Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 33

    "అవును గిరిధర్! హత్య మీరే చేశారు. మీకేమీ తెలియదా ?" అడిగాడు ఇన్ స్పెక్టర్.

    "లేదు! లేదు! నేను చంపలేదు. నా పద్మను నేనే చంపుకుంటానా?" రెండు చేతులతో తలను పట్టుకున్నాడు గిరి. "చంపానేమో ఇనస్పెక్టర్ - అవును నన్ను అరెస్ట్ చేయండి - నన్ను అరెస్ట్ చెయ్యండి" ఆవేశంగా అన్నాడు.

    "అయామ్ సారీ గిరిధర్! పదిమంది సాక్షులమధ్య  మీ భార్యను హత్యచేసిన నేరానికి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను" అన్నాడు యినస్పెక్టర్.

    నిజం భయంకరమైంది. నిజంకన్నా అబద్ధం మరింత భయంకరమైంది. అవసరం ఈ రెండింటికన్నా  భయంకరమైనది.


                                10


    హైకోర్టు భవనం ఎప్పటికన్నా  కిటకిట లాడుతోంది.

    పద్మజ హత్య జరిగిన తర్వాత సెషన్సు కోర్టులో  కేసు నడుస్తున్నంత కాలం దేశంలోని నాలుగు మూలల నుంచి ప్రజలు కేసు గురించి ఫాలో అవుతున్నారు.

    అప్పటికే దేశమంతా  పేపర్లలో  ఈ కేసు గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దెయ్యాలున్నాయా?" అన్న శీర్షికను కొన్ని పత్రికలు ప్రవేశ పెట్టాయి. ఎంతో మంది ఎన్నో రకాలైన అనుభవాల గురించి వ్రాశారు. ఎక్కడ చూసినా యిదే సంభాషణ. హత్యను కళ్ళారా చూశామని చెపుతున్న  వాళ్ళ సాక్ష్యం వినడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం తండోప తండాలుగా వచ్చారు. 1960 ప్రాంతాల్లో నానాపతి కేసు తర్వాత దేశాన్ని ఒక ఊపు ఊపింది ఈ కేసే.

    పరాయి మగాడితో భార్యను కళ్ళారా చూసి సహించలేక  హత్య చేసిన నానాపతికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడి  మరి ఈ కేసులో జడ్జి తీర్పు ఎలాగుంటుందో? ఆ తీర్పు మీద అనేకచోట్ల అనేక రకాలైన బెట్స్ కట్టడం జరిగింది.

    సెషన్సు జడ్జి వాదోపవాదాలన్నీ  విన్నాక గిరిధర్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. కోర్టు రూంలో  హాహాకారాలు చెలరేగాయి. జనం సానుభూతితో చూశారు గిరివైపు. అతను కేసు మొదలు పెట్టినప్పుడెలా వున్నాడో యిప్పుడూ అంత నిర్లిప్తంగానే వున్నాడు.

    అతని అక్కా, బావా వచ్చారు అమెరికా నుంచి. వారి ప్రోద్భలంతో కేసు హైకోర్టు చేరుకుంది.


                        *    *    *


    "మీ పేరు?"

    "హిమజ."

    "హతురాలు పద్మజ మీకేమవుతుంది ?"

    "అక్క."

    "మీ అక్కా, మీరు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారా ?"

    "అవును. మా తల్లిదండ్రులు పోయాక అక్కయ్యే నాకు తల్లీ తండ్రీ అయింది.

    "మీ అక్కయ్య మరణం మీకు తీరని లోటుకదూ ?"

    "అవును."

    "హత్య జరిగినప్పుడు మీరు అక్కడే వున్నారా ?"

    "ఉన్నాను. నేనేకాదు. మరెంతోమంది ఉన్నారక్కడ."

    "అప్పుడేం జరిగిందో వివరంగా చెప్పగలరా ?"

