Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 39


    "రా రవీ! ఈ మధ్య అసలు కనిపించటం లేదేం?" అని ఆప్యాయంగా పలకరించింది.
    ఈ ఆదరానికి రవి, మురళి, ఇద్దరూ ఆశ్చర్యపోయారు__ఇంట్లో చేసిన తీపి పిండివంట రవికీ, మురళికీ పెట్టింది సత్యవతి.... ఎంతో కోపంతో మురళి దగ్గరకు వచ్చిన రవి కోపం లోలోపలే కరిగిపోసాగింది. మురళికీ, రవికీ, టీకూడా ఇచ్చి వాళ్ళదగ్గిరే కూచుంది సత్యవతి.
    "బాగా చదవుతున్నావా రవీ! మీ జీవితాలలో ఈ దశే  ముఖ్యమయినది-బ్రతుకు మొత్తాన్ని ఏదో ఒక మార్గానికి మళ్ళించే మలుపు ఇది-ఒకారి పరీక్ష పోయిందని దిగులు పడకు__ఒకసారి పరీక్ష పోయినా, మళ్ళీ శ్రద్ధగా చదువుకుని రెండోసారి ఫస్ట్ క్లాసులో పాసయిన వాళ్ళను ఎందరినో నాకు తెలుసు-ఈ సిరిసంపదలూ, అంతస్థులూ ఒకళ్ళు సంపాదించి పెట్టేవికావు- మనంతట మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి. వీధిలాంతర్ల క్రింద చదువుకుని జడ్జిలయిన వాళ్ళున్నారు. నా మటుకు నేను ఎంతో కష్టపడి చదువుకుని పైకి వచ్చాను. అదీగాక తాతలు సంపాదించి రాసులుపోస్తే మనవలు కూచుని తినేరోజులు గడిచిపోయాయి. ప్రతి ఒక్కరూ ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడవలసిందే!"
    "అలాగే ఆంటీ! బాగా చదువుకుంటాను." తల వంచుకుని అన్నాడు రవి.
    "నీకు ఇంగ్లీషులో కాని సంస్కృతంలో కాని ఏమైనా తెలియకపోతే అడుగు-చెబుతాను."
    "అలాగే అడుగుతాను ఆంటీ!"
    పిల్లలిద్దర్నీ వదిలేసి తన పనిమీద లోపలికి వచ్చేసింది సత్యవతి-లత తల్లి కూడా వచ్చి "అమ్మా! ఆ రవి ఒట్టు రౌడీ! వాడితో అన్నయ్య తిరిగితే...." అని గుస గుసగా ఏదో చెప్పబోతుంటే సత్యవతి "హుష్!" అని అదలించి "పిల్లలంతా మంచివాళ్ళే! ఎవరూ రౌడీలు కారు-" అంది-తన తల్లి కళ్ళు ఎందుకు చెమ్మగిల్లాయో లతకి అర్ధం కాలేదు. మురళితో తీవ్రంగా పోట్లాడాలని వచ్చిన రవి ఏం మాట్లాడలేక పోయాడు.
    "మా అమ్మ ఇవాళ ఇంటికి త్వరగా రమ్మంది. అందుకని వచ్చేశాను." అన్నాడు మురళి-సమయానుకూలంగా అబద్దాలాడేయ్యటం బాగా నేర్చుకుంటున్నాడు మురళి.
    "సరేలే! నేను పోతున్నాను." అని వచ్చేశాడు రవి-ఆ ఇంటి నుండి బయటపడ్డాక రవి మనసంతా విచిత్రంగా కలతపడింది. బావురుమని ఏడవాలనిపించింది.
    మురళి పరీక్షలలో కాపీలు కొట్టినా, అతడు మొదటినుంచీ కేవలం కాపీలమీద ఆధారపడలేదు__మామూలుగా చదువుకుని, అందరు కాపీలు కొడుతున్నారని తనూ కాపీకొట్టి వ్రాశాడు-అంచేత, ఇప్పుడు యూనివర్శిటీలో పరిస్థితులు మారిపోగానే శ్రద్ధగా చదువుకోగలుగుతున్నాడు. తన పరిస్థితి అలాకాదు-కాపీకొట్టి తప్ప వ్రాయలేని స్థితిలో చదివాడు తను. పదో క్లాసు దగ్గిరనుంచీ....కాపీ కొట్టగలననే ధీమాతో పుస్తకం పట్టుకోకుండా గడిపాడు__ ఏ ప్రశ్నకు ఏ సమాధానమో కూడా మరొకరు చూపించవలసిన అయోమయ పరిస్థితుల్లో కాపీ కొట్టాడు. ఇప్పుడు ఒక్కసారిగా పుస్తకాలు తెరచి చదవాలనుకునేసరికి అంతా అయోమయంగా ఉంది. ఏదీ అర్ధం కావటంలేదు. పదోక్లాసు కూడా చదవకుండా డిగ్రీ క్లాస్ లోకి హైజంప్ చేసి ఒక్కసారిగా అన్నీ చదవటం ఎంత కష్టం! ఎంత తెలివైనవాళ్ళకు సాధ్యపడుతుంది అది! సత్యవతి అంతా చెప్పినట్లు ఇప్పటికైనా బాగా చదువుకోగలిగితే మంచిదే! తనకూ చదువుకోవాలనే ఉంది. కానీ, తన పరిస్థితి ఎవరికి వివరించగలడు? "ఇంగ్లీష్ లోనైనా, సంస్కృతంలోనైనా ఏమైనా తెలియకపోతే అడుగు" అని ఆప్యాయంగా అంటోన్న సత్యవతి ఆంటీతో "నాకు పదోక్లాస్ నుంచీ అన్నీ చెప్పాలి అంటీ! నాకు ఏమీరాదు! ఏదీ అర్ధం కావటం లేదు." అని ఎలా చెప్పగలడు? ట్యూషన్ పెట్టించుకుంటే ఏమైనా ప్రయోజనం వుంటుందేమో! ట్యూషన్ ఎన్ని సబ్జెక్ట్స్ తో పెట్టించుకోగలడు? కాలేజి ఫీజుకట్టి కాలేజిలో చదవటానికే కటకటలాడుతున్న పరిస్థితుల్లో ట్యూషన్ ఫీజులు ఎలా కట్టగలడు?
    కళ్ళు మండటం మొదలుపెట్టాకకాని, తను ఏడుస్తున్నట్లు తెలుసుకోలేకపోయాడు. రవి, సిగ్గుపడి రుమాలుతో గబగబ కళ్ళు తుడుచుకున్నాడు.


