దూరంగా ఎక్కడో చెట్టుమీద ఒక కాకి దాహంతో అరిచి- అరిచి సొమ్మసిల్లింది. ఎండ తీక్షణతకు నేషనల్ హైవేమీద తారు కరిగి పల్లానికి ప్రవహిస్తోంది. ఆ తీవ్రతకి భయపడే కామోసు రోడ్ మీద ఒక్క వాహనం కూడా కనిపించడంలేదు. కొండరాళ్ళ మధ్యనుంచి వస్తున్న వడగాల్పుల శబ్దం కూడా అక్కడి నిశ్శబ్దంలో కలిసిపోయింది.
దూరమౌతున్న రావు తాలూకు కుంటికాలి కర్ర చప్పుడు ఒకటే ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తోంది.
* * *
"కాబోయే శ్రీవారికి,
మీ కాబోయే చరణదాసి హేమంత సంధ్య వ్రాయునది. మనకు పుట్టబోయే బుజ్జిగాడు 'నాన్నని చూడాలి' అంటున్నాడు అని నేను రాస్తే 'మైడియర్ రొమాంటిక్ ఇడియట్ నేనేం చేయకుండానే నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ ఎప్పుడయిందన్న' అనుమానం నీకు రావొచ్చు. నాకు చాలా పిచ్చి పిచ్చిగా వుంది తెలుసా? జామచెట్టు తీవెనుంచి జాజిపూలు కోసి తల్లో తురుముకోవాలనీ, అరిటాకు నూరి గోరింటాకు పెట్టుకోవాలనీ- ఇదిగో ఇలా పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాసి నీ బుర్ర తినెయ్యాలనీ మహా కోరికగా వుంది మైడియర్! ఎందుకో చెప్పనా? నేను ఎల్లుండే వచ్చేస్తున్నానోచ్!
అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా నాన్న ఈ మధ్య సైకియాట్రిస్టుని కలుసుకున్నాడు. సుప్రీమ్ కోర్టు చివాట్లు పెట్టినందుకని అందరూ అనుకున్నారు. నిన్ను కలుసుకున్నాక ఆయన మతి చెడిందన్న విషయం నాకొక్కదానికే తెలుసు. నువ్వు అత్యంత మేధావివో- లేక అలా నటిస్తున్న అత్యంత మాయగాడివో అర్ధంకాక తలబద్దలు కొట్టుకుంటున్నాను. నీ ఎం.ఎం.జె. (మంగళ్ సింగ్ మరో జన్మ) - వ్యవహారం చూసి అవాక్కయి పోయాడు. కాబోయే అల్లుడికి పదిరోజుల్లో ప్రధానమంత్రి అయ్యేటంత పాపులారిటీ వస్తున్నందుకు విభ్రాంతి చెందాలో, ఇన్ని గొప్ప తెలివితేటలు ఎటు దారితీస్తాయో తెలీక విచారించాలో ఆయనకే అర్ధంకాలేదు. అంతలో నువ్వు అన్నిటికీ గుడ్ బై చెప్పెసేసి ఊరికి దూరంగా చిన్న హోటల్ పెట్టుకున్నావని తెలిసి మరీ కంగారుపడ్డారు. నీ ప్రవర్తనపట్ల ఆయనకీ చాలా అనుమానాలు ఏర్పడ్డాయి. అప్పటికీ నేను చెపుదామనుకున్నాను. 'హీ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ ట్యూనింగ్ ఎ ఫిమేల్ టు హిజ్ లిరిక్' అని - అపార్ధం చేసుకోకు. 'అమ్మాయిల్ని పడెయ్యటం తెలిసిన వాడికి ఓటర్లని పడెయ్యటం ఒక లెక్కా?' అని నా ఉద్దేశ్యం. 'కాబట్టి మీ కాబోయే అల్లుడి శక్తి సామర్ధ్యాల పట్ల మీకే అనుమానం వద్దు నాన్నగారూ!' అందామనుకున్నాను. మరింత కంగారు పడతారని వూరుకున్నాను.
