Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 35


    "నువ్వు చెప్పుకోవలసినది ఏమైనా వుందా?" జడ్జి అడిగాడు.

    "నా తరఫున నేనే వాదించుకోవడానికి అనుమతి ఇవ్వమని కోర్టువారిని కోరుతున్నాను!"

    "ప్రొసీడ్!"

    "నా మొట్టమొదటి సాక్షి ఈ కేసుని పరిశోధించిన ఇన్ స్పెక్టర్ సరళరేఖ!" కోర్టులో ఒక్కసారి కలకలం రేగింది.

    తనని ఏ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడో సరళరేఖకి అర్ధం కాలేదు. అయోమయంగానే బోనెక్కింది.

    "హోటల్ లో రూమ్ నంబర్ 201 లో దావూద్ హర్షద్ ఆ రోజు రాత్రి వున్నాడు. అవునా?"

    "అవును!"

    "ఆ తెల్లవారుఝామున అతడు మరణించినట్టు ఎదుటి రూమ్ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. అంటే.... ఆ రూములో దావూద్ తో పాటు ఇంకెవరూ లేరా?"

    "లేరు!"

    బృహస్పతి ఒక కాగితాన్ని ఆమెకి అందించాడు. హోటల్ తాలూకు రూమ్ సర్వీసు వోచర్ అది.... "రాత్రి మూడింటికి రూమ్ నంబర్ 201కి ఆరు సోడా సీసాలు సప్లై చేయబడ్డట్టు ఈ బిల్ లో వుంది. దీన్ని బట్టి దావూద్ తో పాటు మరెవరో వున్నట్టు అర్ధమవుతోంది కదా....!"

    "అతడొక్కడే తెప్పించుకుని ఉండొచ్చు."

    "తెల్లవారుఝామున మూడింటికి కడుపునొప్పి వచ్చి ఆరు సోడాలు తెప్పించుకుని తాగాడంటారా?"

    కోర్టులో నవ్వులు ప్రతిధ్వనించాయి. సరళరేఖ మాట్లాడలేదు. బృహస్పతే అన్నాడు- "అంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రొహిబిషన్ గురించి పక్కన పెడితే, ఆ రూమ్ లో డ్రింక్స్ పార్టీ జరిగిందనుకుందాం. ఆరు సీసాలు అతడొక్కడే తాగడు కదా!"

    "అబ్జెక్షన్ యువరానర్! ముద్దాయి ఈ కేసుకి సంబంధంలేని విషయాల్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ రోజు రాత్రి దావూద్ ఒక్కడే డ్రింక్ చేశాడా, స్నేహితులతోకలిసి చేశాడా అన్నదానికీ, ఈ కేసుకీ ఏ సంబంధమూ లేదు."

    "ఉంది యువరానర్! రాత్రి మూడింటికి దావూద్ గదిలో ఎవరో ఉన్నారు. ఆ సమయంలో ఆరు సోడాలు తెప్పించబడ్డాయి అంటే తెల్లవారేవరకూ ఆ 'అతిథి' కూడా గదిలోనే ఉండి వుండాలి."

    "అబ్జెక్షన్ యువరానర్! ఆరు సోడాలు డ్రింక్ లో కలుపుకుని హతుడే తాగి వుండవచ్చు. అతడొక మాఫియా లీడరు. అంతగా డ్రింక్ చేయడం అతడికి కొత్త కాకపోవచ్చు."

    "అబ్సెక్షన్ సస్టెయిన్డ్... " అన్నాడు జడ్జి. ప్రాసిక్యూటర్ గర్వంగా బృహస్పతి వైపు చూస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు. బృహస్పతి ప్రశ్నలు కొనసాగించాడు.

    "మీరు వెళ్ళేసరికి రూమ్ లో డ్రింక్ బాటిల్ వుందా?"

    సరళరేఖ ఒక క్షణం తటపటాయించి "వుంది" అన్నది. ".... కానీ దాని గురించి నేను లోతుగా పరిశోధించలేదు. బయటి రాష్ట్రంనుంచి వచ్చిన వారికి ఆ సౌలభ్యం పెద్ద హోటల్స్ లో వుంది."

    "హతుడు అనుమతి తీసుకుని తాగాడా? దొంగతనంగా తాగాడా అని నేను ప్రశ్నించబోవడం లేదు. ఆ గదిలో డ్రింక్ చేసినట్టు ఎన్ని గ్లాసులు వున్నాయి?"

    ".... రెండు"

    కోర్టులో నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరింది.

    "తెల్లవారుఝామున మూడింటికి దావూద్ ఆరు సోడాలు తెప్పించుకున్నాడు. అతడితోపాటు ఇంకెవరో ఆ రాత్రి తాగినట్టు రుజువులున్నాయి. ఆ 'అతిథి' ఎప్పుడు వెళ్లిపోయాడో మీరు ఎంక్వయిరీ చేయలేదా?"

    ఒక్కక్షణం నిశ్శబ్దం తర్వాత .... "....చేయలేదు...." అంది సరళరేఖ.

    "నా తర్వాత సాక్షి కేంద్రమంత్రి రాంభరత్...." అన్నాడు బృహస్పతి.

    కోర్టులో మళ్ళీ కలకలం రేగింది. మంత్రికి సమన్లు పంపబడ్డాయి. పక్షం రోజుల తర్వాత ప్రొసీడింగ్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి.

    "హత్య జరిగిన రోజు రాత్రి అదే హోటల్ రూమ్ నంబరు 306 లో వున్నారు. అవునా?"

    "అవును."

    "ఆ రాత్రి మీరు మీ గదిలోనే పడుకున్నారా?"    

    "అవును."

    "ఎన్ని గంటలనుంచి మీరా గదిలో ఉన్నారు?"

    "తొమ్మిదింటికల్లా విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను తలుపులేసుకుని నిద్రపోయాను."

    "భోజనం?"

    రాంభరత్ ఈ ప్రశ్నకి ముందే తయారయి వుండడం వలన, రూం సర్వీసు బిల్లుల సంగతి బృహస్పతి అంతకుముందే పరిశీలించి వున్నాడని తెలుసు.... ".... నేనా రాత్రి భోజనం చేయలేదు" అన్నాడు.

    "నేను హత్య చేస్తున్నట్టు చూసిన ప్రత్యక్ష సాక్షి మీ సెక్యూరిటీ గార్డు. అవునా?"

    "అవును."

    "మీరు మూడో అంతస్తులో రాత్రి తొమ్మిదింటికి పడుకుంటే, అతడు రెండవ ఫ్లోర్ లో తెల్లవారుఝామున అయిదింటికి ఏం చేస్తున్నాడు....?"

    "ఏమో, నాకు తెలీదు. వాళ్ళు రెండో అంతస్తులో రూమ్ తీసుకుని వుండి వుండవచ్చు."

    "కాబట్టి మీ గార్డులు మీకు ఎంత దూరంలో వున్నారో కూడా మీకు తెలీదన్నమాట! ప్రభుత్వం మీ రక్షణకి ఇంత ఖర్చు పెడుతున్నందుకు నాకు విచారంగా వుంది."

    "అబ్జెక్షన్!"

    "సస్టెయిన్డ్."

    "మీరు ఆ రాత్రి దావూద్ హర్షద్ గదికి వెళ్లి పలకరించారా?"

    "లేదు."

    "మీకు ఒక టీ.వి. ఛానల్ వుంది. హతుడు దావూద్ ఇటీవలే ప్రసారమైన మీ నాటకంలో నటించాడు కూడా! అయినా మీరు వెళ్లి పలకరించలేదా?"

    "నాకంత అవసరం అనిపించలేదు."

