Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    సంకల్పనాథ్ ఒక క్షణం మౌనంగా వూరుకుని "సరే" అన్నాడు.

    ట్రైన్ సిర్పూర్- కాగజ్ నగర్ వైపు దూసుకుపోతోంది. ఇద్దరూ అయిదో పెగ్ లో వున్నారు.

    "ఇప్పుడు నేను చెప్పబోయేది దావూద్ గురించి!" అన్నాడు బృహస్పతి. ".... అతగాడు నా చెల్లెల్ని రేప్ చేసాడు. ఆఫ్ కోర్స్ దానివెనకున్నది మీరే...." అతిగా తాగడంవల్ల బృహస్పతి మాట తడబడుతోంది. "....అయినా మనం స్నేహితులమై పోయాం కదా! అందుకని మిమ్మల్ని క్ష....క్ష....క్ష...."

    "క్షమించి...." అందించాడు సంకల్పనాథ్.

    "ఆ....ఆ.... క్షమించి వదిలేస్తున్నాను. కానీ వాణ్ణి మాత్రం వదిలిపెట్టను. చంపితీరతాను."

    "అంత మత్తులో కూడా సంకల్పనాథ్ నవ్వాడు. "నువ్వు దావూద్ హర్షద్ ని చంపుతావా?....హ్హ....హ్హ....హ్హ... ఇంత కన్నా పెద్ద జోక్ నేనెప్పుడూ వినలేదు. దావూద్ హర్షద్ అంటే ఎవరనుకున్నావ్? అతడ్ని నువ్వు చంపుతావా?"

    "అతణ్ణి నేను చంపుతానో, అతడి చేతిలో నేను చస్తానో మీ కనవసరం! ఈ విషయంలో కూడా మీరేమీ కల్పించుకోకూడదు."

    "సరే.... సరే! అతగాడ్ని నువ్వు చంపితే మాత్రం, నిన్ను నా కుడిభుజం చేసుకుంటాను- నిజంగా నీ కంత శక్తి ఉందని నిరూపించుకోగలిగితే!"

    "ఏం మాట్లాడుతున్నావ్ సంకల్పనాథ్ నువ్వు? నువ్వు నన్ను కుడిభుజం చేసుకోవడవేమిటీ? హరిస్వామి చెప్పిన జ్యోతిష్యం కరెక్టయితే నిన్ను కుడిభుజం చేసుకోవాలా, వద్దాని ఆలోచించేంత ఉన్నత స్థితిలో ఉంటాను నేను."

    సంకల్పనాథ్ మత్తు ఆ మాటలకి కాస్త దిగినట్టయింది. ట్రెయిన్ కాగజ్ నగర్ లో ఆగింది. నౌఖరు వచ్చి "భోజనం పెట్టమంటారా సార్?" అనడిగాడు.

    బృహస్పతి కోపంగా- "ఇంకొకసారి ఇలా వచ్చావంటే మాడు పగలగొడతాను. నన్నూ, మీ అయ్యాగారినీ సికింద్రాబాద్ స్టేషన్ లో రైలాగిన తర్వాత వచ్చి లేపు. ఈలోగా మేము లేస్తే సరేసరి! నువ్వుగానీ డిస్టర్బ్ చేశావా, షూట్ చేసి పారేస్తాను. షూట్ అంటే గుర్తొచ్చింది. మీ రివాల్వర్ మీ దగ్గరే ఉందిగా మంత్రిగారూ?" అని అడిగాడు.

    "ఉన్దీ...." మత్తుగా అన్నాడు సంకల్పనాథ్.

    "ఇక నువ్వెళ్ళు. మమ్మల్ని మేం రక్షించుకోగలం. ఆకలేస్తే మా భోజనం మేం తినగలం."

    నౌఖరు వెళ్ళాక తలుపు బోల్డ్ వేస్తూ బృహస్పతి అన్నాడు.

    "నువ్వూ, రాంభరత్ - మీరంటే ప్రధానమంత్రికి ఇటీవల పడడంలేదని హరిస్వామి చెప్పాడు. ఈ ఫోటోలూ, డైరీల సాయంతో మీ ఇద్దర్నీ నా గుప్పిట్లో ఉంచుకుంటే, నేనే భవిష్యత్తులో ప్రధానమంత్రిని కావచ్చు" అన్నాడు.