సర్లే! ఈ విషయాలకేంగాని నువ్వెలా ఉన్నావ్? మనం మానాన్నగారి టాపిక్ వదిలేసి కాస్త రొమాంటిక్ గా మాట్లాడుకోవటం మంచిదేమో! నిన్ను బాగా చూడాలనిపిస్తుందోయ్ బుచ్చిబాబూ.... మొన్నరాత్రి మా ఢిల్లీ తెలుగువాళ్ళు ఓ నాటకం ప్రదర్శించారులే! పేరు 'ముద్దొస్తున్నావోయ్ గోపాలం' అది చూస్తున్నంతసేపూ నువ్వే గుర్తొచ్చావ్. సంవత్సరంపాటు మనిద్దరం కల్సుకోకూడదని షరతు పెట్టినందుకు అపుడపుడు నేను కొంచెం బాధపడిన మాట నిజమే అనుకో! కాని దానివల్ల నాకు రెండు లాభాలు కలిగాయి. ఏమిటో తెలుసా?
మొదటిది.... నువ్వెంత గొప్పవాడివో నాకు తెలియడం.... రెండవది ఏడాది విరహం తర్వాత కలయికలో ఉండే ఆనందం.
ఇంకేం చెప్పను? నిద్రపోయే ముందువరకూ వుండే దిగులు జ్వరం లాంటిదయితే.... నిద్రలేచాక మొదలయ్యే దిగులు పాడై పోయిన అంబులెన్స్ లాంటిదయితే.... అర్ధరాత్రి వచ్చే నీ కల ఒక్కటే నన్ను బతికించే ఆక్సిజన్.
అన్నట్టు నేనింతకాలం ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో నీకు చెప్పలేదు కదూ? వచ్చాక చెప్తావేం. నువ్వు చాలా సంతోషిస్తావ్! ఒకప్పుడయితే తిట్టేవాడివి. ఇపుడు బంగారు బుజ్జికొండలా మారిపోయావు కదా! భలే మెచ్చుకుంటావులే.... నాకా నమ్మకముంది.
ఈ ఉత్తరం నీకు రేపు సాయంత్రం అందుతుంది. అంటే మనం కల్సుకోవటానికి ఇంకా దాదాపు ఇరవై నాలుగు గంటల టైముంది. ఈ విరహపు క్షణాలన్నిటినీ ఇక్కడ గాలిలోకి విసిరేస్తే ఈ రాత్రికవి నీ యింటిముందు కలువలుగా వికసించాలని కోరుకుంటూ.... నీ ....అజినపత్రి"
పి.యస్. అజినపత్రి అనగా గబ్బిలము- హేమంత.
చదవగానే బృహస్పతి మనసంతా అదోలా అయిపోయింది. మితిమీరిన సంతోషం కల్గించిన దుఃఖం అది! అతడా భావాన్ని తన మొహంలో దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదు. అతడి ముఖ కవళికల్ని మరోలా అర్ధం చేసుకున్న పఠాణి.... "ఏమిటి.... ఏమయినా దుర్వార్తా?" అని అడిగింది.
"కాదు. చాలా శుభవార్త. హేమంత సంధ్య రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి వస్తోంది."
"హేమంత అంటే నా స్నేహితుడు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయేనా?"
"అవును."
ఆ అమ్మాయి ఒక నిముషంపాటు మౌనంగా వూరుకుని దగ్గరగా వచ్చి కూర్చుంటూ చిన్నదయిన స్వరంతో అన్నది-" ఆ అమ్మాయంటే నీకు చాలా ఇష్టమనుకుంటాను కదూ!"
బృహస్పతి నవ్వి- "నీకలా తెలిసింది?" అనడిగాడు.
"నీవా ఉత్తరం చదువుతుండగా నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు అలా అనిపించింది."
అతడి నవ్వు మరింత విశాలమయింది. "నేను కూడా పట్టుబడి పోతున్నానన్న మాట! ఇంతకాలం నాకు నా మీద చాలా నమ్మకం వుండేది."
