Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 38

                                 

        అడ్రస్ లు:

                  

        

    ఈ పుస్తకంలో చాలాసార్లు మీమీ మనస్తత్వాలని  పరిశీలించుకోటానికి ఎప్పుడో వ్రాసిన వ్రాతలని పరీక్షించుకోమని తరచూ చెప్పటం జరిగింది. ఆ చాప్టర్ బట్టి  మనస్తత్వాన్ని విశ్లేషించాలంటే,  మీరు ఎప్పుడో ఎవరికో వ్రాసిన కవర్ గానీ, ఉత్తరంగానీ తీసుకోవాలి.

     కొంతమంది,  కవరుపైన సరిగ్గా మధ్యలో చిరునామా వ్రాస్తుంటారు. మరికొంతమంది చాలా క్రిందికి వ్రాస్తారు. అడ్రస్ వ్రాసే విదానాన్ని బట్టి మనస్తత్వాన్ని అంచనా  వెయ్యొచ్చు. సాదారణంగా అందరూ కవరు "మధ్యలోనే" వ్రాస్తారు. ఏ మాత్రం కాస్త పక్కకి గానీ, క్రిందికి గానీ వ్రాసినా, ఈ క్రింది విభాగాల్లో ఒక దానిలోకి చేరినట్టు భావించాలి. మధ్యలోనే వ్రాశాంకదా  అని సంతృప్తి పడకూడదు.

    మధ్యలో వ్రాసేవారు:-

    కవరు మధ్యలో కరక్ట్ గా నాలుగువైపులా సమాన స్థలం వదిలి అడ్రస్ వ్రాసేవారు సరళీకృతమైన ఆలోచనలు కలిగి, చక్కగా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వారై వుంటారు.  వీరు ప్రతీ పనీ - చేసేటప్పుడు, ఆ పని యొక్క ఆనందాన్ని ఆస్వాదించే కంటే,  ఆ పని చెయ్యటంలో వుండే జాగ్రత్తని ఎక్కువ అనుభవిస్తారు. వీరు ఎక్కువగా   స్నేహపాత్రులు కారు. వీరితో స్నేహం చెయ్యాలంటే ఎన్నో అర్హతలు  వుండాలి. వీరి పట్ల అవతల వారికి ఎటువంటి  భావం వున్నప్పటికీ, వాళ్ళపట్ల వీరికి ఏ భావం వుందో సాధారణంగా  బైటపడరు. ఇటువంటివారు జీవితభాగస్వాములైతే, కలిసి జీవించటం చాలా అదృష్టం. కష్టం కూడా!

     బాగా పైన వ్రాసేవారు: -

    ఏ వూరు వెళ్లాలో ఆ వూరిపేరుని కవరుకి సగంలో వ్రాసి, మిగతా అడ్రస్ అంతా  ఆ కవర్ కి పైనే వ్రాసేవారు.
     ఆ విధంగా క్రింద భాగంలో చాలా ఖాళీ వదలి పెట్టేవారు.

    జీవితాన్ని చాలా తేలికగా తీసుకునేవారై వుంటారు. వీరు ఎవర్నీ  పట్టించుకోకుండా 'తమ జీవితమేదో తామే గడపాలి, ఆనందంగా బ్రతకాలి' అనే దృష్టి కలవారై వుంటారు. ప్రతి  పనిని దాని ఫలితాలు ఆలోచించకుండా మొదలుపెట్టేవారై వుంటారు. వీరు పొదుపరులు, ప్రేమ, స్నేహాలలోకి తొందరగా దిగే స్వభావంకలవారై వుంటారు.  లోతుగా ఆలోచించే స్వభావం, అవతలవాళ్లు తమవల్ల ఏ విధంగా నష్టపోతున్నారనే ఆలోచన వీళ్లలో తక్కువ.

     బాగా క్రిందగా వ్రాసేవారు:-

    కవర్ స్టాంప్ క్రింది నుంచి మొదలుపెట్టి, ఊరుపేరు వ్రాయటానికి క్రింద ఖాళీలేక ఇరికించి ఇరికించి వ్రాసేవాళ్లు భవిష్యత్తుపట్ల అవగాహన లేకుండా వున్నవాళ్లై వుంటారు. పైన బాగా ఖాళీస్థలం వదిలేయటం ద్వారా, జీవితంపట్ల వీరెంత నిర్లక్ష్యంగా వుంటారో తెలుస్తుంది. అయితే, జీవితంలో ఎలాగైనా సరే తాము మొత్తాన్నీ, ఒకేస్టేజిలో పోగొట్టుకోవలసి వచ్చినా, ఏమీ బాధపడకుండా తిరిగి వునర్నిర్మించుకోగలమనే ధైర్యాన్ని కలిగి వుంటారు.
 
     కుడిపక్కగా వ్రాసేవారు:-

     కవర్ కి స్టాంప్ కుడివైపు పై భాగంలో  వుంటుంది. ఎడమవైపు మార్జిన్ బాగా వదిలేసి స్టాంప్ క్రింద (అంటే కవర్ కి కుడివైపుక్రింద)  భాగంలో చివరి వరకూ వ్రాసేవారు  అధిక శ్రమపడే నైజం కలిగి వుంటారు.  వీరిలో భావోధ్వేగం ఎక్కువ. అయితే, ఇతరుల సహాయం మీద, సూచనలమీద జీవించటాన్ని  వీరు ఎక్కువ ఇష్టపడతారు. వీరికి ఒక వాహనం వుండి దానితో ఎడమ పక్కగా వెళుతూ  కుడివైపు సందులో తిప్పాలనుకుంటే, ఎడమవైపే ఒక పక్కగా ఆపుచేసి వెనకాలనుంచీ ఒక కిలోమీటర్ దూరం వరకూ ఏ వాహనం రావటంలేదని   నిశ్చయించుకున్న తర్వాత అతి జాగ్రత్తగా తమ వాహనాన్ని కుడి వైపు సందులోకి తీసుకువెళ్తారు. ఇటువంటి  ఉదాహరణలు వీరి గురించి ఎన్నైనా చెప్పొచ్చు.

    పూర్తిగా ఎడం వైపు వ్రాసేవారు:-

    కవర్ అంచునుంచి మొదలు పెట్టి స్టాంప్ పరిసరాల్లో వ్రాసుకుంటూవచ్చి ఖాళీ వదిలే వారు ఎక్కువ సిగ్గుపడేవారు, తమ భావాలని ఎవరికీ చెప్పుకోలేని వారు అయి వుంటారు. వీరికి నమ్మకం తక్కువ. ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకునే నైజం వీరికుండదు. ఒక ఊరు ప్రయాణం చెయ్యవలసివస్తే, ఆ ట్రెయిన్ సాయంత్రంమైతే, ఉదయం పది గంటల నుంచే తమ సామాన్లని తరచూ లెక్కపెట్టుకోవడం అనేది ఇటువంటి వాళ్ల మనస్తత్వానికి ఒక ఉదాహణగా చెప్పుకోవచ్చు.

 Previous Page Next Page