రెండు చేతుల్లో ఇనుప కడ్డీల్లాంటివి, ఒక పిడికిలితో ఇంకొకటి బిగుసుకుని అతని తలమీద మెరుపులా పడ్డాయి. చక్రవర్తి కుప్పలా కూలిపోయేడు.
"వెల్ డన్ జేమ్స్ బాండ్" అంది తులసి కొట్టిన వ్యక్తిని చూస్తూ. అతను మాట్లాడకుండా, మోకాళ్ళ మీద వంగి చక్రవర్తిని పరీక్షించసాగేడు.
"చచ్చేడా?" అని అడిగింది తులసి.... లెదన్నట్టు తలూపేడు. అతడు.
"వీడు మీ శత్రువర్గంలో వాడా? మిత్రుడిని పొరపాటున కొట్టేరా"
"శత్రువే"
"అయితే మనం మనం ఒకటన్నమాట. మిత్రుడికి శత్రువు శత్రువు, శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. బైదిబై చార్లెస్ బ్రాన్ సన్ మీకు అన్నయ్యా?"
"వాడెవడు"
"ఓ ఇంగ్లీషు హీరో మీలాగే ఎప్పుడూ నవ్వకుండా వుంటాడు. సీరియస్ గా"
అతడు నవ్వి "నా పేరు దార్కా" అన్నాడు.
* * *
సాయంత్రం అయిదయింది.
మెయిన్ రోడ్ జనంతో కిటకిట లాడుతూంది. శారద కారు ఒక ప్రక్కగా ఆపుచేసింది. ఆమెతో పాటు ఇద్దరు దిగేరు. మహిళామండలి సభ్యురాళ్ళు వరద బాదితుల సహాయార్ధం డొనేషన్లు వసూలు చేయడానికి తిరుగుతున్న వాళ్ళు. శ్రీధర్ వెళ్ళిపోయిన తరువాత తోచక ఆ మండలిలో చేరింది.
వాళ్ళ పని పూర్తయ్యేసరికి ఏడున్నర కావొస్తుంది . వీధి లైట్లు చీకటిని పారద్రోలుతున్నాయి
ఆమె కారు ఎక్కబోతూంటే వెనుకనుండి మోచేతి దగ్గర ఎవరో తాకినట్లయి వెనుదిరిగింది.
వెనుకనున్న వ్యక్తిని చూసి, కెవ్వున అరవబోయి తమాయించుకుంది. అతడి జుట్టు పాయలు పాయలుగా వేలాడుతూంది. గుడ్డల పీలికలయి వున్నాయి. గెడ్డం పెరిగి వుంది. కళ్ళు గాజు గోళాల్లా, అదోలా వున్నాయి.
"హి హ్హి హ్హి" అన్నాడు శారదను చూసి
ఆమె చుట్టూ అతడు గెంతులు వేస్తూ "దెయ్యము లేచును- కళ్ళు పీకును- తులసి పాతుము -అయినా ఆగను" అని వికృతంగా అరవసాగేడు.
ఆమె కళ్లనిండా నీళ్ళు తిరిగేయి . అంతలో వాళ్ళని రక్షించడానికా అన్నట్టు కానిస్టేబుల్ వచ్చి లాఠీతో వాణ్ని ఆపి, దారి తీసేడు. ముగ్గురు ఆడవాళ్ళూ వడివడిగా కారు చేరుకున్నారు.
"రక్తం చూడొద్దనూ -మట్టి తినమనూ -అందర్నీ రక్షించేది ఆంజనేయుడు" అని అరుస్తూనే వున్నాడు వాడు.
శారద ఇగ్నిషన్ తిప్పింది. కారు స్టార్టు కావడంలేదు. అంతలో ఆ పిచ్చివాడు తనని తప్పించుకుని కారువైపు పురగెత్తుకు రావడం కనిపించింది.
దుఃఖంతో, నిస్సహాయంగా ఆమె ఆక్సిలేటర్ టపాటపా నొక్కుతూ ఇగ్నిషన్ తిప్పసాగింది.
అతడు కారు కిటికీ అద్దం అవతల్నుంచి మొహం దగ్గిరగా పెట్టి, లోపలికి వినిపించేలా అరవసాగేడు.
"ఖేచరి ముద్ర పట్టించు. నీ కూతురికి ఖేచరి ముద్ర. ఇలా ఇలా కారు అద్దానికి మొహాన్ని మరింత బలంగా అదిమాడు. కూరుతి ప్రసక్తి రావడంతో శారద చెయ్యి ఇగ్నిషన్ మీదనుంచి జారిపోయింది. అతడి బలానికి అద్దం ఏ క్షణమయినా పగిలిపోయేలా వుంది.
ఆమె బయటకు చూసింది. పోలీసు కారువైపు పరుగెత్తుకు వస్తున్నాడు. అద్దం అవతల పిచ్చివాడి మొహం వికృతంగా వుంది. "ఖేచరీ" అన్నాడు -ఆ తరువాత ఓ అద్భుతం జరిగింది. ఆ పిచ్చివాడి నోటి మధ్యనుండి నాలుక బయటికి వచ్చింది. మామూలుగా కాదు. పొడుగ్గా - ఇంకా పొడుగ్గా -పాములా -పైకొచ్చి ముక్కుమీద నుంచి పైకెళ్ళి కనుబొమ్మలు కలిసేచోట బొట్టు పెట్టినట్టు ఆనింది. కార్లో వున్న ఆడవాళ్ళిద్దరూ కెవ్వుకెవ్వున అరవసాగారు. పిచ్చివాడు నాలుకని మళ్ళీ మామూలుగా నోట్లోకి లాగేసుకుని వెర్రిగా "ఖేచరీ" అన్నాడు.
ఈ లోపులో పోలీసు వెనుకనుంచి లాఠీతో వాడినెత్తిమీద మోదడం - వాడు "అమ్మా" అని కుప్పకూలిపోవడం. అదే టైముకి కారు స్టార్టు అయి వేగంగా సాగిపోవడం -అన్నీ ఒక్క క్షణంలో జరిగేయి.