Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    "ఏం లేదు. పద" అంటూ కారువైపు దారితీశాడు. కారు ఇంటివైపు బయల్దేరింది. ఇంకో అయిదు నిముషాల్లో ఇల్లు చేరుతుందనగా "ప్రేమా" అన్నాడు. "ఈ విషయం ఇక్కడ చెప్పటమే మంచిది." ఏమిటన్నట్టు చూసింది.

    "నీకో వార్త చెప్తాను, షాకింగ్ న్యూస్. ఎంతవరకూ కరెక్టో తెలీదు. విని తట్టుకోవాలి"

    "ఏమిటది వేణూ" ఆమె విస్మయంగా చూసింది. అతడు ఫోనులో విన్నది చెప్పాడు. ఆమె మొహం పాలిపోయింది. "ఎవరు చెప్పారు" అని అడిగింది.

    "మీ మామయ్య ప్రసాదరావు."

    ఆమె ఒక్కక్షణం ఆలోచించి, ఏదో స్పురించినట్టూ నవ్వింది.

    "ఎందుకు నవ్వుతున్నావు?"

    "ఎత్తులూ పైఎత్తులూ వేసి మామయ్య మెదడు కుళ్ళిపోయింది" అంది.

    "ఎందుకు" అన్నాడు ఆశ్చర్యంగా.

    "ఇప్పటివరకూ నామీద వేసాడు. ఇప్పుడు నేను తన మేనకోడలిని అని తెలిసాక నీ ప్రేమ నిజమైందో కాదో అని పరీక్ష చేస్తున్నాడన్నమాట! ఆస్తంతా పోయిందని తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావో లేదో కనుక్కోవటం కోసం ఇదో టెస్టు అని నా ఉద్దేశ్యం. అదే కరక్టయిన పక్షంలో ఈయన పోరు పడలేక మా నాన్న చిన్నసైజు హార్ట్ ఎటాక్ నాటకంతో ఆపసోపాలు పడుతూ వుండి వుంటాడు ఇంటిదగ్గర మనం వెళ్ళేసరికి__" అంటూ మళ్ళీ నవ్వింది.

    వేణు మొహం ఎర్రబడింది. "ఈ ముసలోడ్ని ఏ కీలు కాకీలు విరిచేస్తాను" అన్నాడు రోషంగా.

    ప్రేమ మొహంలో నవ్వు తగ్గింది. "నిజంగా నీకీ ఎత్తులూ పైఎత్తులూ నచ్చవా వేణూ" అంది నెమ్మదిగా.

    "మరీ ఇంతగానా" అన్నాడు. "....అసహ్యమేస్తుంది"

    "నేను నా స్నేహితురాలిని ఒకరిని పరిచయం చేస్తాను. నీకు నా మీద కూడా అసహ్యమేస్తుందేమో?"

    అతడు చిత్రంగా చూసి "ఏం మాట్లాడుతున్నావు ప్రేమా నువ్వు" అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు.

    అంతలో కారు పోర్టికోలోకి వచ్చి ఆగింది.

    ఆమె దిగుతూ "రా వేణూ" అంది. మెట్లెక్కి గుమ్మం దగ్గిరున్న కర్టెన్ పక్కకి తొలగిస్తూ "ఈ ఎత్తులూ పైఎత్తులూ నీకు అసహ్యమైన పక్షంలో నువ్వు నన్నూ క్షమించాలి వేణూ. ఈ అమ్మాయి నాకెప్పటినుంచో స్నేహితురాలని నీకు చెప్పనందుకు" అంది.

    లోపలికి అడుగు పెట్టబోయిన వేణు లోపలున్న వ్యక్తిని చూసి షాక్ తగిలినట్టూ ఆగిపోయాడు.

    చేతులు రెండూ వళ్ళో పెట్టుకుని, అన్నయ్యేం తిడతాడో అన్నట్టు తలదించుకుని మధ్య సోఫాలో కూర్చుని వుంది__

    మృదుల.


