అతనికి విపరీతంగా నిద్రవస్తోంది. రాత్రంతా కొండల మధ్య అడవిలో డ్రైవ్ చేయటంవల్ల అవయవాలు స్వాధీనం లేవు. అయినా విశ్రాంతికి సమయం లేదు. ఆలస్యమయ్యే ప్రతి నిముషమూ అక్కడ ప్రనూషని మృత్యువు దగ్గరగా తీసుకువెళుతుంది.
ఏం చెయ్యాలా అని అతడు ఆలోచిస్తూ వుండగా దూరం నుంచి నాలుగు వాహనాలు వస్తూ కనిపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో కొండమలుపు దిగి యిటే వస్తున్నాయి.
చైతన్య ఆలస్యం చేయకుండా పరుగెత్తాడు. దాదాపు అయిదొందల గజాలు పరుగెత్తి చిన్న గుట్ట ఎక్కి నాలుగయిదు బండరాళ్ళని దారిమీదకు తోశాడు. మామూలు రాళ్ళే. అయిదారు గుమ్మడికాయల సైజులో వున్నవి. పల్లంలోకి సులభంగా జారి రోడ్డుమీదకొచ్చి ఆగిపోయాయి. దూరంనుంచి చూస్తే అవరోధంగా కనిపిస్తాయి. అది చాలు.
అతనూహించినట్టే వాహనాలు దగ్గరకొచ్చి ఆగాయి. ముందు మిలటరీవ్యాను వెనుక రెండు కార్లు, చివరిది మళ్ళీ వ్యాను.
ముందున్న మిలటరీ వ్యాన్ లోంచి ఇద్దరు సైనికులు, దాని వెనుక వున్న కార్లోంచి ఒక సైనికాధికారి దిగారు.
తుప్పల చాటునుంచి తల పైకెత్తి ఆ వాహనాలవైపు చూసిన చైతన్య గుండె ఒక్కక్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది.
ఆ వ్యాన్ ల మధ్యవున్న రెండో కారుమీద భారత జాతీయ పతాకం రెపరెప ఎగురుతూంది.
"నిన్నటి బాంబు పేలుడికి రాళ్ళు ఇక్కడకు కూడా వచ్చిపడ్డాయన్నమాట" అంటున్నాడు ఒక అధికారి.
"ఇండియన్స్... బ్లడీ ఇండియన్స్...." గొణుగుతున్నాడు ముందు కార్లోంచి దిగిన ఆఫీసర్. ఇద్దరు ముగ్గురు సైనికులు రాళ్ళని తొలగిస్తున్నారు. చైతన్యకి వాళ్ళ తెలివితేటలు చూసి నవ్వొచ్చింది. నిన్నరాత్రి తమ వాహనాన్ని వెంటాడుతూ వాళ్ళ వ్యాన్లు ఆ దారిమీదే వెళ్ళి వుంటాయి అన్న ఆలోచన రాలేదు వాళ్ళకి.
సైనికులు రాళ్ళని తొలగిస్తూ వుండగా, అతడు చివరనున్న వ్యాన్ వెనక్కి చేరాడు. వెనుక చక్రాల క్రింద వెల్లకిలా పడుకుని, రాడ్ కి కాళ్ళూ చేతూలూ మెలివేశాడు.
రెండు నిమిషాల తరువాత కార్లు కదిలాయి. ఐదునిముషాలు ప్రయాణం చేసి సైనిక శిబిరం చేరుకున్నాయి. అతడు తలపక్కకు జరిపి చక్రాల సందుల్లోంచి చూశాడు. అజ్మరాలీ కార్లవైపు వస్తున్నాడు. భారత రాయబారి కార్లోంచి దిగాడు.
ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అజ్మరాలీ కోపంగా ఏదో అరుస్తున్నాడు. భారత రాయబారి మొహం పైకి భావరహితంగా వున్నా, కళ్ళ వెనుక ఆనందం కనిపిస్తూంది. అజ్మరాలీ చెప్పేదానికన్నా, ఇంకా ఏదో పెద్ద నష్టమే జరిగిందనీ, అది చెప్పటానికి అతడు ఇష్టపడటంలేదని భారత రాయబారి గుర్తించినట్టున్నాడు. అందుకే ఆనందిస్తున్నాడు.
అంతలో చైతన్య దృష్టి వ్యాన్ వైపు వస్తున్న మనుష్యుల మీద పడింది. అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.
ఇంతసేపూ వారికోసమే బాధపడ్డాడు.
తనతోపాటు భారతదేశం నుంచి వచ్చిన ట్రూపు కళాకారులు వాళ్ళు!
శత్రు దేశంలో, తాము వెళ్ళిపోయాక భారత రాయబార కార్యాలయం వారి గురించి శ్రద్ధ తీసుకుంటుందని అతడు అనుకున్నమాట నిజమే కానీ, ఇంత తొందరగా రంగంలోకి దిగుతుందని భావించలేదు.
"మొత్తం ఆరుగురు తప్పించుకుపోయారు" అంటున్నాడు అజ్మరాలీ. అంటే.... తను, ఇస్మాయిల్, డాక్టర్ పాల్, ప్రనూష, లక్ష్మి, తన తల్లి... ఆరుగురు గురించే చెపుతున్నాడు. తన తండ్రి గురించి చెప్పటం లేదు.
ప్రనూషని కూడా కలిపి చెప్పేడంటే, ఆమె గురించి జవాబు దారి అతను వహించలేదన్నమాట.
"మా సైనిక రహస్యాలు తెలుసుకోవటానికి వచ్చిన ఆరుగుర్నీ మేము వదిలిపెట్టము. అంతేకాదు, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయబోతున్నాము కూడా."
"ఆ పని మేమే చెయ్యబోతున్నాము అజ్మరాలీ! మా దేశపు ట్రూపుని మీ శిబిరాలకి పిలిచింది మీరు. ఇక్కడ నాటకం వేయమన్నది మీరు. వా వాళ్ళలో ఇప్పుడు కొంతమంది కనపడకపోతే అందుకు మీరే బాధ్యత వహించాలి. ముఖ్యంగా మా దేశపు ఒక ప్రాంతానికి చెందిన సూపర్ స్టార్ ఇక్కడ కనపడకపోతే... మా దేశంలో ఎంత సంచలనం జరుగుతుందో నేను వూహించగలను. ఈ విషయమై మేము మీ ప్రెసిడెంట్ తో మాట్లాడతాము."
చైతన్య ఈ సంభాషణ జరుగుతూ వుండగా వ్యాన్ కింద నుంచి దొర్లి పక్కనే వున్న నీటి కుండీలోకి చేరుకున్నాడు.
ఆ తరువాత కొంతసేపటికి రాయబారి కారు, తన వాళ్ళని తీసుకువెళ్ళిన శబ్దం వినిపించింది.
ప్రనూష ఎక్కడుందో తెలియలేదు.
17
చైతన్య వెళ్ళిపోయాక మిగతా అయిదుగురూ ఆ రాత్రి అక్కడే వుండడానికి నిర్ణయించుకున్నారు. అడవిలోనే మంచి ప్రదేశం ఎన్నుకుని విశ్రమించాలనుకున్నారు.
జగదీష్ ప్రసాద్, రంగనాయకి వృద్ధులు కాబట్టి వారికి శ్రమ ఇవ్వదలుచుకోలేదు. మిగతా ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు కాపలా కాయాలి అని నిశ్చయించుకున్నారు ముందు పాల్ వంతు.
ఎంత సైన్యంలో పనిచేసినా, వయసు ఎక్కువ అవటంవల్ల ఇస్మాయిల్ కూడా తనవంతు వచ్చాక లేపమని చెప్పి నిద్రపోయాడు. లక్ష్మి కూడా కళ్ళు మూసుకుంది.
అరగంట గడిచాక, మిగతా అందరూ నిద్రపోయారని నిశ్చయించుకుని డాక్టర్ పాల్ తుప్పల్లోకి వెళ్ళాడు. వ్యాన్ లోంచి తీసి జాగ్రత్తగా దాచిన వైర్ లెస్ లో ఆర్మీ క్యాంప్ ని కాంటాక్టు చేశాడు.
"అజ్మరాలీ...."
"స్పీకింగ్..."
"నేను డాక్టర్ పాల్ ని మాట్లాడుతున్నాను."
"మీ మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నాము పాల్! ఎక్కడికి చేరుకున్నారు?"
"దాదాపు బోర్డర్ దగ్గరికి...! ఐయామ్ సారీ సర్... చివరి నిమిషము వరకూ వాళ్ళు ఈ విషయం నాకు తెలియకుండా దాచారు. లేకపోతే ఇంతదూరం వచ్చి వుండేది కాదు."
"ఫర్వాలేదు డాక్టర్ పాల్! ఇందులో నువ్వు చెయ్యగలిగింది ఏముంది? ప్రనూషని వదిలిపెట్టి వెళ్ళగలిగేలా చేశావు అంతే చాలు! చైతన్య ఎక్కడున్నాడు?"
"ప్రనూష కోసం మీ దగ్గరకే తిరిగి వచ్చాడు. ఇంకో నాలుగయిదు గంటల్లో అక్కడికే చేరుకోవచ్చు."
"రానీ, ఒక వినూత్న పద్ధతిలో స్వాగతం పలుకుతాను."
"నాతో ఉన్న ఈ నలుగుర్నీ చంపెయ్యమంటారా?"
"వద్దు. ఆ జగదీష్ ప్రాణాల్తో కావాలి. అతడితో రహస్యాలు చెప్పించటానికి అతడి భార్య కూడా కావాలి. ఇంతకాలం నోరు విప్పనివాడు ఇప్పుడెలా చెప్పడో చూస్తాను. ఇస్మాయిల్ ని చంపెయ్యి. వాడు సైన్యంలో వున్నవాడు. ఎప్పటికయినా ప్రమాదమే... ఆ ఇంకో అమ్మాయి..."
"లక్ష్మి...."
"అదే ...లక్ష్మి..... నీ యిష్టం" అన్నాడు.
పాల్ కొంచెం ఆగి అన్నాడు. "మేము ఎక్కడున్నామో చెప్పమంటారా?"
"చెప్పు. రేప్రొద్దున్నే ఆర్మీని పంపుతాను."
పాల్ చెప్పసాగాడు. అయిదు నిముషాల్లో టోపోగ్రఫీ చెప్పాడు. అంతా విని అజ్మరాలీ అన్నాడు. "గుడ్ నైట్ పాల్! రేపు మధ్యాహ్నం కలుసుకుందాం."
పాల్ వైర్ లెస్ సెట్ 'ఆఫ్' చేశాడు.
చెట్లచాటునుంచి లక్ష్మి విన్నదని అతడికి తెలీదు.
అతడు తిరిగి యధాస్థానానికి వచ్చి చూశాడు. దూరంగా జగదీష్ అతడి భార్య నిద్రపోతున్నారు. మరోవైపు ఇస్మాయిల్.
అతడు లక్ష్మి దగ్గరగా నడిచాడు. ఆమె పక్కకి తిరిగి పడుకుని వుంది. భుజంమీద పైట నేలమీదకు జారిపోయి వుంది. నడుము దగ్గర మెలిక స్పష్టంగా తెలుస్తూంది. అతడు ఆమె అందాన్ని ఓ క్షణం కన్నార్పకుండా చూసి, మోకాళ్ళ మీద నెమ్మదిగా కూర్చున్నాడు. కాళ్ళమీద చెయ్యివేసి నెమ్మదిగా పైకి జరుపుతూ నడుము దగ్గర ఆపి వేళ్ళతో వత్తాడు.
ఆమె కళ్ళు విప్పి చప్పున లేచి కూర్చుంది.
అప్పుడే అతడిని గమనించినట్టు "మీరా?" అంది. అతడు కూడా మామూలుగా సర్దుకుని "నా టైమ్ అయింది. ఇక నీ వంతు" అన్నాడు.
ఆమె బద్ధకంగా వళ్ళు విరుచుకుని "తెల్లవారటానికి ఇంకా ఎంత టైముంది?" అని అడిగింది.
"మూడు గంటలు."
"మీరు పడుకోండి నేను కాపలా కాస్తాను" అంది.
"నాకూ నిద్ర రావటంలేదు. నీకు తోడు వుంటాన్లే" ఓరగా చూస్తూ అన్నాడు. అతడి చూపులో భావం గ్రహించీ గ్రహించనట్టు "అయితే మీరు మెలకువగా వుండండి. నేను పడుకుంటాను" ఆమె తిరిగి వత్తిగిల్ల బోయింది.
"లేదు. లేదు. నువ్వు వుండు" అంటూ అతను నేలజారేడు.
ఆమె కొంచెం సేపు మెలకువగా వుండి, అందరూ నిద్ర పోయారని నిశ్చయించుకున్నాక లేచి, చెట్ల వెనక్కి వెళ్ళింది. అక్కడ తుప్పల్లో వెతకసాగింది.
డాక్టర్ పాల్ నిజానికి నిద్రపోలేదు. ఆమెనే గమనిస్తున్నాడు. అతడిలో కోరిక క్షణక్షణానికీ పెరిగిపోతోంది. అతడు ఓరకంటితో చూస్తూ ఉండగా, ఆమె చెట్ల చాటుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వైర్ లెస్ సెట్ కోసం ఆమె వెతుకుతూంది. వెనుకనుంచి అతడు చప్పుడు చేయకుండా దగ్గరకొచ్చి "ఏం కావాలి?" అని అడిగాడు. అంత దగ్గర్నుంచి హఠాత్తుగా అతని కంఠం వినిపించేసరికి ఆమె అదిరిపడి ముందుకు పరుగెత్త బోయింది. అతడు ఒక అంగలో ముందుకు దూకి ఆమెని పట్టుకున్నాడు.
ఆమె గింజుకోసాగింది.
"ఏం కావాలి? ఏం వెతుకుతున్నావు చెప్పు?" వెనుకనుంచి చేతులు బిగించి అడిగాడు.
ఆమె సమాధానం చెప్పకుండా అతడి పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది. ఆమె ప్రయత్నించేకొద్దీ అతడి పట్టు మరింత బిగుసుకోసాగింది.
ఆమె ఉన్నట్టుండి ప్రతిఘటించటం మానేసి "వదులు. నీతో మాట్లాడాలి" అంది.
ఈసారి ఆశ్చర్యపోవటం పాల్ వంతయింది. "ఏమిటి నువ్వు మాట్లాడేది?" అన్నాడు.
"ముందు నన్నొదులు. ఎక్కడికీ పారిపోన్లే."
అతడు ఆమెని వదిలి "ఏమిటి నువ్వు చెప్పదల్చుకున్నది?" అన్నాడు.
"నేను నీతో ఓ బేరం పెట్టదల్చుకున్నాను."
"ఏమిటది?"
"ఇంకొంచెం సేపట్లో మా సైనికులు ఇక్కడికి వస్తారు. నువ్వు నన్నేమీ చేయకుండా వదిలేస్తే మా వాళ్ళు నిన్నేమీ చేయకుండా నేను హామీ యిస్తాను."
అతను నుదురు చిట్లించి "ఎవరు నువ్వు? ఇంకొంచెం సేపట్లో సైనికులు వస్తారని నీకెలా తెలుసు?" అన్నాడు.
"నేను "సా" తాలూకు మనిషిని" ఇంగ్లీషులో అంది. 'సా' అంటే పాకిస్తాన్ సీక్రెట్ ఏజన్సీ. (PSA)
* * * *