Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 35

                                 

    మనం జాగ్రత్తగా గమనిస్తే 5-12 ఏళ్లమధ్య వయసు వున్న పిల్లలు ఈ విధంగా చాక్ పీస్ తో గోడలమీద గచ్చులమీద గీస్తూంటారు. చిత్రం ఏమిటంటే వయసు పెరిగినా కూడా మనం ఈ అలవాటుని మార్చుకోలేం.  25 ఏళ్లు వచ్చిన తరువాత  కూడా కొందరు ఒంటరిగా వున్నప్పుడు ఈ విధంగా పిచ్చిబొమ్మలు గీస్తూ ఏదో ఆలోచిస్తూ వుంటారు. అది వారి మనస్తత్వాన్ని ప్రస్పుటింపజేస్తుంది.

     ఇలా బొమ్మలు గీయటాన్ని "డూడ్లింగ్" అంటారు.

     ఈ డూడ్లింగ్ ని పరిశీలించటం ద్వారా, దాన్ని చిత్రించిన వ్యక్తి మనస్తత్వాన్ని పసిగట్టేవీలుంది. ఒక మనిషి చిత్రించిన బొమ్మబట్టి  అతడి ఊహలు, ఆశలు, ఆశయాలు, బాధలు, భయాలు, వ్యక్తిత్వం, సెక్స్ పట్ల ఆసక్తి,  సృజనాత్మకత - వీటన్నిటి గురించి తెలుసుకోవచ్చు.

    ఈ డూడ్లింగ్ ని బట్టి మనస్తత్వాన్ని తెలుసుకోబోయే ముందు మీరు మీ పాత నోట్ బుక్స్ తీసుకోవాలి. సాదారణంగా నోట్ బుక్స్ చివరిపేజీల్లో ఇలాంటి బొమ్మలు ఎక్కువ కనిపిస్తాయి.  కేవలం  మనస్తత్వాన్ని పరిశీలించుకోటానికి బొమ్మలు గీయటం కాకుండా మనం ఎప్పుడో గీసిన బొమ్మలని పరిశీలించాలి.

    ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలని ఇక్కడ గమనిద్దాం.

    1. ముఖాలు:

             

    నవ్వుతూ - లేక-  ఏడుస్తూ వుంటే ముఖాలు గీసేవారు అందరితేనూ కలిసిపోయే వారై వుంటారు.  అయితే, అందులో విచారంగా వుండే బొమ్మలు గీసేవాలు ఏదో తెలియని అసంతృప్తిలోనూ  కోపంలోనూ వ్యవహరిస్తారు. ఒక చిన్న తలవేసి ఒక అస్తిపంజరం లాంటి బొమ్మగీసేవారు సాధారణంగా సమాజం మీద ఒక కసితో వ్యవహరిస్తూ వుంటారు. ఆడపిల్లల బొమ్మలు, ఆడపిల్లల ముఖాలు గీసేవాళ్లు అమ్మాయిలైతే, అది వారికి తన కుటుంబ సభ్యుల మీదున్న ఆప్యాయాతను తెలియజేస్తుంది. అదే మగవాళ్ళైతే వారి యొక్క "ఈడిపన్ కాంప్లెక్స్" ని  సూచిస్తుంది.

     కాగితాల మీద  కాకుండా గోడలమీద తలుపులమీద  ఇలా ఆడపిల్లల బొమ్మలు గీసేవారు సెక్స్ కోరికలు తీరని అభద్రతా భావంతో వుంటారు.

     ఒక్క మొహం బొమ్మ మాత్రమే వేసి అందులో కళ్లూ ముక్కూ నోరూ గీసేవారు ఎక్కువ ఒంటరితనంతో గడపటానికి ఇష్టపడతారు. ఎవరికీ పరిపూర్ణమైన స్నేహితులు కావటానికి ఇష్టపడరు.  మనసులో మాత్రం స్నేహం పట్ల చాలా ఇష్టం వుంటుంది. ఇంకొకరు  తమని అర్దం చేసుకోలేరేమో అనే భావంతో ఇతరులకి దగ్గరవరు.   తాము అవతల వారిని ప్రేమించటం మొదలు పెడితే, తాము ప్రేమించినంత అవతల వాళ్లు తమని ప్రేమించ లేరేమోననే భయం వీరిలో చోటు చేసుకుని వుంటుంది. నిజంగా వీళ్లు ప్రేమించటం మొదలు పెడితే ఎవ్వరూ ఆపలేరు.

     2. ముగ్గులు, పజిల్స్, అల్లికలు:

                

     సాధారణంగా ఇలాంటి ముగ్గులు స్త్రీల నోట్ బుక్స్ లో గమనిస్తూ వుంటాం. ఒక వేళ పురుషులెవరైనా ఇలాంటి ముగ్గులు గీస్తే వారిలో వున్న ఫిమినేనిటీని ఇది తెలియజేస్తుంది.

     ఖాళీ సమయాల్లో కాగితాలమీద పజిల్స్ గానీ, నక్షత్రాలు గానీ గీసేవారు కళలపట్ల ఎక్కువ ఆసక్తి కలిగి వుంటారు. పజిల్స్ వేసేవారు ఆర్దిక పరమైన ఇబ్బందుల్లో వుండి, సతమతమయ్యేవాళ్లయి వుంటారు. ఖాళీగా వున్న సమయాల్లో నక్షత్రాలు గీసేవాళ్లు భావుకులు, లలితకళల పట్ల ఉత్సాహం వున్నవాళ్లు, చదువుపట్ల ఆసక్తి కలవారు అయివుంటారు.

     ముగ్గులు గీసేవారు ఒంటరి తనంలో బాధపడేవారై వుంటారు. వీరియొక్క సౌశీల్యాన్ని , మంచితనాన్ని, ప్రేమించే గుణాన్ని అవతలివారు అర్దంచేసుకోలేరు. అందువల్ల   వీరు మానసికమైన ఒంటరితనంతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు.

     3. గీతలు, వృత్తాలు, ఆకులు, మొక్కలు:

                

     గీతలు, వృత్తాలు గీసేవారు ఎక్కువగా అంతర్ముఖులై వుంటారు. అయితే ఎదుటివారి  మీద ప్రేమ, దయకూడా కలిగి వుంటారు. ప్రేమలో పడ్డవారిని ఈ రకమైన  డూడ్లింగ్ ల్తో చాలా సులభంగా  గుర్తుపట్టవచ్చు.

     వృత్తాలు గీయటం ప్రేమకు సూచన. ప్రేమ వివాహం చేసుకొని కొత్తగా కాపురం పెట్టిన వారి ఇళ్లల్లో పుస్తకాలని మనం గమనిస్తే , ఇలాంటి వృత్తాలను చూడవచ్చు.

     ఆకులు, రెమ్మలూ గీసేవాళ్లు తమ తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ఎక్కువ ఆప్యాయత చూపేవాళ్లు, సంసారబంధం పట్ల  ఎక్కువ కట్టుబడేవాళ్లు అయివుంటారు.

 Previous Page Next Page