Previous Page Next Page 
రక్షరేకు పేజి 36

                                                                     17
    తనకు దయానంద్ గారిచ్చిన అయిదు వందలూ, అలా ఇలా ఖర్చు కాకముందే. ఆ డబ్బుతో రత్నమ్మకు పెళ్ళి చేయాలనుకొన్నాడు జైహింద్ బాబు.
    "అమ్మా! రత్తికి సంబంధం చూస్తున్నాను" అని తల్లితో చెప్పగానే -
    "ఇప్పుడు డబ్బేదిరా?" అంది అన్నమ్మ బాధగా.
    "ఎలాగో సర్దుతానులేవే! అసలే దానిమీద లేనిపోని నిందలొచ్చి పడుతున్నాయే! తొందరగా చేసేస్తేనే మంచిది......."
    "జయన్నా! ఎట్టాగో, అట్టా దానికి పెళ్ళి అయిందనిపించెయ్యి. నాకు యిక చీకూ చింతలే వుండవు....." అంది అన్నమ్మ బాధగా.
    అతి ప్రయత్నంమీద సంబంధం కుదిర్చారు జయన్న. అన్ని విషయాలూ మాట్లాడుకున్నాడు. అంతా నిశ్చయమయింది. పెళ్ళికి మూహుర్తం కూడా నిశ్చయించారు. పెళ్ళి ఏర్పాట్లు ఉన్నదానిలో ఉన్నంత క్లుప్తంగా బాగానే జరిపించాడు జయన్న.
    అందరి హృదయాలూ ఏదో కీడును శంకిస్తూ దడదడలాడుతున్నాయ్. తనవాళ్ళ మనస్సుల్లోంచి ఆ భావం పోగొట్టాలని జైహింద్ బాబు చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది.
    ముహూర్తం దగ్గిరపడుతుంది. పెళ్ళివారు రాలేదు! అందరూ పెళ్ళికూతురి వేషంలో ఉన్న రత్నమ్మను చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకొంటున్నారు.
    లేని ఓపికతో లేచి పెరుగుతుంది అన్నమ్మ. మహూర్తం సమీపిస్తున్నకొద్దీ అన్నమ్మకు శరీరమంతా చెమటలు పట్టసాగాయి. ముహూర్తం దగ్గిరవుతున్నకొద్దీ పెళ్ళివారు రాలేదని తెలుసుకొని నిలువుగా వణికిపోసాగింది.
    "అమ్మా! నువ్వు కూచో. ఈ పనులు మేం చూసుకుంటాంలే!" అని జైహింద్ బాబు నచ్చచెప్పినా అన్నమ్మ కూచోలేకపోతోంది. తల్లిని చూస్తోన్నకొద్దీ జైహింద్ బాబుకి భయం వెయ్యసాగింది. కానీ ఏ విధంగానూ తల్లిని స్థిమితపరచలేకపోయాడు.
    ముహూర్తం దాటిపోయింది. పెళ్ళివారు రాలేదు. అంతవరకూ గుసగుసలు చెప్పుకొంటూన్న బంధువర్గం పైకే అనుకోసాగారు.
    "ఒక్కోరి జాతకం అంతే!..... ఏదనుకొంటే అదే మట్టవుతాది."
    "అదేంకరమో, రత్తికి యెప్పుడు పెళ్ళనుకున్నా, ఎవురో ఒకరు సావవలసిందే."
    "ఈసారి ఎవురికి మూడిందో?"
    అన్నమ్మ చెవుల్లో ఇవన్నీ పడుతూనే ఉన్నాయి కానీ. ఏం చెయ్యగలదు? ఆ నోళ్ళు తను ముయ్యలేదు.
    పెళ్ళి పందిరి ఉంచాలా? పీకెయ్యాలా? అసలు పెళ్ళి జరుగుతుందా, జరగదా అని అందరూ తర్జన - భర్జనలు జరుపుకొంటుంటే ఎప్పటికో సాయంత్రానికి పెళ్ళివారి దగ్గిర నుంచి కబురు వచ్చింది.....వాళ్ళ బస్సులు బయలుదేరి వస్తోంటే, వాగు పొంగి రోడ్డుమీదకు రావటంవల్ల బస్ ఆగిపోవలసి వచ్చిందట. పెళ్లివారికి ఇది చాలా అపశకునంగా తోచిందట. తీరా పెళ్ళి అయిపోతే, ఇంకా ఏం మూడుతుందోనని భయపడుతున్నారట. అంచేత వెనక్కి వెళ్ళిపోయారట. ఈ పెళ్ళి చేసుకోరట.
    ఈ వార్త వినగానే విరుచుకు పడిపోయింది అన్నమ్మ జైహింద్ బాబు పై ప్రాణాలు పైనపోయాయి.