    సంకల్పనాథ్ చేతిలో గ్లాసు బలంగా విసిరికొట్టాడు. పెద్ద చప్పుడుతో అది బద్దలయింది. "నిజంగా అలా అన్నాడా?"

    "ప్రధానమంత్రుల్ని తయారు చేయడం తన వృత్తి" అన్నాడు. "ఈ ఫోటోల సహాయంతో బ్లాక్ మెయిల్ చేస్తే మీరిద్దరూ చెరొక పదికోట్లూ ఇస్తారనీ, దాంతో నేను ఎలక్షన్లలో నిలబడవచ్చనీ అన్నాడు. మనం- మనం ఒకటి అన్న విషయంలో మీకు నమ్మకం కలగడానికి గానూ నీకీ విషయం చెప్తున్నానంతే! గుడ్ నైట్!!!" అంటూ తను చెప్పవలసింది చెప్పేసినట్టు అప్పర్ బెర్త్ మీదకి వెళ్ళి పడుకున్నాడు.

    ఆ తర్వాత పది నిముషాలకి రైలు కాజీ పేటలో ఆగింది.

    అప్పుడు సమయం తెల్లవారుఝాము మూడుగంటలైంది.


                                          *    *    *


    హోటలు గదిలో, ఉదయం అయిదింటికి రాంభరత్ నిద్రలో అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ రాత్రి అతడికి సరిగ్గా నిద్ర పట్టలేదు.

    కేంద్రంలో పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. సంకల్పనాథ్, రాంభరత్ లాంటి వాళ్ళందరూ ఎన్నికల్లో నెగ్గినా, పార్టీ మాత్రం మెజారిటీ నిలబెట్టుకోలేక పోయింది. దానితో తిరిగి అధికారంలోకి వస్తుందా, రాదా అనేది అనుమానాస్పదమయింది. ఇదిలా వుండగా మరోవైపు ప్రధానమంత్రి (పార్టీ ప్రెసిడెంట్) తమనిద్దర్ని సి.బి.ఐ. కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడన్న వార్త తెలిసింది. మూడవవేపు నుంచి బృహస్పతి దగ్గరున్న డైరీలు భయపెడుతున్నాయి.

    ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అన్న విషయం చర్చించడం కోసం అతడు దావూద్ హర్షద్ దగ్గరికి రాత్రి వచ్చి ఉన్నాడు. అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి. వివిధ పథకాలూ ఆలోచించారు. బాగా ఆలస్యమవడంతో అతడు ఆ గదిలోనే విశ్రమించాడు. అతడి సెక్యూరిటీ గార్డులు ఆ హోటల్ లోనే మరో రూమ్ లో ఉన్నారు.

    దాదాపు ఫుల్ బాటిల్ తాగినా అతడికి నిద్ర సరిగ్గా పట్టలేదు. ప్రొద్దున్న అయిదింటికి తలుపుకొట్టిన చప్పుడు వినపడింది. విసుగ్గా "ఎవరదీ?" అన్నాడు. అట్నుంచి అస్పష్టంగా వినబడిన సమాధానం అర్ధంకాలేదు.

    మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు.

    దావూద్ హర్షద్ "నేను తీస్తాను" అంటూ వెళ్ళి తలుపు తెరిచాడు.

    తెరవగానే ఒక క్షణం స్థానువయ్యాడు.

    మాఫియా లీడర్ల ప్రాణాలు అనుక్షణం ప్రమాదంలో వుంటాయి. వాళ్ళెప్పుడూ అమితమైన రక్షణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కాస్త 'లూజ్' గా వుంటారు. అదే ప్రాణాంతకమవుతూ వుంటుంది.

    ప్రస్తుతం అలాగే జరిగింది.

    .... ఎదురుగా బృహస్పతి నిలబడి వున్నాడు.

    అతడు ఎక్కువ సమయం ఇవ్వలేదు. ఇవ్వకూడదు కూడా.

