాలక్షేపం  చెయ్యడానికీ  దొరికే సమయం కాసేపు ఆలోచించడానికి  ఒక మంచి పుస్తకం చదవడానికి ఉండదు. వందల మైళ్ళయినా  ప్రయాణంచేసి ఒక గుడిని దర్శించడానికి తీసుకున్న  శ్రమ, ఉన్న ఊళ్ళోనే  ఒక మేధావి ఉపన్యాసం ఉంటే వెళ్ళి వినే తీరిక దొరకదు. అయినా ఈ అనవసరపు మాటలతో సమయం వృధా చేయడం దేనికిగాని  నేను వెళ్ళొస్తాను."

 Previous Page Next Page