                     *    *    *    *


    "అసలిదంతా ఎలా చెప్పాలో.... ఎక్కణ్నుంచి మొదలెట్టాలో తెలియటంలేదు" అంది ప్రేమ బాల్కనీలోకి వంగిన కొబ్బరాకుని మధ్యకి చీలుస్తూ.

    "నాన్నకి ఎవరో స్లో-పాయిజనింగ్ చేస్తోన్న సంగతి డాక్టర్ చెప్పే సరికి దిగ్భ్రాంతి చెందాను. పైకి ఏమీ పట్టించుకోకుండా వున్నట్టు కనపడినా, డాక్టర్ దగ్గిర వివరాలన్నీ తెలుసుకున్నాను. యీ లోపులో ప్రసాదరావు నిన్నొ ఆయుర్వేద ధన్వంతరిగానూ, నువ్విచ్చిన నవమూలికా కషాయంతోనే నాన్న బ్రతికినట్టూ చెప్పాడు. ఇంటికొచ్చాక యీ ఊరిలో కెల్లా పెద్ద ఆయుర్వేద కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే, అసలు నవమూలికా కషాయం అన్న పేరే ఆయుర్వేదంలో లేదన్నారు."

    వేణు మొహం పాలిపోయింది. ప్రసాదరావు నోటి కిష్టం వచ్చినట్టూ వాగినప్పుడే ఇలాటిదేదో జరుగుతుందనుకున్నాడు.

    "మా అవుట్ హవుస్ లో వుండటానికి వచ్చినప్పుడు "నాకెవరూ లేరు. ఒంటరిగా వుంటున్నాను" అన్నావు. అంతకు ముందెప్పుడో నీకో చెల్లెలుందని చెప్పినట్టూ గుర్తు- అది గుర్తొచ్చి, ఫ్యాక్టరీకి నీ పాత పెర్సనల్ ఫైల్ చూసాను. నువ్వు నిశ్చయంగా అబద్ధం చెబుతున్నావని తెలిసింది. కానీ ఇదంతా ఎందుకో అర్ధంకాలేదు. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. షాపింగ్ చేస్తూ వుంటే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎక్కడ చూసానా అనుకుంటూ వుంటే నా స్నేహితురాలి తండ్రి అని గుర్తొచ్చింది. ఆయన నన్ను చూసి కంగారు పడసాగాడు. ఎందుకో అర్ధంకాలేదు. డొంక తిరుగుడుగా రెండు మూడు మాటలు మాట్లాడేసరికి ఆయన బుట్టలో పడిపోయాడు. ముందున్న కంగారుపోయి, "అయితే సాధించాడన్న మాట కుర్రవాడు" అన్నాడు. "అవునండీ" అన్నాను నమ్మకంగా. "మంచిదమ్మా ఇంత డబ్బు ఖర్చు పెట్టినందుకు ఫలితం దక్కిందన్నమాట" అన్నాడు ఆనందంగా.

    "దక్కిందిగానీ అసలేం ప్లానండీ బాబాయిగారూ" అన్నాను వరస కలుపుతూ. తోటి పెళ్ళికొడుకుమీద కత్తి చూపించి పెళ్ళి చేయించటం గురించిన ప్లాన్ అంతా చెప్పేసేడు. అప్పుడే కోటలో పాగా వేయటం కోసం ఇదంతా నువ్వు చేస్తున్నావని అర్ధమైంది. ఒకమ్మాయి కోసం ఇంత అద్భుతంగా ఎత్తు వేయగలిగిన కుర్రవాడెవరా అని అప్పుడే మొదటిసారి పరిశీలనగా చూసాను. ఫరవాలేదు. పాలబుగ్గల పిల్లవాడు ప్రేమించటానికి అర్హుడే అనిపించింది. నిజం చెప్పొద్దూ...."     సాయంత్రపు ఎండ పడటంవల్లో ఏమోకానీ వేణూ మొహం ఎర్రగా మారిపోయింది.