    ఇలాంటి వ్యవహారాల్లో దావూద్ హర్షద్ తలపండిన వాడనీ, ఆలోచించుకోవడానికి ఏ మాత్రం టైమిచ్చినా చిరుతపులి కన్నా వేగంగా రియాక్టవుతాడనీ బృహస్పతికి తెలుసు. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వరుసగా మూడుసార్లు పిస్టల్ పేల్చాడు. పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చడం వల్ల ఒక్క బుల్లెట్ కూడా వృధా కాలేదు.

    దావూద్ హర్షద్ మోకాళ్ళమీద కుప్పకూలిపోయాడు. క్షణాల్లో అతడి ప్రాణం పోయింది. భారతదేశపు చీకటి ప్రపంచంలో అతి ప్రసిద్ధుడయిన ఒక మాఫియా మనిషి- అంత "సాధారణంగా" ప్రాణాలు పోగొట్టుకోవడం వాస్తవం. అలా కాకపోతేనే ఫిక్షన్.

    మొదటి బుల్లెట్ చప్పుడుకే రాంభరత్ పక్కమీద ఎగిరి పడ్డాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన అతడికి అర్ధంకావడానికి అరనిముషం పట్టింది. ఆ లోపులోనే బృహస్పతి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. గట్టిగా అరవాలనీ, చుట్టుప్రక్కల వాళ్ళని అప్రమత్తం చేయాలని కూడా రాంభరత్ కి తోచలేదు. భయంతో కట్టెలా బిగుసుకుపోయిన శరీరం తిరిగి స్వాధీనంలోకి రావడానికి చాలాసేపు పట్టింది. వణుకుతున్న కాళ్ళతో వేగంగా లోపలికి వెళ్ళి, ఫోన్ చేసి గార్డుని పిలిచి, జరిగిన విషయం చెప్పాడు.  

    తను ఆ దావూద్ గదిలో రాత్రి వున్న విషయం ఎటువంటి పరిస్థితి లోనూ బయటకు రాకూడదని, సెక్యూరిటీ గార్డుని ఆదేశించాడు. తన గదికి వెళ్ళాక సెక్యూరిటీ గార్డు ఏం చెయ్యాలో, రహస్యంగా రెండు మూడు సూచనలు యిచ్చాడు.

    మంత్రి చెప్పిన విధంగానే గార్డు- తన గదికి వెళ్ళాక, రిసెప్షన్ కి ఫోన్ చేసి హత్య గురించి చెప్పాడు.

    అరగంటలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. హడావుడి ప్రారంభం అయింది. దావూద్ హర్షద్ లాంటి మాఫియా నాయకుడి హత్య సామాన్యమైన విషయం కాదు. పత్రికా విలేఖరులూ, ఫోటోగ్రాఫర్స్ ఆఘమేఘాలమీద అక్కడికి చేరుకున్నారు. అందరినీ కంట్రోల్ చేయడం పోలీసులకి తలకి మించిన భారమైంది.

    దేశంలోని వివిధ పత్రికా కార్యాలయాలకూ న్యూస్ ఏజన్సీలనుంచి టెలిప్రింటర్ల మీద సమాచారం పంపబడింది.

    "దావూద్ హర్షద్ దారుణ హత్య"

    ప్రముఖ మాఫియా లీడరు ఈ రోజు తెల్లవారుఝామున నగరంలోని ఒక స్టార్ హోటలులో దారుణంగా హత్య చేయబడ్డాడు. హంతకుడు ద్వారం సమీపంనుంచి కాల్చడంతో దావూద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రివాల్వర్ చప్పుడు విని, సెక్యూరిటీ గార్డు తన గదిలోంచి బయటికి వచ్చే సమయానికి హంతకుడు పారిపోతూ కనబడ్డాడు. హంతకుడిని బృహస్పతిగా గుర్తించడంతో, పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే హోటలులో మరో గదిలో వేరే పనిపై విచ్చేసి వున్న కేంద్రమంత్రి రాంభరత్- ఈ వార్త విని దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. "దావూద్ హర్షద్ నేరచరిత్ర కలవాడయితే అయి వుండవచ్చు కానీ, న్యాయస్థానంలో ఏ నేరమూ రుజువు కానంత వరకూ అతడు గౌరవనీయుడైన పౌరుడేననీ, వ్యక్తిగత కక్షలతో బృహస్పతి అనే యువకుడు అతడిని హత్య చేయడం దారుణమంటూ తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. తన చెల్లెల్ని రేప్ చేశాడన్న అభియోగంపై దావూద్ హర్షద్ మీద బృహస్పతి గతంలో కేసు పెట్టిన విషయం పాఠకులకు విదితమే." 


