మురళి చేతిలో ఎయిర్ బేగ్ లాక్కుని అందులోంచి పాతిక రూపాయిల యెకనమిక్స్ టెక్ట్స్ బుక్ తీసి పుస్తకాల షాపువాడితో గట్టిగా బేరమాడి పన్నెండు రూపాయలకు ఆ పుస్తకాన్ని అమ్మేసి ఆ డబ్బు జేబులో వేసుకుని "పద!" అన్నాడు శివ.
మురళికి కళ్ళలో నీళ్ళు తిరిగి పోతున్నాయి. సాధారణంగా స్టూడెంట్స్ ఎవరూ టెక్ట్స్ బుక్స్ కాలేజికి తీసుకురారు__ ఆరోజు యెకనమిక్స్ టెస్టు ఉంది. చదువుకుందామని తీసుకువచ్చాడు__ ఆ పుస్తకం అంత చవగ్గా అమ్మేస్తున్నాడు శివ-మళ్ళీ తను ఆ పుస్తకం కొనాలంటే ఎలా? అమ్మకు తెలిస్తే చంపెయ్యదూ?
"నా పుస్తకం అమ్మద్దు." అన్నాడు కన్నీళ్ళతో అడ్డుపడుతూ.
"అరె! ఆడపిల్లలెక్క ఏడుస్తావేంది బే! ఏం ఫికరుపడకు! ఇట్టాంటియ్యి వంద బొక్కులు కొనిస్తాలే! నడు! నడు! సినిమాకు టైమయి పోతాంది."
కళ్ళనీళ్లు పెట్టుకొంటున్న మురళిని చెయ్యి పట్టుకుని ఈడ్చుకు పోయాడు శివ.
శివ, రవి, ఇద్దరూ కేరింతలు కొడుతూ సినిమా చూస్తోంటే, వాళ్ళమధ్య పొంగి వచ్చే కన్నీళ్ళను చొక్కా చేత్తో తుడుచుకుంటూ కూచున్నాడు మురళి.
యెకనమిక్స్ పుస్తకం-పాతిక రూపాయలు!....ఇవే హోరు మంటున్నాయి మురళి మనసులో....తెరమీద దృశ్యాలు కనిపించటం లేదు.
సాయంత్రం ఆరు దాటాక వచ్చిన మురళిని "ఇంత ఆలస్యమయిందేం?" అని అడిగింది సత్యవతి.
"ప్రైవేట్ క్లాస్...." అని అబద్ద మాడేశాడు మురళి__సహజంగానే నమ్మింది సత్యవతి. అదీగాక మురళి డిగ్రీక్లాస్ లోకి వచ్చిన దగ్గిరనుంచీ కొంచెం పెద్దవాడయ్యాడని అన్నీ ఆరాలు తియ్యటం మానేసింది.
కొత్త పుస్తకం పాతిక రూపాయల పుస్తకం అతి సునాయాసంగా పన్నెండు రూపాయలకే అమ్మేశాడు శివ-తలుచుకున్న కొద్దీ, గుండె పగులుతోంది మురళికి.
కాంతారావుకి అన్ని విషయాల్లోనూ ఒకటే అశ్రద్ధ__పర్స్ లోంచి ఏదో అవసరానికి డబ్బుతీసి వాడి, పర్స ని అలాగే బల్లమీద పడేసి స్నానానికి వెళ్ళిపోయాడు. ఆ పర్స్ మురళి కంటపడింది__యెకనమిక్స్ టెక్ట్స్ కొనాలి-వణుకుతున్న చేతులతో ఆ పర్స్ లోంచి పాతిక రూపాయలు తీసి తన పుస్తకాల్లో దాచేశాడు. కాంతారావు స్నానంచేసి వచ్చి పర్స్ లో డబ్బు లెక్క చూసుకోకుండానే జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు.... ప్రాణాలు ఉగ్గ బట్టుకుని కూర్చున్న మురళి 'హమ్మయ్య-' అనుకున్నాడు. ఆ రోజే యెకనమిక్స్ టెక్స్ట్ కొనుక్కున్నాడు-అప్పటినుంచి ఏ పరిస్థితుల్లోనూ టెక్ట్స్ బుక్స్ కాలేజికి తీసికెళ్ళ కూడదని ఒట్టు పెట్టుకున్నాడు. ఆ రాత్రి కాంతారావు భార్యను "నా పర్స్ లోంచి నువ్వు డబ్బేమైనా తీశావా?" అని అడిగాడు-మురళి ముఖం పాలిపోయింది-గుండెల్లోంచి వణుకు ప్రారంభమయింది.