ఆ అమ్మాయి అంది- "ఈ కొద్దిసేపటిలో నువ్వు నాలుగు సార్లు నవ్వావు. నేనొచ్చిన తర్వాత నువ్వు నవ్వినట్టు నేనెప్పుడూ చూడలేదు. ఆ తేడా కొట్టిచ్చినట్టు కనబడుతోంది."
బృహస్పతి మాట్లాడలేదు.
"ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు" తనలో తనే అనుకున్నట్టు అంది.
బృహస్పతి జవాబివ్వలేదు. ఆమె కొంచెంసేపు ఊరుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్టు "నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను" అంది. అతడు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"నేను .... నేను మంగళ్ సింగ్ మేనకోడల్ని కాను."
బృహస్పతి ఆమె వేపు విస్మయంగా చూశాడు.
ఆమె తల దించుకుని "అవును. నా పేరు రజియా. ఢిల్లీలో ఓ బీద కుటుంబంలో పుట్టాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన దాన్ని. నీ గురించి పేపర్లో చదివాను. చిన్న వల విసిరి చూద్దామనిపించింది. మంగళ్ సింగ్ మేనకోడలిగా నాటకమాడాను. నిన్ను పెళ్ళాడితే లక్షలూ.... కోట్లూ లభిస్తాయనుకున్నాను. మరీ పచ్చిగా చెప్పాలంటే కనీసం ఉంపుడు కత్తెగా నన్నా సెటిల్ అవుదామనుకున్నాను.... ఆగు.... డబ్బు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా? లాంటి నీతి వాక్యాలు చెప్పకు. బీదరికం ఎంత దారుణమైనదో నీకు తెలీదు."
బృహస్పతి తల అడ్డంగా ఊపుతూ "నేను నీకే నీతులూ చెప్పబోవడంలేదు. నీకన్నా దారుణమైన నాటకాలు నేనాడాను. మంగళ్ సింగ్ పేరుతో ప్రజల్ని మోసం చేయాలనుకున్నాను. అంతవరకూ ఎందుకు? నిధిలో వాటా ఇవ్వవలసి వస్తుందని నిన్ననే నా నేహితుణ్ణి చేతులారా దూరం చేసుకున్నాను."
రజియా విభ్రాంతురాలై చూసింది.
బృహస్పతి అన్నాడు. "అవును. నన్ను నమ్మి నువ్వు నీ విషయం చెప్పావు. నాకూ నీతో అసలు సత్యాన్ని చెప్పాలనిపిస్తోంది. అతడి దగ్గర బుకాయించాను. కానీ రావు చూసినదంతా నిజమే. ఆ రాత్రి నా ప్రాణాలకి ప్రమాదం లేదని తెలియగానే పెట్టెలోంచి నిధి ప్లాన్ తీసుకున్నాను. స్నేహితుడు రక్తపు మడుగులో పక్కన కొట్టుకుంటున్నా దానికి ప్రాముఖ్యత యివ్వలేదు. డబ్బు మనిషి చేత ఎలాంటి పనయినా చేయిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?"
ఆమె లేస్తూ "నేనీ సాయంత్రం వెళ్ళిపోతాను" అంది.
"ఎక్కడికి?"
ఆమె మొహం మీద ఒక విషాదమైన నవ్వు కదలాడింది. "అడ్రస్ లేనిదాన్ని. మళ్ళీ అడ్రస్ లేని చోటికి వెళతాను. ఎప్పుడైనా ఢిల్లీలోని చీకటి వీధుల్లోకి వస్తే బహుశా అక్కడ కనబడతానేమో" అంది.
"నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతోనే ఉండవచ్చు."
రజియా సంభ్రమంగా చూసింది.
అతడు లేచి పచార్లు చేయసాగాడు.
తన మనసులో కదుల్తున్న అస్పష్టమైన ఆలోచనలకి మాటల రూపం యిస్తున్నట్టు చెప్పసాగాడు. "ఆ నిధి గురించి ఏం చెయ్యాలో నాకింకా అర్ధం కావడంలేదు. నువ్వన్నట్టు నీతులు చెప్పటం చాలా సులభం, ఆచరణలోనే చాలా కష్టం. అంత డబ్బు ప్రభుత్వానికో, అసలు వారసులకో అప్పజెప్పటం అంత సులభం కాదు. కానీ దీనికి హేమంత సంధ్య చచ్చినా ఒప్పుకోదు. ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. రేపే ఈ విషయం అటో ఇటో తేలిపోతుంది. నువ్వుకూడా ఆ నిర్ణయానికి యిష్టపడగలిగితే ఇక్కడే ఉండి కష్టపడు."
ఆమె మొహం విప్పారింది "నిజంగానా?" అంది.
"నిజంగానే అంటున్నాను. అయితే ఆ నిధిమీద మాత్రం ఆశలేం పెట్టుకోకు. దానికి హేమంత ఒప్పుకోదు."
ఆమె నవ్వి "ఆ నిధిమీద నాకేం హక్కుంది?" అంది.
అతడు కూడా నవ్వేస్తూ - "నేనేదో కోటీశ్వరుడినైపోతే ఆ రకంగా ఇక్కడుండడం మంచిదనుకుంటున్నావేమోననీ" అన్నాడు.
"అలాంటి ఆశలేం లేవు. నేను కొద్దిగా మారాననుకుంటున్నాను." అతడి మొహంలో నవ్వు మాయమైంది. సాలోచనగా మనసులో అనుకున్నాడు. "అవును. నేనూ మారాను. అయితే ఈ మార్పుకి హేమంత సంధ్యా? ప్రశాంత నివాళా?"
24
రాంభరత్ చాలా ఇరిటేటెడ్ గా వున్నాడు. దావూద్ హర్షద్ హత్య కేసునుంచి బృహస్పతి విజయవంతంగా బయటపడటం ఒకవేపూ, ఆ హత్య కేసు విషయమై పత్రికల్లో తనమీద దుమారం రేగడం మరోవైపూ అతణ్ణి కుంగదీస్తున్నాయి. బోనులో పడ్డ ఎలకలా పచార్లు చేస్తున్నాడు.
హరిస్వామి మౌనంగా అతడినే గమనిస్తున్నాడు. అతడికి కూడా చిరాగ్గానూ, బృహస్పతిపై అమితమైన కోపంగానూ వుంది. అప్పటివరకూ తనకి 'ప్రధాన మంత్రుల్ని తయారు చేస్తాడు' అన్న కీర్తి వుండేది.
ఈ మూడు స్తంభాలాటలో బృహస్పతే నెగ్గుతాడనుకుని అతడి వర్గంలో చేరడానికి తను ప్రయత్నించాడు. వర్గ నాయకులయిన ఇద్దరు శత్రువులు ఒకటిగా కలిసిపోతే వాళ్ళ అనుచరులు ఏ రకమైన ఇబ్బందిలో పడతారో స్వానుభవంగా హరిస్వామికి తెలుస్తోంది. సంకల్పనాథ్ రే గురించి తాను మాట్లాడిన అవాకులూ చవాకులూ అన్నీ బృహస్పతి అతడికి (సంకల్పనాథ్ రేకి) చెప్పాడని తెలియడంతో మరింత కుత కుత లాడిపోతున్నాడు.
వాళ్ళిద్దరూ అలా తమ తమ ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగా అక్కడికో ఫోన్ కాల్ వచ్చింది.
"నేను వెంటనే అక్కడికి రావచ్చా? మీతో అర్జంట్ గా మాట్లాడాలి?"
వాళ్ళున్నది ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్. చాలా కొద్దిమందికి మాత్రమే ఆ ఫోన్ నెంబర్ తెలుసు. అందువల్ల అవతలినుంచి మాట్లాడుతున్నదెవరాని కూడా హరిస్వామి అడగలేదు.