                                         *    *    *


    తలుపు మీద వేళ్ళతో కొట్టిన చప్పుడికి సంకల్పనాథ్ రేకి మెలకువ వచ్చింది. ఎయిర్ కండిషన్డ్ కూపే అవడంవల్ల బయట వెలుతురు వచ్చిందీ, లేనిదీ తెలియడంలేదు. ట్రైన్ మాత్రం నెమ్మదిగా సాగుతున్న విషయం తెలుస్తోంది.

    సంకల్పనాథ్ తన బెర్త్ మీద నుంచి లేవబోయే లోగా పై బెర్త్ మీద నుంచి బృహస్పతి కిందికి దిగి తలుపు తెరిచాడు.

    "సికింద్రాబాద్ దగ్గర పడుతోంది సార్" అన్నాడు పి.యే.

    బృహస్పతి బ్రీఫ్ కేస్ పట్టుకుని "నేను పక్క కూపేలోకి వెళతాను. దండలూ, కార్యకర్తలూ, కోలాహలం.... అంతా హడావుడిగా ఉంటుందేమో! నేనెందుకు లెండి" అన్నాడు.

    అతడు చెప్పింది సమంజసమే నన్నట్టు సంకల్పనాథ్ తలూపాడు.

    మరో అయిదు నిముషాల తర్వాత రైలు సికింద్రాబాద్ లో ఆగింది. పార్టీ కార్యకర్తల జయ జయ ధ్వానాల మధ్య మంత్రి తన కారు వద్దకు చేరుకున్నాడు. కారు ప్రభుత్వ అతిధిగృహం వేపు దూసుకుపోయింది. రేడియోలో వార్తలు వస్తున్నాయి. వెనుక సీటులో కూర్చుని వింటున్న సంకల్పనాథ్ కి ఒక క్షణం పాటు అది కలో, నిజమో అర్ధంకాలేదు.

    "ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దావూద్ హర్షద్ హత్య జరిగింది. ఒక ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం ఈ హత్యకు కారకుడైన బృహస్పతి అనే యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు...." న్యూస్ రీడరు చెప్పుకుపోతున్నాడు.

    గెస్ట్ హౌస్ కి చేరుకోగానే సంకల్పనాథ్ రే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లో ఈ హత్య గురించి వివరాలు కనుక్కున్నాడు.

    వివరాలు తెలుస్తున్నకొద్దీ అతడి అయోమయం మరింత ఎక్కువయింది.


                                                     22


    "యువరానర్!" అంటూ ప్రారంభించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ".... కొన్ని నెలల క్రితం ఇదే కోర్టులో ముద్దాయి బృహస్పతి, అతడి చెల్లెలు హిమసమీర కలిసి కేంద్ర మంత్రులనీ, దావూద్ హర్షద్ నీ బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఒక దొంగకేసు పెట్టారు. కోర్టువారు ఈ విషయమై ముద్దాయినీ, అతని చెల్లెల్నీ మందలించారు కూడా! ఆ పాత కక్షలు మనసులో పెట్టుకుని, ముద్దాయి ఈ హత్య చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా వున్నారు. ఎదురు రూమ్ లో వున్న సెక్యూరిటీ గార్డు, ముఖద్వారం దగ్గరున్న రిసెప్షనిస్టూ- ముద్దాయిని స్వయంగా గమనించారు. సెంట్రీ అయితే ముద్దాయి చేతిలో రివాల్వర్ నీ, అతడి కాళ్ళదగ్గరే కూలిపోయిన హతుణ్ణి కళ్ళారా చూశాడు. ఈ సాక్ష్యాల ఆధారంగా ముద్దాయికి ఉరిశిక్ష విధించ వలసిందిగా కోర్టువారిని కోరుతున్నాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra