తులసి ముఖంలోకి చూస్తూ, "మీరెందుకో బాధపడుతున్నట్లున్నారు...."
కృష్ణారావును అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నకొద్దీ చాలా ఆశ్చర్యంగా ఉంది తులసికి....
"ఈ అవిటి చేత్తో... నన్ను ఆదుకునేవాళ్ళు లేక ఎలా బ్రతకగలను?"
"అవునవును! మనకు ఏదైనా అవసరం ఉందనుకొంటే చాలా బాధగా ఉంటుంది. ఆలాంటప్పుడే ఎదుటివాళ్ళు మనసు సానుభూతితో చూడాలనిపిస్తుంది. అందుకే నాకు చంద్ర అంటే అంత గౌరవం. నన్నే కాదు. కుసుమను కూడా ఎంత ఆదరంగా చూస్తుంది?"
మెరుపు కొట్టినట్లయింది తులసికి. అభమూ శుభమూ ఎరుగని పసి వయసులో దారుణమయిన దురదృష్టానికి గురయి కొంత వికృతాకారం ఏర్పడినందుకు కుసుమను చీదరించుకుంది తను. మరి, తన అవిటి చెయ్యి చూసి మిగిలినవాళ్ళు చీదరించుకొంటే, అన్యాయమేముందీ?
"కుసుమ సంగతి సరే! మీకు అవసరం ఏముందీ?"
"నాకా? నాకు..... ఏం లేదు....."
కృష్ణారావు సిగ్గుపడుతూ ముఖం తిప్పుకున్నాడు. ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకోవటం సభ్యత కాదనిపించింది. ఆ కుతూహలమూ లేకపోయింది.
"మిమ్మల్ని రాయవెల్లూరు తీసికెళ్తాను. ఇప్పుడే ఒక గంటలో వస్తాను. మనం వీలయితే రేపే బయలుదేరి వెళ్దాం. కానీ, మీ అమ్మగారి దగ్గర ఎవరుంటారు?"
తులసికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది.
"అమ్మ దగ్గర అక్క ఉంటుంది."
"ఆవిడ చూసుకోగలరా?"
"ఎందుకు చూసుకోలేదూ? తను మాత్రం అమ్మకి కూతురు కాదా? మొదటినుంచీ నాకంటే అక్కకే ఎక్కువ చేసింది అమ్మ....."
"సరేలెండి. రేపు వెళ్ళి మీ అక్కయ్యగారితో మాట్లాడి మనం బయలుదేరి వెళ్ళిపోదాం...."
"థాంక్సు! థాంక్యూ వెరీమచ్....."
"కానీ.... అప్పటివరకూ మీరు హోటల్ గదిలో ఒంటరిగా ఉండగలరా? రాత్రి ఒక్కరూ ఉండగలరా?"
హోటల్ ప్రొప్రైటర్ గుర్తుకొచ్చి, గుండెలు దడదడలాడాయి తులసికి.....
"ఉండలేను."
"ఎక్కడ ఉంటారు మరి?"
"నేను! మీతోనే వస్తాను."
"నేను సూర్యం యింట్లోనో, కాకపోతే చంద్ర ఇంట్లోనో గడుపుతాను. ఎక్కడికి వస్తారు మీరు?"
ప్రతి క్షణమూ ఒక సమస్య ఎదురవుతున్నకొద్దీ ప్రతిఘటించే శక్తి సన్నగిల్లి పోతోంది తులసిలో....
"చంద్ర ఇంటికే వస్తాను" అంది.
"వెరీగుడ్! చంద్ర చాలా సంతోషిస్తుంది. అయితే ఇప్పుడే వెళ్దాం రండి" అన్నాడు.
కృష్ణారావుతో కలసి వచ్చిన తులసిని చూసి చంద్ర చాలా ఆశ్చర్యపోయింది. ఎలాంటి దెప్పిపొడుపు మాటలు ఎదుర్కోవలసి వస్తుందోనని చాలా భయపడింది తులసి. కానీ, చంద్ర అలాంటిదేమీ లేకుండా ఎంతో ఆదరంగా ఆహ్వానించింది.
"కృష్ణా! నువ్వు వస్తావో, రావో అని ఏమీ వండలేదు. క్షణాలలోగా వంట చేస్తాను" అని వంట చెయ్యటానికి లేచింది! కృష్ణారావు చంద్ర కష్టపడటం చూడలేనట్లు "ఫరవాలేదు లెద్దూ ఏదుంటే అదే పెట్టు. తినగలంలే!" అన్నాడు.
