"మా వాళ్ళు వచ్చి ఇస్తారు" అంది తడబడుతూ.... ప్రొప్రైటర్ తులసిని అనుమానంగా చూస్తూ__
"మీ వాళ్ళంటే ఎవరు? ఒకాయన నిన్న ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాయన వేరే గదిలో ఉండి, తన బిల్ తను ఇచ్చేసి వెళ్ళిపోయాడు" అన్నాడు.
"మా వాళ్ళు వస్తారు. ఆగండి" అంది తులసి మొండిగా.... ప్రొప్రైటర్ తులసిని ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. తులసి గుండెల్లో రాయి పడింది. కృష్ణారావు వస్తాడా? చంద్ర రానిస్తుందా? క్రిందటి రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే అతడు రాకపోయినా రాకపోవచ్చు. అప్పుడు తన గతి.....?
ఒక్కొక్క నిముషం గడుస్తున్న కొద్దీ తులసి గుండెల్లో రైళ్ళు పరుగెత్తసాగాయి. సాయంత్రం అయింది. కృష్ణారావు రాలేదు. కాని, ప్రొప్రైటర్ వచ్చాడు.
హేళనగా "మీ వాళ్ళు వచ్చారా!" అన్నాడు.
"రాలేదు. వస్తారు." అంది.
"ఇలాంటి కేసులు చాలా చూశాం కాని, ముందు బిల్ చెల్లించండి." మర్యాద వదిలేసి గద్దిస్తున్నట్లుగా అడిగాడు ప్రొప్రైటర్.
"కొంచెంసేపు ఆగండి. నా దగ్గర డబ్బు లేదు."
ప్రొప్రైటర్ వెకిలిగా నవ్వాడు.
"ఆ సంగతి అర్థమయిందిలెండి. మీకు కావాలంటే డబ్బు సంపాదించుకునే మార్గం నేను చూపించగలను. ఆ చెయ్యి ఒకటి కాస్త అసహ్యంగా ఉంది. పైటలో కప్పుకోవటానికి వీలుకాదా?"
రక్తం సల సల మరిగిపోయింది తులసికి.
"జాగ్రత్త! నోటికొచ్చినట్లు మాట్లాడారంటే పోలీసులకు రిపోర్టు చేస్తాను" అంది హుంకరిస్తూ.
ప్రొప్రైటర్ గభాలున తన ధోరణి వదిలేసి వ్యాపార ధోరణిలో "ఇవాళ ఏడు గంటలలోగా నా బిల్ ఇయ్యకపోతే నేనే పోలీసులకు రిపోర్టు ఇస్తాను" అని వెళ్ళిపోయాడు. హోటల్ ప్రొప్రైటర్స్ ఎప్పుడూ తనలాంటి ఆడవాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచుతారని తులసికి తెలియదు.
ఏడయింది. కృష్ణారావు రాలేదు. ప్రొప్రైటర్ మళ్ళీ వచ్చాడు. బెదిరిపోయి చూస్తున్న తులసిని చూసి హేళనగా నవ్వి__
"మేడమ్! బిల్ ఇప్పిస్తారా?" అన్నాడు కపట మర్యాదతో.
"మా వాళ్ళు ఇంకా రాలేదు." అంది తులసి తల వంచుకుని కృంగిపోతూ.
"అయితే పోలీసులకు కబురు చెయ్యమంటారా? వాళ్ళు అందరికీ 'మా వాళ్ళే'!"
హడలిపోయి చూసింది తులసి. ఆపుకోలేక పైకి పకపక నవ్వేశాడు ప్రొప్రైటర్. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు కృష్ణారావు. ప్రొప్రైటర్ నవ్వు ఆగిపోయింది.
"మర్యాదగా "నా బిల్ సెటిల్ చేస్తారా సార్?" అన్నాడు.
"ఓ యస్" అని, బిల్ తీసుకుని డబ్బు చెల్లించాడు కృష్ణారావు. "థాంక్స్" చెప్పి వెళ్ళిపోయాడు ప్రొప్రైటర్.
"హమ్మయ్య! సమయానికి వచ్చారు" అంది తులసి పట్టరాని ఆనందంతో. ఆ ఆనందాన్ని ఆశ్చర్యంగా చూస్తూ__
"ఎందుకు రాను?" అన్నాడు కృష్ణారావు.
తులసి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఊరుకుంది. కృష్ణారావు రాకపోతే, రావటం ఇంకా ఆలస్యమైతే? ఏం జరగబోయేదో, అతనికి చెప్పాలనిపించలేదు. అత్యంత జుగుప్సాకరమైన, పరమ భయంకరమయిన ఆ కొన్ని క్షణాలు మళ్ళీ తలుచుకోవాలన్నా కంపరంగానే ఉంది.
"సరే! ఇప్పుడేం చేద్దామంటారు? ఇలా హోటల్ రూంలో ఎన్నాళ్ళని ఉండగలరు? ఆస్పత్రికి దగ్గరలో ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకుంటే...."
అతని మాటలు పూర్తి కాకుండానే అడ్డుపడింది తులసి.
"కృష్ణారావుగారూ! మీకు కొన్నికోట్ల నమస్కారాలు చేస్తాను. నన్ను రాయవెల్లూరు తీసికెళ్ళండి. నా చెయ్యి తిరిగి స్వాధీనమయ్యేలా చెయ్యండి. నా కాళ్ళ మీద నేను బ్రతికే అవకాశం కలిగించండి. మీ ఋణం తప్పకుండా వడ్డీతో సహా తీర్చుకుంటాను."
"రాయవెల్లూరుకా? చాలా డబ్బు కావాలి!" నిరాశగా అన్నాడు కృష్ణారావు. ఆ కంఠంలో నిరాశ తులసి అప్పుడప్పుడే ఊపిరిపోసుకుంటోన్న ఆశను సమూలంగా నాశనం చేసింది.
డబ్బు! ఎంత ముఖ్యమైనది జీవితంలో ఇది! వెధవ డబ్బు_ అనటం తేలిక. తెల్లవారింది మొదలు డబ్బు లేకుండా ఏం గడుస్తుంది?_ 'నాకు డబ్బు అక్కర్లేదు' అనుకునే ప్రాణి నిజంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఎంత డబ్బు ఉన్నా, ఇంకా సంపాదించాలనే ఆశే! పాత కోరికలు తీరుతున్న కొద్దీ తీరవలసిన కొత్త కోరికలు కోకొల్లలుగా బయలుదేరుతుంటాయి.
"పోనీ, నాకు కొద్దిగా విషం తెచ్చిపెట్టండి!"
"విషమా? అలాగే! కానీ, అది బజార్లో దొరికుతుందా? డాక్టర్ సర్ట్ ఫికెట్ లేకుండా ఇస్తారా? అయినా విషం మీకెందుకు?"
ఆశ్చర్యంగా కృష్ణారావు ముఖంలోకి చూసింది. నిజంగా ఇతనికి అర్థంకాలేదా? కావాలని తనను పరిహాసం చేస్తున్నాడా? అతని ముఖంలో ఏ కోశానా చిలిపితనం లేదు, కొద్దిపాటి అలసట మాత్రమే ఉంది. ఆవులిస్తున్నాడు_ పోరంబోకు రౌడీ, ముండల ముఠాకోరు అని పేరు తెచ్చుకున్న కృష్ణారావు నిజంగా ఇంత అమాయకుడా?
"విషం ఎందుకని అడుగుతున్నారా? మింగి చావటానికి!"
"ఓ గాడ్! ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు?"
"బ్రతకటం చేతకాక....."
"చంద్ర దగ్గరకి వెళ్ళండి. బ్రతకటం ఎలాగో నేర్పిస్తుంది. ఎలాంటి చిరాకుల్లో ఉన్నా నవ్విస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా ఆదరిస్తుంది. ఎంతటి దుఃఖాన్నైనా మరిపిస్తుంది. 'ఛస్తే బాగుండును' అనుకుంటూ చంద్ర దగ్గరకు వెళ్ళినవాళ్ళు, ఈ లోకంలో బ్రతకటం కంటే గొప్ప అదృష్టం లేదనుకుంటూ బయటికొస్తారు....."
హుషారుగా చెప్పుకుపోతున్న కృష్ణారావు తులసి ముఖం చూసి ఆగిపోయాడు. ఏదో పొరపాటుగా మాట్లాడానని అర్థమయింది.