Previous Page Next Page 
తులసి పేజి 40

                                                                        14


    "మనం ముందు బయటపడాలి"   

    "ఈ బిల్డింగు ఒక తేనెతుట్టు లాంటిది. ఎన్ని గదులున్నాయో ఎవరికీ తెలీదు. ఆ గదుల్లోంచిబయటపడడం అంత సులభం అని నేననుకోను" అంది తులసి.

    "నా గది పైకప్పులోంచి చూసిందెవరు?"

    "నేనే......"

    "నేనందులోంచి బయటపడ్డాను"

    "దెన్ యూ హావ్ టూ థాంక్ మీ"

      అతడు మౌనంగా వూరుకున్నాడు. ఆమె ఇంగ్లీషు ఉచ్ఛారణ అతడిని కొద్దిగా ఇబ్బందిలో పెట్టింది. మాట మారుస్తూ "వీణ్ని ఎక్కడయినా దాయాలి ముందు" అన్నాడు చక్రవర్తి శరీరాన్ని బల్లకింద చూస్తూ వుంటే, అప్పుడు మళ్ళీ ఆమె పాదుకల్ని చూసింది. అంతా గుర్తొచ్చింది. తనొచ్చిన పనీ, ఇరుక్కుపోయిన విధానం.........

    మరుక్షణం ఆమె దార్కా సంగతి మర్చిపోయి పరిశోధనలో పడింది. పాదుకలు నేలకి ఎందుకు తాపడం చేసి వున్నాయి? ఆమె బల్లక్రిందకి వంగి చెప్పుని బలంగా లాగింది. అది చేతికి వచ్చింది కానీ, దానికి ప్లగ్, ఆ ప్లగ్ కి పిన్ వుండటం ఆశ్చర్యం కలిగించింది. అంతలోనే ఆమెకి బల్లమీద గరుగ్గా తగిలిన కాగితం విషయం జ్ఞాపకం వచ్చింది. లేచి ఆ పై గుడ్డని బలవంతంగా లాగింది. దానిక్రింద నల్లగా గరుగ్గా కనబడింది......

    కార్బన్ కాగితం..........

    ఆమె దాన్ని తీసి అడుగున ఏముందో చూసింది. తెల్లటి చైనా సిల్కు గుడ్డ....... దాని చివర
 
    ఒక తాడుకి కట్టబడి వుంది. ఆ తాడు బల్లకోడులోకి వెళ్ళిపోయింది.

    భక్తుడు ప్రశ్న వ్రాస్తూ వుంటే, అది కింద చైనా సిల్కుగుడ్డ మీద కాపీలా పడుతుందన్నమాట, తరువాత ఎవరో ఎక్కణ్నుంచో దాన్ని లాగుతారు......కానీ......కానీ సిద్దేశ్వరి  కుర్చీలోంచి లేవకుండానే ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పగలుగుతుంది? ఆమె ఒక్క క్షణం ఆలోచించింది.

    దార్కా ప్రేక్షకుడిలా గమనిస్తున్నాడు. ఆమె మొహంలో పనిపట్ల ఏకాగ్రత, కళ్ళలో తీక్షణత, కదలికలో చురుకు, అతడికి తను విషాచికి శిష్యుడిగా వున్న రోజుల్ని గుర్తు తెస్తున్నాయి.

    తులసి చూపుడు వేల్తో బల్లకోళ్ళని కొట్టింది. ఆమె అనుకున్నట్టే ఒక కోడు డోలగా వుంది. దాని క్రింద తివాచీని తడిమి చూసింది. ఒక తాడు ఎత్తుగా తగిలింది. దాన్ని తడుముకుంటూ ప్రయాణం సాగించింది. అది పక్క రూమ్ లోకి వెళ్ళింది. ఆమె తలుపు తెరిచి, ఆగదిలోకి అడుగు పెట్టీ పెట్టగానే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.

    ఆ గదిలో గోడకి చిన్న ట్రాన్స్ మీటర్ వుంది.

    ఆమె జేమ్స్ బాండ్ లా సన్నగా విజిల్ వేయబోయి ఆడదాన్నని గుర్తువచ్చి, మానేసి "అదీ విషయం" అంది అంతా అర్ధమైపోయినట్టుగా.
   
    "ఏమిటి" అన్నాడు దార్కా.

    "సిద్దేశ్వరి ఈ కుర్చీలో కూర్చోగానే, తన పాదుకల్ని ఈ ప్లగ్ కన్నాల్లో పెడుతుంది.

    ఆ పాదుకలకి వున్న వైర్లకి ఆమె చెవి దగ్గర వున్న హెడ్ ఫోన్స్ కనెక్ట్ చెయ్యబడి వుంటాయి. మనం ప్రశ్న వ్రాయగానే, అది కార్బన్ కాగితం ద్వారా కింద వున్న సిల్కు గుడ్డమీద పడుతుంది. ఆ గుడ్డని పక్కగదిలో వున్న అసిస్టెంటు తాడుతో, బల్లకోడు గుండా, తివాచీ కిందనుంచి లాగేస్తాడు. దాన్ని చదివి ట్రాన్స్ మీటర్ లో చెబుతాడు. అది సిద్దేశ్వరి పాదుకల గుండా ఆమె చెవి దగ్గర వినబడ్తుంది. ఆ తరువాత సంగతి తెలిసిందే........"

    దార్కా ఈ మోసాన్ని తొందరగా జీర్ణించుకోలేకపోయాడు. తులసి అంది.

    "మన మూర్ఖత్వాన్ని ఆసరాగా చేసుకుని సిద్దేశ్వరి లక్షలు లక్షలు సంపాదించింది. చాలా తెలివిగా పగడ్బందీగా వేసిన ప్లాన్ ఇది"

    "ఇంత సులభమా ఇది"

    "తెలిస్తే అంతా సులభం, తెలియకపోతే మానవాతీత శక్తి" అంది తులసి. మానవాతీతం అనగానే ఆమెకి గాలిలో ఎగిరి తనతో మాట్లాడిన పుర్రె జ్ఞాపకం వచ్చింది.

    పక్క గదిలోకి పరిగెత్తింది. చీకటిగా వుంది ఆ గది. బల్లమీద పుర్రె గాజు గోళాల్లా మినుక్కు మినుక్కు మంటున్న కళ్ళు -అయితే ఈసారి ఆమె భయపడకుండా దాన్ని చేతుల్లోకి తీసుకుంది.

 Previous Page Next Page