"కానీ నాన్నగారికి మీరంటే గొప్ప అభిప్రాయం వుంది. ఇప్పుడిలా అడిగితే ఏమనుకుంటారో?"
"అందుకే నిన్నే అడగమంటున్నాను. నేను అడిగితే కట్నం అవుతుంది. నువ్వు అడిగితే సహాయం అనుకుంటారు. ఎలా అడుగుతావో, ఏం చేస్తావో అది నీ యిష్టం. దాంతో మన కష్టాలు తీరిపోతాయి. తర్వాత జీతం తెచ్చి నీ చేతుల్లో పెడతాను. పొదుపుగా ఎలా వాడుకుంటావో అది కూడా నీ యిష్టం. నెలకి నా ఖర్చులకు నువ్వే యిద్దువుగానీ,"
పావని కోరుకునేది సరిగ్గా యిలాంటి ప్రవర్తనే. ఇంకో పది రూపాయలు ఇమ్మని అతడు బ్రతిమాలటం.....తను కాస్త ఏడిపించి మరీ ఇవ్వడం.....ఎంత చక్కటి అనుభవం అది.
"ప్రయత్నిస్తాను" అంది.
భాస్కరరామ్మూర్తి ఆ రోజే వెళ్ళిపోయాడు.
* * *
మాట యిచ్చిందేగానీ పావనికి తండ్రి దగ్గర ఆ ప్రస్తావన తేవడం అంత సులభం కాలేదు. ఆమె దిగులుగా కనిపించడం చూసి విశ్వపతె అడిగాడు- "ఏమ్మా అల్లుడు ఒంటరిగా వున్నాడని దిగులుగా వుందా?"
"లేదు నాన్నా! అలాంటిదేం లేదు" ధైర్యం తెచ్చుకుంది. "నాన్నా! నేనోవిషయం అడగనా?" అతడి దగ్గరకువెళ్ళి కూర్చుంది.
"అడుగమ్మా! సందేహం దేనికి? సమస్యలు వుంటే నా దగ్గరకాక ఎవరి దగ్గర చెప్పుకుంటావు?"
"పెళ్ళికి ముందు మీ అల్లుడు పాతికవేలు అడిగితే ఏం చేసేవారు?"
విశ్వపతి భ్రుకుటి ముడిపడింది. "ఏంటమ్మా! కట్నం గురించి ఏమైనా అనుకుంటున్నారా?"
"లేదు నాన్నా! ఆయన ఏమీ అడగలేదు. కానీ ఆయనకు అప్పులున్నాయి. వాళ్ళ అక్క దగ్గరే పెళ్ళప్పుడు పదివేలు అప్పు తీసుకున్నారు. మొన్న వాళ్ళు వచ్చి ననామాటలు అని వెళ్లారు. నాకే బాధగా అనిపించింది."
"అదేమిటి? నేను తరచి తరచి అడిగినా ఏమీ చెప్పలేదు. ఇచ్చిన డబ్బు కూడా తిరిగి యిచ్చేశాడు."
"అవును. అప్పట్లో ప్రమోషన్ వస్తుందని, ఏదో ఎరియర్స్ వస్తాయని అనుకున్నారట. అవేమీ ఇప్పట్లో రావని తెలిసిపోయింది. దాంతో చాలా దిగులుపడిపోతున్నారు."
చాలామంది ఆడపిల్లల్లాగే పావని కూడా తప్పు చేసింది. భర్త గురించి చెడుగా చెపితే పుట్టింట్లో అతనిపట్ల గౌరవం తగ్గిపోతుందని బాధ అది. అందులోనూ విశ్వపతికి భాస్కరరామ్మూర్తి పట్ల అపరిమితమైన గౌరవం.
"అలా దిగులుపడవద్దని ఉత్తరం వ్రాయి. నాలుగురోజుల్లో డబ్బు తెస్తాను. పంపిద్దాం" అన్నాడు విశ్వపతి.
పని సులభంగా జరగడంతో పావని మనసు కుదుట పడింది. ఆ మర్నాడే విశ్వపతి పొలం తాకట్టు పెట్టి పాతికవేలు తెచ్చాడు. అల్లుడికి మొహమాట పడొద్దని ఉత్తరం వ్రాసి డ్రాప్టు పంపాడు. అది అందినట్లుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ విశ్వపతికి ఉత్తరం వ్రాశాడు మూర్తి.
* * *
నా ప్రియమైన మూర్తీ.
మీరు వెళ్ళి పదిరోజులు దాటిపోయింది. నాకయితే కొన్ని యుగాలయి పోయినట్లుగా వుంది. డబ్బు అందినట్లుగా నాన్నగార్కి ఉత్తరం వ్రాస్తే చాలా. మీ ప్రియసఖిని ఇక్కడున్నానని గుర్తులేదా? మీ ఉత్తరం వస్తే నన్ను ఏడిపించాలని తెగ వుబలాటపడి పోతున్నారు మా తమ్ముడూ, చెల్లెలూనూ. కానీ మీరు ఆ అవకాశం యివ్వలేదు. నాకయితే ప్రతిక్షణం ఎదురుచూపే మీ ఉత్తరం వస్తుందన్న దానికంటే ముందు మీరే వస్తారని, మా తోటలో పూలు కూడా మీరు వస్తున్నారని గుమ్మంవైపే తలలు తిప్పి చూస్తున్నాయి. కొద్ది గంటలసేపు జీవించే పారిజాతాలు నేల రాలి కూడా కనులు విప్పార్చుకొని చివరి క్షణందాకా మీ రాక కోసం వేచి చూస్తున్నాయి. వాటిని చూస్తుంటే నాకు కంటనీరు తిరుగుతోంది. వాకిట గుమ్మానికి వేలాడే సన్నజాజి పూలవి మరో కథ. ఇన్నాళ్ళూ నా జడ నలంకరించాలని తెగ ఉబలాటపడేవి. ఇప్పుడు మీ పాదాలకింద నలగాలని, తెల్లారేటప్పటికి పూల వర్షం వాకిటనిండా కురిపిస్తోంది. అయినా మీకు జాలిలేదు. ఇక విరబూసే మల్లెలది మరో రకం భావం. అవి నా తల్లోకి రావటం, మీ పాదాలకు తివాచీలు వెయ్యటంలాంటివి, మన పక్కమీద మనిద్దరి శరీరాల కిందా నలగటానికి ముచ్చటపడుతున్నాయి. అయితే బాధంతా వాటిదేనా? నీకేం అనిపించడం లేదా అనుకుంటున్నారు కదూ ఎలా చెప్పను మీకు? నా శరీరంలో ప్రతి అణువూ మీ స్పర్శకోసం తపించిపోతోందని, చల్లటి వెన్నెల నన్ను కాల్చి పారేస్తుందని! మనం కలుసుకుంటే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. మరి ఇన్ని క్షణాలను వృధా చేయడం మీకు భావ్యం కాదు. త్వరగా వచ్చేయండి.
మీ,
పావని.
భర్తకి వ్రాసిన మొదటి లేఖ అది. పోస్టుచెయ్యటం మొదలు, జవాబు కోసం ఎదురుచూస్తోంది. ఆ ఉత్తరం చూడగానే వెంటనే బయలుదేరతాడని ఊహించిన విషయం నిజం కాలేదు. మూర్తి విశ్వపాతికే ఉత్తరం వ్రాశాడు మళ్ళీ పావనిని శనివారం రైలు ఎక్కిస్తే ఆదివారం స్టేషనుకి వస్తానని.
"నాకు వ్రాస్తే ఇప్పుడే బయలుదేరతానని భయం కాబోలు" నవ్వుకొంది పావని. వెంట బోలెడు సామానుతో ఆ శనివారం రైలెక్కింది.
రైలు సికింద్రాబాదు స్టేషనులో అడుగు పెట్టగానే పావని కళ్ళు ఫ్లాట్ ఫారం మీద పరుగెత్తటం మొదలు పెట్టాయి. తను కనుపించగానే అతడిలో కదిలే ఆలోచనలు తలుచుకుని సిగ్గుపడింది. ఇక యిన్నాళ్ళ విరహం తర్వాత ఇంటికెళ్ళగానే అతడి ప్రవర్తన ఎలాగుంటుందో? అందులో అలాంటి ఉత్తరం చదివాక.
రైలు ఆగింది. మూర్తి ఎక్కడా కనిపించలేదు. కూలీతో సామాను దింపించి నిలబడింది. అయిదు నిమిషాలయినా జాడలేదు. ఆమె ఇల్లు చేరేసరికి భాస్కరరామ్మూర్తి ఒక్కడే వున్నాడింట్లో.
"నువ్వు వచ్చేసరికి ఇల్లంతా సర్దిపెట్టాలని కష్టపడుతున్నా" అన్నాడు ఆమె మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా.
పావనికి భయం వేసింది. భాస్కరరామ్మూర్తి బోళా మనిషి. మనసులో ఏమున్నా పైకి చెప్పేస్తాడు. అరుస్తాడు. కొడతాడు. కాని అతడిలో కన్నింగ్ నెస్ లేదు. ఇల్లు సర్దటం అనేది అతడు చేసే పనికాదు. చెయ్యడు. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. అయినా ఇలా అబద్దం చెపుతున్నాడంటే ఎవరి ప్రభావమో అతడి మీద పడుతోందన్నమాట. అది చాలా ప్రమాదకరమైనది.
చాలామంది భార్యలలాగే పావని తప్పుచేసింది. ఇద్దరు అపరిచితులు పెళ్ళితో ఒకటవుతారు. మొదటి రోజునుంచి ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొద్దిరోజుల వరకు వాళ్ళకు ఎదుటివాళ్ళలో మంచి గుణాలే కనిపిస్తాయి. తమాషా ఏమిటంటే అవతలివాళ్ళ బలహీనతల్ని కూడా అప్పుడంతగా పట్టించుకోకుండా సులభంగా తీసేసుకుంటారు. వాళ్ళ నిజస్వరూపాలు తెలుసుకునేటప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఇద్దరిలో డామినేటింగ్ నేచర్ వున్నవాళ్ళు అప్పటికే రెండోవాళ్ళ మీద అధికారం చెలాయించడం మొదలు పెట్టేస్తారు.
చాలా రోజుల తర్వాత భార్య ఇంటికి వచ్చిందన్న విషయం అతడికి గుర్తున్నట్లేలేదు. తండ్రికి చెప్పి పాతికవేలు వెంటనే పంపించిందని కృతజ్ఞతాభావమూ చూపించలేదు. ఆమె తెచ్చిన వాటిలో తనకేం ఇష్టమో, వాసంతికేమి ఇష్టమో తీసి విడిగా పెట్టుకున్నాడు.
"ఏమండీ అప్పులన్నీ తీరిపోయాయా?" క్యాజువల్ గా అడిగింది పావని.
"ఏం లెక్క చూపించాలా?" కర్కశంగా జవాబిచ్చాడు.
"అదికాదండీ. ఇంత ఫర్నిచర్ అదీ కొన్నారు. మళ్ళీ యిబ్బంది పడతామని" నసిగింది.
"ఉన్నదాంట్లోనే కొన్నాను. మనింటి కోసమేగా? పరాయి వాళ్ళకు పెట్టలేదులే" అతడి అరుపులు చుట్టుప్రక్కల వాళ్ళకు వినిపించేంత గట్టిగానే వుంటాయి.
పావని మరి మాట్లాడలేకపోయింది. అతడు ప్రసన్నంగా వున్న సమయం చూసి గోముగా అడిగింది.
"ఏమండీ, నా ఉత్తరానికి జవాబివ్వలేదేం?"
"మీ వాళ్ళంతా ఏడిపిస్తారని రాశావుగా."
"ఆ ఏడిపించటంలో ఎంత ఆనందం వుంటుందో మీకేం తెలుసు?"
"ఆ ఉంటుంది. అయినా ఏమిటా ఉత్తరం సెక్స్ కోసం పడి చచ్చిపోతున్నట్లు! అదిచూసి వాసంతి వాళ్ళంతా ఒకటే నవ్వడం. నీకు సిగ్గనేది లేదు."
పావని అదిరిపడింది. "నేను రాసిన ఉత్తరం వాళ్ళంతా చూడడమా! ఛ.....ఎంత మేనర్స్ లేనివాళ్ళు...." కోపంగా అంది.
"ఏం? నేనే చూపించాను. భోగం వేషాలు నువ్వూనూ...." అన్నాడు చిరాగ్గా.