                                                          17


    ఎప్పటిలా కుమార్ సైకిల్ కి రోడ్డుమీద అడ్డుగా నిలబడి చెయ్యి అడ్డంగా జాపి "సార్!" అంది సరోజ. కుమార్ సైకిల్ ఆపి దిగాడు కాని ఎప్పటిలా నవ్వలేదు. అతని ముఖం వడలిపోయి ఉంది.
    "అలా నిలబడిపోయా వేమిటి? పార్క్ లోకిపోయి కూచుందాం పద!" అంది సరోజ ముందు తను దారితీస్తూ.
    కుమార్  సరోజను అనుసరించకుండా ఆగిపోయి "సారీ సరూ! నేను రాలేను" అన్నాడు.
    సరోజ ఆశ్చర్యంగా చూసి "అదేం? ఇంటిదగ్గిర పనుందా?" అంది.
    నిష్కల్మషంగా తనను అంతగా ప్రేమిస్తోన్న సరోజముందు కపటం అభినయించటం కుమార్ కి చేతకాలేదు.
    "అదికాదు-ఇంకమీదట మనం ఇలా కలుసుకోవద్దు-ప్లీజ్? ఇలా నన్నెప్పుడూ కలుసుకోడానికి ప్రయత్నించకు."

 Previous Page Next Page