Previous Page Next Page 
తులసి పేజి 38

    "ఆ తరువాత ఆ రోగి ఏం అయ్యాడో నాకు తెలీదు. ఇప్పుడు ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్పాను. సన్యాల్ మరణం తరువాత ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అతడు చేసిన ఆపరేషన్ గురించి ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మాట్లాడేను. నా మాటల్ని హేళనగా కొట్టి పడేసేరు వాళ్ళు. అదీగాక ఒక మనిషికి అలా బలవంతంగా ఆపరేషన్ చేసినందుకు.శిక్ష పడుతుందని కూడా అప్పట్లో భయం వేసింది నాకు. దాంతో ఇంక దాని సంగతి ఎవరికీ చెప్పలేదు. కాని నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజురాత్రి ఆపరేషన్ అయ్యాక రోగి నోటితో స్వయంగా తన పేరు చెప్పటం....."

    అబ్రకదబ్ర పండిత్ మాటలు వినటంలేదు.

    ".....శ్రీనివాస పిళ్ళై...... శ్రీనివాసపిళ్ళై........." అని తనలో తనే గొణుక్కుంటున్నాడు.

                                            *    *    *

    "ఆ బల్లకింద ఎవరున్నారు? బైటకిరండి మర్యాదగా" చక్రవర్తి కంఠం గదిలో మారుమ్రోగింది. తులసి టేబిల్ క్లాత్ మరికొంచెం లాగింది. దానికింద గరుగ్గా ఏదో తగిలింది.
   
    చక్రవర్తి రెండడుగులు ముందుకేసి బల్ల దగ్గరికి వస్తున్నాడు తులసి మరింత ముణగదీసుకుని బల్లకోడు దగ్గరికి జరిగింది. కోడుమీదనుంచి ఆమె మెడమీదకి పాములా ఏదో జారింది. ఆమె కెవ్వున అరవబోయి, అతి కష్టం మీద తమాయించుకుని తడిమి చూసుకుంది. తాడు చేతికి తగిలింది.

    చక్రవర్తి మోకాళ్ళమీద వంగేడు.   

తులసి అప్రయత్నంగా తాడు లాగింది. దాంతోపాటు బల్లగుడ్డ కిందవున్న మరో చైనా సిల్కుగుడ్డ చేతిలోకి వచ్చింది. దాంతోపాటు కార్బన్ పేపర్ కాగితం కూడా అప్పుడు చూసిందామె. కుర్చీలో కూర్చుని కాళ్ళు పెట్టుకునే చోట చెప్పులు వుండడం. అయితే అవి మామూలు చెప్పుల్లా కాకుండా రాజులువాడే పాదుకల్లా వున్నాయి. ఆమె గుండెల్నిండా వూపిరి పీల్చుకుంది. చక్రవర్తి తనకోసం వంగగానే ఆ పాదుకతో అతడి తల బద్దలు కొట్టాలని ఆమె ఉద్దేశ్యం.

    అతడు తలవంచి బల్లకిందకు వస్తున్నాడు.

    ఆమె సివంగిలా ముందుకుదూకి, ఆ వూపులోనే ఆ వెండి చెప్పుని పట్టుకుని, ఎత్తి కొట్టబోయింది. కానీ, అంతవేగంలోనూ ఆమె విస్తుబోయేటట్టు - ఆ చెప్పులు నేలకే తాపడం చేయబడి వున్నాయి. వస్తాయన్న ఉద్దేశ్యంతో వాటిని పట్టుకుని వుండడంవల్ల ఆమె ముందుకి తూలింది.......సరిగ్గా చక్రవర్తి కాళ్ళమీదకి......

    స్త్రీ అనయినా చూడకుండా ఆమెని అతడు ఎంత బలంగా కొట్టేడంటే - కార్పెట్ మీద దాదాపు అయిదు గజాల దూరంలో వెళ్ళి పడిందామె. పెదవి చిట్లింది. తల అదిరిపోయి క్షణంపాటు ఏమీ కనపడలేదు. ఆమె కళ్ళు తెరిచేసరికి అతడు ఆమె దగ్గరికి వచ్చేడు. ఆమెను చూడగానే "నువ్వే నన్నమాట" అన్నాడు.

    తులసి జవాబు చెప్పలేదు.

    "క్రితం సారి వచ్చినప్పుడే సరిగ్గా మర్యాద చేసి పంపవల్సింది వదిలేశాం. తిరిగి వచ్చావన్నమాట" అని అడుగు ముందుకు వేసేడు.

    ఇక పారిపోవడానికి దారిలేదు. తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. అతడు దగ్గరికి రావడం తెలుస్తూంది. తెలుగు సినిమా పతాక సన్నివేశంలోలా పోలీసులు వస్తారని. ఇన్స్పెక్టర్ ఎడమచేతితో పిస్టల్ ఎక్కుపెట్టి "యూ ఆర్ అండర్ అరెస్ట్ - హేండ్సప్" అంటాడని ఆశపడ్డది.

    కానీ అలాంటిదేమీ జరగలేదు.   

    ఆమె రెక్క పట్టుకుని లేవదీసేడు చక్రవర్తి.

    డిటెక్టివ్ నవలలు నేను చదవను గాక చదవను -అనుకొంది తులసి.

    "ఈ గదిలోకి నువ్వెలా ప్రవేశించావ్?" అడిగాడు చక్రవర్తి.

    "ఛూమంతర్......" అంది తులసి. "మూర్ఖుడా -మానవాతీత శక్తుల్నే ప్రశ్నిస్తున్నావా!"

     చావడం ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు జేమ్స్ బాండ్ లాగా చావడం మంచిది. "నీ మానవాతీత శక్తుల్ని మా కాళీమాత వదిలిస్తుందిలే" అంటూ గుమ్మంవేపు తోసేడు. ఆమెకు తను చూసిన విగ్రహం జ్ఞాపకం వచ్చింది. విగ్రహపు చేతిలో రక్తంకారిపోయి కుదించుకుపోయిన మనిషి తల....... ఆ తలని తన తల 'రీప్లేస్' చెయ్యబోతూందా -

    గుమ్మందాటుతున్నదల్లా- క్షణంలో వెయ్యవ వంతు ఆగింది. ఆమె దృష్టి గుమ్మం అవతల -కొద్దిగా కదిలిన నీడమీద పడింది.

    ఎవరో వున్నారు బయట. వేచి చూస్తున్నారు., తమ రాకకోసం గన్ షాట్ గా. చక్రవర్తి తరుపు మనిషికాదు. ఆమె ముందుకు అడుగు వేయడం కొద్దిగా ఆలశ్యం చేసింది. అది గమనించిన చక్రవర్తి గుమ్మంలోంచి ముందుముందుకు వెళ్ళాడు.   

 Previous Page Next Page