    "అంతలో గోవా ప్రయాణం తగిలింది. నాన్నకి కాలు విరగలేదనీ, మొబైలు ఎక్స్ రేమిషనూ అదీ నాటకమనీ నాకు తెలుసు. వచ్చే నవ్వు ఆపుకుంటూ నేనూ అందులో భాగం పంచుకోసాగాను. నాన్న స్థానంలో నువ్వు ప్రయాణమయ్యావు. అప్పటికే నా మనసు నీ పట్ల ఆకర్షితమై పోయింది. ఇక్కడ ప్రసాద్ సంగతొకటి చెప్పాలి. ప్రసాద్ అంటే అసలు నాకెప్పుడూ ఇష్టంలేదు. ఏదో అధికారం వున్నట్టూ అతడు చూపించే చనువు నాకు అసహ్యం వేసేది. ఈ గోవా ప్రయాణం ద్వారా నిన్ను మరింత దగ్గిరగా పరిశీలించవచ్చు కదా అనుకున్నాను. ఒక పెళ్ళి కావల్సిన అమ్మాయికి, తను చేసుకోబోయే అబ్బాయి ఎలా వుండాలీ అన్న విషయం మీద కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు వుండటంతో తప్పేమన్నా వుందా లేదుకదూ.... గోవా ప్రయాణం దగ్గిర పడుతున్నకొద్దీ నా మనసు వువ్విళ్ళూరసాగింది. ప్రయాణం సరీగ్గా ఒక గంటలో వుందనగా, అప్పుడు తెలిసిందో వార్త. మనసూ కళ్ళూ అన్నీ మోసం చేస్తున్నాయా అనిపించేటంత భ్రమలో పడేసే వార్త! ఒకమ్మాయి వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. భయం భయంగా అంతా చెప్పింది. తన అన్నయ్యా_ ఇంకో ముసలాయనా కలసి వేస్తున్న ఎత్తు గురించీ, తను చాటుగా వుండి విన్న దానిగురించీ చెప్పింది. కంపించిపోయాను. భయంతో వణికిపోయాను. మనుషుల్లో ఇంత కసి పగా వుంటుందా అని మధనపడ్డాను. కానీ మృదులేమో, తన అన్నయ్య అటువంటివాడు కాదనీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ గీత దాటడనీ వాదించింది. నాకూ పూర్వపు టెన్షన్ తగ్గిపోయింది. ఇదేదో గమ్మత్తుగా కనిపించింది. మేమిద్దరమూ దాదాపు పందెంలాటిది వేసుకున్నాము. అక్కణ్నించి అసలు కథ ప్రారంభమయింది. నువ్వంటే నేను ఇష్టం ప్రదర్శించసాగాను. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం దీన్నించి నేను బయట పడగలననే నమ్మకం నాకుంది. దాంతో కేవలం నిన్ను గమనించసాగాను. అలా గమనించటమే నన్ను పూర్తిగా ప్రేమలోకి దింపేసింది. గోవాలో నీ సిన్సియారిటీ, ఎంత అవకాశం వచ్చినా చొరవ తీసుకోకపోవటం- ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. నన్ను మోసం చెయ్యటానికి వచ్చి నువ్వెలా పూర్తిగా ప్రేమలో పడ్డావో, నిన్ను పరీక్షించటానికి వచ్చి నేనూ అలానే పడిపోయాను. కర్తవ్యానికి ప్రేమకీ మధ్య కొట్టుమిట్టులాడుతూన్న నిన్ను పరిశీలిస్తున్న కొద్దీ నాకూ ప్రేమంటే ఏమిటో తెలియసాగింది. కానీ నా ఒంటరితనాన్ని ప్రసాద్ ఉపయోగించుకోవాలని చూసాడు. గెస్టు హవుస్ లో మా ఇద్దరిమధ్యా మాటా మాటా పెరిగింది. నాన్నగారికి స్లో- పోయిజనింగ్ ఇచ్చింది నువ్వేకదా అనేసరికి పిచ్చెక్కిపోయి ఏదేదో పేలసాగాడు.     

    తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి నువ్వు! అంత అర్ధరాత్రి నా గురించి నువ్వు అలా వెయిట్ చేయటం నాకెంతో సంతోషం వేసింది. నాకేదయినా జరిగిందేమోనని నీ కళ్ళలో కనపడ్డ భయం చూసి నవ్వు వచ్చింది కూడా!.... సరే ప్రసాద్ వెళ్ళిపోయాడు. హిప్పీలతో జరిగిన దెబ్బలాటలో నీ కాలు విరిగింది. సరీగ్గా ఆ మూడునెలలు.... అవే మనని బాగా దగ్గిర చేసింది. ఇక నన్ను నేను ఆపుకోలేక ముద్దు పెట్టుకున్నాను కూడా. కానీ నీమీద మరోవైపు నుంచి వత్తిడి ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాత్రి గుర్తుందా? వర్షం కురిసిన రాత్రి_ అర్ధరాత్రి దాటాక మా ఇంటికి వచ్చావు. గురుదత్ ప్రసక్తి వచ్చింది. ప్రేమ గురించిన ప్రసక్తి వచ్చింది. స్వచ్చమైన ప్రేమ గురించి నేనో నిర్వచనం చెప్పేసరికి దెబ్బతిన్నట్టూ వదిలేసావు. అప్పుడే నాకో విషయం అర్ధమైంది! నువ్వు నన్ను పాడుచెయ్యలేవు. అప్పుడే అక్కడే, మొత్తం అంతా నాకు తెలుసునన్న సంగతి చెప్పేద్దామనుకున్నాను. అప్పటికే ప్రసాదరావు మా మావయ్య అన్న విషయము నాకు తెలిసిపోయింది. నేను చెప్పేస్తే ఏమవుతుంది? నువ్వు నన్ను ప్రసాదరావు దగ్గరికి తీసుకెళతావు. అంతా కలిసి నాన్న దగ్గరికి వెళతాము. మన వివాహం జరుగుతుంది. కానీ.... నా మనసులో ఒక అసంతృప్తి అలానే_ మిగిలిపోయింది. "నా భర్త ఒకప్పుడు నన్ను పాడు చెయ్యటానికి నియమింపబడ్డాడు" అని. నన్ను పాడుచెయ్యలేదు. కానీ నిజంగా నన్ను ప్రేమించాడా? ఎలా_ ఎలా ఇది తెలుసుకోవడం? తెలుసుకోకపోతే ఈ అనుమానం ఇక జీవితకాలం వెంటాడుతూనే వుంటుంది. దీన్నించి ఎలా బయటపడటం? ఈ నాటకానికి ఎలా ముగింపు చెప్పటం? దీనికి సమాధానం మరుసటిరోజు దొరికింది. ఆ రోజు ఎలాగైనా కర్తవ్యాన్ని పూర్తిచెయ్యాలన్న కృత నిశ్చయం నీ కళ్ళలో కనబడుతూంది. గత మూడు నెలలుగా నీ కళ్ళలో కనపడిన ప్రేమ ఆ రోజు లేదు. నేనూ ఆ రోజు అది తేల్చేసుకోవాలనుకున్నాను. "మూడునెలల"నే సరికి నాకో ఆలోచన వచ్చింది. గోవాలో ప్రసాద్ గెస్టుహవుస్ లోంచి బయటకు రావటానికీ దీనికీ లంకె కలిపి వాష్ బేసిన్ దగ్గరికి పరుగెత్తాను, నేను పెడుతున్నది చాలా ఘోరమయిన పరీక్ష అని నాకు తెలుసు. కానీ...."

    ఆమె మాటలు పూర్తికాలేదు. వేణు ఆమెని చప్పున దగ్గరికి లాక్కొని కళ్ళమీద ఆపుకోలేక సంతోషంతో ముద్దు పెట్టుకోసాగాడు. ఆమె కాదనలేదు. అతడి హృదయం మీదకి వాలిపోయింది. ప్రేమకి ఏమీ కాలేదన్న ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూంది. అతడి కౌగిలిలో ఛాతీమీద తల ఆన్చి కళ్ళు మూసుకుని ఆమె అన్నది__

    "మీకు కావలసినది పూర్తవటంతో నువ్వూ ప్రసాదరావు తప్పుకుంటారనుకున్నాను. కానీ నేను వూహించనంత శిఖరాలకి ఎదిగిపోయావు నువ్వు. ఆ క్షణం నీ రీజినింగ్, నీ వాదన చూస్తూంటే నాకు భయంతో, గౌరవంతో, ఆనందంతో కళ్ళు చెమర్చాయి. నాకు తెలిసిన వేణు ఇతడేనా అనిపించసాగింది. మొత్తంమీద పందెంలో నీ చెల్లెలుతో వోడిపోయినా నిన్ను గెల్చుకున్నాను...."
   
    అతడు మాట్లాడలేదు. తనకి కావలసిన విషయం అంతరంగంలో నుంచి ఇస్తూన్న ఆనందపుటాస్వాదనలో మునిగిపోయాడు.

    ఆమె కూడా ఏదో స్వాప్నికావస్థలో వున్నట్టు "ప్రేమంటే మంచి-చెడు- అంతా కలిపి స్వీకరించటమట! ఎంత మంచి నిర్వచనం!" అంది.

    అతడు ఆమెనించి సుతారంగా దూరం జరుగుతూ "మనం క్రిందికి వెళదామా" అన్నాడు. ఇద్దరూ మెట్లు దిగి క్రిందికి వచ్చారు. ప్రేమ మృదులవైపు తిరిగి నవ్వుతూ "అంతా చెప్పేసేను" అంది.

    మృదుల వేణు దగ్గిరగా వచ్చి నెమ్మదైన స్వరంతో "నువ్విచ్చిన కళ్ళు అన్నయ్యా ఇవి! నువ్వు ఘోరం చేస్తావేమో, దాన్ని చూడాలేమో అని భయపడ్డవి. అందుకే.... అందుకే వెళ్ళి అంతా చెప్పేసాను. నువ్వు నామీద కోపం తెచ్చుకోవు కదూ" అంది. సీరియస్ గా "ఇట్రా" అన్నాడు. ఆమె భయపడుతూ దగ్గరికి వచ్చింది.

    "నా మొహంలోకి చూడు."

    "ఎందుకూ?"

    "నా దవడ కండరం బిగుసుకుంటుందా? లేదుకదూ. అంటే నాకు కోపం రావటం లేదన్నమాట."

    మృదుల నవ్వసాగింది. అతడూ నవ్వుతున్నాడు. నవ్వనిది ప్రేమ ఒక్కతే! ఆమె వేణూనే గమనిస్తూంది. చెల్లెల్ని నవ్వించటం కోసం అతడది చేస్తున్నాడని ఆమెకి తెలుసు. తనెంత అదృష్టవంతురాలో కూడా ఆమెకి తెలుసు. మహోన్నత వ్యక్తిత్వాన్ని కూడా మామూలు నవ్వులో దాచిపెట్టగల మొగవాళ్ళు అరుదు.

    తను చెప్పిన మరో అబద్ధం_ హిందీ రాదన్నది_ అది గుర్తొచ్చి పెదాలమీద చిరునవ్వు కదలాడి అతడివైపే చూస్తూ ఆప్యాయంగా అనుకున్నది.

    तुम मेरा हँसी अरमान हो
    एक खोयी हुई पहचान हो

   
    నా తీయటి కోరిక నువ్వు.
    నేను పారేసుకున్న జ్ఞాపకానివి నువ్వు.
    ఈ గుండె కోట శిఖరాల నధిష్టించిన పతకాన్ని
    రెపరెపలాడించే ప్రేమగాలి తిమ్మెరవి నువ్వు
    అని.


                                                         ** శుభం **

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra