Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    తను వచ్చినపని అనుకోకుండా దారికి వస్తున్నందుకు తబ్బిబ్బైనా, ఆయన ఏమంటాడోనని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
    "మీరు సజస్టు చేస్తున్నప్పుడు కాదంటానా? మీ యిష్టం. పెళ్ళిచూపులెప్పుడు ఏర్పాటు చేద్దాం?"
    "ఎప్పుడోనా? ఇవాళ ఏకాదశి. ఫస్టుగా వుంది. మధ్యాహ్నం రెండింటికీ, నాలుగుకీ వర్జ్యంకూడాలేదు. ఇవాళే కానిద్దాం. ఏమోయ్! ఏమంటావు?" అన్నాడు మృత్యుంజయరావువంక తిరిగి.
    అతను మొదట కొంచెం బెట్టుచేద్దామనుకున్నాడు. కాని కుదరక "పెద్దవారు మీరు చెబుతున్నారు. అలాగే కానియ్యండి" అన్నాడు.
    తర్వాత ఆయన పుట్టినతేదీ. యింటిపేరూ, గోత్రం అన్నీ రాసుకున్నాడు. మధ్యాహ్నం కృష్ణశర్మగారూ, మృత్యుంజయరావూ కలిసి వారింటికి వెళ్ళటానికి నిర్ణయం జరిగింది.
                     *    *    *
    పెళ్ళిచూపులకు బయల్దేరుతుంటే మృత్యుంజయరావుకు కంగారుగా వుంది. ముచ్చెమటలు పోస్తున్నాయి. పులిబోనులోకి వెడుతున్నట్లుగా బాధపడుతున్నాడు. ఎలాగో ఓపిక చేసుకుని తనకున్న దుస్తులన్నిటిలోకి మంచి ప్యాంట్ తీసి వేసుకున్నాడు. జుట్టు అందంగా దువ్వుకున్నాడు. అద్దంముందు నిలబడి 'నేను చాలా బాగున్నానివేళ' అనుకోవటానికి ప్రయత్నించాడు.
    ధైర్యం తెచ్చుకుని, కృష్ణశర్మగారింటికి వెళ్ళి, ఆయన్ని తీసుకుని రిక్షా ఎక్కి అక్కడినించి జగన్నాథంరావుగారింటికి వెళ్ళాడు.
    గదిలో కూర్చుంటే లోపలనుంచి ఆడవాళ్లు తొంగితొంగి చూస్తున్నారు. పిల్లలు వచ్చి చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. సిగ్గుతో అతనికి చచ్చిన చావుగా వుంది. ఎందుకొచ్చానురా భగవంతుడా అని తిట్టుకుంటున్నాడు. 'నా మొహం... నాకు పెళ్ళేమిటి?' అనుకుంటున్నాడు విసుగ్గా.
    ఇరుగు పొరుగు పెద్దమనుషులు యిద్దరు ముగ్గురు అతిథులుగా వచ్చారు. సోమయాజులు వస్తాడేమోనని అతను కంగారుపడ్డాడు. కాని ఆయనెక్కడా కనిపించక కాస్త కుదుటపడ్డాడు.
    పెళ్ళికూతుర్ని తీసుకువచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చోపెట్టారు. అతనికి చెడ్డసిగ్గుగా, భయంగా వున్నది. కృష్ణశర్మగారు ఏదో పరిహాసప్రసంగాలు చేస్తున్నారు. అక్కడ కూర్చున్న పెద్దమనుషులతో, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలూ, కథా కమామీషూ ఆరా తీసుకున్నాడు. మధ్యమధ్య "సరిగ్గా చూడవోయ్, కావాలంటే ఏమన్నా ప్రశ్నలడుగు" అని హెచ్చరిస్తున్నాడు. అలాగే ఆ అమ్మాయిని "సిగ్గుపడకుండా చూడమ్మా! అట్లా తలవంచుకుని కూర్చుంటే లాభంలేదు" అని బలవంతం చేస్తున్నాడు.
    మృత్యుంజయరావుకు ఉక్కబోస్తున్నది. ఉక్కిరిబిక్కిరిగా వుంది. ముఖాన చెమట తుడుచుకుందామని జేబులోంచి చేతిరుమాలు తీసి తుడుచుకుంటున్నాడు. కాని అతని చేతికది రుమాలుగా అనిపించలేదు. అదోరకంగా అనిపించి, రెండుచేతుల్లోకి తీసుకుని విప్పిచూశాడు. అతనిగుండె ఆగిపోయినంత పనయింది. అది రుమాలుకాదు- గాంధీటోపీ. చాకలివాడు మార్చి తెచ్చినట్లున్నాడు. పెళ్ళికూతురు చూడలేదుకదా అని కంగారుపడుతూ ఆమెవంక చూశాడు. ఆమె అతన్నే గమనిస్తోంది. జరిగిన విషయం కనిపెట్టి ఫక్కుమని నవ్వింది. ఆ నవ్వులో చాలా అవహేళన గోచరించింది అతనికి. పరాభవంతో ముఖం కందగడ్డయిపోయింది. తర్వాత మెరుపులా అక్కడినుంచి లేచివెళ్ళి, గుమ్మం దాటబోతూ ఓసారి వెనుదిరిగి చూసి వెక్కిరించి వెళ్ళిపోయింది ఆమె.
