Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 1

   
                                        ఉదయశ్రీ నాల్గవ భాగము
    
                                                నమస్సుమాంజలి
    
    కొందరు ప్రతిభా వ్యుత్పత్తులలో 'ప్రతిభ గరీయసి' అన్నారు. కొందరు 'వ్యుత్పత్తి మహీయసి' అన్నారు. మరికొందరు ప్రతిభా వ్యుత్పత్తులకు సమ ప్రాధాన్యం అంగీకరించారు. వాస్తవానికి ఇదే ప్రశస్తమైన పద్దతి. ప్రతిభ లోపించిన కావ్యానికి ప్రకాశం ఉండదు; వ్యుత్పత్తి కొరవడిన కావ్యానికి వికాసం ఉండదు.
    కారయిత్రీ భావయిత్రీ శక్తులు రెండూ అన్యోన్యాశ్రయాలు. కారయిత్రి కావ్యాన్ని సృష్టిస్తుంది. భావయిత్రి అందలి అందాన్నీ, ఆనందాన్నీ అనుభవిస్తుంది. సర్వాంగ సుందరమైన సారస్వత స్వరూపానికి కవీ సహృదయుడూ ఉభయులూ అవసరమే. అందుకనే 'సరస్వత్యాస్తత్త్వం కవి సహృదయాఖ్యం విజయతే' అన్నారు ఆచార్య అభినవ గుప్తపాదులు. తెలుగు గుండెలు కవితను నిండించుకొని రసజ్ఞతను పండించుకొన్నవి. తెలుగుతల్లి ప్రేమాంకంలో కవులకూ రసజ్ఞులకూ కొరత లేదు.
    ఈనాడు "పద్యానికి ప్రచారం పడిపోయింది" అన్నమాట పసలేని మాట. ఎందుకంటే పద్యంగానీ, గద్యంగానీ హృద్యంగా అనపద్యంగా రచించటం కావాలి గాని అభిమానంతో అనురాగంతో అందుకొని ఆనందించే సహృదయులు ఎల్లప్పుడూ ఉన్నారు. ఇది నా అచంచల విశ్వాసం.
    ఈ కావ్య సంపుటిలో "సింహేంద్రవాహన" మొదలు 'శ్రీకృష్ణ దేవరాయల' వరకు ఇరువదినాలుగు రచనలున్నవి. ఇందలి "వియద్వాణి" సౌమ్య ఉగాది కవి సమ్మేళనం విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారితమైనది. "స్వర్ణలత" సుప్రసిద్ధ హిందీ కవి సుమిత్రానందన్ పంత్ కవితకు భావానుకృతి. అలాగే "సవితాదేవి కవితాలేఖ" శ్రీ నరేంద్ర హిందీకవితకూ, 'జ్యోతిర్మూర్తి' శ్రీగులాం రసూల్ కాశ్మీరీ కవితకూ, 'సుప్రభాతము' డాక్టర్ ఉమారాయ్ గారి బెంగాలీ కవితకూ భావానువాదాలు. ఇవన్నీ రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా జాతీయ కవిసమ్మేళనాలలో ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారితాలు. వారందరికీ నా కృతజ్ఞతలు.
    
                                                                     -కరుణశ్రీ
    
                                      
    
    "జయ మహాకాళి! జయ జగజ్జనని! జయము !!
    రాజరాజేశ్వరీ! భవానీ! జయమ్ము !!
    త్రిపురసుందరీ! భువనేశ్వరీ! జయమ్ము !!
    జయము! సింహేంద్రవాహనా! జయము జయము!!
    
    వాఁడొక దున్నపోతు! బలవంతుఁడు! బ్రహ్మ వరప్రసాది! "యీ
    రేడు జగమ్ములందు సరియెవ్వరు నా" కని వి్ఱ్ఱవీగుచు
    న్నాఁడు; ప్రపంచవంచన మొనర్చి త్రివిష్టప మాక్రమించుకొ
    న్నాఁడు; వివేకశూన్యుఁడు వినం డెవ రెట్టి హితమ్ము చెప్పినన్.
    
    వాఁ డొక దుండగీఁడు; మెడ వంగని మొండిశిఖండి; స్నేహముం
    బూడిదపాలొనర్చెడి ప్రబుద్దుఁడు; స్వార్ధపరుండు; పెంచుకొ
    న్నాఁడు దురాశ, నందనవనంబును బీడొనరించి స్వర్గమున్
    బాడొనరించినాఁడు, పశుబంధుఁడు దుస్సహ దుర్మదాంధుఁడున్ !
    
    వాఁ డొక రాక్షసుండు, నయవంచనలో మొనగాఁడు, సుంత మో
    మోడఁడు లోకనిందకు, మదోద్దతుఁ "డాడిన దెల్ల యాటగా"
    "పాడిన దెల్ల పాటగ" ప్రపంచము సర్వము చాప చుట్టుచు
    న్నాఁడటె! నమ్మకమ్ముపయి నమ్మకమన్నది లేదు వానికిన్.
    
    వాఁ డొక తుమ్ము తుమ్మిన నవగ్రహముల్ భయకంపితమ్ములై
    యూడిపడున్ ధరిత్రిపయి నొక్కవడిన్ వడగండ్ల కైవడిన్;
    వాఁడివిషాణముల్ దురదవాయఁగ వాఁడొక క్రుమ్ము క్రుమ్మినన్
    పోడిమి దక్కి బ్రద్దలయి పోవును నాకపురీకవాటముల్ !!
    
    పేరు మహిషాసురుఁడు! దగాకోరు! మ్రుచ్చు
    దనమునకు మూర్ఖతాకును "బెట్టినది పేరు"!!
    వాఁడు బాధింపనట్టి దేవతలు లేరు;
    వాఁడు పరిభవింపని మునీశ్వరులు లేరు.
    
    అమ్మదమత్తచిత్తుని యహంకృతి హద్దులు దాటె దుర్నివా
    రమ్మయి, బ్రహ్మ యిచ్చిన వరమ్మున కావరమెక్కి నెత్తికిన్
    గొమ్ములు వచ్చె రాక్షసునకున్; జెనకున్ బనిమాలి సాధులన్;
    దమ్ములు లేవు వాని సవిధమ్మున నిల్వఁగ వజ్రపాణికిన్.
    
    మింటికి మంటి కంటి, మితిమీఱిన వాని పరాక్రమంపు పె
    న్మంటలు కాల్చుచుండె భువనమ్ముల; వాని శమింపఁజేయ ము
    క్కంటికి తమ్మికంటికి మగంటిమి చాలకపోయె; నా జగ
    త్కంటకుఁ ద్రుంచి లోకములఁ గావఁగదే! జగదేకమాతృకా!"
    
    అంచు ప్రార్ధించు సురసంచయముల కనిక
    రించి నయనాంచలముల వీక్షించె దేవి;
    అమ్మ హృదయ మ్మెఱింగి మృగాధిరాజు
    "చెంగు" మని లేచి దుమికి గర్జించి నిలచె!
    
    బాణకృపాణపాణు లిరుప్రక్కల ముప్పదిమూడుకోట్ల గీ
    ర్వాణులు శ్రేణులై బలిసిరాన్, మునుముందు మృగేంద్రవాహనా
    సీన భవాని సాగినది చేతఁ ద్రిశూలము నూని సంగర
    క్షోణికినై, క్రుధారుణరుచుల్ కనుగొల్కుల నొల్కవోయుచున్!
    
    అమ్మహిషుం డటుల్ నిజభుజాగ్రమునం గద దాల్చి దైత్య సై
    న్యమ్ములతో సుపర్వనివహమ్ములఁదాకి యదల్చె; కొమ్ములన్
    గ్రుమ్మి విదల్చె; డుల్చిరి విరోధి శిరోధు లమర్త్యు; లీ క్రియన్
    "దొమ్మిది రాత్రు" లొండొరులతో నని సల్పిరి దేవదానవుల్ !
    
