Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 4


    "చిచ్చూ, ఇవాళ నువ్వు ఎంత మంచిపని చేశావో చెప్తాను రా!"
    జ్ఞాన్ లేచాడు. ఉత్సాహంగా తండ్రి వెనకాల ఆయన పుస్తకాలు పెట్టుకునే షెల్ఫ్ దగ్గరికి వచ్చాడు చిచ్చు. ఆ షెల్ఫ్ కి అయిదు అరలున్నాయి. వాటినిండా కూరి కూరి ఉన్నాయి పుస్తకాలు. ఒక అరనిండా మేగజైన్స్ ఉన్నాయి. వాటిల్లోంచి ఒక మేగజైన్ తీసి, ఒక పేజీ తెరిచి "ఇది చదువు" అన్నాడు.
    తన టేబిల్ ముందు కూచుని చదివాడు చిచ్చు.
    "భలే. భలే." చప్పట్లు చరిచాడు. నోట్ బుక్ తీసి కొన్ని విషయాలు కాపీ చేసుకున్నాడు. ఏదైనా ప్రత్యేకత ఉన్న విషయాలు అలా కాపీ చేసుకోవడం జ్ఞాన్ అలవాటు చేసాడు కొడుక్కి. తర్వాత నోట్ బుక్ చంకన పెట్టుకుని, ఇళ యింటికి పరుగుతీశాడు. తను నోట్ చేసుకున్న విషయాలు ఇళకి చెప్పాలి. వెంటనే చెప్పాలి.
    "చిచ్చూ! వంటయింది. అన్నం తిని పో!"
    ఇంటి గుమ్మంలో నిలబడి గట్టిగా అరిచింది వర్ధని.
    అప్పటికే కొంతదూరం పరిగెట్టిన చిచ్చు ఆగి, వెనక్కి తిరిగి "రాను" అన్నట్లు ఊపి మళ్ళీ పరుగుతీశాడు.


                                        *    *    *    *


    యోగానాథశాస్త్రి భారతం చదివి వినిపిస్తున్నాడు. శిధిలావస్థలో ఉన్న పెంకుటింట్లో, వరండాలో ఉన్న ఎత్తు అరుగు మీద కృష్ణాజినం పరుచుకుని, వ్యాసపీఠంలో భారతం పెట్టుకుని చదువుతున్నాడు ఆయన. విరాట పర్వఘట్టం. విధిలేక కీచకుడి ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురయింది ద్రౌపదికి. సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తే అదృశ్య రూపంలో ఒక రాక్షసుణ్ని పంపించాడు ఆమెకి రక్షగా.
    గడప అవతల కూచుని బూడిదలో హరికేన్ లాంతరు చిమ్నీలు తడుస్తోంది ఇళ. తుడుస్తూ తండ్రి చెప్పే పురాణం వింటోంది. ఆ పిల్లకి జ్ఞానం వచ్చినప్పటినుంచీ పురాణగాధలు వింటూనే ఉంది. సహజంగా చిన్నపిల్లలకి కథలంటే ఉండే ఇష్టం కొంత, ఇళకి ప్రత్యేకంగా ఉన్న ఊహాశాలిత కొంతా, ఆ కథలన్నీ ఆమె నరనరాన జీర్ణమయిపోయాయి. ఎన్నోసార్లు వంటరిగా ఉన్నప్పుడు తను విన్న కథలన్నీ మనసులో మననం చేసుకొనేది. ఆ కథల్లో తనను ఒక పాత్రగా ఊహించుకుని, ఆ అద్భుతాలన్నీ తనకే జరిగినట్లు పగటికలలు కనేది.
    తను అనసూయ-విష్ణుమూర్తి మారువేషంలో వచ్చాడు తన పాతివ్రత్యం భంగం చెయ్యటానికి "దుర్మార్గుడా. అవతలకి పో? నేను శపిస్తే నా పాతివ్రత్య మహిమతో బూడిద అయిపోతావు." అనేది. తన పాతివ్రత్యానికి మెచ్చి విష్ణుమూరత్ కి ప్రత్యక్షమయి "నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో" అంటాడు.
    "మా దుర్గ గుళ్ళో కొట్టే కొబ్బరి చిప్పలన్నీ నాన్నకే రావాలి. నామాలయ్యకి వాటా వెళ్ళకూడదు. మా పెద్దక్కయ్యని మా బావ కొట్టకూడదు. కిరాణా కొట్టు షావుకారు అడిగినప్పుడల్లా బియ్యం అప్పియ్యాలి. చిన్నాన్న చదువుకోవడానికి జీతం కావాలి..." ఇలా వరాలు కోరేసుకొనేది. ఈ వరాలు లిస్ట్ పూర్తి కాకుండానే ఆ పిల్ల పగటికలని భగ్నం చేస్తూ ఇంట్లో ఎవరో ఏదో పనికి పిలిచేవారు.
    తండ్రి చెప్పే కథ వింటూ "సూర్యుడు మంచి దేవుడే. సత్రాజిత్తుకి శమంతకమణి ఇచ్చాడు. ద్రౌపదికి అక్షయపాత్ర ఇచ్చాడు. ద్రౌపదికి అక్షయపాత్ర ఇచ్చాడు. ఇప్పుడు రాక్షసుడ్ని సృష్టించి ద్రౌపదికి తోడుగా పంపాడు. రేపటినుంచీ సూర్యుడికి పూజ చెయ్యాలి. ఒక్కటంటే ఒక్కటి - అక్షయపాత్ర ఇస్తేచాలు" అనుకుంటోంది.
    బయటనుంచి "ఇళా" అని పిలుపు వినిపించింది. ఆ గొంతు చిచ్చూది. "వస్తున్నా" లోపలినుంచే అరిచింది. ఆ అరుపుకి ఆ అరుగు మీద కూచున్న పురాణ శ్రోతలంతా అటు చూశారు. వాళ్ళలో చాలామంది మగవాళ్ళు. వయసు మీరిన వాళ్ళు. ముగ్గురు నలుగురు ముసలితనం వచ్చిన ఆడవాళ్ళూ వున్నారు. వాళ్ళా హారతి పళ్ళెంలో వేసిన చిల్లర డబ్బులే యోగనాథశాస్త్రి సంపాదన. ఎవరూ అయిదు పైసల కంటే ఎక్కువ వెయ్యరు. శ్రోతలందరూ కలసి పదిహేనుగురికంటే ఎక్కువ ఉండరు. ఒక ముసలమ్మ ఇళని ఉద్దేశించి "పెద్దదానివవుతున్నావు. అలా అరవకూడదు" అంది. యోగానాథశాస్త్రి గుటక మింగాడు. ఇళ ఈ మాటలేవీ వినిపించుకోలేదు. చిమ్ నీ లాంతరుకి బిగించి కిందపడ్డ బూడిద ఎత్తేసి ఇంటికి దగ్గరలోనే ఉన్న ఉసిరిచెట్టు కిందకి వచ్చేసింది. చెట్టు మొదల్లో పైకివచ్చిన వేళ్ళమీద కూచుని ఉన్నాడు చిచ్చు. అతడి వళ్ళో నోట్ బుక్ ఉంది.
    ఇళ వచ్చిన సంగతి గమనించి కూడా, కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నవాడిలా కూచున్నాడు చిచ్చు.
    "ఏయ్ చిచ్చూ" భుజంమీద చెయ్యివేసి కుదిపింది."
    "హుష్. మాట్లాడించకు. నాకు రుద్రుడు కనిపిస్తున్నాడు." కళ్ళు మూసుకునే అన్నాడు చిచ్చు. చటుక్కున భుజం మీదినుంచి చెయ్యి తీసి ఒక అడుగు వెనక్కి వేసింది. కళ్ళు మూసుకునే నవ్వాడు.
    "ఏయ్. నీది దొంగజపం!" అంది ఇళ. కళ్ళు తెరిచాడు చిచ్చు.
    "ఎలా చెప్పగలవ్?"
    "జపంలో ఉన్నవాళ్ళు నవ్వరు!"
    "నవ్వుతారు. ఏడుస్తారు, జుట్టుపీక్కుంటారు, పీకుతారు. అది వాళ్ళ వాళ్ళ దర్శనాల్నిబట్టి ఉంటుంది. నారదుడు ఆడదిగా మారిపోయాడు. ఇళ మొగవాడిగా మారిపోయింది."
    "ఏయ్ ఏయ్"
    ఉక్రోషంగా చిచ్చూ వీపు మీద గుద్దింది. తప్పించుకుని పారిపోతూ మరింత ఉడికిస్తూ అన్నాడు.
    "కావాలంటే మహాభారతం ఆదిపర్వం చదువుకో. పురూరవుడికి తల్లీ, తండ్రీ కూడా ఇళాదేవి అని ఉంటుంది."
    "కాదు! పురూరవుడి తల్లి ఇళ, తండ్రి బుధుడు. నాకు తెలుసు!"
    "అది కవిత్రయం వాళ్ళ తెలుగు భారతంలో కథ. సంస్కృత భారతంలో మరో కథ ఉంది. ఋగ్వేదంలో ఇంకో రకంగా ఉంది. ఇళ ఆడది కాదు. మనువుకు పట్టిన మగవాడు. పార్వతికి పరమ పవిత్రమైన పొదలోకి వెళ్ళటం వల్ల ఆడదిగా మారిపోయారు. అలా ఆడదిగా ఉన్నప్పుడు బుధుడ్ని పెళ్ళి చేసుకున్నాడు."
    "నీకెలా తెలుసు, ఈ కథలు?
    "మా నాన్నగారు చెప్పారు. ఆయన ఏదో రీసెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ చదివి నోట్స్ రాసుకుంటున్నారు. విదుషి అక్కతో డిస్కస్ చేస్తోంటే విన్నాను."
    ఇళ మాట్లాడలేదు. జ్ఞానదేవ్ అంటే ఆ పిల్లకి చాలా గౌరవం. తండ్రికి నచ్చజెప్పి తన చదువు ఆపకుండా చేశాడు. చైతన్య మాట్లాడిన రీసెర్చ్ ఏమిటో ఆ పిల్లకి అర్థం కాలేదు. కానీ, అతడి మాటలు ఆమె మనసు మీద పూర్తి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించాయి. మహాదేవి అమిత మహిమ కలది. ఆమె తిరుగాడే పవిత్రమైన ప్రదేశంలోకి ప్రవేశించిన మొగవాళ్ళు సహితం ఆడవాళ్ళుగా మారిపోతారు. లెంపలేసుకుని దణ్ణం పెట్టుకుంది. తెల్లబోయాడు చిచ్చు.
    "నాకెందుకు దణ్ణం పెడుతున్నావ్?"
    చిచ్చు వెటకారపు ధోరణి అర్థమయింది ఇళకి! అతడి ఉద్దండపు అల్లరి కూడా తెలుసు! అందుకే నిజం చెప్పకుండా అల్లరి ధోరణిలో అంది.
    "నీకు రుద్రుడు కనిపించాడుగా! అందుకు!"

 Previous Page Next Page