Previous Page Next Page 
ఆత్మబలి పేజి 36


    "ఇడియట్! అన్నయ్య పోయాడని తెలిసీ రాలేదేం?" అంది కోపంగా.
    ఆ కోపానికి నవ్వొచ్చింది ఉమకు. అక్క ఆనాటికీ, ఈనాటికీ ఒక్కలాగే ఉంది.
    "నవ్వుతావేం? ఇది నవ్వొచ్చే విషయమా?"
    "విషయం కాదు. నీ ధోరణి."
    "ఏడిశావులే! ఎందుకు రాలేదు?"
    "నువ్వు నాకు రాస్తే ఎందుకు రాను? ఇలాంటి దారుణం జరిగిందని తెలిస్తే నేనక్కడ నిలవగలనా?"
    "ఒకటికాదు, నాలుగు ఉత్తరాలు రాశాను. జబ్బు మొదలయినప్పుడూ, తీవ్రమయినప్పుడూ, పోయాకా, ఆ తరువాత."
    "నాకొక్కటి కూడా చేరలేదు."
    "శుద్ధ అబద్ధం. స్వయంగా నేనే పోస్టు చేశాను. పోస్టల్ వాళ్ళు ఉత్తరాలు మింగెయ్యరు."
    "ఏమో మరి!"
    శోభ తీవ్రంగా చలపతివంక తిరిగింది.
    "ఏవండీ! నా ఉతరాలందలేదూ? నిజం చెప్పండి."
    తీవ్రమయిన శోభ స్వరూపం చూసి వణికిపోయాడు చలపతి.
    "అందాయి."
    ఉలిక్కిపడింది ఉమ.
    "అందాయా? మీకు తెలుసా? మరి, నాకెందుకు చెప్పలేదు?" అంది కాతరస్వరంతో. చలపతి తలవంచుకున్నాడు.
    కోపంతో నిలువెల్లా వణికిపోతూ "సమాధానం చెప్పవేమయ్యా?" అని గద్దించింది శోభ. చలపతి గడగడలాడిపోయాడు.
    "చెప్తాను. ఎందుకంటే, మరేమో మా అమ్మ చెప్పింది...."
    "నాన్సెన్స్! ఉమ పేరున ఉన్న ఉత్తరం మీ అమ్మెందుకు చింపింది?"
    చలపతి పిచ్చి చూపులు చూశాడు.
    "ఆయనను చెప్పనియ్యక్కయ్యా! తరువాత నీ సందేహాలన్నీ తీరుస్తాను."
    విసుగ్గానూ, మందలింపుగానూ అంది ఉమ.
    "చెప్పండి." అంది చలపతితో మృదువుగా. తడారిపోయిన చలపతి గొంతులోకి మాటలొచ్చాయి.
    "మీ అన్నయ్య పోయాడని తెలిస్తే నువ్వు మీ వాళ్ళింటికెళ్ళి పోతావుట! వెళితే మళ్ళీ రాకపోవచ్చట. అమ్మ చెప్పింది. నువ్వెళ్ళిపోతావంటే నాకు భయమేసింది. అందుకని చెప్పలేదు."
    శోభ గద్దింపుతో భయపడి మరింత వెఱ్ఱివాలకంతో అన్నాడు చలపతి.
    "ఓ గాడ్!" అంటూ తలపట్టుకొని అక్కడినుంచి లేచిపోయింది శోభ.
    ఉమ నిశ్శబ్దంగా కూర్చుంది. శోభ వెళ్ళిపోవటంతో చలపతి ప్రాణాలు కుదుటపడ్డాయి. నిశ్శబ్దం చాలా భయంకరంగా మృత్యుదేవత మూగ సందేశంలా ఉంది. చలపతి ఉక్కిరిబిక్కిరై సహించలేక "నామీద కోపం వచ్చిందా ఉమా?" అన్నాడు.
    "లేదు; బాధగా ఉంది."
    "బాధపడకు ఉమా! ఇంకొకసారి నీ ఉత్తరాలు నీకిస్తాను."
    "అందుక్కాదు. బ్రతికినంతకాలమూ మీ భార్యగా బ్రతుకుతానని మీకు మాటిచ్చాను. మీకు నాలో నమ్మకం లేకపోయినందుకు బాధగా ఉంది."
    "కాదు! కాదు! ఉమా! నాకు నీలో నమ్మకముంది. నీలో నమ్మకంలేక కాదు. ఏవిఁటంటే..." ద్ ద్ ద్ ఎందుకంటే...మాటలకోసం తడుముకోసాగాడు చలపతి. అతనికి మాటలందించే ప్రయత్నమేం చెయ్యలేదు ఉమ.
    రాత్రి భోజనాలయ్యాక ఉమతో మాట్లాడటానికి ముందు వరండాలో చాపపరిచి కూర్చుంది శోభ. ఉమతోపాటు అక్కడే కూర్చున్న చలపతిని చూస్తూ చికాకణచుకోలేకపోయింది. అక్క భావాన్ని కనిపెట్టింది ఉమ. చలపతివంక తిరిగి "పిల్లలంతా సినిమాకెళ్తున్నారు. మీరూ వెళ్ళకూడదూ?" అంది.
    చలపతి వెంటనే బయల్దేరాడు.
    "ఇతనికి సినిమాలంటే ఇష్టమనుకుంటానేం?" అంది శోభ.
    ఉమ సమాధానం చెప్పలేదు.
    "మాట్లాడవేం?"
    "నిజాన్ని అనుభవిస్తూ నేను సహించగలను. విని నువ్వు సహించలేవని సందేహిస్తున్నాను."
    "సహించగలిగినా, సహించలేకపోయినా నిజం నిజమే! చెప్పు."
    "ఇష్టమంటూ ఏం లేదు. ఏ సినిమానో, కథ ఏమిటో కూడా గుర్తుండదు. కాని చూస్తారు" శోభ మాట్లాడలేదు. పొంగివచ్చే ఆవేదన నణచుకుంటూ కొంచెంసేపు మౌనంగా కూర్చుంది.
    "అన్నయ్య పోయినప్పుడు కూడా రాని నువ్వు ఇలా అకస్మాత్తుగా ఊడిపడ్డావేం?"
    "చిన్నకథ ఉంది."
    "భేష్! వినిపించు."
    అక్క స్వభావం తెలిసిన ఉమ సాధ్యమైనంత క్షుప్తంగా జరిగిన సంగతులు వినిపించింది. ఉమ భయపడినట్లుగానే శోభ కోపంతో మండిపోయింది.
    "మనుష్యులా, పశువులా వాళ్ళు? వింతమృగంలాంటి తమ కొడుక్కి అపురూపమైన కన్యనిచ్చిందిగాక ముష్టిసంబంధమని ఈసడిస్తారా? ఇలాంటి కోడలు దొరికిందే అదృష్టమనుకోక కోడంట్రికం కూడానా? ఎందుకూ పనికిరాని చవటను అనన్యసామాన్యమైన దీక్షతో ఒక మార్గంలో పెట్టుకొస్తున్నందుకు సంతోషించవలసింది పోయి అడ్డుపుల్లలూ అపనిందలూనా? మొగుడు చవటవడానికి సాయం ఆర్ధికమైన ఇబ్బందులా? తిండి పెట్టడానికి ఏడుపా? ఇంటెడు చాకిరీ చేయించుకొని పడేస్తున్న ఆ మెతుకులకు దెప్పుళ్ళా? ఉద్యోగం చెయ్యనివ్వరా? ఉమా! నీకు బుద్ధిలేదు, జ్ఞానంలేదు. నీ మెళ్ళో మంగళసూత్రాలు తీసి మురిక్కాలువలో పారేసి నీ మొగుడ్ని వాళ్ళమ్మ వళ్ళోకి తరిమేసి హాయిగా ఉద్యోగం చేసుకో. ఆ సంసారంకంటే ఈ బ్రహ్మచర్యం కోటిరెట్లు మెరుగు. ఛీ! ఛీ!!"
    రోషంతో బుసలుకొట్టే అక్కను చూస్తూ శాంతంగా నవ్వింది ఉమ.
    "నీ ఇంత ఉపన్యాసమూ వృథాయే అక్కయ్యా! నీచూపు ప్రస్తుతం మన సమాజమున్న స్థితిమీదకాక ఇంకా ముందుంది. కోడంట్రికమూ, దెప్పుళ్ళూ, నిబంధనలూ మన సంసారాలలో అతి మామూలుగా తీసుకోవలసిన సామాన్య విషయాలు. మంగళసూత్రాలు తీసిపారెయ్యగలిగిన వ్యక్తినే అయితే అసలీ వివాహమే జరిగిఉండేది కాదుగా!"

 Previous Page Next Page