Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 39

    "మీరు పద్మజతో బయటకు  వెళ్ళలేదా" అని అడుగుతున్నాడతను. అంటే ఆమె గదిలో ఉండదని తెలిసి అతడు తిరిగి వచ్చాడా? అంతలో మంచంమీద ఫైలుమీద పడింది నా దృష్టి. అందులోంచి  అతనేదో కాపీ చేస్తున్నట్లుంది. తెల్ల కాగితాలు కనిపించాయి. ఆ ఫైలు అతని వ్యాపారానికి సంబంధించినదేమో, నాకు తెలియదు. కానీ అలాగయితే అతను గాభరాపడడం దేనికి? ఫైలు అట్టమీద పడింది నా దృష్టి. అది ఫ్రెంచి గవర్నమెంటు ఫైలులా అనిపించింది. ఒకవేళ  పద్మజే అతన్ని ఏదైనా కాపీచేయమన్నదేమో  అనుకుని వెళ్ళిపోయాను.

    మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని కలవడానికి  వెళ్ళాను. గది లోపల ఆమె, గిరిధర్ వున్నారు. కానీ అతని స్వరం వేరుగా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో గమ్మత్తుగా మాట్లాడుకుంటున్నారు. నాకు అర్ధం కాలేదు. ఆ విషయం చాలా గమ్మత్తుగా అనిపించింది. ఈ రోజు పుస్తకంలో గిరిధర్ గురించి చదువుతున్నప్పుడు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో తెలిసింది. ఎందుకు చేశాడో తెలియదుగాని చాలా చక్కగా నటించాడప్పుడు. ఒక సైకాలజీ రీసెర్చి స్కాలర్ గా ఆ విషయాన్ని  గుర్తించాను. నా అభిప్రాయం ప్రకారం అప్పటినుంచి అతనేదో ప్లాన్ లో ఉన్నాడని స్పష్టమౌతోంది. ఇదంతా ఇప్పుడు రుజువు చెయ్యలేం. కానీ ఈ విషయం మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని  రాస్తున్నాను.

    అంతకు ముందురోజు వాళ్ళ గదికి నేను వెళ్ళినపుడు గిరిధర్ ఎంతో ఉత్సాహంగా ఫారిన్ విశేషాలు "నన్ను అడిగి" తెలుసుకున్నాడు. నేనూ కూర్చుని అన్నీ వివరించి చెప్పాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీడ్కోలు చెప్పడానికి వెళ్ళాను. గది బయటకే వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. నేను ఆగిపోయాను. నా దగ్గర నుంచి తెలుసుకున్న అక్కడి డ్రయంఫ్ నోటర్ కాథడ్రల్ విశేషాలను చూసినట్లుగా స్వరం మార్చి పద్మజకు చెబుతున్నాడు గిరిధర్. అప్పుడు నాకు అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. అతను పద్మజను మోసం చెయ్యడానికి ఒక ఆత్మలాగా, అన్ని విషయాలు తెలిసినట్లుగా నటించి ఉంటాడని. ఆ అవసరం ఎందుకు కలిగిందతనికి? ఇదేదో కుట్రలా  అనిపించడం లేదూ ?

    ఈ విషయం మీకేమయినా సహాయం కావలసివస్తే నేను సిద్ధం. నాకు ఉత్తరం వ్రాసినా సరే లేదా ఫోన్ చేసినా మీకు కావలసిన సహాయం చెయ్యగలను.

                                                      __జూలీ క్లాడ్"

    వారం రోజుల తర్వాత  ఉత్తరం  అందుకుని చదివిన హిమజ దిగ్బ్రమ చెందింది. ఆ విషయాలు ఆమెను కలచివేశాయి.

    ఆ ఉత్తరాన్ని సాగర్ కి అందజేసింది.

    "ఇలాంటి ఆధారాలు మనకు ముందుగానే తెలిసి ఉంటే కొంత ఉపయోగపడేవి, పరిస్థితి చెయ్యిజారి పోయాక యిప్పుడు తెలిసీ ప్రయోజనం ఏమిటి?" దిగులుగా అంది. "అదీగాక ఈ ఉత్తరం మనకే విధంగా ఉపయోగపడుతుంది? కేవలం మన మనసుల్ని మరింత బాధపెట్టటం తప్ప."

