Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    అందరూ మార్కండేయుడివంక చూశారు. తనమీద పడ్డ బాధ్యతను గుర్తు చేసుకుని, అతను ధైర్యంచేసి గొంతు సవరించుకున్నాడు. "పవిత్రమైన ఆశ్రమాన్ని నెలకొల్పి, ప్రజలకు నీతిబోధ చేస్తూ, మీరు అవినీతికార్యానికి ఒడిగట్టారు. ఒక నీతిబాహ్యురాలైన స్త్రీతో అర్ధరాత్రి సమయాన తలుపులు వేసుకుని అంతరంగికంగా వుండగా పట్టుబడ్డారు. దీనికి సంజాయిషీ కావాలి" అన్నాడు బిగ్గరగా.
    స్వామిలో ఏమి తొట్రుపాటు లేదు. "మీరు చూసిన సంఘటన యదార్ధం. నా దగ్గర ఏమీ సంజాయిషీ లేదు" అన్నాడు ప్రశాంతస్వరంతో.
    అవును! ఏమి సమాధానం చెప్పి యితరులని నమ్మించగలడు?
    "వినండి" అన్నాడు మార్కండేయుడు. ఈసారి ప్రజలను ఉద్దేశిస్తూ, "ఇతడు చేసిన నేరం ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నంతమాత్రాన నేరం నేరంకాకుండా పోదు. ఇతను ప్రజలందర్నీ వంచించాడు. ఇతడ్ని నమ్మి స్త్రీలందరూ హారతిపట్టేవారు. గృహిణులు నిష్కల్మషహృదయంతో సేవలందజేసే వారు. కాని యితను కుత్సితుడు. మాతృసమానంగా పరిగణించవలసిన పరస్త్రీతో అవినీతిసంబంధం పెట్టుకున్నాడు. ధర్మాన్ని మంటగలిపాడు. మిమ్మల్నీ, నన్నూ, భగవంతుడ్నీ, అందర్నీ వంచించాడు. ఇతను నీతిబాహ్యుడు, ప్రజాద్రోహి, సంఘవిద్రోహుడు. ఈరోజు యీ స్త్రీ అయింది. రేపు మీ సహోదరికో, ధర్మపత్నికో అపచారం తలపెట్టవచ్చు. ఇలాంటి వయోముఖవిష కుంభాన్ని వదిలిపెడితే యితను సంఘానికి చేసే చెరుపుకు అంతువుండదు. ఇప్పుడు చెప్పండి. ఏంచేస్తారు యితన్ని? విడిచిపెడ్తారా? శిక్షిస్తారా? సత్కరిస్తారా?" 
    ప్రజల్లో పెద్ద కలకలం చెలరేగింది. గట్టిగా కేకలు పెడ్తున్నారు. తోసుకుని ముందుకు వస్తున్నారు. "ఇన్నాళ్ళూ మనం వెర్రివెధవలమై మోసపోయాం" "ఇతని పాపం పండింది" "అసలు ఎంతమంది జీవితాలు పాడుచేశాడో యిదివరకు?" నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే వున్నాను సోదరా" "ఇతన్ని ఏం చేసినా పాపంలేదు" అంటూ రకరకాలుగా అరుస్తున్నారు.
    యువకులు యింకా రెచ్చిపోయారు.
    "ఈ మోసగాడ్ని తన్నండి."
    "బాగా బుద్ధిచెప్పండి."
    "వెళ్ళగొట్టండి" అంటూ ముందుకు వస్తున్నారు.
    ఆ చీకటి, అక్కడక్కడా వెలుగుతోన్న దీపాలు, ఆ కాంతిలో, రాక్షసుల్లా కనిపించే మనుషులముఖాలు, అప్పుడప్పుడూ పెనుగాలి, ఊగేవృక్షాలు, విరగబడబోయే కిరాతకత్వం.
    జగతి ముందుకు వెళ్ళింది. "ఆగండి" అని అరిచింది.
    "ఎందుకా అమ్మాయి అరుస్తోంది? తన ప్రియుడి జాతకం బయట పడిందనా?"
    "మీరంతా అంధులు, మూర్ఖులు, విశ్వాసహీనులు, అవివేకులు. మీకు అర్ధం కానంతమాత్రాన యింత దారుణచర్యకు తలపడతారా? స్వామి మీకు చేసిన అపకారం ఏమిటి? మీలాంటి ఉన్మత్తులకోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంటున్న మహనీయుడ్నా మీరు అవమానిస్తున్నది? మీకు ఇష్టం లేకపోతే తనదార్ని తనను వెళ్ళనివ్వండి. అంతేగాని ఆయన్ని బాధించే హక్కు మీకెవరిచ్చారు" ఆవేశంలో ఆమెముఖం రక్తకాంతితో నిండి ప్రకాశించింది. కంఠ నాళాలు ఉబ్బాయి. ఓ శక్తిలా భాసించింది.
    "అసలు దీనికంతటికీ కారణం యీ టక్కులాడే. పైగా బెబ్బులిలా అరుస్తోంది. దీన్నికూడా విడిచిపెట్టకూడదు."
    "రండి, అందరూ రండి."
    ఓ పెద్ద భీభత్సం చెలరేగింది. మహాగందరగోళం వికటశక్తి ప్రకాశించి నట్లయింది. ఆ యిద్దరిమీదా రాళ్లు రువ్వుతున్నారు. దుమ్ము, తుక్కు, కుళ్ళిన పళ్ళు మీదికి విసురుతున్నారు. ఎవరో గుంపులోకి లాగి క్రింద పడవేశారు. ఎవరి యిష్టమొచ్చినట్లు వారు యధేచ్చగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ల బట్టలు చినిగాయి. వాళ్ల శరీరాలు రక్తసిక్తమైనాయి. గాయాలతో నిండిపోయాయి. ఎక్కడైతే స్వామి కీర్తించబడ్డాడో అక్కడే పరాభవించబడ్డాడు. మానవత్వం పశుత్వంలా మారింది. అసలు మానవత్వంలో వున్న యదార్ధం యిదే.
    "ఇహ వదలండి. చచ్చిపోతారు."
    చచ్చిపోతారనగానే అందరికీ భయమేసింది. వదిలిపెట్టి దూరంగా జరిగారు.    
    స్వామి నెమ్మదిగా లేచాడు. ఒక్కమాట మాట్లాడలేదు. ఒక్కరివంకా చూడలేదు. చెదిరినజుట్టుతో, గాయాలు రేగిన శరీరంతో, రక్తసిక్తమైన దుస్తులతో మనిషి భయంకరంగా వున్నాడు. మెల్లిగా కదలి వెళ్ళిపోతున్నాడు.
    జగతి లేచి చూసింది. దూరంగా వెళ్ళిపోతూన్న స్వామి ఆకృతి కనిపించింది. "స్వామీ! స్వామీ!" అని గుంపును తొలగించుకుంటూ పరిగెత్తింది. స్వామి ఆగటంలేదు. "స్వామీ" అని హీనస్వరంతో అరుస్తూ లేచి శక్తి తెచ్చుకుంటూ, ఆ చీకటిలో పరిగెడుతున్నది. స్వామి అంతకంతకూ దూరమైపోతున్నారు. ఇంకోసారి గట్టిగా ఎలుగెత్తి అరుస్తూ ముందుకి దూకింది. ఓ పెద్ద చెట్టుకొమ్మ ఆమె నుదుటికి బలంగా కొట్టుకుని "అమ్మా!" అని అరిచి స్పృహతప్పి పడిపోయింది. తర్వాత జగతి పిచ్చిదయింది. పాటలు పాడుకుంటూ, కేకలు పెట్టుకుంటూ ఊరూరా తిరగసాగింది. ఆమె వంటిమీద బట్టలు చిరిగి శిథిలమవుతున్నాయి. నిద్రాహారాలు లేవు. పోలీసులు చూసి ఆమెను పట్టుకెళ్ళి రోగనిర్ణయం జరిగాక విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు.
                                                  17
    సన్నిపాత జ్వరంలాంటి వంటరితనం భరించలేక మృత్యుంజయరావుకు పెళ్ళి చేసుకుందామని బుద్ధిపుట్టింది. కాని వెంటనే తనకు పిల్లనెవరిస్తారు అన్న శంక పొటమరించింది. తనకు పాతికేళ్ళు దాటుతున్నాయి. ఉద్యోగం చేసుకుంటున్నాడు. సంపాదించుకుని తింటున్నాడు. కాని తనకింతవరకూ పిల్లనిస్తామని ఎవరూ ఎదురుకాలేదు. తన వయసు ఉద్యోగహోదావున్న ఏ యువకుడిచుట్టూనైనా ఆడపిల్లల తండ్రులు ముసురుతారు. తను చేసుకున్న పాపానికి అంతులేదు. కాబట్టి దీనికికూడా నోచుకోలేదు.
    కృష్ణశర్మగారని అతనికి చూచాయగా పరిచయమున్న ఓ కుటుంబీకుడు వున్నాడు. ఆయనకు పెళ్ళిళ్ళు చేయించటం ఓ సరదా. డబ్బుకీ, దస్కానికీ లోటులేదు. తన చేతులమీదుగా కళ్యాణాలు జరిపించటం ఓ పుణ్యకార్యంగా తలపోస్తాడాయన.  
    మృత్యుంజయరావు వెళ్ళేసరికి పడకకుర్చీలో కూర్చుని దినపత్రిక తిరగ వేస్తున్నాడాయన.
    నడవలోకి ఎవరో నూతనాగంతకుడు రావటం చూసి ఆయన పత్రికలోంచి తల ఎత్తి, కళ్ళజోడు సవరించుకుంటూ "ఎవరబ్బాయి?" అని అడిగాడు.
    "నేను... నన్ను మృత్యుంజయరావంటారండీ."
    "అలాగా, ముందు కూర్చో."
    అతను కూర్చుని "నేను భానుమూర్తిగారబ్బాయినండీ" అన్నాడు.
    "ఏ భానుమూర్తిగారూ? ఓహో ఆదర్శ వివాహం చేసుకుని ఆదర్శంగా జీవించిన భానుమూర్తికదూ. లోగడ ఓ సందర్భంలో కలుసుకున్నట్లున్నాం కదూ. ఎప్పుడు చెప్మా."
    "అదే, ఒకసారి మీరు పనివుండి మా ఆఫీసుకి వచ్చారు."
    "ఆఁ అవునవును' గుర్తువచ్చింది. చాలా కాలమైంది కలుసుకుని ఏమిటోయ్ బొత్తిగా కనబడటం మానేశావు? మంచినీళ్ళేమైనా కావాలా?"
    "వద్దండి."
    ఆయనకు అరవైఏళ్లు దాటాయి. అయినా మనిషి దృఢంగా, ఆరోగ్యంగా వుంటాడు. ఎప్పుడూ హడావుడిగా మాట్లాడుతూనో, ఇంట్లో పిల్లల్ని పిలిచి పనులు పురమాయిస్తూనో వుంటాడు. లేకపోతే తెగ ఉత్తరాలు రాస్తాడు గొలుసుకట్టు వ్రాతతో. ఆయన ఉత్తరాలన్నీ పెళ్ళిసంబంధాలను గురించిన వివరాలతోనే నిండివుంటాయి.
    మృత్యుంజయరావుకి తాను వచ్చినపని ఎలా చెప్పాలో తెలియలేదు. ఎలా ప్రారంభిద్దామా అని సంకోచిస్తున్నాడు.
    "అవునూ, నీవింకా వివాహం చేసుకోలేదుకదూ."
    "లేదండీ?"
    "అరెరే. ఇన్నాళ్ళూ నీగురించి మరిచిపోయానే. ఎంతపని జరిగింది" అని ఒక నిముషం ఊరుకుని "కట్నమాశ ఎంతవరకూ వుంది?" అని అడిగాడు.
    "కట్నం తీసుకుందామనే అభిప్రాయం లేదండీ"
    "చాలా బాగుంది నాయనా, రత్నంలాంటిమాట అన్నావు. మీ తండ్రి అలాంటి మహానుభావుడు. ఆ శాఖ ఎక్కడకు పోతుందీ?"
    ఇంతలో "నమస్కారమండీ" అంటూ లోపలకు ఓ పెద్దమనిషి వచ్చాడు.
    "ఓహో! జగన్నాథరావుగారా? రండి రండి."
    జగన్నాథరావు వచ్చి కూర్చుని "మీవంట్లో ఎలావుంది? ఈమధ్య ఆరోగ్యం బాగాలేదని విన్నాను" అన్నాడు.
    "ఆఁ, అదే! కడుపులో కొంచెం తెమడ చేరింది. పైత్యం పేరుకుని గుండెల్లోకి ఎగదన్నింది. ఇప్పుడు కాస్త నెమ్మదిగా వుందిలెండి. అన్నట్లు మీ అమ్మాయికి సంబంధం కుదిరిందా?"
    "అబ్బే! యింకా లేదండీ. ఆ రాజమండ్రి కుర్రాడు కట్నం పదివేలు కావాలన్నాడు. అందుకని సంక్షేపించుకున్నాం."
    "అరెరే! ఎంతపని జరిగింది? అన్నట్లు ఈ కుర్రాడు తెలుసునా? మృత్యుంజయరావని లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. రెండు వందలయాభైదాకా తెచ్చుకుంటున్నాడు. భానుమూర్తిగారని యీయన తండ్రి గొప్ప సంఘసంస్కర్త. ముత్యంలాంటి మనిషి. పాపం, యితని బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. అన్నట్లు భానుమూర్తిగారంటే ఎవరనుకున్నారు? ఈశ్వరదత్తుగారని మీరు వినేవుంటారు. ఆ రోజుల్లో మూడుసార్లు యాగం జరిపించిన మహానుభావుడు. ఆయన కుమారుడు. అన్నట్లు ఈశ్వరదత్తుగారి మేనమామగారైన రామచంద్రంగారూ, మీ తండ్రిగారూ స్నేహితులుకూడానూ" అని చెప్పారు కృష్ణశర్మగారు.
    ఆయన మృత్యుంజయరావువంక ఎగాదిగా చూస్తున్నాడు.
    "ఈయన జగన్నాథరావుగారోయ్. పేరుపొందిన వకీలు. ఈయన తండ్రి కోటిలింగంగారు. ఆంధ్రదేశంలో ఖ్యాతి గడించిన ప్లీడరు. ఆరోజుల్లో బొంబాయినుండికూడా పార్టీలు ఆయన దగ్గరకు వస్తూండేవారు. అన్నట్లు మీ ఆఫీసులో పనిచేస్తున్న సోమయాజులులేడూ... ఆయనకీ... మీకూ చుట్టరికం వుండాలి కదండీ జగన్నాథరావుగారూ."
    "కజిన్ అవుతాడు."
    "ఆఁ, అది. ఇంతకీ చెప్పవచ్చేది ఏమిటంటే యీ అబ్బాయి యింకా పెళ్ళి చేసుకోలేదు. మాణిక్యంలాంటి కుర్రాడు. ఫస్టుక్లాసయిన సంబంధం. కట్నందగ్గర పట్టింపులేదు. మీ అమ్మాయికైతే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra