8. జంతువులు, పక్షులు, పాములు:
ఖాలీ కాగితం చూస్తే చాలు దానిమీద పక్షులు బొమ్మలు గీసేవాళ్లు రంగురంగుల ప్రపంచాన్ని ఊహించే భావుకులై వుంటారు. జంతువు బొమ్మలు గీసేవాళ్లు సాటి మనిషిని నమ్మని స్వభావం గలవారై వుంటారు. పట్టుదలకి చిహ్నంగా వీళ్లని పేర్కొన వచ్చు.
పైన చెప్పిన రకరకాల విశ్లేషణలో ఏ విభాగానికి మీరు మిమ్మల్ని అన్వయించుకుంటారో ముందు గుర్తించుకొండి. ఒక్కొక్కప్పుడు మీరు రెండు విభాగాలకి చెందిన వారై వుంటారు. ఉదాహరణకి మీకు ముగ్గులు వెయ్యటం, పక్షి బొమ్మలు వెయ్యటం అలవాటనుకుందాం. ఆ రెండు విభాగాలలో ఆయా డూడ్లింగ్స్ కి ఇచ్చిన విశ్లేషణని మీ స్వభావానికి అన్వయించుకోవాలి.
ఇంకురంగు:
మనిషి మనస్తత్వాన్ని కనిపెట్టడంలో అతడు వాడే ఇంకుయొక్క ప్రాముఖ్యత అంతగా లేదు. అయినా కూడా గ్రాఫాలజిస్టులు మనిషి వ్యక్తిత్వానికి, అతడు వాడే ఇంకురంగుకి కొంతవరకూ దగ్గర సంబంధం వున్నట్లుగా భావిస్తున్నారు.
సాదారణంగా ఎక్కువమంది 'బ్లూ - బ్లాక్ ' ఇంకులు ఉపయోగిస్తారు.
వాడే ఇంకురంగునిబట్టి గుణగుణాలని పరిశీలిద్దాం.
బ్లూ: ఈ రంగు ఉపయోగించేవారు స్నేహస్వభావం కలిగి వుంటారు. తమపనిపట్ల సిన్సియర్ గానూ ఎదుటివారిని అర్దం చేసుకోవటం లోనూ, వారిని ఆదరించడంలోనూ వారికి ఒక మార్గదర్సకులుగానూ వ్యవహరిస్తారు. అయితే వీరికి ఏ విషయంలోనూ కూడా ఒక అవగాహన, పట్టుదల వుండవు. పదిమంది వెళ్లే దారిలో వెళ్లాలనే మనస్తత్వం తప్ప, ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలని గానీ, కొత్త విషయాన్ని శోధించి కనిపెట్టాలని గానీ వీరికి అంతగా ఆశక్తి వుండదు.
బ్లూ బ్లాక్: వ్యాపార విషయాల్లో ఉత్సాహం వున్నవారు, రాజకీయాల్లో నైపుణ్యం వున్నవారు ఈ రకం రంగు వాడతారు. వీరు చేసే ప్రతీపని ఒక పద్దతిలో హుందాగా వుంటుంది. వీరు చాలా డిగ్నిఫైడ్ గా వుంటారు. వీరి పరిచయాన్ని పెంచుకోవడానికి అవతలి జనం ఉత్సాహపడుతూ వుంటారు.
రాయల్ బ్లూ: సాధారణంగా దీన్ని వృత్తిపరంగా, ప్రావీణ్యం సంపాదించేవారు (డాక్టర్లు, సంఘసేవకులు, లాయర్లు) వాడతారు. ఈ రంగు వాడటానికి ఉత్సాహం చూపించేవారిలో సాదారణంగా దయాగుణం, స్నేహభావం, జాలి ఎక్కువగా వుంటాయని గ్రాఫాలజిస్టులు అంటారు.
బ్లాక్: తన యొక్క వ్యక్తిత్వాన్ని పదిమందీ గుర్తించాలనుకునే వారు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను గానీ, ఇంక్ పెన్ను గానీ వాడతారు. పెద్ద పెద్ద పదవుల్లో వున్న వాళ్లు, గొప్పవాళ్లు, అధికారం చలాయించాలనుకొనే వాళ్లు దీన్ని ఉపయోగిస్తారు. నల్లరంగు బాల్ పెన్ను గాని, కలం గానీ వాడే స్త్రీలు భవిష్యత్తు పట్ల నిర్దిష్టమైన అవగాహన కలిగివుండి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. జీవితంలో ఏదో సాధించాలనే తపన వీరికుంటుంది.
డార్క్ బ్రౌన్: ఇంజనీర్లు, నిర్మాణాత్మకం ఆలోచించాలనే తపనవున్నవాళ్లు, సంఘంలో బాధ్యతాయుతమైన పదవికి రావాలనే కోర్కెవున్న వాళ్లు డార్క్ బ్రౌన్ ఉపయోగిస్తారు. సాధారణంగా విద్యార్దుల్లో ఈ రకం రంగువాడేవారు చాలా తక్కువ.
గ్రీన్: ఒంటరిగా, ప్రశాంతంగా, ఈ సంఘానికి దూరంగా వుండాలని అనుకునేవారు గ్రీన్ రంగుని వాడతారు. వీరికి అనూహ్యమైన తెలివితేటలుండి అందర్నీ ఆకర్షించగలుగుతారు. పదిమందిని తమవైపు తిప్పుకో గలుగుతారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువకానీ, ఈ రంగు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ని కూడా సూచిస్తుంది.
రెడ్ : అందరిలోనూ తాము ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఈ రంగు వాడతారు. అధికారయుతమైన గొప్పతనం కనిపించాలని, మిగతావాళ్లకన్నా తమకి ఎక్కువ తెలుసని ఈ రంగు కలం ఉపయోగించేవారు భావిస్తూ వుంటారు. మిగతా వారికన్నా తామే శక్తి వంతులమని వీరి నమ్మిక. అయితే, ఒక విషయాన్ని సూటిగా గమ్యం వైపువెళ్లేలా చేయడానికి గాని, ఒక పని చెయ్యటానికి పూర్తి అవగాహన గాని వీరికి వుండదు.