"తన బిడ్డ ఒక క్షణం అవస్థ పడితేనే చూసి భరించలేదు తల్లి. అలాంటిది మేం కట్నాలిచ్చుకోలేని కారణంగా నా బిడ్డ జీవితాంతం కష్టపడుతూంటే చూసి భరించగలనా? అందుకే పుట్టగానే చంపేస్తున్నాం" అని చెప్పిందట తల్లి కన్నీళ్ళతో. అదంతా చదివిన రోజు ఎంత ప్రయత్నించినా కంటిమీద కునుకురాలేదు. ఈనాటికీ అనాగరిక జాతులకు కుటుంబనియంత్రణ విధానాలు- బోధించేవారు- అమలు జరిపించేవారూ లేరా? శిశుహత్యల వరకు పరిస్థితి ఎందుకు రానిస్తున్నారు?
కల్లార్ తెగ మనుష్యుల వ్యాసం ప్రచురింపబడ్డ "ఇండియా టుడే" ఆఫీసు మీద దాడి చేసి ఇలాంటి ఆచారాలున్నది మా అనాగరిక జాతుల్లో మాత్రమేనా? నాగరికులు-విద్యావంతులు అయిన వాళ్ళల్లో కూడా ఎందరు గర్భంతో వుండగానే స్త్రీ శిశువుల్ని చంపేయడం లేదు" అని పోట్లాడారట.
ఎంత నిజం? అన్ని రకాల సమాల్లోను స్త్రీ శిశువు పట్ల ఇంత నిరాదరణా? ఒకవేళ స్త్రీల సంఖ్య తగ్గిపోయి మగవాళేళ సమాజంలో ఎక్కువగా వుంటే అప్పుడుమాత్రం స్త్రీ సుఖంగా వుంటుందా? ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఒకే ఆడదాన్ని పెళ్ళిచేసుకొని, "నీకు ఆ మొగుడిమీద ఎక్కువ ప్రేమా ఈ మొగుడిమీద ఎక్కువ ప్రేమా" అంటూ ఆడదాన్నే కాల్చుకు తింటారేమో? ఒకప్పుడు సమాజంలో కన్యాశుల్కం వుండేది. అప్పుడు స్త్రీ ఎంత సుఖపడిందో గురజాడవారు చెప్పారు. తరువాత అదిపోయి వరకట్నాలొచ్చాయి. అప్పుడు స్త్రీ ఎంత సుఖపడిందో వీరేశలింగంగారు చెప్పారు. ఇప్పటికీ ఎందరో చెపుతూనే వున్నారు.
పైపై ఆచారాలు ఏవి ఎలా మారినా స్త్రీ తన స్వతంత్ర వ్యక్తిత్వం సంతరించుకొనే వరకూ ఆమెకు విముక్తిలేదని ఎప్పటికి గుర్తిస్తుంది స్త్రీ జాతి.
ఈ ఆలోచనలలో మునిగిపోయిన మృదుల డ్రైవర్ చేస్తున్నదేమిటో గమనించలేదు. అతడు వెనక్కి తిరగ్గానే తనకేదో చెప్పబోతున్నాడనుకొని ముందుకొంగి మరింత సహకరించింది. జరిగిన మోసం ఇప్పుడర్దమయింది. ఇదెవరిల్లు? తనను ప్రత్యేకించి పిలిపించుకోవలసిన అవసరం ఎవరికుంది?
ఆమె ఆలోచనలను సమాధానమా అన్నట్లు "హల్లో!" అనే రాజభూషణం పలకరింపు వినిపించింది.
వంకర నవ్వుతో మృదుల పడుకున్న మంచం దగ్గిరగా వచ్చి నిలబడ్డాడు రాజభూషణం.
"నిష్కారణంగా నన్ను కోర్టుకీడ్చి అవమానించావు. అందుకు బదులు తీర్చుకుంటాను. ఇప్పుడే నిన్ను బలత్కారంగా అనుభవిస్తాను" కసిగా అన్నాడు మెత్తగా నవ్వింది మృదుల.
"బలాత్కారమా? అది దేనికి?"
తెల్లబోయి చూశాడు.
"నీమీద నాకెప్పట్నుంచో మనసుంది. ఎలా చెప్పాలో అర్ధంకాలేదు. నువ్వు ణా మనసు అర్ధం చేసుకోలేదనే కోపం కూడా నీకెదురు తిరగడానికి కారణం!"
మతిపోయింట్లయింది రాజభూషణానికి. ఇందులో ఏదేనా మోసం లేదుకదా! అనే అనుమానం రాకపోలేదు. మృదులలాంటి మోడ్రను లేడీకి నీతి నియమాలేమిటనే చాందసపు వూహ అతని అనుమానాన్ని దూరంగా నెట్టింది. అయినా ఇప్పుడామె వంటింటి కుందేలు. ఎక్కడికి పోగలదు. పైగా గది బయట, ఇంటి ముందు తన మనుష్యులు కాపలాగా వుండనే వున్నారు. ఈ మాటలు నమ్మడంవల్ల లాభమేకాని నష్టంలేదు.
అతడి మొహం చూస్తూ అతని ఆలోచనల్ని చదివింది మృదుల.
"ఈ కట్లు విప్పండి. చేతులకి, కాళ్ళకి కట్లతో శృంగారమేమిటి?" అంది గోముగా. ఆమె కట్లు విప్పేసాడు రాజభూషణం. ముందుకి వంగబోయాడు ముద్దు పెట్టడానికి.
"ఛ ఇలా వంటినిండా బట్టలతోనా!" చిలిపిగా నవ్వుతూ అంది. ఆమె నవ్వూ, మాటలూ పిచ్చెక్కిస్తున్నాయి రాజభూషణానికి. ఆరాటంగా బట్టలన్నీ విప్పేసి మూలకి విసిరేసి, ఆమె మీదకి ఉరికాడు. ఒడుపుగా మంచం మీంచి కిందకి దూకి మంచంమీదపడ్డ రాజభూషణం చేతుల్ని కదలకుండా పట్టుకుని, తనక్కట్టిన తాడుతోనే గట్టిగా కట్టేసింది. కోపంగా లేవబోయే రాజభూషణాన్ని మెడ మీద అరచేత్తో ఒకటి కొట్టింది. అంతటి మగవాడూ విరుచుకు పడిపోయాడు. వెనక్కి అతడి కాళ్ళుకూడా తాడుతో కట్టేసి, చేతులకు కట్టిన తాళ్ళకొసల్ని మంచం మొదటికోడుకి, కాళ్ళకి కట్టిన తాళ్ళ కొసల్ని మంచం రెండో కోడుకి గట్టిగా ముడేసింది.
* * *
మహావీర్ సోమనాధ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ కార్యాలయం చేరుకొని జరిగింది క్లుప్తంగా సోమనాధ్ కి వివరించాడు.
"ఏదో అతి సామాన్య విషయంగా, భార్యాభర్తల తగవులాటగా ప్రారంభమైంది. చివరకి జాతీయ సమస్యలా వుందే", అన్నాడు సోమనాధ్. మహావీర్ వచ్చేసరికి సోమనాధ్ వీడియో కేసెట్టు టి.వి. స్క్రీన్ మీద కనిపించే నల్లటి నీడల్లాంటి ఆకారాన్ని చూసి మహావీర్ నవ్వి 'ఇదేం వీడియో రికార్డింగ్, దేనికి పనికొస్తుంది ఇది?" అన్నాడు, నిట్టూర్చాడు సోమనాధ్.
"పొరపాటు ఎక్కడ జరిగిందో అర్ధంకావడం లేదు. భాగవతార్ ఇన్ స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన లేనప్పుడు ఆయన బెడ్ రూమ్ లో మృదుల మీద తీసిన వీడియో కేసెట్టిది. కొన్ని చోట్ల కాళ్ళు, కొన్ని చోట్ల నల్లని నీడలూ తప్పమరేమీ కనపడ్డంలేదు దీన్లో".
"మృదులగారి మీదా?...." నమ్మలేనట్లు అడిగాడు మహావీర్. వెంటనే టి.వీ. స్క్రీన్ దగ్గిరకొచ్చి, బేండ్స్ ఎడ్జస్ట్ చేసాడు.
"లైటింగ్ సరిగా లేనట్లుంది. వీడియో కేసెట్ ఎడ్జెస్ట్ మెంట్ కూడా సరిగా లేదు. ఇప్పుడు ట్రై చెయ్యండి" అన్నాడు.
సోమనాధ్ మళ్ళీ టి.వి. ఆన్ చేశాడు. ఈసారి ఫిలిమ్ కాళ్ళదగ్గర ఆగిపోక పూర్తిగా వచ్చింది. తెరమీది స్త్రీ మృదులకాదు. గతుక్కుమన్నాడు సోమనాధ్. నల్లటి నీడలు స్పష్టమైన ఆకారంలో కనిపించాయి. స్త్రీ వ్యక్తి మృదులకాదని, రూడైంది.
"ఈ విషయం వెంటనే భాగవతార్ కి తెలియజెప్పాలి. ఆయన ఇన్నాళ్ళూ, తన భార్యకి ఎవరితోనో సంబంధం వుందని భ్రమపడుతూ బాధపడుతున్నాడు" అర్జంటుగా బయలుదేరబోతూ అన్నాడు సోమనాధ్.
మృదుల విషయంలో తన అంచనా తప్పుకానందుకు ఎంతో రిలీఫ్ పొందాడు మహావీర్. జరిగిందంతా వూహించుకుంటే అతనికి ఆపుకోలేనంత నవ్వొచ్చింది.
"వెంటనే వెళ్ళి ఈ విషయమంతా చెప్పి భాగవతార్ గార్ని ఇక్కడికి తీసుకురండి. ఆయనొచ్చేసరికి బహుశా మృదులగారూ ఇక్కడే వుంటారు."
తన సెకెండ్ హేండ్ హిందూస్థాన్ కారు మీద బయల్దేరాడు సోమనాధ్.
గడియారం ముళ్ళు పరిగెడుతున్నాయి. ఒక గంట గడిచేవరకూ మహావీర్ పెద్దగా పట్టించుకోలేదు. రెండుగంటలు గడిచేసరికి ఆందోళన ప్రారంభమైంది. మూడోగంటకూడా గడిచిపోయేసరికి స్థిమితంగా ఉండలేకపోయాడు. 022 బొంబాయి ఎస్.టి.డి. నంబర్ డయల్ చేసి ఆ తరువాత తను నోట్ చేసుకున్న లాయర్ యశోధరాదేవి నంబర్ కి డయల్ చేశాడు.
* * *
హోటల్ నాగార్జునా గేటు దగ్గిర ఘూర్ఖా సోమనాధ్ ని లోపలికి వెళ్ళనీయలేదు.
"లోపల ఏదో గలాటా జరుగుతోంది. కొంతసేపటి వరకూ ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలులేదు" అన్నాడు.
"నాది అర్జెంటు పని లోపల సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసులు భాగవతార్ గారున్నారు. వారితో ఒకమాట చెప్పాలి.
"అదేం కుదుర్దు. కాసేపు మీడొక్కుకార్లోనే కూర్చోండి. గొడవ సర్దుమణిగేక లోపలికి పోవచ్చు."
ఏం చెయ్యాలో పాటుపోలేదు సోమనాధ్ కి. పర్సులోంచి పదిరూపాయలు తీసి ఘూర్కా చేతిలోపెట్టి, "పోనీ లోపలున్న భాగవతార్ గార్ని బయటికి పిలిపించే యేర్పాటు చెయ్యగలవా?" అన్నాడు. సోమనాధ్ అటు తిరిగి ఘూర్ఖాతో ఆతృతగా మాట్లాడ్తూన్న సమయంలోనే, ఇట్నుంచి భాగవతార్ తనకారులో వెళ్ళిపోయాడు.
ఘూర్ఖా చప్పట్లుకొట్టి హోటల్ బోయ్ ని పిలిచి, "లోపల భాగవతార్ గారున్నారేమో చూసి ఉంటే ఆయన కోసం యెవరో వచ్చారని చెప్పు" అన్నాడు. హోటల్ బోయ్ లోపలికెళ్ళొచ్చి "భాగవతార్ గారు లేరట. ఇప్పుడే వెళ్ళిపోయారట" అని చెప్పాడు.
"ఎక్కడికెళ్ళారట?"
ఇబ్బందిగా ముఖం పెట్టాడు బోయ్. మరో పదిరూపాయల నోటు తీసి హోటల్ బోయ్ చేతిలో పెట్టాడు సోమనాధ్. బోయ్ లోపలికెళ్ళి తిరిగొచ్చి "కుసాయిగూడా కెళ్ళారట" అన్నాడు.
"కుసాయిగూడాలో ఎక్కడికి?"
కళ్ళు చికిలించి చూసాడు హోటల్ బోయ్. మరో అయిదురూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు సోమనాధ్. వాడు మరోసారి లోపలికెళ్ళొచ్చి," ఎక్కడి కెళ్ళాడో ఎవరికీ తెలియదట" అని చెప్పేసి, తుర్రున లోపలికి పారిపోయాడు. ఇహ తనకేమీ గిట్టుబాటు కాదని వాడికి తెలుసు.
చేసేది లేక తనడొక్కు కారులో కుసాయి గూడాకి బయలుదేరాడు. పైరింజన్ లా, శబ్దం చేసుకుంటూ సోమనాధ్ కారు కుసాయిగూడా చేరుకుంది.
సిటీ అవుట్ స్కర్ట్స్ లో చిన్న పల్లెటూరులా వుంటుంది కుసాయిగూడ. అయిదారిళ్ళు అక్కడక్కడ విసిరేసినట్టుగా వుంటాయి. ఒక డాబా యింటి ముందు నిలబడి హాల్లో వున్న పెద్దమనుష్యుల నుద్దేశించి, "ఈ ప్రాంతాలకి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు భాగవతార్ వచ్చారా?" అని అడిగాడు.