    "ఆ రోజు అక్కయ్య పుట్టినరోజు. కొద్దిమంది దగ్గర స్నేహితులను డిన్నరుకు ఆహ్వానించాం. అందరం భోజనాలు చేసి కూర్చున్నాక, గిరిధర్ పైన గదిలోకి వెళ్ళాడు. కాస్సేపటికి అక్కయ్య కూడా పైకి వెళ్ళింది. వారిద్దరిమధ్యనా  ఏం జరిగిందో నాకు తెలీదు. అతిధుల్ని వదిలి వెళ్ళలేక కాస్సేపు  తటాపటాయించాను నేను. ఇంతలో అక్కయ్య రూంలోంచి  బయటకు పరుగెత్తుకు వచ్చింది. వెనకనే గిరి కూడా వచ్చాడు. పిస్తోలుతో అక్కయ్యను కాల్చడం అందరం చూశాం."

    "అప్పుడు ముద్దాయి గిరిలో మీకేమయినా మార్పు కనిపించిందా?"

    "కొద్దిగా మనిషి ముఖంలో మార్పు వుంది. కళ్ళు ఎర్రగా వున్నాయి. అయినా మేమందరం కింద హాల్లో ఉన్నాం. అంత స్పష్టంగా కనిపించలేదు."

    "అతను ఇదివరలో అప్పుడప్పుడూ  కాస్త విపరీతంగా ప్రవర్తించేవాడని సాక్షులు చెప్పారు. మీరు దాని విషయంలో ఏమంటారు ?"

    "నేను ఎప్పుడూ అతను అలా ప్రవర్తించడం చూడలేదు."

    "మీ అక్కయ్య అతని ప్రవర్తన గురించి మీకెప్పుడూ  చెప్పలేదా ?"

    "ఒకటి రెండుసార్లు  చెప్పింది శేఖరం ఆత్మ గిరిధర్ ను ఆవహిస్తున్నట్లు.  కాని నాకెందుకో నమ్మకం కలగలేదు. ఏదో మోసం ఉందని అనుకున్నాను నేను."

    "అంటే గిరిధర్ సరియైన మానసికస్థితిలో వుండే మీ అక్కయ్యను హత్య చేశాడని మీ ఉద్దేశ్యమా?"

    "నాకు తెలిసినంతవరకు అతని మానసిక పరిస్థితిలో  ఏ లోపమూ లేదు. అతని ద్వంద్వ ప్రవృత్తిని నేను కళ్ళారా చూడలేదు. కాని ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. అక్కయ్యను హత్యచేసింది అతనే. ఆ విషయం నేనే కాదు అక్కడున్న అందరం కళ్ళారా చూశాం, అతను పొరపాటుగా పిస్తోలు కాల్చలేదు. అక్కయ్యను చంపాలనే ఉద్దేశ్యంతోనే కాల్చాడు."

    "దట్సాల్ యువర్ అనర్" ప్రాసిక్ర్యూషన్  లాయర్ కూర్చున్నాక డిఫెన్సు లాయర్ లేచాడు. ఆయన పేరుమోసిన క్రిమినల్ లాయరు.

    "మిస్ హిమజా! హత్య చేసిన సమయంలో ముద్దాయి మానసిక ప్రవృత్తిలో ఎలాంటి లోపమూ లేదని మీరన్నారు ఒక మనిషి జీవిత సమస్య ఇది. అతని మానసిక పరిస్థితి గురించి డాక్టర్లు మరొక విధంగా చెప్పారు. మీరు కాస్త ఆలోచించి సమాధానం చెప్పడం మంచిది."

    "చనిపోయిన వ్యక్తి నాకున్న ఒక్కగా నొక్క అక్క. ఆమె జీవితం పట్ల లేని సానుభూతి ఆమెను హత్య చేసినవాడిమీద  వుండాలనడం హాస్యాస్పదంగా ఉంది లాయర్" అంది హిమజ కోపంగా.

 Previous Page Next Page