    అతను భూమిలోకి కృంగిపోయాడు.
    "ఈ కోతిమొహంవాడు తప్ప యింకెవరూ దొరకలా! ఇంకెప్పుడూ యిలాంటి చచ్చుమొహాన్ని తీసుకువస్తే ఊరుకోను. చెబుతున్నా. అసలు మొహంమీదే అడుగుదామనుకున్నా, ఎప్పుడైనా అద్దం చూసుకున్నావా అని?" లోపలనుంచి పెళ్ళికూతురు చేస్తున్న ధూంధాంలు బయటగదిలో కూర్చున్న అందరికీ వినిపించింది.
    మృత్యుంజయరావు ముఖాన కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. భూమి బ్రద్దలై, తనని అందులో దాచుకుంటే బాగుండుననిపించింది.
                      *    *    *
    సాయంత్రం ఏడుగంటలవేళ తనగదిలో మంచంమీద పడుకుని ఆ మసక చీకటిలో కుమిలిపోతున్నాడు. అతనికి ఆ క్షణాన జీవితమంటే పూర్తిగా విరక్తి కలిగింది.
    తనని ఎవరు పరాభవించలేదు గనక? ప్రతి జీవిచేతా అవమానించబడ్డాడు. ఎప్పుడూ రంపపుకోతలే.
    తనను మంజులత పరాభవించింది. పెళ్ళికూతురు పరాభవించింది, మాలతి నిర్లక్ష్యం చేసింది.
    గతంలో సంఘటనలేవో వికృతంగా గుర్తుకొస్తున్నాయి.
    ఒకసారి బుద్ధి గడ్డితిని కాలేజిలో చదువుకునే రోజుల్లో తనగదికెదురుగా వున్న యింట్లోని అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. అప్పుడు తను వేరే యింట్లో వుండేవాడు. ఆ ఉత్తరానికా అమ్మాయి జవాబు రాసింది. "నువ్వు గాడిదవి, జిడ్డువాడివి, పిరికిపందవు. నిన్ను చూస్తేనే నాకసహ్యం. నీతో ప్రేమేమిటి? ఈసారి ఎప్పుడైనా పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాస్తే మా పెద్దవాళ్ళతో చెప్పి డొక్కశుద్ధి చేయిస్తాను. జాగ్రత్త."
    మరోసారి మనసు వక్రించి తనకు బట్టలు యిస్త్రీ చేసే చాకలిపిల్లను చెయ్యి పట్టుకున్నాడు.
    తనచేతిని పురుగును విదిలించినట్లు విదిలించివేసి, యిక తిట్లు లంకించుకుంది. "దుర్మార్గుడా!" అంది. "త్రాష్టుడా! ఇన్నాళ్ళూ యీ దుర్భుద్ధి పెట్టుకుని వున్నావా?" అంది. "మా వోడితో చెప్పి నీ తాట ఒలిపిస్తాను" అంది.
    ఇహ సర్వం విస్మరించి ఆమె కాళ్ళమీద పడ్డాడు.
    ఆ సమయంలో ఆమె తిట్టినతిట్లు, పలికిన దూషణవాక్యాలు అతను జీవితంలో చరమాంకంలో తల్చుకున్నా నిద్రపట్టదు.
    అవన్నీ తల్చుకుని "నన్నెవరూ ప్రేమించరు. నన్నెవరూ అభిమానించరు. నేనెవరికీ అక్కర్లేదు" అని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో ఎంతవేళ గడిచిపోయిందోకూడా అతనికి తెలియదు.
    గదిలో లైటు వెలిగింది. అతను ఉలికిపడి తల ఎత్తి చూసేసరికి మాలతి మెరుపులా అతని దగ్గరకు వచ్చి కూర్చుంది.
    మాలతి ఎందుకు వచ్చిందో, అలా ఎందుకు జరిగిందో అతను ఆలోచించలేదు. ఒకప్పుడు మాలతి తనను తృణీకరించిందనీ, ఏవిధంగానూ ఆత్మీయురాలు కాదనీ ఊహించటానికి తిరస్కరించాడు. మాలతి వొడిలో తలపెట్టుకుని "నాకెవరూ లేరు" అని ఏడుస్తున్నాడు.
    మాలతి అతని జుత్తులోకి వ్రేళ్లు పోనిచ్చి దువ్వుతూ "నేనున్నాను" అంది.
    అప్పుడు చూశాడు మాలతి ముఖంవంక అదిరిపడి. ఎంత విషాదంగా, దీనంగా వాడిపోయి వుందామె వదనం! మాలతి చెంపలమీదకూడా కన్నీటి చారికలు. తను విన్నమాట నిజమా అని నమ్మలేకుండా వున్నాడు.
    "నేను కావాలన్నారు కదూ ఓసారి. నన్ను పెళ్లిచెసుకుంటారా?"
    ఈ అమృతపుజల్లు అతను భరించలేకపోయాడు. "మాలతీ! నాకెందుకీ వరమిస్తున్నారు?" అని అడిగాడు వెర్రివాడిలా. అతనికి శోష వస్తున్నట్లుగా వుంది.
    "అదంతా నాకు తెలియదు. మనం పెళ్ళిచేసుకుందాం. కాని యీ వూళ్ళో నివసించలేను నేను. నన్నెక్కడికైనా తీసుకువెళ్ళండి. ఇక్కడి వికృతచేష్టలు కనిపించనంత దూరానికి" మాలతి మైకం క్రమ్మినదానివలే తూలిపోతూ, తడబడుతూ మాట్లాడుతోంది. 
                                                    18
    మాలతి తండ్రి పశుపతిగారు కూతురుపెళ్ళి స్వంతంగా కుదర్చలేక పోయినా, పెళ్లి వాళ్ళే చేసుకున్న కూతురికీ, అల్లుడికీ వరంగల్ బదిలీ అయేటట్లు చూడటంలో మంచి ప్రజ్ఞా, పలుకుబడీ ప్రదర్శించాడు. ప్రస్తుతం భార్యతప్ప ఎవరూలేని మృత్యుంజయరావు కాకినాడ జీవితానికి ఉద్వాసనచెప్పి, సతీసమేతంగా వరంగల్ వెళ్ళిపోయి నవజీవనం ప్రారంభించాడు.
    మాలతి ఉద్యోగం మానకుండా చేస్తున్నది. ఇంట్లో వంట వండుతుంది. అతనికి వడ్డిస్తుంది. అతనికి కావలసిన సదుపాయాలన్నీ ఏమరుపాటు లేకుండా సమకూరుస్తుంది. ఇంట్లోకి ఏ వస్తువు కావలసినా బజారుకు వెళ్ళి స్వయంగా పట్టుకువస్తుంది. అతనికి రకరకాల ఫలహారాలు చేసి పెడుతుంది. అంతా బాగానే వుంది. కాని ఆమెలో ఏదో కరువయింది. కాపురానికి వచ్చాక మాలతి పెదవులమీద చిరుహాసం ఉదయించగా అతను చూడలేదు. మాలతిని నవ్వించటం అతనికి చేతకాదు. తన రూపాన్ని గురించిగాని, వైఖరిని గురించి గాని ఆమె ఎన్నడూ అవహేళన చెయ్యలేదు. కనీసం వ్యాఖ్యానించలేదు. ఇతరులెవరన్నా అనుకుంటున్నప్పుడు చెవిన పడినా పట్టించుకోలేదు, అతన్నెప్పుడూ అసహ్యించుకోలేదు, ఏలోటూ చెయ్యలేదు.
    తమ జీవితం యాంత్రికంగా సాగిపోతున్నదని అతనికి తెలుసు. కాని చేయగలిగిందేముంది? తను కోరిన మాలతి లభించింది. కాని జీవితాన్ని విలాసంగా గడపటం అంటారే- అది ఎట్లా? చేతకావటంలేదు.
    మాలతి జీవితంలో ఏర్పడ్డ గండికిగల కారణం అతనికి చూచాయగా తెలుసు. అంటే తెలుసుకున్నాడనికాదు, ఊహించాడు.
    శేఖరం అందరితో ఆడుకొన్నట్లు మాలతితో ఆడుకోవటానికి ప్రయత్నించాడు. మాలతి ఏమీ తెలియని అవివేకురాలుకాదు. శేఖరాన్ని గురించి కొంత తెలిసినా, తన స్వార్ధంకోసం, జీవిత పరిపూర్ణతకోసం అతనితో కలిసి తిరిగింది. అలా తిరగటంలో మమతకులోనై మనసుకూడా యిచ్చింది. కాని ఆమె అతన్నుంచి ఆశించింది కేవలం మానసిక బంధాలేకాదు, వైవాహిక బంధం.
    శేఖరం మరో కులస్థుడు- మాలతిని పెళ్ళి చేసుకుంటే అతన్ని యింట్లోంచి తన్ని తగిలేస్తారు. కాకపోయినా ఆమెను జీవితభాగస్వామినిగా చేసుకునే కాంక్ష అతనికి యిసుమంత అయినాలేదు. అతనికి కావలసింది ఆమెతో విలాసం, చనువు తీసుకోవటానికి ప్రయత్నించాడు. కాని ఆమె చాలా నిగ్రహం, నియమంగల యువతి. అతని వెర్రివేషాలకు ఏమీ అవకాశం యివ్వకుండా వివాహప్రసక్తి తీసుకువచ్చింది.
    పెళ్ళి ప్రమేయం రాగానే శేఖరం ముఖం నల్లబడింది. "ఐయామ్ సారీ మాలతీ! ఆ ఉద్దేశం నాకులేదు" అన్నాడు.
    మాలతి కోపోద్రిక్తురాలయింది. "నువ్వు వట్టి రోగ్ వి. నీలాంటివాడితో తిరిగి నన్ను నేను దగా చేసుకున్నాను. నా ముందునుంచి పో" అని అరిచింది. అతను పిల్లిలా అక్కడ్నుంచి జారుకున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra