Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    "ఛీ!" అంటూ శ్రీపతి విసురుగా లేచిన సవ్వడి వినిపించింది రాధకు. ఆమె కంగారుపడి ఎగిరి ఇవతలకు ఒక్కగంతు వేసింది. కాని అప్పటికే శ్రీపతి బయటకు వచ్చేశాడు. తల వొంచుకుని నిలబడి వున్న ఆమెను చూసి "మీరా?" అన్నాడు.

    రాధ జవాబివ్వలేదు.

    "బయటే నిలబడ్డారేం?"

    "ఏమీలేదు" అని రాధ గొంతు పెగల్చుకుని ఇంకా ఏదో చెప్పబోయింది. కాని ఆమె పెదాలు దాటి మాట బయటకు రాలేదు. ఆ కంగారులో ఏమి చేస్తున్నదీ తెలియక వెనక్కి తిరిగి శ్రీపతి వెనకనుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా చర చరమని బయటకు వచ్చేసింది. ఆ సందుదాటి మలుపు తిరిగే వరకూ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అప్పుడు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుని "హమ్మయ్య" అనుకుని నెమ్మదిగా నడవసాగింది. కొద్ది రోజుల క్రితం  సుభద్రమ్మగారు తనతో అంది : "ఈ మధ్య అల్లుడు  సరిగ్గా ఎవరితోనూ మాట్లాడటంలేదు." కాని అప్పుడా మాటలు తనేమీ పట్టించుకోలేదు. ఆవిడ చెప్పింది ర్తిటేనని ఇప్పుడు  రూఢి అయింది. కాని స్వల్పకాలంలోనే ప్రమీల అంటే శ్రీపతికి చిరాకు కలగటానికి కారణం ఎంత తలబద్దలు చేసుకున్నా ఆమెకు అర్థంకాలేదు. ప్రమీల హృదయవిదారకంగా అతన్ని బ్రతిమిలాడటం వింది. ఆమెను చూసి జాలిపడింది. "ఈ మొగాళ్ళకు దయలేదు" అనుకుంది.

    ఆమె యింటికి చేరేసరికి తల్లి ఎదురుగా వస్తూ "అప్పుడే వచ్చేవేం?" అనడిగింది.

    "ఊరికినే, అక్కడ ఏమీ తోచలేదు."

    తల్లి అంతకంటే ఎక్కువగా అడగలేదు."


                        *    *    *

    ఆ రాత్రి రాధకు విచిత్రమైన కల వొచ్చింది. తను రోడ్డువెంట నడుస్తోంది. ఆనందరావు తన వెంబడి వస్తున్నాడు. తనని ప్రేమించమని అడుగుతున్నాడు. తనవాళ్ళెవరూ తనవంక  చూడటంలేదు. ఎవరి గొడవలో వాళ్ళు వున్నారు. ఆనందరావు ధోరణి మార్చి, తనతో వచ్చేస్తే ఈ ప్రపంచమంతా చూపిస్తానంటున్నాడు. ధనరాసులలో దొర్లిస్తానంటున్నాడు తను "ఛీ" అన్నది అసహ్యించుకున్నది. "చాతనయితే పెళ్ళి చేసుకో, లేకపోతే పో" అంది. అతను తనవంక దీనంగా చూసి వెళ్ళిపోతున్నాడు. తనకు కాస్త జాలి వేసింది. "పోనీ  పిలుద్దామా పాపం!" అనిపించింది. "పిలుస్తే?"  "ఛా" అనుకుని ఆ ప్రయత్నాన్ని  విరమించింది. ఇంకా ముందుకు సాగింది. చాలాసేపు త్వరత్వరగా నడిచాక ప్రమీల యింటికి వచ్చింది. లోపలకు అడుగు వేయబోతూ పైకి చూసింది ఆశ్చర్యం! పిట్టగోడమీద నుంచి ప్రమీలను క్రిందికి త్రోసి వెయ్యటానికి ఆమె భర్త ప్రయత్నిస్తున్నాడు. అతని ముఖం క్రూరంగా, భయంకరంగా వుంది. ప్రమీల పాపం రోదిస్తూ ప్రార్థిస్తోంది. ఇదంతా చూసి  తను కెవ్వున  కేకపెట్టింది. కాని తన కేక ఎవరూ వినిపించుకోలేదు. ఘాతుక కృత్యం జరిగిపోయింది. ప్రమీలని శ్రీపతి క్రిందకు త్రోసివేశాడు. బిగ్గరగా అరుస్తూ క్రింద పడిపోయింది ఆమె. తను దగ్గరికి పరుగెత్తింది రక్తం! ఆమె తల బ్రద్దలయిపోయింది. సపర్యలు చేయబోతూంటే శ్రీపతి యెప్పుడు క్రిందికి దిగి వచ్చాడో తనను  బలవంతంగా  పుచ్చుకున్నాడు. "రా" అని లాగుతున్నాడు. తను తెల్లబోయింది. "యిదేమిటి?" అంది. "నీకు పెళ్ళయింది" అంది. "నీ భార్య సకల  సద్గుణవతి" అంది. కాని అతను విడిచి పెట్టలేదు. భయంకరంగా నవ్వుతున్నాడు. "నువ్వే నా సర్వస్వం" అంటున్నాడు. తను భయపడి పారిపోబోయింది. కాని అతను వదల్లేదు. రాక్షసంగా తనని భుజాలమీద వేసుకొని తీసుకుపోతున్నాడు. చివరిసారిగా తన శక్తినంతా వినియోగించి గట్టిగా కేకవేసింది.

    రాధకు మెలకువ వచ్చింది. చుట్టూరా చూసి ఆమె కల అని తెలుసుకొన్నప్పుడు ఆమెకు నవ్వు, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. "ఇదేమిటి? ఈ పాడుకల" అనుకుంది. అప్పుడు  తెల్లవారుఝాము అయివుంటుందని ఊహించింది. ఇంకా కాసేపు పడుకుంటానికి ప్రయత్నం చేస్తూండగా ప్రక్కగదిలోంచి తల్లిదండ్రుల మాటలు వినిపించాయి.

    "కోడల్ని యెప్పుడు తీసుకువద్దాం?" అని అడుగుతోంది తల్లి.

    "ఎక్కడికే?" అని బద్దకంగా ఆవలించి అడిగాడు తండ్రి.

    "కాపురం చేసేందుకు" అని కొంచెం నిష్టూరంగా జవాబిచ్చింది.

    "తొందరేం?"

    "తొందరెందుకు లేదు. వాళ్ళు ఉత్తరం రాసి వారంరోజు లయింది. మనం ఇంతవరకూ జవాబు రాయలేదు. వాళ్ళు అంత తొందర పడుతున్నప్పుడు మనం ఊరుకుంటే ఏం బావుంటుంది?"

    ఆయన కొద్దిగా ఆలోచించి "సరే! అలాగే కానిద్దాం" అన్నాడు.

    "రేపు ఉత్తరం రాస్తారా?"

    "అలాగే"

    "కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక ఆయన "అయితే నారాయణుడు వొప్పుకుంటాడంటావా?" అన్నాడు.

    ఆవిడ విచారంగా "పెళ్ళికి వొప్పుకోవటంతోనో వాడి నిగ్రహమంతా పటాపంచలయింది. తరువాత అన్నీ యధావిధిగా జరగకుండా ఆపడానికి వాడెవడు?" అంది.

    ఇటువంటి సంభాషణ ఎప్పుడు  వచ్చినా తీసుకువచ్చే ప్రసక్తే ఆమె యివాళ కూడా తీసుకవచ్చింది. "మీరు ఎప్పటికప్పుడు ఈ విషయం ఆలోచించటం మానేస్తున్నారు. రోజులు గడిచిన కొద్దీ మనకే కష్టం."

    "ఎవరి విషయం నువ్వనేది?"

    "రాధ విషయం "

    "అదీ అయ్యాక ప్రకాశంగాడి పెళ్ళంటావు!"

    ఆమె కొంచెం సిగ్గుతో "కావద్దా మరి? అవన్నీ ప్రకృతి ధర్మాలు" అంది.

    "అవునవును నాకు తెలుసు. చూడసలు ఈ మధ్య పడిన శ్రమతో నేను బొత్తిగా యిదయిపోయాను. మళ్ళీ నా ఆరోగ్యం బాగుండటం లేదు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని తరువాత మళ్ళీ ఆ ప్రయత్నాలు జరిపిస్తాను, సరేనా?"

    ఆమె మాట్లాడకుండా మౌనంగా పడుకుంది.

    ఈ సంభాషణంతా వింటూన్న రాధ మనస్సు ఉల్లాసంతో ఊగింది. కొద్ది రోజుల్లో వదిన యింటికి వస్తుంది. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది. ఇక నిద్ర  పట్టలేదు. లేచి కూర్చుంది. కొద్ది కొద్దిగా  వెలుతురు వస్తోంది. ఒక్కసారి బద్ధకంగా  ఆవులించి, లేచి , ఏదో తోచి అన్నగారి గది సమీపానికి వెళ్ళింది. ఏదో చెబుదామని ఆమె ప్రయత్నం . కాని గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఏం చెబుతుంది? ఆమె ముఖం సిగ్గుతో  ఎర్రబడిపోయింది. తనలో తను నవ్వుకొంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది.


                              20

    నెలరోజుల్లో అనుకున్నదంతా సక్రమంగా  నెరవేరింది. సుగుణ కాపరానికి వచ్చింది. ఆమె రాకకు ఆ యింట్లో అందరూ స్వాగతవచనం పలికారు. ఆమె కూడా యింట్లో అందరితో కలిసిపోవటానికి యెక్కువ రోజులు పట్టలేదు. ఇదివరకు ఛాయ ఆమెను చూసి దూర దూరంగా పారిపోయేది. ఇప్పుడు చేరువకు రాసాగింది.

    నారాయణ గది ఇదివరకు మాదిరిగా  ఇప్పుడు లేదు. ఇప్పుడు  ఒకరికి ఇద్దరు అయ్యారు కదా! రాధ చాలా శ్రమపడి ఆ గదిని అందంగా, సౌందర్యవంతంగా, సౌఖ్యంతంగా అమర్చి పెట్టింది. బయటకేం అనకపోయినా నారాయణ మనసులోనే చెల్లెలని అభినందించుకున్నాడు. నారాయణ ఎలాగైనా  దూరాలోచనగల మనిషి. ఈ తాత్కాలిక సౌఖ్యాలకు, ఆనందాలకు అందరిలాగే  ఆనందపరవశుడైనా యిహ ముందు  ఏమి జరగనున్నదా అని అతను సర్వదా  ఆలోచిస్తున్నాడు. తను తీసుకువచ్చే వందరూపాయలు ఇదివరకే సరిపడేవి కావు. ఇంటినిండా  రోగిష్టి మనుషులతో పెరుగుతున్న సంసారపు ఖర్చుతో  యిప్పుడు  యెందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఈ ప్రపంచంలో తమ కుటుంబం ఏ విధంగా బ్రతుకుతుందో అతనికి అర్థం కావటం  లేదు. ప్రకాశరావు సంపాదనలోకి వచ్చాక ఒక మాదిరిగా ఫరవాలేదు. కాని యింతవరకూ మొదటి సంవత్సరమే పూర్తీకాలేదు. ఇంకా రెండు నెలల్లో అవుతుంది. ఆ తర్వాత యింకో ఏడు ఎంత కష్టమో తల్చుకునేసరికి అతనికి గుండెలవిసిపోయేవి. తన భార్య ముందు లేనిపోని గొప్పలు ప్రదర్శిద్దామని ఎన్నడూ  ప్రయత్నించలేదు. ఆమె యీ యింటికి వచ్చిన మొదటి రోజు దంపతులిద్దరూ గదిలో చాలా రాత్రివరకూ కబుర్లు చెప్పుకొంటూ గడిపారు. ఆ సంభాషణ ద్వారా ఏ మాత్రం బాధపడకుండా ఆమెను తనవైపు ఆకర్షించేటట్లు చేద్దామనుకున్నాడు.

    ఆమె వచ్చి గది గుమ్మం దగ్గర నిల్చుంది. ఒకటి రెండునిమిషాలు నిదానించి చూసి దగ్గరకుపోయి ఆమె చేతిని మృదువుగా పట్టుకొని లోపలకు తీసుకువచ్చాడు. విచలిత దృష్టితో, గోముగా ఆమె వదనారవిందాన్ని చూస్తూ "సుగుణా" అన్నాడు.

    సుగుణ జవాబు చెప్పలేదు.

    మళ్ళీ పిలిచాడు.

    "ఊఁ."

    "ఎవరివి?"

    ఆమె జవాబు చెప్పటానికి సిగ్గుపడి చిరునవ్వు నవ్వింది.

    "ఎవరివి?"

    "ఉహుఁ" అని ఆమె తల దించుకొంది.

    అతడు ఆమె చుబుకాన్ని పట్టుకొని ముఖాన్ని పైకి ఎత్తుతూ "ఈ ఇంటి కోడలివి" అన్నాడు.

    అర్థ్ర నేత్రాలతో భర్త కళ్ళల్లోకి చూసింది సుగుణ. తర్వాత నారాయణ ఆమెను మంచంమీద కూర్చోబెట్టి, తను ఆమె ప్రక్కనే కూర్చుని తన స్వవిషయాలను గురించి మాట్లాడాడు.

    "చూడు సుగుణా! మాకేం డబ్బులేదు. బీదవాళ్ళం. ఈ కాలపు చాలామంది పిల్లల్లాగ లేనిపోనివి గొంతెమ్మ కోరికలు కోరి, అవి తీర్చమని అడిగినట్లయితే అవి తీర్యటం అసాధ్యం. పేచీలు, కలహాలు మినహా ఫలితం ఏమీ వుండదు. అందరితో మంచిగా వుంటూ, కలుపుగోలుతనంగా వుంటే మంచి కోడలిపని పేరు సంపాదించగలుగుతావు. నే చెప్పేది వింటున్నావా?"

    "మీరు చెప్పిట్లే చేస్తాను" అని పలికింది ఆమె.

    నారాయణ సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు.

    సుగుణ భర్తతో అబద్ధం ఏమీ చెప్పలేదు. మరునాటి నుంచీ అలాగే ప్రవర్తించసాగింది, ఒక్క ఉదాహరణ చాలు, ఎవరయినా శారదాంబని "మీ కోడలు ఎలాంటిదండీ?" అని ప్రశ్నిస్తే, శారదాంబ కోడలు వింటుందేమోనని అటూ ఇటూ చూసి "మా కోడలికేం దేవత" అనేది.

    ఈ మధ్య రాధ ప్రమీల ఇంటికి తరచు వెళ్లడం మానేసింది. వెళ్ళకపోవడంలో ఇష్టం లేకపోవటం ఎంతమాత్రమూ కారణం కాదు. ఆ రోజు జరిగిన సంఘటనతో ఆమె  భయపడిపోయింది. తను చాలా అసందర్భమైన పరిస్థితిలో అక్కడ్నుంచి వచ్చేసింది. తమ  ప్రవర్తన వాళ్ళకు చాలా వింతను కలిగించి వుంటుంది. ఇవన్నీ బాపుకొని మళ్ళీ  మామూలు పరిస్థితిలోకి వచ్చేందుకు ఒకసారి వాళ్ళ ఇంటికి పోదామనే వుంది. కాని సహించలేకపోయింది.

    ఒకరోజు రాధ, సుగుణ మధ్యాహ్నం ఆడుకొంటూ కూర్చున్నారు. ఆట మంచి వుత్సాహంతో వుండగా మెల్లగా ప్రమీల లోపలకు వచ్చింది. ఆమెవంక రాధ ఆశ్చర్యంగా చూసి "రా, ప్రమీలా? కూర్చో" అంది ఆదరంగా. సాధారణంగా ఆమె తన ఇంటికి రాదు. ఇంత ఆకస్మికంగా వచ్చిందంటే ఏదయినా కారణం వుండకపోదని అనిపించింది రాధకు. నిశితంగా చూసింది. అందంగా, కోమలంగా వుండే ఆమె వదనారవిందం ఇవాళ సహజ సౌందర్యాన్ని కోల్పోయి, మేఘావృతమైన ఆకాశంలా వుంది. ఇంతకుముందు వరకూ బాగా ఏడ్చి వచ్చిందని సులభంగా తెలుస్తూనే వుంది.

    "మీ ఆటకు అడ్డు రాలేదు గదా!" అని ప్రమీల ఒక ప్రక్కగా చాపమీద కూర్చుంది.

    "బాగానే వుందిలే నీ ప్రశ్న ఏమిటో ఇలా దయచేశావు?"

    "ఎన్నాళ్ళకీ తమ దర్శనం కాకపోతేనూ."

    ఈ మాటలు పట్టి పట్టి అంటున్నట్లు అనిపించింది రాధకు. స్నేహితురాలివంక సూటిగా చూసింది ఆమె. చాలా రోజులనుంచీ మానసికబాధతో కుమిలిపోతూ వుండాలని తోచింది ఆమెకు. అదీగాక ఆమె చెంప కుడివైపు ఎర్రగా కందిపోయి వుంది. ఒకవేళ చేయి చేసుకున్నాడేమో మూర్ఖుడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra