Previous Page Next Page 
రక్షరేకు పేజి 35


    ఆ మాటవిన్న జైహింద్ బాబు, నాగమ్మని తలచుకొని కొద్దిగా జాలిపడ్డాడు. భగవంతుడే నాగమ్మకీవిధంగా బుద్ధి చెపుతున్నాడా అనిపించింది.
    నాగమ్మ దగ్గిరకొచ్చి వ్యాసమూర్తి చెప్పింది చెప్పాడు. నాగమ్మ ఉసూరుమనిపోయి "ఇప్పుడాణ్ని బతిమిలాడుకోవాలా!" అంది.
    చంద్రి ఊరుకోకుండా "వద్దమ్మా! వాడు చేతబడి చెయ్యబట్టే అయ్య ఇలా అయిపోయాడు. వాణ్ని మన గుడిసెలోకి రానియ్యనే వద్దు" అంది.
    నాగమ్మకి తను కల్పించుకొన్న అబద్ధం తనకే నిజమైపోయింది. మంత్రాలలో, తంత్రాలలో నమ్మకం వున్న నాగమ్మకి వెంకడు చేతబడి చేశాడేమోననే అనుమానం నిజంగానే ఉంది. అందుకే ఇంత జరిగినా వెంటనే వెంకడి దగ్గిరకు వెళ్ళలేకపోయింది.
    అన్నీవింటోన్న రాజయ్య ఊరుకోలేక "వెంకడు యెర్రి బాగులోడే! సేతబళ్ళు ఆడికేం తెలుస్తయ్యే! ఆడి తాత దగ్గిర మూలికల వయిద్దె నేర్చుకొన్నాడు అంతేనే! ఆడు నాకెందుకు చేతబడి సేస్తాడే! పిలవ్వే! ఆ తోట చూసుకొంటాడు, నీకూ, చెంద్రికీ దిక్కవుతాడు" అన్నాడు.
    ఎప్పటిలా నాగమ్మ విరుచుకుపడలేదు. ఆలోచిస్తూ కూచుంది.
    తల్లి వాలకం చూసి చంద్రి "వద్దమ్మా! అన్నని పిలవకు. నీకేం బెంగ? నేనెక్కడన్నా పాచిపని చేసి నిన్ను పోషిస్తాలే" అంది.
    ఆ మాటలతో నాగమ్మ హడలిపోయింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చెయ్యకుండా వెంకడి దగ్గిరకు బయలుదేరింది. తనను వెతుక్కొంటూ వచ్చిన పినతల్లిని చూసి ఆశ్చర్యంతో మతిపోయింది వెంకడికి.
    "యేంటి పిన్నమ్మా?" అన్నాడు అభిమానంగా.
    నాగమ్మ వెంకడి రెండుచేతులూ పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
    వెంకడు హడలిపోయి "యేంటి పిన్నమ్మా! అయ్యకెట్టా వుంది? సెల్లి బాగుందా?" అన్నాడు.
    నాగమ్మ కళ్ళు తుడుచుకొని  "ఆదికాదుర మనతోట యజమాని తోటమనకివ్వనంటున్నాడు. నువ్వు రావాలట! ఇన్నాల్లమట్టీ నువ్వు సేసినావుగందా? నువ్వొచ్చి జగడమాడితే ఆల్లునీకొదిలేస్తారంట - జయన్న నీకుతోడుగా వుంటాడు. వకీలుబాబు కూడా వత్తాసొస్తాడు" అంది.
    వెంకడు తేలిగ్గా ఊపిరి పీల్చుకొని "ఓస్! ఇంతేనా! వస్తాలే పిన్నమ్మా! మనతోట పోతా వుంటే ఎట్టా వూరుకుంటా! ఈ సేతుల్తో పెంచాను ఆ మొక్కల్ని. అయ్యన్నీ వదిలివత్తా వుంటే కల్ల నీల్లొచ్చినాయనుకో" అన్నాడు.
    వెంకడి మంచితనం అప్పటికి నాగమ్మకి బాగా అర్థమయింది. తమ తోటి స్వాధీనం చేసుకోవాలనే దురాశతో వెంకడు వస్తానంటున్నాడని ఆమె అనుకోలేకపోయింది. వెంకడి దగ్గిరకు రావడానికి ముందే అతడి సంగతి సందర్భాలన్నీ విచారించింది. సరళ పొలాల్లో పనిచేస్తూ అతడు తోటలో సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. సరళ ఇంటిలో అందరూ అతన్నిగౌరవంగా చూస్తారు. "అవును మరి! సరళమ్మకాడ సంపాదించకుండూ మరేడ సంపాదిస్తాడు" అనుకొంది అక్కసుగా.
    ఆ సరళమ్మని వదిలి తను రమ్మంటే వస్తాడో రాడోనని భయపడింది. అలాంటిది ఒక్కమాట తను రమ్మని అనగానే సంతోషంగా రావటానికి ఒప్పుకున్నాడు. ఏమైనా వుంటే ఇలా వస్తానంటాడా? రాజయ్యన్నట్టే నిజంగా యెర్రిబాగులోడు. తను అన్ని మాటలన్నా ఒక్కమాట మనసులో పెట్టుకోలేదు!
     సరళతో చెప్పి నాగమ్మ దగ్గిరకు వచ్చేశాడు వెంకడు. జరిగిందేదీ మనసులో పెట్టుకోకుండా సవతితల్లిని ఆదుకోవటానికి వెళుతున్న వెంకడికి మనసులోనే నమస్కరించింది సరళ. "వీళ్ళ దగ్గిరనుంచి నేనెంతో నేర్చుకోవాలి" అనుకొంది.
    వ్యాసమూర్తి సహకారంతో తోటను వెంకడి స్వాధీనం చెయ్యగలిగాడు జైహింద్ బాబు.
    వ్యాసమూర్తి నవ్వుతూ, "జయన్నా! ఎంతసేపూ వాళ్ళకోసమూ, వీళ్ళకోసమూ నన్ను సహాయం అడుగుతావే కానీ, నీకోసం ఏదీ అడగవేం?" అన్నాడు.
    "అదేంటి బాబుగారూ! వీళ్ళంతా నావాళ్ళు కారా" అన్నాడు జైహింద్ బాబు. వ్యాసమూర్తి మాట్లాడలేదు! "ఇలా అందరూ అనుకోగలిగితే..... కనీసం వందమందిలో పదిమంది అనుకోగలిగితే....." అని ఆశపడింది అతని హృదయం.   

 Previous Page Next Page