"లేదు__తియ్యలేదు. ఏం? ఏమైనా పోయిందా? ఎప్పుడు పోయింది?"
"పదో, పదిహేనో, తక్కువయి నట్లుగా ఉంది"
సత్యవతి తల కొట్టుకొని "కర్మ! ఎంత పోయిందో కూడా తెలియదనమాట! ఆఫీస్ లో పోయిందా? ఇంట్లో పోయిందా?" అంది.
"అబ్బబ్బ! ఊరికే గొడవ చెయ్యకు-అసలు పోయిందో? లేదో? నేనే ఏమైనా ఖర్చు పెట్టేశానేమో!" అని కసురుకున్నాడు భార్యని కాంతారావు. చెయ్యగలిగింది లేక ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకుంది సత్యవతి.
'మా నాన్నగారు బంగారు తండ్రి?' అని మనసులో తండ్రిని చాలా మెచ్చుకున్నాడు మురళి.
మురళి రవిని తప్పుకు తిరగాలని ప్రయత్నిస్తున్న కొద్దీ , రవి, శివ, మురళిని వదలటంలేదు-కానీ వాళ్ళు మురళిని ఏం చెయ్యలేక పోతున్నారు. ఒక్క నోట్ బుక్, పెన్సిల్ తప్ప మురళి కాలేజికి ఏం తీసుకురావటం లేదు.
ఆ రోజు రవి మురళితో "సాయంత్రం క్లాసయిపోయాక వెళ్ళిపోకు-నీతో మాట్లాడాలి!" అన్నాడు.
మురళి హడలిపోయి ఎప్పటికంటె కాస్త ముందుగానే కాలేజీనుండి బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. రవికి మండిపోయి సరాసరి మురళి ఇంటికే వచ్చేశాడు- ఆ సమయానికి సత్యవతి ఇంట్లోనే ఉంది. వంట్లో బాగుండక స్కూల్లో పర్మిషన్ తీసుకుని ముందుగా వచ్చేసింది. సత్యవతి చూసి రవి తడబడ్డాడు. "గుడ్ ఈవినింగ్ ఆంటీ!" అన్నాడు నవ్వుకాని నవ్వుతో.
రవి తడబాటు అర్ధం చేసుకుంది సత్యవతి-రవిని చూస్తే ఎంతో జాలి కలిగింది సత్యవతి మనసులో.... వచ్చీరాని వయసు-పాలుకారే చెక్కిళ్ళు-అమాయకత్వం వదలని చూపులు....ఈ పిల్లలు ఇలా పాడయిపోవటానికి ఎవరు బాధ్యులు? మొదట్లో రవి దర్జా, అదీ, చూసి అతడు ఎవరో పెద్దింటి పిల్లవాడని అనుకుంది సత్యవతి_కానీ, ఇంటర్ పరీక్షల సమయంలో జరిగిన గొడవలవల్ల అతని సంగతి పూర్తిగా తెలిసింది....తండ్రి అక్రమవ్యాపారం చేస్తు కొన్నాళ్ళు కొడుకుని అందలం ఎక్కించాడు. ఆ తండ్రికి కాని, ఆ తల్లికి కాని, కొడుకు చదువు సంధ్యల విషయమూ, అతని వ్యక్తిత్వమూ ఏదీ పట్టదు__ ఫలితంగా ఎటుకాని స్థితిలో ఈ అమాయకుడు తనను తాను చక్కదిద్దుకోలేని అసహాయస్థితిలో నిలిచాడు-రవి కుటుంబ స్థితి_అతని వ్యవహారమూ తెలుసుకున్నాక-రవితో మురళి స్నేహాన్ని ఏమాత్రమూ సహించలేక పోయింది సత్యవతి. కానీ, రవి కళ్ళముందు నిలబడి తడబడుతూ "గుడ్ మార్నింగ్ ఆంటీ!" అంటోంటే సత్యవతి మనసు విచిత్రంగా వదిలిపోయింది. ఈ రవి ఒకప్పుడు తన బిడ్డకు దెబ్బలు తగలకుండా కాపాడాడు-ప్రత్యేకం ఇంటికి వచ్చి రోజూ మురళిని కారులో కాలేజీకి తీసికెళ్ళేవాడు__అలాంటివాణ్ణి కొన్నాళ్ళు ఇంటి బిడ్డలా, ఇంట్లో తిరిగిన వ్యక్తిని 'ఆంటీ!' అంటూ పలకరించిన పసివాణ్ణి పొమ్మని అనగలదా?