    గండరగండఁడౌ మహిషు గర్వము సర్వము కాలరాచి, బ్ర
    హ్మాండము దద్దరిల్ల జగదంబ భవాని మహాత్రిశూలమున్
    గుండెలలోన గ్రుచ్చి, కఱకుం గరవాలున వాని శీర్షమున్
    ఖండనసేసె లోకము లఖండ ముదంబున తాండవింపఁగన్.    

    ఇమ్మహిషాసురప్రతిము లెందఱొ ముందుయుగాలఁబుట్టి వి
    శ్వమ్మున కెగ్గొనర్ప "ననివార్య మహాజనశక్తిగా" సమై
    క్యమ్మయి దుష్టరాక్షసుల గర్వమడంచి జగమ్ము గాతు నం
    చమ్మ భవాని కూర్మి నభయమ్మిడియెన్ సకల ప్రజాళికిన్.
    
    ఇది మహాశక్తి విజయ! మియ్యది దురంత
    దుర్మద దురాక్రమణ దురుద్యోగములకు
    దుర్భర పరాజయమ్ము! ఘాతుక కిరాత
    జాతి పెనుభూతములకు శాశ్వతసమాధి!!
    
    దానవపీడ వీడుట కుదాహరణమ్ముగ దేవలోకమున్
    మానవలోకమున్ భువనమాతృ సమర్చ లొనర్చె; "నిత్య క
    ల్యాణము పచ్చతోరణము"నై భరతావని యుల్లసిల్ల "దే
    వీ నవరాత్ర" శోభ ప్రభవించె సమస్త దిగంచలమ్ములన్ !!

                                     
    
    (జగత్కంటకుడైన నరకుని సంహరించుటకు జగత్పతియైన పతి
    వెంట సంగ్రామరంగానికి వచ్చినది సాత్రాజితి. నరకుడు దుర
    హంకారముతో యుద్దానికి సిద్దపడినాడు. ఆ లోకకంటకుని
    ఆలోకింపగానే సాత్రాజితి కంఠములో జైత్రవాని మ్రోగినది)
    
    రంకెల్ మానుము రాక్షసాధమ! అవక్రమ్మైన చక్రమ్ముతో
    పంకేజాక్షుఁడు వచ్చె నీ శిరము ద్రుంపన్ నేఁడు యుష్మన్మనో
    హంకార మ్మఖిలమ్ము వమ్మయి లయమ్మైపోవ నస్మద్ధను
    ష్టంకారమ్ము పగుల్చు నీ చెవులు! నిశ్శంకుండవై నిల్వరా!
    
    దుర్మార్గుండవు! ధూర్త బుద్ధివి! దురాత్ముల్ నీ చమూనాయకుల్
    ధర్మద్రోహులు పౌరజానపద విధ్వంసక్రియా పారగుల్ !!
    నిర్మర్యాద నికృష్టవర్తణు నినున్ నిర్జించి యీ భూమిపై
    ధర్మస్థాపన చేయవచ్చె జగదంతర్యామి నా స్వామియై !
    
    గ్రామములన్ దహించి, పరకాంతల బల్మి గ్రహించి, దైవత
    గ్రామణులన్ మథించి, ఋషికల్పుల బట్టి వధించి, లోక సం
    క్షేమ నిరోధివౌ నిఖిల జీవ విరోధివి నీవు, "సత్య సం
    గ్రామము?" తప్పదింక, నరకా! "నరకాంతకు" దోయిలింపరా!
    
    "గాజులచేయి కార్ముకము గైకొని రాక్షసరాజుతోడ ఘో
    రాజి యొనర్చుటా" యని తిరస్కృతి సల్పితివే, విశేష వి
    భ్రాజదవక్రవిక్రమ పరాక్రమ భారతవీరనారి సా
    త్రాజితిరా! జగజ్జననిరా! అపరాజితరా! నిశాచరా!
    
    నీవు మనుష్యులన్ బ్రతుకనీవు; మఱిప్పుడు తప్పదయ్యె నీ
    చావు; ప్రజావళీ విజయసౌధములన్ వెలిగించు రేపు దీ
    పావళి దివ్యదీప్తులు, తథాస్తు! నినున్ హతమార్చు విశ్వ వి
    ద్రావణమైన యుష్మదపరాధమ! ఓ  రజనీచరాధమా !!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra