"నిజమే సాగర్. నాకది తట్టనేలేదు" విభ్రమంగా అంది హిమజ. సాగర్ సి.బి.ఐ. బ్రెయిన్ తో సాలోచనగా తార్కికంగా సమస్యని చర్చిస్తున్నాడు.
"అయితే గిరిధర్ విషయం మనకు తెలిసినట్లు బయట వాళ్ళకు నిరూపించడం కష్టం. మనది వితండవాదం అంటారు. అంతగా కలుషితం అయిపోయాయి మనవాళ్ళ బుర్రలు. మనం ఒక పద్ధతిలో పరిశోధన ప్రారంభించాలి. గిరి గతం గురించి మనకు బాగా తెలియదు. ఈ విషయంలో అతనికి సహాయం చేసినవాళ్ళెవరో తెలుసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ రామకృష్ణకు ఇందులో భాగం వుందా అన్నది"
హిమజ ఉలిక్కిపడింది.
"ఆ డాక్టర్ కి మేమంటే చాలా అభిమానం సాగర్! ఆయనకు యిందులో సంబంధం వుందంటే నేను నమ్మలేను"
"నిరూపించబడేంతవరకూ అందరూ దొంగలే, అనుమానితులే హిమా! రామకృష్ణ సహాయం లేకపోతే గిరి అంత సులభంగా తప్పించుకునేవాడు కాదు. ఎందుకంటే సెక్షన్ 84 ప్రకారం నిందితుడు నేరం చేసిన సమయంలో మానసికమైన జబ్బుతో బాధపడుతున్నట్లు రుజువు కావాలి"
"అందర్నీ అనుమానించి ఒకవేళ వాళ్ళు నిరపరాధులని తెలిస్తే వాళ్ళకి మనస్తాపం కలిగించిన వాళ్ళమవుతాం. ఎందుకింకా ఈ పరిశోధనలు? పూర్తిగా ఓడిపోయామనే అనిపిస్తోంది"
"ఎందుకంత నిరాశాపూరితంగా మాట్లాడతావు హిమా! చదువుకున్న దానివి. నిరాశావాదం పనికిరాదు. మనిషన్నవాడు ఒక ఓటమిని మనసులో పెట్టుకుని ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటానన్న నిర్ణయానికి రాకూడదు. యిప్పుడు మనకు చిన్న ఆధారం దొరికింది. దాని ఆధారంగా ముందుకు సాగుదాం."
"నాకు నమ్మకం కలగడంలేదు సాగర్! కటిక చీకట్లో కనిపించకుండా ఏమని వెదకడం? జరగవలసిన నష్టం జరిగిపోయింది"
"హిమా, ఒక ఉదాహరణ చెప్తాను. యిప్పుడు వున్నట్లుండి కరెంట్ పోయిందనుకో, అంతకు మునుపెప్పుడో చీకట్లో అగ్గిపెట్టె వెతకబోయి టేబుల్ మీద గ్లాసు పడేసి విరగ్గొట్టావే అనుకో - కాబట్టి నాకేమీ కనిపించదు. ఇలా చీకట్లో కూర్చోవడమే మంచిది అన్నది నెగటివ్ ఫీడ్ బాక్ - నిరాశావాదం - దాన్ని నీలోంచి తీసివెయ్యి, నీకు అగ్గిపెట్టె ఎక్కడుందో తెలుసు. చీకట్లో అయినా కాస్త జాగ్రత్తపడితే తడుముకుంటూ అయినా తీసి వెలిగించగలను అనుకుని మొదలు పెట్టి అలాంటి పాజిటివ్ ఫీడ్ బాక్ మెదడుకు అందించు. నీకు విజయం లభిస్తుంది. గిరి హంతకుడని మనకు తెలుసు. ఎంత జాగ్రత్తపడినా ఏదో ఒక పొరబాటు కూడా చేసే ఉంటాడు. అతని గది తాళాలు తీసుకురా చూద్దాం"
హిమజ తెచ్చిన తాళంతో గిరి గది తలుపు తెరిచాడు సాగర్. గదినిండా వస్తువులు చిందరవందరగా పడి వున్నాయి.
గది లోపల నిశ్శబ్దంగా వుంది.
"చివరిసారిగా ఈ గదిలోకి ఎవరు వచ్చారు?" అడిగాడు సాగర్ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.
"కోర్టు నుంచి విడుదలయ్యాక గిరిధర్ అమెరికా వెళ్ళబోయే ముందు వచ్చాడు. గదిలో ఒక గంటసేపు వుండి వెళ్ళిపోయాడు. తరువాత నేనే తాళం వేశాను"
"అయితే హడావుడిగా అన్నీ తిరగేసి కావలసినవి పట్టుకెళ్ళి పోయినట్లున్నాడు. అయినా తొందరలో ఏమైనా వదిలేశాడేమో? చూద్దాం" ఒక్కో వస్తువు తీసి, చూసి పక్కన పెడుతూ అన్నాడు.
హిమజ అతనికి సాయం చెయ్యసాగింది.
చాలావరకు గిరిధర్ రోజూ వాడుకునే వస్తువులే కనిపిస్తున్నాయి. బీరువా ఖాళీగా వుంది. బట్టలు కూడా గదిలో నేలమీద పడివున్నాయి. బీరువాలో లాకర్ లో కొన్ని రసీదులు, పాత బిల్లులు తప్ప మరేం లేవు. సాగర్ కనిపించిన కాగితాలన్నీ తీసి ఒక పక్కగా పెట్టాడు.
బాత్రూంలో మెడిసిన్ చెస్టులో చాలా మందులు కనిపించాయి. చాలావరకు ప్రతి యింటిలో వుండేవే. ప్రతి సీసాని జాగ్రత్తగా పరిశీలించాడు సాగర్. ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు.
"మళ్ళీ మొదటికే వచ్చాం. ఏ క్లూ దొరకలేదు కదూ ?" అంది హిమజ.
"లేదు. ముందుగా అనుకున్నదే. పద, వెళదాం" బయటకు దారి తీశాడు సాగర్.
"పద్మజ గదిలో ఏమైనా దొరుకుతుందేమో చూస్తే" అడిగింది హిమజ.
"అదీ ఒకసారి చూద్దాం పద."
గది తలుపులు తెరవగానే ఎదురుగా పద్మజ ఫోటో నవ్వుతూ పలకరించింది.
గిరిధర్ గదిలో కాకుండా పద్మజ గదిలో సామానులు ఎక్కడి వక్కడ నీట్ గా సర్ది వున్నాయి. పద్మజ వ్రాసుకునే టేబుల్ ఖాళీగా వుంది.
"ఆఫీస్ ఫైల్స్, పేపర్లు.... అన్నీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి పోయారు" అంది హిమజ అతని ఆలోచన గ్రహించినట్లుగా.
సాగర్ మనసులో ఫిరోజ్ పూర్ నుంచి స్నేహితుడు హరీందర్ సింగ్ ఇచ్చిన టెలిగ్రాం మెదిలింది. పంజాబ్ లో తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి తోడ్పడుతున్నది డిఫెన్స్ సెక్రటేరియట్ లో పనిచేసే ఒక స్త్రీ అని తెలసిందనీ, అది పద్మజ అని తను అనుమానిస్తున్నాడనీ, మరొక చిన్న ఎంక్వయిరీలో అది కన్ ఫర్మ్ కావచ్చుననీ తెలియ చేశాడతను హరీందర్ హత్య చేయబడకపోతే అప్పుడే ఈ విషయం బయటకొచ్చేది. అఫీషియల్ గా పరిశోధన చేయడం జరిగేది. తను పద్మజను కాస్త కానీ పెట్టాలనుకుంటుండగానే గుజరాత్ అల్లర్లు గురించి అక్కడకు పంపారు. దాదాపు నెలపైగా తను అక్కడే వుండిపోవడం హిమజను దక్షిణదేశం తిరగటానికి పంపడం జరిగింది. అందువల్ల హిమజకూ ఇక్కడి విషయాలు ఏమీ తెలియవు.