Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 32

 
    ఇంగ్లీష్ లెక్చరర్ లో మాత్రం చాలా పరివర్తన కలిగింది. కుమార్ తప్పులేకపోయినా కుమార్ క్షమార్పణ కోరుకోవటం...ఇంత జరిగినా కుమార్ ని కొట్టిన వ్యక్తులపైన చంద్రశేఖర్ చర్య తీసుకోకపోవటం-ఆయనను బాగా కదిలించాయి_ ఉద్రేకానికి లొంగిపోయి తమ విద్యార్ధిని కొట్టడమేకదా, ఇంతకు మూలమని చాలా సిగ్గుపడ్డాడు. కుమార్ కోలుకుని కాలేజికి వచ్చాక నిండుక్లాసులో "అయామ్ సారీ కుమార్! నిన్ను కొట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఒక లెక్చరర్ గా నేను చెయ్యవలసిన పనికాదది. ఇకముందు మీరంతా నా స్నేహితులనే భావిస్తాను నేను. మీరు కూడా నేను మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు. 'దుర్వాసముని'గా పేరుబడ్డ లెక్చరర్ అలా మాట్లాడేసరికి విద్యార్ధుల ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఒక లెక్చరర్ అంత గౌరవాన్ని తమకిచ్చాక ఆ గౌరవాన్ని అంత తేలిగ్గా వదులుకోలేక నిశ్శబ్దంగా పాఠం విన్నారు.