"నీకేం? నువ్వు అలాగే అంటావు. తులసిగారు రాకరాక నా ఇంటికి అతిథిగా వచ్చారు. పాపం! ఆవిడకి కడుపునిండా భోజనమయినా పెట్టొద్దూ?" అంది చంద్ర.
చంద్ర చూపిస్తున్న అభిమానానికీ, ఆప్యాయతకు తులసి కొద్దిగా ముడుచుకు పోయింది. 'మంచి మనసు' అనుకోకుండా ఉండలేకపోయింది. కానీ, ఆ భావాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయింది. చంద్ర పతిత, సంఘం హీనముగా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటికి తనలాంటి వ్యక్తి వస్తే, ఆనందించదా? గౌరవించదా? అనుకుంది.
కృష్ణారావు తనను రాయవెల్లూరు తీసికెళ్తున్నట్లుగా విని, చంద్ర ఈర్ష్య పడుతుందనుకుంది తులసి. కానీ, చంద్ర చాలా ఆనందించింది. "మీకు నయమయిపోతుంది. నాకు తెలుసు_ ధైర్యంగా ఉండండి" అని ఆరిపోతున్న ఆశలను ఎగసిన దోసింది. నిజంగానే కృష్ణారావు అన్నట్లు చంద్ర దగ్గరికి వచ్చిన కొంచెంసేపట్లోనే అహర్నిశలూ తులసిని ఆవరించుకున్న దిగులు పటాపంచలయిపోయింది. కళ్ళముందు ఏదో బంగారు భవిష్యత్తు రూపురేఖలు దిద్దుకోసాగింది.
"అక్కడ మీకు తోడుగా నేను రానా?" ఆప్యాయంగా అడిగింది చంద్ర. నివ్వెరపోయింది తులసి. తన సొంత అక్క రక్తాన్ని పంచుకుని పుట్టిన తోబుట్టువు-ఇలా అడుగుతుందా? తన తప్పు ఏం లేకపోయినా, బావను పెళ్ళి చేసుకునేకంటే చావటమే తనకెక్కువ ఇష్టమని తెలిసినా, బావ తనను మరొక దృష్టిలో చూస్తున్నాడని... తనలో అందముందని, ఏదో అసహనం పేరుకు పోయింది అక్కలో.... కృష్ణారావుతో తను మాట్లాడిన ధోరణి వక్రంగా ఉంది. అయినా చంద్ర...
అసలు చంద్రకు కృష్ణారావుమీద ప్రేమ లేదేమో? అలాంటి వాళ్ళకు ప్రేమ ఏమిటీ? అహ! అలా కాదు. కృష్ణారావు తన వలలో పడతాడేమోననే భయంతోనే తమవెంట వస్తానంటోందేమో! ఛ! ఛ! ఏం మనసు తనది! ఇలా వక్రంగా తప్ప ఎందుకు ఆలోచించలేకపోతోంది? చంద్ర ఎంతో ఉదారంగా తనకు సహాయం చేస్తోందని ఎందుకు నమ్మకూడదూ?
చంద్ర తమతో రావటానికి కృష్ణారావు ఒప్పుకోలేదు. "చంద్రా! నీకు ఎంతో కష్టంమీద ఉద్యోగం ఇప్పించాడు సూర్యం టెంపరరీగా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్లు సెలవులు పెట్టుకున్నావంటే_ ఆ ఉద్యోగం కాస్తా ఊడితే ఎంత కష్టం?"
"అవును. నేనా విషయం ఆలోచించనే లేదు. పోనీలే! నేను రాను. కానీ, ఏదైనా అవసరమైతే వైర్ ఇవ్వండి."
కృష్ణారావుకి కారుంది. బోలెడు డబ్బుంది. చంద్ర కూడా బ్రోతల్ గా బాగానే సంపాదించి ఉండాలి. అటు ఇద్దరికిద్దరూ ఆ చిన్న ఉద్యోగం కోసం పాకులాడుతున్నారు. ఆ ఉద్యోగం తప్ప మరొక గతిలేని ఎందరో నిరుద్యోగులుగా అవస్థపడుతుంటే డబ్బున్నవాళ్ళే తమ పలుకుబడితో అధికారంతో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరింత జల్సాగా బ్రతుకుతున్నారు. ఏనాటికి బాగుపడుతుంది ఈ సమాజం?