    "ఏమీ చేయలేమనీ, అంతా అయిపోయిందనీ  ఎందుకనుకుంటున్నావు? ఈ ఆధారాలు మనం రుజువు చెయ్యగలిగేవి కావు. రుజువు చేయగలిగితే  ఎన్నేళ్ళ తర్వాతయినా  అపరాధిని శిక్షించవచ్చు. జర్నలిస్టుగా నువ్వు ఈ కేసులో ఎంతో చెయ్యగలవు. ఇరవై సంవత్సరాల తర్వాత డేవిడ్ యాలోప్ పరిశోధించి వ్రాసిన నవలల ఆధారంతో ఇద్దరు నిర్దోషులను కోర్టువారు విడుదల చేశారు. తప్పించుకున్న  మరో వ్యక్తిని అన్నేళ్ళ తర్వాత శిక్షించటం జరిగింది. గిరిధర్ నేరం రుజువు చేయడానికి కావలసిన ఆధారం దొరకనీ, అతను అమెరికాలో ఉన్నా, ఆర్కిటికాలో ఉన్నా రప్పిస్తాను" అన్నాడు సాగర్.

    "ఇలా ఎందుకు జరుగుతుంది సాగర్! ఒక జడ్జి వాదోపవాదాలు విని అతను నేరం చేశాడని రుజువయిందని శిక్ష విధిస్తాడు. అదేరకమైన వాదనలు విన్న మరో జడ్జి అతను నిరపరాధి అంటాడు. ఎంత అస్తవ్యస్తంగా ఉందీ న్యాయవ్యవస్థ."

    "జడ్జి అయినా మనిషేకదా, వాద ప్రతివాదాల మీదే అతని తీర్పు ఆధారపడి ఉంటుంది. గిరిధర్ కేసులో తీర్పు నిచిన జస్టిస్ ఏమన్నారు? న్యాయశాస్త్రంలో ఇలాంటి  లొసుగులున్నాయనీ వాటిని ఆధారంగా తీసుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారనీ, తెలివిగల వాళ్ళు  నేర్పుగా 'లా'లో లాంటి లొసుగులనే ఉపయోగించుకొని  శిక్షపడకుండా తప్పించుకుంటున్నారు."

    "కాని గిరిధర్ మీద నేరం నిరూపించడం కష్టం కదూ అతనిదంతా నటన అని నిరూపించడం జరిగేపని కాదేమో? అదీగాక నిజంగా గిరిధర్ కేవలం స్కిజోఫ్రెనియా అవస్థలోనే  ఈ హత్య చేశాడేమో" నిస్పృహగా అంది.

    "దురదృష్టవశాత్తు మానవాతీతశక్తుల మీదున్న  నమ్మకం మనవాళ్ళకు మనుష్యుల శక్తిమీద ఉండదు. అందుకే వీళ్ళను మోసం చేయడమంత సులభం మరొకటిలేదు. దైవశక్తికెంత  విలువనిస్తారో  దెయ్యాలకి అంత భయపడే జనం మనవాళ్ళు. ఇక గిరిధర్ చెప్పిన భవిష్యవాణి విషయం అంటావా-అతడేం చెప్పాడు? నైజీరియాలో కూ (ప్)గురించి చెప్పాడు.అంతేగా. నైజీరియాతో, వ్యాపార సంబంధాలున్న మనిషి అతడు. ఈ కుట్రలనేవి  అప్పటికప్పుడు జరిగేవికావు. అతడు కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ వుండవచ్చు. అటువంటప్పుడు  ఆ కూ (ప్) విషయం తెలుసుకోవడం కష్టం కాదు. ఎందుకంటే ఇలాంటి కుట్రల్లో వ్యాపారస్తుల మద్దతు కూడా వుంటుంది. ఇకపోతే ఆండ్రోపోప్ మరణం గురించి చెప్పడంలో అసలు ఆశ్చర్యం ఏమీలేదు. ఈ మధ్య మన దేశంలోనే  జరిగిందికదా. ఇందిరాగాంధీని పొద్దుట తొమ్మిదింటికి హత్య చేస్తే కారణాంతరాలవల్ల సాయంత్రం వరకూ ఆమె మరణించినట్లు వార్త బయటకు రానివ్వలేదు. బి.బి.సి. ఈ వార్త ముందుగా ప్రసారం చేసింది. అలాగే కొన్ని కారణాలవల్ల దేశనాయకుల మరణవార్తలు వెంటనే బయటపెట్టరు. ముఖ్యంగా రష్యాలాంటి కమ్యూనిస్టు దేశాల్లో. అలాంటప్పుడు మరో సోర్స్ ద్వారా ఆ వార్త తెలుసుకోవడంలో  వింతేమీలేదు."  

 Previous Page Next Page