అతడే ఆమె సైన్యం తరువాయి భాగం
పిడుగుపడ్డట్టు వినిపించిన ఆ మాటలకి అందరూ ఒకర్నొకరు చూసుకున్నారు.
వాళ్ళ మధ్య ప్రనూష లేదు!
చైతన్య ఆలోచన్లు రాకెట్ కన్నా వేగంగా పరుగెత్తుతున్నాయి. ఏం జరిగిందో అతడికి అర్ధమవుతూంది. అనుకున్న పథకం అయితే, ఇస్మాయిల్ ముందు జీపులో సాగిపోతూ, శత్రు సైనికుల దృష్టి తనవైపు మళ్ళించుకోవాలి. శత్రువుల వ్యాన్ లతోపాటు తమ వ్యాన్ కూడా బయటకు సాగిపోవాలి. అంతవరకూ బాగానే వుంది కానీ ప్రనూష ఎక్కడ ఎక్కాలో ముందే నిర్ణయించుకోలేదు. అందరూ వ్యాన్ వెనుక భాగంలో ఎక్కిన తరువాత డాక్టర్ పాల్ ని వ్యాన్ వెనుక భాగం నుంచి రెండుసార్లు శబ్దం చేయమన్నాడు. కాని తప్పు ఎక్కడ జరిగిందంటే... డాక్టర్ పాల్, ప్రనూష ముందు సీట్లో తనతోపాటు కూర్చుని వుంది అనుకున్నాడు.
చాలా చిన్న చిన్న విషయాలుకూడా ప్లాన్ చేయకపోతే, మొత్తం ఆపరేషన్ ఎలా ఫెయిల్ అవుతుందో చెప్పటానికి అది ఉదాహరణ. విజయం చేతివేళ్ళ అంచులవరకూ వచ్చి ఒక్కసారిగా జారిపోయింది.
'కమెండో' ఆపరేషన్ అంటే ఎంత జాగ్రత్తగా వుండాలో, ప్రతీ చిన్న విషయం ఎంత జాగ్రత్తగా, సునిశితంగా ప్లాన్ చేయాలో అతడికి అర్ధమయింది.
గుండెల్నిండా గాలి పీల్చుకుని వదుల్తూ "నేను వెనక్కి వెళతాను" అన్నాడు.
అందరూ అయోమయంగా అతడివైపు చూశారు. అతడు చెప్పేది వాళ్ళకి అర్ధమవటానికి కొన్ని క్షణాలు పట్టింది.
డాక్టర్ పాల్ అన్నాడు- "వెనక్కి వెళ్ళి ప్రనూషని తీసుకొస్తారా?"
"తీసుకురాగలనో లేదో నాకు తెలీదు. వెళ్ళటం మాత్రం నా కర్తవ్యంగా భావిస్తున్నాను."
"వెళ్ళి...."
"వెళ్ళి ఏమీ చేయలేకపోవచ్చు. నేను వెళ్ళేవరకూ ప్రనూషను వాళ్ళు ప్రాణాలతో వుంచకపోవచ్చు. అయినా వెళ్ళటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను."
"వెళ్ళి...."
"వెళ్ళి ఏమీ చేయలేకపోవచ్చు. నేను వెళ్ళేవరకూ ప్రనూషను వాళ్ళు ప్రాణాలతో వుంచకపోవచ్చు. అయినా వెళ్ళటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను."
అప్పటివరకూ మౌనంగా వున్న ఇస్మాయిల్ ముందుకు కదిలి, "మళ్ళీ ఇంకోసారి ఆలోచించు బాబూ! మనం సరిహద్దు అంచుల్లో వున్నాం. విజయానికి చేరువల్లోకి చేరుకున్నాం. పోనీ నువ్వు వెళ్ళటంవల్ల అక్కడ ఆమె అపాయం నుంచి ఏమైనా బయట పడుతుందా అంటే అదీ లేదు. చుట్టూ సైనికుల వలయం. ఆ వలయాన్ని ఛేదించుకొని ఒకవేళ కష్టపడి నువ్వు లోపలికి వెళ్ళినా కేవలం అది ఆమె మృతదేహాన్ని చూడటానికే! కానీ దానికోసం నువ్వు తీసుకుంటున్న రిస్క్ ఇక్కడ మీ తల్లిదండ్రుల్ని ఈ కొండల మధ్య ఒంటరిగా వదిలిపెట్టడం- ఇదంతా దేనికో నాకు అర్ధంకావడంలేదు" అన్నాడు.
డాక్టర్ పాల్ ఇస్మాయిల్ ని చూస్తూ "కరెక్ట్" అన్నాడు.
చైతన్య జగదీష్ వైపు తిరిగి, "మీ అభిప్రాయం ఏమిటి నాన్నగారూ?" అని అడిగాడు.
జగదీష్ తలెత్తి చూశాడు. ఆ వృద్ధుడి కళ్ళల్లో అదోలాంటి తేజస్సు కనపడుతూంది. "నువ్వు నన్ను ఇది అడుగుతున్నది ఓటింగ్ గురించా?" అన్నాడు.
"ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు. ఓటింగ్ అవసర మేమున్నది?" అన్నాడు చైతన్య.
"నేను నీ స్థానంలో వుంటే ఇలా అందరి అభిప్రాయాలూ కోరను. ఆ అమ్మాయి కోసం వెంటనే వెనక్కి వెళతాను."
చైతన్య నిరుత్తరుడయ్యాడు.
"అవును చైతన్యా! ఈ పనిమీద ఇద్దరూ కలిసి వచ్చారు. నీ కోసం తను ఎన్నో ప్రమాదాల్ని ఎదుర్కొంది. ఆమె కోరిక చిన్నది. కేవలం నీ తండ్రిని విడిపించటం కోసమే ఆమె ఇంత శ్రమ తీసుకుంది. అటువంటి ఆమెక్కడ కష్టాల్లో వుంటే నేనైతే ఇలా చర్చిస్తూ కూర్చోను. ఆమె కోసం ప్రాణంతో వుందా, పూర్తిగా మరణించి వుంటుందా అని వేచి వుండను. వెంటనే బయల్దేరతాను"
చైతన్య కళ్ళు మెరిసాయి. కృతజ్ఞతగా తండ్రివైపు చూశాడు. తాము వెంటనే సరిహద్దు దాటకపోతే తల్లి, తండ్రి ప్రాణాలకెంత రిస్కో అతనికి తెలుసు. కానీ ఇక్కడ సమస్య తల్లి, తండ్రి, మిత్రురాలు- ఇవికావు. తమతో వచ్చిన ఒక మెంబరు శత్రువుల మధ్య వుండిపోవటం జరిగింది- వెళ్ళాలి అంతే!
అతడు సూచన్లు ఇవ్వటం మొదలుపెట్టాడు.
16
ప్రనూషకి ఏం చేయాలో తోచలేదు.
ఆ రాత్రి.... అప్పటివరకూ అంతా అనుకున్నట్లే జరిగింది. ముందు ఇస్మాయిల్ జీపు బయల్దేరింది. తను స్మోక్ బాంబులు విసిరేసి సృష్టించిన అయోమయంలో సైనికుల వ్యానులు పొగని చీల్చుకుంటూ ముందుకు సాగాయి. చైతన్య వెళ్ళి వ్యాను ఎక్కటం, మిగతా వాళ్ళందరూ అంతకుముందే వ్యాను వెనుక భాగంలో వెళ్ళి చేరుకోవటం చూసింది. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవటంతో అంతా చీకటి ఏర్పడింది. పొగ మధ్యలో బ్యాటరీ లైటు కాంతి చీకటిని పారద్రోలలేకపోతోంది. రైఫిల్స్ చప్పుడు దూరంనుంచి వినిపిస్తోంది.
ఇస్మాయిల్ జీపు చక్రబంధాన్ని చీల్చుకుని దూసుకుపోవటం ఆమె చూసింది. ఆమె సంతృప్తిగా వ్యాను వైపు వెళ్ళబోతూంటే- అప్పుడు జరిగింది ఆ సంఘటన.
చీకట్లోంచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు అజ్మరాలీ!
అతడి చేతిలో పిస్టల్ వుంది. అయితే ప్రనూష భయపడలేదు. పిస్టల్ రేంజికి అందనంత దూరంలో వుంది ఆమె.
అజ్మరాలీ పరుగెత్తుకుంటూ ఆమెవైపు రాసాగాడు. ఆమె ఆలోచనలు మెరుపుకన్నా చురుగ్గా సాగాయి. ఈ పరిస్థితుల్లో ఆమె వ్యానువైపు వెడితే - అజ్మరాలీ దృష్టి దానిమీద పడుతుంది. ఇక అందరూ ఆ వ్యానునే ఫాలో అవుతారు. ఇంతవరకూ చేసినదంతా వృధా అవుతుంది.
అందువల్ల ఆమె చీకట్లోకి పరుగెత్తింది. ఆమె ఉద్దేశ్యం ప్రకారం వ్యానుని అటువైపు నుంచి చేరుకుంటే అజ్మరాలీకి తను చీకట్లో ఎటు వెళ్ళిందీ తెలీదు.
ఆమె బాణంకన్నా వేగంగా పరుగెత్తింది. దూరంనుంచి అజ్మరాలీ రావటం తెలుస్తూంది.
వ్యానులన్నీ వరుసగా నిలబెట్టి వున్నాయి. మిలటరీ క్రమ శిక్షణలో ఒకదాని తరువాత ఒకటి బయల్దేరుతున్నాయి. వాటికి సమాంతరంగా చీకట్లో వస్తూంది ఆమె.
చైతన్య వున్న వ్యాను ఇంకొక వంద గజాల దూరంలో వుంది.
బ్యాటరీలైట్ల వెలుతురులో అది అస్పష్టంగా కనిపిస్తూంది.
ఆ కొద్ది దూరం ఎలాగయినా చీకట్లో ప్రయాణించి వ్యాను చేరుకోగలిగితే వెళ్ళిపోవచ్చు.
ఆమె వేగం హెచ్చించింది.
వ్యాను ఇంకో యాభై గజాల దూరంలో వుందనగా ఆమె స్పష్టంగా విన్నది. రెండుసార్లు వెనుకనుంచి కొట్టిన చప్పుడు... అందరూ వచ్చినట్టు, ముందున్న డ్రయివర్ కి వెనుకనుంచి డాక్టర్ పాల్ కోడ్.... దాంతో చైతన్య వ్యానుని ముందుకు దూకించాడు.