                                     14


    ఇటు దేశంలోనూ, అటు విద్యార్ధి రంగంలోనూ, ఒక్కసారిగా ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అన్ని రకాల అక్రమ వ్యాపారాలనీ అణచి పారేస్తున్నారు. వెనుకటిలా పోలీసులకు లంచంపెట్టి తప్పించుకోవటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. రవి తండ్రి సాగిస్తోన్న గేంబ్లింగ్ వ్యాపారం పూర్తిగా మూతపడింది. ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులయిపోయింది. కార్లల్లో తప్ప బయటికి రాని రవికి కాలేజి జీతం కట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబంలో ఎవరూ చదువుకున్నవాళ్ళుకారు. రవి తండ్రి చదువుకోలేదు. అతనికి అక్రమ వ్యాపారాలూ, గూండాలతో లావాదేవీలూ తప్ప ఏ ఉద్యోగమూ లేదు. రవి తమ్ముడికి కూడా చదువు అబ్బలేదు. కాపీలుకొట్టే అవకాశం వున్న రోజుల్లోనే పదోక్లాసు మూడుసార్లు తప్పి ఆ తరువాత చదువు మానేసి తనూ "ఫేమిలీ బిజినెస్" లోకి దిగాడు. కానీ, ఆ బిజినెస్ మూతపడటంతో ఉద్యోగం చేస్తానంటూ బయలుదేరాడు. పదోక్లాసు ఫెయిలయిన ఆ అబ్బాయికి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది?
    రవి, మురళి, మంజు, లత అందరూ డిగ్రీ క్లాసుల్లోకి వచ్చారు. యూనివర్శిటీకి పాత వైస్ ఛాన్సెలర్ మారి కొత్తగా మరొక వైస్ ఛాన్సెలరు వచ్చారు. కొత్త వి.సి చక్రధారిలాగ యూనివర్శిటీలో చెలరేగుతోన్న అరాజకానని అరికట్టడానికి కంకణం కట్టుకున్నాడు. 75% అటెండెన్స్ స్ట్రిక్ట్ గా ఉంటేకాని పరీక్షకు కూచోవటానికి వీల్లేదని రూల్స్ ఎప్పుడూ ఉన్నాయి. కానీ ఆ విషయం శ్రద్ధగా పట్టించుకునే వాళ్ళెవరూ ఉండేవారుకాదు. కొత్త వి.సి వచ్చాక ఏ నెల కానెలా అటెండెన్స్ చెక్ చేసి అటెండెన్స్ సరిగా లేని విద్యార్ధులకు అప్పటికప్పుడే నోటీసులు పంపుతున్నారు. ఆ కారణంవల్ల విద్యార్ధులు క్లాసులు ఎగ్గొట్టి తిరగటం తగ్గింది. అన్నింటికంటే చాలా మంచి మార్పు డిగ్రీ కోర్సులలో ఏ సంవత్సరాని కా సంవత్సరం పరీక్షలు పెట్టటం-ఇంటర్నల్ ఎస్సెస్ మెంట్ ఏర్పాటు చెయ్యటం 20% మార్కులు ఇంటర్నల్ ఎస్సిస్ మెంట్ కి ఉండటంతో విద్యార్ధులందరూ క్లాసు పరీక్షల విషయంలో కూడా శ్రద్ధ చూపించవలసి వచ్చింది. అంతేకాదు! ఇంటర్నల్ ఎస్సిస్ మెంట్ మార్కులు తమ లెక్చరర్ల చేతుల్లోనే ఉండటంతో, ఇదివరకులా లెక్చరర్స్ ని తిరస్కరించి, నిరసించి మాట్లాడటానికి విద్యార్ధులకు సాహసం కలగటం లేదు. ఎప్పటికప్పుడే క్లాసు పరీక్షలు ఉండటంతో వాళ్ళు విధిగా ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవలసి వస్తోంది.
    విద్యార్ధులు లెక్చరర్స్ కి భయపడటమే కాదు- లెక్చరర్స్ కూడా విద్యార్ధుల బాగోగులు సిన్సియర్ గా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసిన పరిస్థితి కల్పించారు వి. సి. ఇంటర్నల్ ఎస్సిస్ మెంట్ తమ చేతిలో ఉందికదా అని లెక్చరర్ల ఇష్టంవచ్చినట్లు మార్కులు వెయ్యటానికి వీల్లేదు. విద్యార్ధుల ఆన్సర్ పేపర్లన్నీ జాగ్రత్తగా ఉండాలి. మార్కులు కూడా రికార్డు చేసి ఉండాలి-యూనివర్శిటీ కమిటీ వచ్చి ఆ ఆన్సర్ పేపర్లన్నీ పరిశీలిస్తుంది. లెక్చరర్ పాక్షిక దృష్టితో వ్యవహరించినట్లు తోస్తే సంజాయిషీ అడుగుతుంది. అంచేత పేపర్ ఇవ్వటంలోనూ, కరెక్ట్ చెయ్యటంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లెక్చరర్లు. అంతేకాదు-లెక్చరర్లపై విద్యార్ధుల అభిప్రాయాలకు కూడా విలువ ఈయాలన్నారు వి.సి. సాధారణంగా చక్కగా చదువుచెప్పే లెక్చరర్లను విద్యార్ధులు తప్పకుండా గౌరవిస్తారు. సామర్ధ్యంలేక క్లాసులో తడబడే లెక్చరర్లను అక్కడికక్కడే తాటాకులుకట్టి ఏడిపిస్తారు. చదువు చెప్పకుండా పోపికోలు కబుర్లు చెప్పే లెక్చరర్ల క్లాసులో అప్పటికి ఆ కబుర్లు ఎంజాయ్ చేసినా, క్లాసు నుంచి బయటికి రాగానే ఆ లెక్చరర్ ని గురించి చెప్పుకుని నవ్వుకుంటారు. అంతేకాదు! "ఫలాని లెక్చరర్ కి చదువు చెప్పటం రాదు. పిచ్చికబుర్లే చేతనవును" అని యాగీ కూడా చేస్తారు. లెక్చరర్లపై విద్యార్ధుల అభిప్రాయాలకు కూడా వి.సి. విలువ ఇయ్యాలనటంతో లెక్చరర్లందరూ హెచ్చరికగా ఉంటున్నారు. పదినుండి నాలుగువరకూ కాలేజిలో వుండాలని రూల్ ఉన్నా, ఇదివరలో ఆ రూల్ ఎవరూ పాటించేవారుకాదు. కొత్త వి.సి. వచ్చాక ప్రతి లెక్చరరూ తాను వచ్చిన సమయమూ, వెళ్ళే సమయమూ కూడా హెడ్ ముందు ఒక రిజిష్టర్ లో వేసి సంతకం చెయ్యాలన్నారు. అంచేత ఇదివరకులా అవకాశం చిక్కినప్పుడల్లా కాలేజినుంచి వెళ్ళిపోయేలెక్చరర్ల ఆటకట్టింది. సాధారణంగా టీచింగ్ నోట్స్ హైస్కూల్ లోనే వ్రాస్తారు. కాలేజిలెవల్లో అలాంటి నోట్సు వ్రాయటం ఇదివరకు ఉండేదికాదు. లెక్చరర్లు ముందుగానే రాము చెప్పబోయే పాఠాలకు సినాప్సిస్ వ్రాసి విద్యార్ధులకు అందించాలనీ, ఒక రిజిస్టర్ లో ఎప్పటికప్పుడు తాము చెప్పబోయే పాఠాలకు సంబంధించిన సంపూర్ణమైన వివరణ వ్రాసి ఉంచాలనీ శాసించారు. ఈ ఏర్పాట్లతో లెక్చరర్ ప్రిపేరవకుండా కాలేజికి వచ్చే ప్రమాదం తప్పిపోయింది.
    ఆ సంవత్సరం పరీక్షలు కూడా చాలా స్ట్రిక్ట్ గా జరిగాయి. పోలీస్ బందోబస్తీతో ఎక్కడా, ఎవ్వరికీ ఏవిధంగానూ కాపీకొట్టడానికి అవకాశం లేకుండా చేశారు వి.సి. అంతవరకూ బాగా కాపీలు మరిగిన విద్యార్ధులు ఒక్కసారిగా కాపీలులేకుండా వ్రాయటానికి చాలా అవస్థపడవలసి వస్తుందని వి. సికి తెలుసు. ఆ కారణంచేత పరీక్షా పత్రాలు బాగా ఛాయిస్ ఉండేలాగ తయారుచేయించారు. అయినా ఫలితాలు చాలా దారుణంగానే ఉన్నాయి. అంతవరకూ ఒక విధమయిన విచ్చలవిడి తనానికి అలవాటు పడిపోయిన విద్యార్ధులు ఒక క్రమపద్ధతిలో పరీక్ష వ్రాయలేకపోయారు. ఆన్సర్ పేపర్ల నిండా "మాకు చీటీలు దొరకలేదు. ఆ కారణంచేత రాయలేకపోయాం- దయతలచండి!" "కాపీ లేకుండా-మేము చిన్న పిల్లలం, ఎలా రాయగలం?" ఇలాంటి వ్యాఖ్యాలే ఉన్నాయి చాలా వరకూ.

 Previous Page Next Page