Home » Dr jandhyala papayya sastry » Karunashri Sahithyam - 3


    కొద్దిసేపటికే తిన్నడు మంచి బలిసిన లేడిని కొట్టి తెచ్చాడు. దాని మాంసం రుచికరంగా పచనం చేశాడు. పరిశుభ్రమైన తామర దొప్పలలో భద్రపరిచాడు. సువర్ణముఖి నదిలో దిగి నోటినిండా నీళ్లు తీసుకొని వచ్చాడు. ముందుగా నోటి నీటిని శివలింగం మీద పుక్కిలించాడు. మాంసపు దొప్పలు స్వామిముందు పెట్టి "ఇవిగో! స్వామీ! కడుపునిండా ఈ కరకుట్లు తిను." అని పరమశివుణ్ణి ప్రార్థించాడు.
    ఎంత వేడుకున్నా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఎంత ప్రార్థించినా ఆ నైవేద్యం ఆరగించలేదు. ఎంతసేపు చూచినా శివలింగం చలించలేదు.అప్పుడు తిన్నడికి అంతులేని సంతాపం కలిగింది. అతడు చింతాక్రాంతుడై "ఎందుకు స్వామీ! సందేహిస్తున్నావు! చక్కగా స్నానం చేశావుగదా! మరి ఆహారం ఆరగించవేం? ఈ కరకుట్లు నాకిష్టం కావా? బాగా కాలలేదా? కాక చాలలేదా? మరీ మాడిపోయినవా? రుచిగా లేవా? లేకపోతే నీకు అసలు ఆకలి కావటం లేదా? ఎందుకు తినవు? రా తండ్రీ! ఈ కమ్మని కరకుట్లు కడుపునిండా తిని వెళ్లు." అని పార్వతీపతిని బ్రతిమాలుకున్నాడు. కాని ఎంతవేడినా తిన్నడి కోర్కె ఫలించలేదు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు.
    తిన్నడు పెద్దగా విలపిస్తూ "శంకరా! నిన్ను భక్తవశంకరుడు అంటారే! మరి నేను చెప్పిన మాట ఎందుకు వినవూ? నా నైవేద్యం ఎందుకు తినవూ? ఎంత పిలిచినా పలకవుగదూ! అయితే నేను నీముందే నాతల పగులగొట్టుకొని చచ్చిపోతాను." అని శివలింగం మీద శిరస్సు పెట్టి పగులగొట్టుకోపోయాడు. తక్షణమే దయామయుడైన సదాశివుడు తిన్నడి ముందు సాక్షాత్కరించాడు.
    "వద్దు తిన్నా! అంత సాహసం వద్దు. నీ సేవాసక్తికి నేను మెచ్చుకుంటున్నాను! నీ నైవేద్యం పుచ్చుకుంటాను." అని నైవేద్యమందుకొని అదృశ్యమైనాడు. మహాశివుని సందర్శనంలో మైమరచిపోయాడు తిన్నడు. అప్పటినుంచీ తిన్నడు స్వామిసన్నిధిలోనే నివశిస్తున్నాడు.
    తిన్నడు స్వామిని నిత్యమూ పుక్కిలి నీటితో అభిషేకించి పూలూ ఆకులూ తెచ్చి పూజిస్తున్నాడు. నిండు మనస్సుతో మాంస ఖండాలు వండితెచ్చి నిత్యనైవేద్యం అర్పిస్తున్నాడు. పరమశివుడి మీద భక్తి గీతాలు పాడుతూ బ్రహ్మానందపరవశుడౌతున్నాడు. ఆ బాలభక్తిని భావశుద్ధికీ, నిర్మలబుద్ధికీ పొంగిపోతున్నాడు గంగాధరుడు.
    ఆ ప్రాంతంలోని పల్లెటూరిలో పరమభక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నెలకొకసారి అడవికి వచ్చి స్వామివారిని సందర్శించేవాడు. సువర్ణముఖిలో శుచియైవచ్చి, మహాదేవుని ఆవుపాలతో అభిషేకం చేసేవాడు. మంచి మంచి మారేడు దళాలతో మహేశ్వరుని పూజించేవాడు. రుచ్యములైన భక్ష్యాలతో నైవేద్యం అర్పించేవాడు. తీయందనాల ఫలరసాలతో పానీయం సమకూర్చేవాడు. నియమశీలుడైన బ్రాహ్మణవర్యుడి నిశ్చలార్చనకు మోదభరితుడై ప్రసన్నుడయ్యేవాడు పరమేశ్వరుడు.
    ఒకనాడు తిన్నడు మాంసం తేవటానికి అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలోనే బ్రాహ్మణుడు ఆవుపాలతో శివార్చనకోసం అక్కడికి వచ్చాడు. కాని పరమశివుణ్ణి పరికించగానే అతనికి దుర్భరమైన దుఃఖం కలిగింది. శివలింగం చుట్టూ ఎంగిలిచారలూ ఎముకల ప్రోగులూ, మాంసఖండాలూ, కొల్లలుగా పడిఉన్నాయి. ఆ పరిసరమంతా దుర్గంధపూరితమై అసహ్యంగా ఉన్నది. పవిత్రమైన శివసన్నిధిని ఆ విధంగా పాడుచేసిన పాపాత్ముడెవరా అని పరితపించాడు బ్రాహ్మణుడు. ఆ దురాచారాన్ని సహించినందుకు అతనికి స్వామిమీద గూడా ఆగ్రహం కలిగింది. అతడు స్వామి ముందు నిలిచి "మహాదేవా! పరమపవిత్రమైన నీ సన్నిధిని మాంసపంకిలం చేసిన పాపాత్ముడెవడు? శివంకరమైన నీ సన్నిధిని రక్తసిక్తం చేసిన రాక్షసుడెవడు? నీవు చూచి చూచి ఇంత అన్యాయాన్ని ఎందుకు సహించావు? ఇందుకు కారణం చెప్పి తీరాలి." అని గట్టిగా అడిగాడు బ్రాహ్మణ ప్రవరుడు.
    అతని పరితాపానికి జాలిపడి భక్త సులభుడైన పరమశివుడు బ్రాహ్మణప్రవరుడికి ప్రత్యక్షమైనాడు. "విప్రవర్యా! విచారపడకు. ఈ విధంగా నన్ను సేవించిన భక్తాగ్రగణ్యుడు అమాయకుడైన ఒక శబర బాలకుడు. అతడు నాకోసం అయిన వాళ్ళనందరినీ విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. నిండు మనస్సుతో, నిత్య శ్రద్ధతో నన్ను సేవిస్తున్నాడు. అతడు నా భక్త కోటిలో ప్రథమ స్థానం పొందాడు. అందువల్లనే నేను అతనికి వశమైపోయాను. అతని నివేదన అందుకుంటున్నాను. అతని భక్తిని ప్రత్యక్షంగా పరీక్షించాలంటే నీవు నా లింగం చాటున దాగి ఉండు. ఇప్పుడే అతడు తిరిగి వస్తాడు." అని పలికి అదృశ్యమైనాడు పరమేశ్వరుడు.
    పరమశివుని పలుకులు విని విస్మయమందాడు విప్రవర్యుడు. అతడు చకచక ఆవు పాలతో దేవదేవుడికి అభిషేకం చేశాడు. పూజ పూర్తి కాగానే శివాజ్ఞ శిరసావహించి లింగం వెనుక దాగి ఉన్నాడు. అప్పుడే తిన్నడు మాంసపు దొప్పలతో తిరిగి వచ్చాడు. చెప్పుకాలితో శివలింగంమీది పరిమళపత్రాలూ పుష్పాక్షతలూ ప్రక్కకు నెట్టివేశాడు. నోటినిండా నింపి తెచ్చిన నదీజనం ఒక్కమాటుగా శివలింగం మీద పుక్కిలించాడు. మాంసపు దొప్పలు శివుని ముందు పెట్టి "తిను స్వామీ! తిను. వేళ మిగిలిపోతున్నది. తొందరగా వచ్చి తిను." అని వేడుకున్నాడు తిన్నడు.
    కాని ఆరోజున అతనికి పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. "ఏమిటి స్వామీ! ఎంత పిలిచినా రావూ? కమ్మని తిండి గబగబా వచ్చి తిను." అన్నాడు తిన్నడు. కాని శివలింగం చలించలేదు. పరమశివుడు కదలలేదు. స్వామికి ఏంలోపం జరిగిందో ఎంత ఆలోచించినా అర్థంకాలేదు తిన్నడికి.
    అంతనేకే ఆకస్మికంగా శివలింగం ఎడమ కంటినుంచి నెత్తురుకారటం మొదలుపెట్టింది. అది చూడగానే తిన్నడి గుండెలు గుభిల్లు మన్నాయి. అతడు గోలుగోలున ఏడుస్తూ "అయ్యో! నా సామీ! నీ కంటి నుంచి రక్తం ధారలు కట్టుతున్నదే! ఏం ప్రమాదం జరిగింది తండ్రీ!" అంటూ స్వామికన్ను పరిశీలించాడు తిన్నడు. "పాపం! పరమశివుని కన్ను గాయమైపోయింది. అంతేకాదు. కన్ను గ్రుడ్డుకూడా చితికిపోయింది. వెనువెంటనే తగిన మందు వెయ్యాలి." అని అనుకొని తిన్నడు గబగబా వెళ్ళి అడవి అంతా గాలించి ఏవేవో ఆకులు కోసి తెచ్చాడు. ఎన్నెన్నో మూలికలు పట్టుకొని వచ్చాడు. స్వామికంటిలో పసరులు పిండి వైద్యం చేశాడు. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. శివుడికన్ను బాగుపడలేదు. స్వామి కంటివెంట మరింత వేగంగా రక్తధార ప్రవహిస్తున్నది. తిన్నడికి ఏమీ తోచలేదు. "అయ్యో! సామీ! నీవు ఒంటికంటివాడవైపోయావా? నేనేం చేసేది తండ్రీ! ఎన్ని వైద్యాలు చేసినా ఏమీ లాభం లేకపోయింది. ఇంక నీ కన్ను ఎలా బాగుపడుతుంది!" అని పరిపరి విధాల పరితపించాడు తిన్నడు.