    ఒక్కొక్కసారి మూర్ఖత్వాలు కూడా మనుష్యులను కాపాడగలవు. ఇలాటిదేదో జరుగుతుందని అన్నమ్మ లోలోపల మొదటినుండీ భయపడుతూనే ఉండటంవల్ల ఈ దెబ్బకు తట్టుకోగలిగింది. నలుగురూ చేరి ఉపచారాలు చెయ్యగానే కోలుకుంది. అన్నమ్మని మంచంమీద పడుకోబెట్టి ఎక్కడివాళ్ళక్కడ వెళ్ళిపోయారు.
    రత్నమ్మకి పెళ్ళి కాలేదు. కాని జైహింద్ బాబుకి రెండు వందల రూపాయలు ఖర్చయ్యాయి. రత్నమ్మకి ఏడవటానికి కూడా శక్తి లేకపోయింది. తన పెళ్ళి బట్టలు విప్పేసి మామూలు చీరతో తనకు జావతీసుకొచ్చిన రత్నమ్మను చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కడుపులో ఏదో ఉక్రోషం చెలరేగింది. అది ఎలా బయటపెట్టుకోవాలో తెలియక రత్నమ్మమీదే విరుచుకుపడింది.
    "పోయే పో. అతతలకి పో. ముదనష్టపు జాతకం నీది - శని జాతకం నీది...... దరిద్రపు జాతకం నీది...... నువ్వెక్కడడుగేస్తే అక్కడ భగ్గుమని పోతాది. అసలు నీమూలంగానే మాకిన్నికష్టాలు. నువ్వు విరగయిపోతే, మా శనీ విరగలవుద్ది ఫో. ఫో."
    తల్లి ధోరణికి జైహింద్ బాబు భయపడి పోతూ అడ్డుపడి "అదేంటమ్మా. రత్తినాడిపోసుకుంటావు దేనికి? అదేం చేసింది?" అన్నాడు.
    "ఇంకేం సెయ్యాలి? దాని ముఖంలోనే ఉన్నాయి పంచ మహా పాతకాలు - యిది సస్తే కాని. ఈ కొంపకి పట్టిన శని వదల్దు....." మంచం కోడికి తల బాదుకుని ఏడవసాగింది అన్నమ్మ.
    జైహింద్ బాబు అడ్డుపడి అతి కష్టంమీద తల్లిని ఓదార్చగలిగాడు.
    రత్నమ్మ పాపం, మొదటినుంచీ, ఎంతో ఎంతో సహిస్తూ వచ్చింది! చెల్లెలు బల్లదుకాణం మీద కూచుని హాయిగా గడుపుతుంటే తను పొద్దుటినుంచీ, సాయంత్రం వరకూ పనికి కుదురుకుని, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి తన తిండి కూడా అక్కడే తిని జీతం తెచ్చి తల్లి చేతికిచ్చింది - తనకంటె చిన్నదయిన చెల్లెలు తనను ఈసడిస్తూ, తనకంటే ముందు ముందు మరొకర్ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయినా సహించింది..... అందరూ తనను శని జాతకురాలని మొహం మీదే అవమానిస్తున్నా సహించింది.
    కానీ, ఏ తల్లిని ఇన్నాళ్ళుగా తన పనికూడా మానుకుని సేవించిందో, ఏ తల్లి మాత్రమే తనకు ఈ లోకంలో అండ అనుకుందో, ఆ తల్లి కూడా ఈసడించుకుని చీకొట్తే భరించలేకపోయింది. అదీకాక, తనే శని జాతకురాలనీ. తన కారణంగానే ఆ కుటుంబం కష్టాలకు లోనవుతున్నదనీ..... తను పోతే కుటుంబానికి కష్టాలు పోతాయనీ, తల్లి నిదించటం రత్నమ్మ భయపెట్టింది. అది నిజమేనేమో అనిపించసాగింది - ఆ ఆలోచన భరించలేకపోయింది - అర్థరాత్రి వేళ లేచి అందరూ నిద్రపోతున్నారనుకుని ఇంట్లోంచి బయలుదేరింది.
    రత్నమ్మ ఏం చేస్తుందోనని జైహింద్ బాబుకి అనుమానంగానే ఉంది. పది నిముషాలకొకసారి లేచి ఆమె నిద్రపోతోందో లేదోనని గమనిస్తూనే వున్నాడు. రత్తి పక్కలో అటు ఇటు దొర్లటం, కొంగులో ముఖం దాచుకుని ఏడవటం అంతా గమనిస్తూనే వున్నాడు - ఓదార్చినందువల్ల దుఃఖం మరింత ఎక్కువవుతుందని, తనే స్తిమితపడుతుందని, అలాగే పడుకున్నాడు - అలిసిపోయిన జైహింద్ బాబుకి కొద్దిగా కునుకు పట్టింది.

 Previous Page Next Page