    బృహస్పతి జడ్జీకి ఒక ఫోటో కాఫీ అందజేస్తూ "రాత్రి పన్నెండు గంటలకి ఆర్డర్ చేయబడిన చికెన్ -65 బిల్లు ఇది! దీని మీద ఇనీషియల్ గౌరవనీయులయిన మంత్రివర్యులు రాంభరత్ గారిది!! కావాలంటే సాక్షి నిరాకరించవచ్చు" అన్నాడు.

    రాంభరత్ మొహం మ్లానమయింది. వెయిటర్ బిల్లు అందించగానే తను దగ్గరగా వున్నాడు కాబట్టి ఇనీషియల్ వేశాడు. అది ఇలా వచ్చి మెడకి చుట్టుకుంటుందని ఊహించలేదు. సంతకం తనది కాదని నిరాకరిస్తే మరింత ఉచ్చులో చిక్కుకోవలసి వస్తుందేమో- అర్ధంకాని పరిస్థితి!

    "మీరు ఆ రాత్రి దావూద్ హర్షద్ గదిలోనే తెల్లవారే వరకూ ఉన్నారు... అందుకే మీ సెక్యూరిటీ గార్డులు కూడా ఎదురు రూమ్ లో ఉండవలసి వచ్చింది.... మూడవ అంతస్తులో మీ రూమ్ పక్కనే గదులు వాళ్ళకి బుక్ చేయబడి ఉన్నాయి.... సాయంత్రం మీరు హోటల్ లో దిగినప్పుడు వాళ్ళు కూడా మీ పక్కరూమ్ లోనే ఉన్నారు.... మీరు దావూద్ తో కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు దావూద్ తాలూకు సెక్యూరిటీ గార్డులు అతడి ఎదురు గదిలో ఉన్నారు.... మీ గార్డులు కూడా వాళ్ళతో కలిసి ఆ రూమ్ లోనే ఆ రాత్రి వున్నారు.... రెండు గెస్ట్ బెడ్ లు వాళ్ళకోసం ఆ రాత్రి ఆ రూమ్ కి సప్లై చేయబడ్డట్టు రికార్డులో వుంది.... అందుకే మీ గార్డు తెల్లవారుఝామునే పిస్టల్ చప్పుళ్ళు విని ఆ ఎదుటి రూమ్ లోంచి బయటికి వచ్చాడు. తెల్లవారేవరకూ 'కలిసి' తాగుతున్న మీ ఇద్దరికీ ఏదో గొడవ వచ్చింది. మీరు దావూద్ ని షూట్ చేశారు. ఆ చప్పుడికి బయటికి వచ్చిన మీ గార్డుతో నేరం నా మీదకి తోసెయ్యమని చెప్పారు. ఏమీ ఎరగనట్టు మీ గదికి వెళ్ళి పడుకున్నారు. అవునా?"

    "నో...." గట్టిగా అరిచాడు రాంభరత్.

    ఈ లోపులో పి.పి. లేచి "ముద్దాయి సాక్షిని కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు యువరానర్!" అన్నాడు.

    "నేనేమీ కన్ ఫ్యూజ్ చేయడంలేదు. ఆ రాత్రి మంత్రిగారు హతుడైన మాఫియా లీడర్ గదిలో డ్రింక్ చేస్తున్నాడా.... లేదా అన్న విషయం ఆయనతో చెప్పించడమే నా ఉద్దేశం."

    అప్పటికి రాంభరత్ సర్దుకుని, మానసికంగా ప్రిపేరయ్యాడు. చెప్పడం ప్రారంభించాడు. ".... నాకిప్పుడు గుర్తొచ్చింది యువరానర్! నేను గాఢనిద్రలో వుండగా పన్నెండింటికి దావూద్ ఫోన్ చేశాడు. నేను పై అంతస్తులో వున్నానని తెలుసుకుని, నన్ను తన గదికి ఆహ్వానించాడు. నేను వెళ్ళేసరికి విస్కీ గ్లాసులతోనూ, సిగరెట్ వాసనతోనూ నిండివుంది అతడి గది. అదే సమయానికి వెయిటర్ చికెన్ తీసుకువచ్చాడు. నేను ఆ వాతావరణంలో ఉండలేననీ, మరుసటిరోజు ప్రొద్దున్నే ఏదయినా పనుంటే, అతడినే నన్ను వచ్చి కలవమనీ చెప్పి నా గదికి వెళ్ళిపోయాను" అన్నాడు.

    "అభినందనలు. చాలా బాగా చెప్పారు" అన్నాడు బృహస్పతి. తర్వాత జడ్జివైపు తిరిగి ".... యువరానర్! మన మంత్రులని కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న సెక్యూరిటీ గార్డులని మనం అభినందించాలి. మంత్రిగారికి పన్నెండింటికి ఫోన్ రాగానే ఆయన కింద అంతస్తుకి బయలుదేరారు. తమ గదిలో పడుకోకుండా, వరండాలోనే నిలబడి కళ్ళలో వత్తులేసుకుని కాపాడుతున్న సెక్యూరిటీ గార్డులు, మంత్రిగారితో పాటు కింద అంతస్తుకి వచ్చారు. అయిదు నిముషాల్లో ఆ వాతావరణం భరించలేక మంత్రిగారు పైకి వెళ్ళిపోయారు. గార్డులు మాత్రం ఎదుటి రూమ్ లోకి గెస్ట్ బెడ్ లు తెప్పించుకుని నిద్రపోయారు."

    కోర్టు గొల్లుమంది. జడ్జీకూడా నవ్వాపుకోలేక పోయాడు. రాంభరత్ బిక్కమొహంతో చూస్తున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తల పట్టుకుని కూర్చున్నాడు.

    "నా తర్వాత సాక్షి సెక్యూరిటీ గార్డు" అన్నాడు బృహస్పతి.

    అతడు బోనెక్కాడు.

    "హత్య జరిగినప్పుడు నువ్వేం చూశావో ఒకసారి చెప్పు."

    "రివాల్వర్ చప్పుడు వినబడగానే ఒక్క ఉదుటున లేచి తలుపుతీసి బయటికి వచ్చాను. ఎదుటి గది గుమ్మం దగ్గర నువ్వు నిలబడి వున్నావు" బృహస్పతిని చూస్తూ అన్నాడు గార్డు. బృహస్పతి బాణాల్లాటి చూపులకు తట్టుకోలేక మొహం పక్కకు తిప్పుకుని కొనసాగించాడు. ".... నీ చేతిలో పిస్టల్ వుంది. అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయావు. నేను హోటల్ యాజమాన్యానికి ఈ విషయం వెంటనే తెలియబరిచాను."

    "ఆ ఎదుటి గదిలో నువ్వు ఎందుకు వుండవలసి వచ్చింది?"

    మంత్రికన్నా సెక్యూరిటీ గార్డే కాస్త తెలివైనవాడు. విషయం కాస్త అతికినట్టు చెప్పగలిగాడు. "....మంత్రిగారు తన గదిలోంచి బయటికి వస్తున్నట్టు అలికిడై, మేము బయటికి వచ్చాం. ఆయన పైకి తిరిగి వెళ్ళిపోయిన విషయం మాకు తెలియదు. కింద ఉన్నవాళ్ళు కూడా మా వృత్తికి సంబంధించిన వాళ్ళే కాబట్టి, మాట్లాడుకుంటూ వుండిపోయాం."

    "గుడ్! మంత్రిగారి సెక్యూరిటీ, మాఫియా లీడరు సెక్యూరిటీ 'స్నేహితుల'వడం ప్రజాస్వామ్యానికి నిదర్శనం. అఫ్కోర్స్! మంత్రిగారూ, మాఫియా లీడరూ స్నేహితులవగా లేనిది మీరు స్నేహితులవడంలో తప్పేముందిలే....! అయితే అది రివాల్వర్ చప్పుడే అని నీకు నిశ్చయంగా తెలుసా?"

 Previous Page Next Page