    అంతలోనే అతడికి ఒక ఆలోచన తట్టింది. "కంటికి బదులు కన్నే" అనుకున్నాడు తిన్నడు. వెంటనే తన అంపపొదిలోని బాణాగ్రంతో తన ఎడమకంటి గ్రుడ్డు పెకలించి స్వామి కంటికి అడ్డం పెట్టాడు. అంతే! తిన్నని వైద్యం ఫలించింది. మహాశివుని గాయం మానిపోయింది. అసమానమైన అగ్నిపరీక్షలో శబరబాలకుడు ఉత్తీర్ణుడైనాడు. ఆ బాలభక్తుని త్యాగశక్తికి శివలింగం చాటున దాగి ఉన్న విప్రవర్యుడు విభ్రాంతుడైనాడు.
    పరమశివుని ఎడమకన్ను బాగుపడ్డదని సంతోషిస్తున్నాడు తిన్నడు. అంతలోనే ఉన్నట్లుండి మహాశివుడి కుడికంటినుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. అప్పటికప్పుడే పరమశివుని కుడిగ్రుడ్డు కూడా చితికిపోయింది. కాని ఇప్పుడు తిన్నడికి ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. వెంటనే అతడు తన కుడి కన్ను గూడా పెకలించి శివుని కంటికి చికిత్స చేయాలని అనుకున్నాడు.
    కాని ఇప్పుడు మరొక చిక్కు వచ్చింది. తాను రెండు కళ్లూ లేని కబోది అయితే స్వామికన్ను గుర్తించటం ఎలాగా? గుర్తించలేకపోతే స్వామి కంటికి తన కంటిగ్రుడ్డు అమర్చటం ఎలాగా? అందుకోసం తిన్నడు తన కుడికాలు ఎత్తి పరమశివుడి కుడికంటి మీద గుర్తుగా పెట్టాడు. అంపపొదినుంచి బాణంతీసి కుడికంటి లోపల గ్రుచ్చుకోబోయాడు. అంతలోనే భక్తవశంకరుడైన శంకరుడు తిన్నడి ముందు సాక్షాత్కరించాడు. నిండు భక్తితో తన రెండు కళ్ళనూ పూజా పుష్పాలుగా సమర్పిస్తున్న భక్తవర్యుడికి సదాశివుడు సాక్షాత్కరించాడు.
    పరమేశ్వరుడు భక్తుని చేయిపట్టుకొని "ఆగు తిన్నా! ఆగు. అతి కఠోరమైన అగ్నిపరీక్షలో నీవు అఖండ విజయం పొందావు! అద్భుతమైన నీ ఆత్మశక్తినీ, అపారమైన నీ ప్రాకృతభక్తినీ ఈ బ్రాహ్మణవర్యుడికి ప్రదర్శించటానికే ఈ విధంగా నిన్ను పరీక్షించాను. లోకోత్తరమైన నీ భక్తి ప్రపత్తికి నేను మెచ్చుకున్నాను. నీకు మోక్షలక్ష్మిని ప్రసాదిస్తున్నాను. నీవు శాశ్వతంగా నా సన్నిధిలో అపరసౌఖ్యాలు అనుభవిస్తావు." అని అనుగ్రహించాడు. తిన్నడు పరమానంద పరవశుడై చేతులుమోడ్చి "ధన్యుణ్ణి. సామీ! నేటికి నా జన్మం తరించింది. నా పుణ్యం ఫలించింది. ఈ విధంగా మోక్షసాధనలో నాకు సహాయం చేసిన ఈ విప్రవర్యుడికి గూడా ముక్తిమార్గం ప్రసాదించండి." అని అపారకృపాలయుడైన అంబికాధవుని ప్రార్థించాడు. అతని అభీష్టం నెరవేర్చి అదృశ్యమైనాడు పరమేశ్వరుడు. పరమ పవిత్రులైన భక్తులిద్దరూ పరమేశ్వరుని పదధ్యానంలో పరవశులైనారు.

                                       *  *  *  *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra