Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 37

    8. ప్రస్తుత కేసులో  ముద్దాయి  పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో  బాధపడుతున్నట్లు అతన్ని పరీక్షించిన డాక్టర్లు  చెప్పారు.  ఈ విషయంపై మరొక సైకియాట్రిస్టు డాక్టర్ ప్రదీప్ సలహా తీసుకోవడం జరిగింది. ముద్దాయికి మొదటి నుండి ట్రీట్ మెంట్ యిస్తున్న  డాక్టర్ రామకృష్ణ ముద్దాయి కొంతకాలంగా ఈ జబ్బుతో బాధపడుతున్నట్లుగా చెప్పాడు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం ముద్దాయి యిక ముందు కూడా ఇలా ప్రవర్తించడానికి  ఆవకాశం వున్నా అదృష్టవశాత్తూ  అతను మామూలు మనిషి కావడానికి ఆవకాశం ఉందనీ చెప్పారు.

    పారనాయిడ్ స్కిజో ఫ్రెనియాతో బాధపడే వ్యక్తికి పక్కన ఎవరూ లేకపోయినా ఏవేవో శబ్దాలు వినిపిస్తాయ్. దాంతో అతను గాభరాపడి  మెంటల్ బాలెన్స్ కోల్పోతాడు. తనేం చేస్తుందీ  అతనికి తెలియదు. హత్యచేసిన సమయంలో ముద్దాయి మానసిక పరిస్థితి ఎలా వుందో డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వబడింది.

    ఈ కేసులో ముద్దాయి అప్పటివరకు బాగానే వున్నాడు. భార్య వద్దంటున్నా పార్టీ ఏర్పాటు చేశాడు. ఆహ్వానితులతో చక్కగా మాట్లాడాడు. కానీ వున్నట్లుండి  అతనిలో ఏదో మార్పు వచ్చింది. అక్కడా ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం అతను ఏం చేస్తుంది తెలియని పరిస్థితిలో హతురాలిని చంపినట్లు  తెలుస్తోంది. అందువలన అతడు చేసిన నేరానికి అతను బాధ్యుడుకాదు. ఏ దెయ్యం అతనిలో  చేరి ఈ పని చేయించిందో నేను చెప్పలేను.

    నేను తీసుకున్న నిర్ణయంలో  లొసుగులు  నాకూ తెలుసు. చీఫ్ జస్టిస్ హాల్ట్ చెప్పినట్లు ఇలాంటి నిర్ణయాలు  చేసేటప్పుడు  కొంత విమర్శ తప్పదు. ఈ విమర్శపట్ల  భవిష్యత్తులో నాకంటే  తెలివిగల న్యాయవేత్తలు ఒక నిర్ణయానికి రాగలరనే నమ్మకం నాకుంది.

    ఇక్కడ ముద్దాయికి తను చేస్తున్నది ఎలాంటి పనో తెలియదు. ఏం చేస్తున్నదీ  తెలియదు. తెలివిలో వున్న వాడెవడూ  పదిమంది ముందు తెలిసేటట్లు  హత్య చెయ్యడు. అతను మానసిక రోగి అని నిర్ణయించి అతన్ని విడుదల చేస్తున్నాం. అయితే ఇలాంటి వ్యక్తుల విషయంలో భవిష్యత్తు  గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో  కొంత ఆలోచించాలి. ఐ.పి.సి. సెక్షన్ 328తో ఇలాంటి "పిచ్చివాళ్ళ" ని  ఏం చేయాలో వుంది. 329 ఐ.పి.సి. ప్రకారం మానసిక రోగుల్ని  కోర్టులో  ఎలా ట్రీట్ చెయ్యాలో  వివరించబడింది. సెక్షన్ 331 కొన్నాళ్ళు కేసు వాయిదావేసి  తిరిగి పునర్విచారించడానికి ఆవకాశం ఇచ్చింది.  సెక్షన్ 325 క్లాజ్ _3 నిందితుణ్ని బాగా దగ్గరబంధువుల  సంరక్షణలో  ఉంచాలని వివరించింది. అందువల్ల ఈ చివరి సెక్షను ప్రకారం నిందితుణ్ని అతని అక్క సంరక్షణలో ఉంచాలని  తీర్పునిస్తున్నాం. అతన్ని వాళ్ళతోపాటు అమెరికా వెళ్ళడానికి అనుమతినిస్తున్నాం."

    జడ్జి తీర్పు చదవడం పూర్తవగానే....

    అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కోర్టులో....

    ఒక్కసారి గొడవ మొదలయింది.


                     (మొదటి అధ్యాయం సమాప్తం)


                     రెండో అధ్యాయం


    ఆకాశం మార్తీభవించిన  స్వచ్చతకు  మారు పేరులా, మంచు వర్షాన్ని  కురిపించబోతున్నట్లుగా మెరుస్తోంది. ఎంత అందంగా ఉందీ ప్రదేశం ? హిమాలయాల్లోంచి  కైలాస పర్వతం ఎగిరివచ్చి ఆ మైదానంలో వాలినట్లు ఉంది.

    ఆ సానువుల నుండి జాలువారుతున్న  ఆ సెలయేర్లూ, ఎర్రటి పూలతో మెరుస్తున్న ఆ ప్రకృతి ఎవరికోసమో  ఎదురు చూస్తోన్న  అభిసారికలా వుంది. ఆ పర్వతాగ్రం పురుషుడిలా వుంది. సాధునయనాలతో, ఆర్తితో ప్రకృతిని ప్రేమతో స్పృశిస్తూంది. ఆ శిఖరం ప్రేయసి పొందుకోసం  తహతహలాడే పురుషుడిలా లేదు. చరచరా జగత్తును శాసించే మహాశక్తిలా తను సృష్టించిన జగతిని అనురాగంతో  తిలకిస్తున్నట్టు  ఉంది. ప్రపంచంలో జరిగే అన్యాయాలనూ, ఆ అన్యాయాలని అరికట్టటానికి మనిషి ఏర్పరచుకున్న చట్టాలన్నీ చూస్తూ పరిహసిస్తున్నట్లు  వుంది. అంతలో ప్రకృతి మారిపోయింది.

    ఆకాశం నిండా నల్లటి మబ్బులు  చేరుకున్నాయి. ఎక్కడ నుంచి వచ్చాయో తెలీదు. ఆ పర్వత మధ్యంలో సెగలు ప్రారంభం అయ్యాయి. ఎక్సరే కళ్ళతో  చూస్తున్నట్లు అంతర్భాగంలో  ఉన్న కల్మషం అంతా కనిపిస్తోంది. భూమి లావాలా మరుగుతోంది. క్షణంలో ఎంత భీభత్సంగా తయారయింది! అప్పటి ఆ దివ్యమంగళ పురుషుడు ఇప్పుడు భయంకరమైన కోరలతో  రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఇదే అతని అసలయిన రూపమా? ఆ లావాని ఉండలుగా చుట్టి విసురుతున్నాడు. చెట్లూ, చేతులూ కాలిపోతుంటే  చూసి వికటాట్టహాసం చేస్తున్నాడు.

    ఎవరో స్త్రీ, అటే వెళుతోంది చూసుకోకుండా. అమాయకంగా నవ్వుతూ వెళుతున్నది. ఆ భయంకర రూపాన్ని ప్రేమపూరితంగా చూస్తూ నన్నేం చెయ్యలేడు అన్న ధీమాతో నడుస్తోంది.

    అరే, అది పద్మజ కదూ, ఎక్కడి నుంచి వచ్చింది ?

    "అక్కా, ఆగు అటు వెళ్ళకు" దిక్కులు పిక్కటిల్లేలా  అరిచింది హిమజ నిద్రలోనే.

    పద్మజ వినడంలేదు. చిరుహాసంతో  అలాగే వెళుతోంది నిర్భయంగా.

    అయ్యో, వాడు విసిరిన నిప్పు బంతిలా  వచ్చి పద్మజను కబళించి వేస్తోంది.

    "అక్కా, అక్కా " పరుగెడుతోంది హిమజ. మరుగుతున్న లావా ప్రవహిస్తూ అడ్డం వచ్చింది.

    "అక్కా....!" భయంతో మెలుకువ వచ్చి లేచి కూర్చుంది హిమజ.

 Previous Page Next Page