చిల్డ్రన్ హాండ్ రైటింగ్ :
స్కూలుకు వెళ్లగానే పిల్లలు చేసే మొదటి పని తమ హోంవర్కు, చూచివ్రాతలు మాస్టారుకు చూపించడం. పిల్లల చేతివ్రాత గుండ్రంగా, అందంగా రావాలని చూచివ్రాత వ్రాయిస్తుంటారు. కాపీబుక్ గీతల మధ్య చూచివ్రాతలో అందరూ ఒకేలా వ్రాసినా మామూలుగా నోట్సులు వ్రాసినప్పుడు మాత్రం ఏ ఒక్కరూ ఒకేలా వ్రాయరు. కనీసం వత్తులన్నా ఇతరులతో సంబంధం లేకుండా వ్రాస్తారు. పెద్దవుతున్నకొద్దీ ఈ మార్పులు మరింత విస్తృతమవుతుంటాయి.
సాధారణంగా మనం చుట్టాలింటిలోనో, స్నేహితుల ఇంటిలోనో లేక మరెక్కడైనా గానీ వింటూ వుంటాం. "అబ్బా! వీడి చేతివ్రాత ఎంత బాగుందో. వీడు చాలా గొప్పవాడు అవుతాడు"అని! అలాగే "వంకర టింకర గీతలూ, వీడూనూ, ఎందుకూ పనికిరాకుండా పోతాడు వెధవ..... " అని కూడా వింటుంటాం.
ఇలా పిల్లల చేతివ్రాతలు చూసి వారిని అంచనా వేయటం అనాదిగా జరుగుతున్నా, వారి గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇలా వ్రాయొచ్చు, ఇలా వ్రాయకూడదు అనే విచక్షణాజ్ఞానం వుండదు. అలాగే ఇలా వ్రాయాలి, ఇలా వ్రాయకూడదు అనే ఆలోచనా పరిధి కూడా వీరికి వుండదు.
అక్షరాలు అందంగా వ్రాసే పిల్లలందరూ గొప్పవారవుతారనీ, అలా వ్రాయని వారందరూ ఎందుకూ పనికిరాకుండాపోతారని అనుకోవటం చాలా తప్పు.
పిల్లలు ఆడుతూ, పాడుతూ తమ ఇష్టమొచ్చినట్టు వ్రాసేస్తారు. ఇలా వాళ్లు వ్రాసిన దానిని బట్టి వారి యొక్క మనస్థత్వాలను, భవిష్యత్తును అంచనా వేయటమే కాకుండా, ఆ సమయంలో వారి మానసికస్థితి ఎలా వుందో తెలుసుకోవచ్చు. వారి యొక్క సమస్యలు, సంతోషాలు, న్యూనతాభావం, ఉద్రేకం... చివరికి తమచుట్టూ వున్న మనుషుల మీదా,పరిసరాల మదా వాళ్లకు కలుగుతున్న ఏహ్యభావాన్ని కూడా తెలుసుకోవచ్చు.
పిల్లల్లో టెన్షన్:
వంకరగా, గజిబిజిగా వ్రాసేవాళ్లు టెన్షన్ తో నలిగిపోతూ వుంటారు. మాష్టారిచ్చిన హోంవర్కు చేయలేదనో, కంఠస్తం చేయమన్న పాఠం చేయలేదనో టెన్షన్ తో వుంటారు. ఒక అక్షరం కుడివైపుకి, మరొక అక్షరం ఎడమవైపుకి వ్రాసే వారికి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది.
అలా కాకుండా నీటుగా, అక్షరాలు గుండ్రంగా వ్రాసేవాళ్లు మానసికంగా చక్కని స్థితిలో వుంటారు. వీరు క్లాసు ఫస్టు రావటం మాష్టారడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పటం, పెద్దలనుంచి మెప్పు పొందటం జరుగుతుంది. కానీ ఇది ఒక వయసు వరకే పరిమితం. వ్రాతమీద పిల్లవాడు ఎలాటి "కమాండ్" సంపాదించాడు - అన్నదాని మీదే అతడి తెలివితేటలు ఆధారపడి వుంటాయి. అంతే తప్ప - ఎంత గుండ్రంగా వ్రాసాడు - అన్నదానిమీద కాదు. తరువాత ఇచ్చే వుదాహరణల్లో దీన్ని గమనించవచ్చు.
దిద్దుళ్ళు:
అక్షరాలమీద అక్షరాలు వ్రాసేవాళ్లు పైకి చాలా నెమ్మదస్తుల్లా కనిపించినా, మానసికంగా చాలా అల్లరి స్వభావం కలిగి వుంటారు. దీనివల్ల అసూయ, ద్వేషం అభివృద్ది చెంది తోటి పిల్లలతో కొట్లాడటం, టీచర్లకు, ఇంట్లోవాళ్లకు ఎదురుచెప్పటం చేస్తారు. వీరిపై వీరికి నమ్మకం తక్కువవున్న స్థితిని కూడా ఇది సూచిస్తుంది.
కళాత్మకంగా :
ఈ విధమైన చేతివ్రాతలో పిల్లలు పెద్దలనుంచి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కోరుతుంటారు. వీరికి చదువులోనేకాక, ఆటల్లోనూ, కళల్లోనూ ప్రవేశం వుండటంతో చాలా పట్టుదలగల మనుషులుగా తయారవటానికి అవకాశం వుంది. కానీ వీరిలో కొద్దిమంది 'తప్పించుకుపోయే' మనస్థత్వం కలిగి వుండి కొంచెం ఎమోషనల్ గా ప్రవర్తిస్తూ వుంటారు. వీరిని ఎక్కువగా లాలించాలి. వీలైనంతవరకూ 'టూర్స్' తిప్పాలి.