"ఓవర్ రూల్డ్" జడ్జి - అతడి మాటలు పూర్తికాకుండానే అంటూ, సాక్షివైపు చూసాడు. బృహస్పతి కంఠం సవరించుకుని, "మధ్యలో ఎవరినో లిఫ్ట్ అడిగాను. అతడి కారులో వెళ్ళడానికి అరగంట పట్టింది" అన్నాడు.
"షూటింగ్ తాలూకు వాన్ కానీ, మిగతా వాహనాలు కానీ మీకు ఎదురుపడలేదా?"
"లేదు."
"మీ ధాబా మెయిన్ రోడ్ పక్కనుంది. జనరేటర్ శబ్దానికి గానీ, షూటింగ్ హడావుడికిగానీ జనం మూగలేదా? అది నిజమైన రేపో షూటింగో కూడా వాళ్ళకి తెలీలేదా? షూటింగ్ అయిన అరగంటలోనే మీరక్కడికి చేరుకున్నాను అన్నారు. షూటింగ్ జరిపినవాళ్ళు ప్రేక్షకుల్ని లోపలికి రానివ్వలేదనుకుందాం. షూటింగ్ పూర్తిచేసుకుని వాళ్ళు వెళ్ళిపోయాకయినా బయటి జనాలు - అదే ప్రేక్షకులు లోపలికి ప్రవేశించాలి కదా! కనీసం ఆటోగ్రాఫ్ లయినా అడుగుతారు కదా! నీ చెల్లెల్ని ఒకదాన్నీ వదిలేసి అందరూ వెళ్ళిపోయారనుకుందాం. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? ప్రేక్షకుల కంటపడకుండా పావుగంట దాక్కుని, ఆ తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? మీరు ప్రవేశించేసరికి ధాబా తలుపులు తీసే వున్నాయన్నారు. ఈ అరగంటసేపూ ఒక్క కష్టమరూ రాలేదా?"
పి.పి. ఛివాలున కుర్చీలోంచి లేచి "గౌరవనీయులైన డిఫెన్సు లాయరు సాక్షిని అయోమయంలో పడేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ అమ్మాయిని అడగాలి. అంతే తప్ప సాక్షి కేమిటి సంబంధం?"
డిఫెన్స్ లాయరు నవ్వాడు. "బృహస్పతి ప్రాసిక్యూషన్ వారి సాక్షి కాదు యువరానర్! నా సాక్షి!! ముద్దాయిల్ని అతడే రక్షించబోతున్నాడు."
"కోర్టులో సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. లాయరు ఒక ఫైలును జడ్జి ముందుకు తోస్తూ "టీ.వీ. లో ప్రసారమైన ప్రోగ్రాంల తాలూకు వివరాలు యువరానర్" అని ఒక క్షణం ఆగి గుండెలనిండా బలంగా శ్వాస పీల్చుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు.
.... బృహస్పతి చెప్పిన సాక్ష్యమే వాస్తవమైన పక్షంలో, ముద్దాయి దావూద్ హర్షద్ ఆ రోజు సాయంత్రం సరిగ్గా ఆరింటికి రేప్ జరిగిన స్థలంలో వుండాలి. కానీ అతడు ఈ ఊరినుంచి బొంబాయి బయలుదేరే ప్లైట్ లో వున్నాడు. ఆ రోజు ఆ ప్లైట్ సరయిన సమయానికే బయలుదేరినదనడానికి సాక్ష్యం ఏవియేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన ఈ చార్ట్! దీన్ని బట్టి బృహస్పతి, అతడి చెల్లెలు కలిసి ఆడిన నాటకం అర్ధమవుతోంది కదా! కేవలం కేంద్రమంత్రులని బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారన్నది తిరుగులేని వాస్తవం. ఆరింటికి హిమసమీరని రేప్ చేసిన దావూద్ హర్షద్ అదే సమయానికి ఫ్లయిట్ లో ఎలా వుంటాడు? ఈ ఒక్క కారణం ఆధారంగా ముద్దాయిని విడుదల చేయవలసిందిగా కోర్టువారిని కోరుతున్నాను" ముగించాడు డిఫెన్సు లాయరు.
ఆ తర్వాత రోజు జడ్జిమెంటు వచ్చింది.
"డిఫెన్సు వాదనతో కోర్టు ఏకీభవిస్తోంది. ఒక రోడ్డుపక్క హోటల్ లో రేప్ చేసి, పబ్లిక్ లో దాన్ని లైవ్ గా ప్రసారం చేస్తే, ఆ విషయం హైవే ట్రాఫిక్ జనాలకి అనుమానాస్పదం కాలేదన్నది నమ్మశక్యంగా లేదు. బృహస్పతి ఇచ్చిన సాక్ష్యం కూడా వాస్తవానికి విరుద్ధంగా వుంది. అతని చెల్లెలి రేప్ జరిగిన టైమ్ లో ముద్దాయి అక్కడ లేడని బలమైన సాక్ష్యాలున్నాయి. ఇదంతా కేవలం అధికారం, డబ్బు ఉన్నవారిని బ్లాక్ మెయిల్ చేయడానికి నిర్దేశించుకున్న వ్యవహారమని అర్ధమవుతోంది. పవిత్రమైన శీలాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచన హిమసమీరకూ, ఆమె అన్నయ్యకూ కలిగినందుకు వారిని శిక్షించాలి. అవివాహితురాలైన చెల్లెలి పరువు మర్యాదల్ని ఈ విధంగా అమ్ముకోవాలని అనుకోవడమే హేయమయిన చర్య! కోర్టు దీన్ని గర్హిస్తోంది. ప్రధమ తప్పిదంగా బృహస్పతినీ, అతడి చెల్లెల్నీ హెచ్చరింఛి వదిలేస్తోంది."
* * *
"హలో"
కోర్టు మెట్లు దిగుతున్న బృహస్పతి నెమ్మదిగా తలెత్తి పక్కకి చూశాడు. సంకల్పనాథ్ రే నవ్వాడు. "....చూశావా? ఎంత తెలివిగా దెబ్బకొట్టానో! నాకు చాలా ఆనందంగా వుంది. రాజకీయపు టెత్తులతో బోర్ కొట్టిన నాకు ఈ వ్యవహారం కాస్త వెరైటీగా, భలే గమ్మత్తుగా వుంది. మనం మన తెలివితేటలకి అప్పుడప్పుడే గీటురాయిలాగా ఇలాంటి పరీక్షలు పెడుతుండాలి. అప్పుడే మెదడు షార్స్ అవుతుంది. ఇంతకీ జరిగినదేమిటో ఊహించగలవా నువ్వు?"
బృహస్పతి అతడివైపు బ్లాంక్ గా చూశాడు.
"టీ.వీ.లో ఈ రోజు నాటకం నువ్వనుకున్నట్టు అయిదు నుంచి ఆరింటివరకూ రాలేదు. 4.30 నుంచి 5.30 వరకూ వచ్చింది"
బృహస్పతి నమ్మలేని ఈ నిజాన్ని విని నిర్ఘాంతపోయాడు.
సంకల్పనాథ్ రే పెదాలమీద మళ్ళీ వికృతమైన చిరునవ్వు వెలిసింది. "నేను ఏ ప్లాన్ వేసినా అంత పర్ ఫెక్ట్ గానే వేస్తాను. ఆ సాయంత్రం నీ చెల్లెల్ని రేప్ చేయించాలని అనుకున్నాను. 'ది రేప్' అన్న నాటకం సాయంత్రం అయిదింటికి ప్రసారమవుతుందని పేపర్ల ప్రోగ్రామ్ షీట్ లో వేయించాను. కానీ 4.30 కే అది ప్రారంభమయింది. ఇంత చిన్న విషయాన్ని జనాలు పెద్దగా గుర్తుంచుకోరు. నీకింకో విషయం తెలుసా? నా గదిలో గడియారం ముళ్ళని అరగంట ముందుకి జరిపాను. అది చూసి నువ్వు కూడా అయిదింటికే నాటకం ప్రారంభమయిందని అనుకున్నావు. ఈ విధంగా మీరందరూ భ్రమలో పడ్డారు. 5.30కి రేప్ పూర్తికాగానే దావూద్ హర్షద్ ధాబా నుంచి డైరెక్ట్ గా విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడర్ధమయిందా- వెంట్రుక వాసి పొరపాటు కూడా జరక్కుండా ఎంత గొప్పగా నేనీ ప్లాన్ చేశానో?" సంకల్పనాథ్ రే మోహంలో చిరునవ్వు కొనసాగింది.
".... ఒకసారి క్లోజ్ చేసిన కేసుని సాధారణ పరిస్థితుల్లో కోర్టు తిరిగి స్వీకరించదు. నేను చెప్పినదంతా నిరూపించాలన్నా నీ దగ్గర ఇంకేం సాక్ష్యం లేదు. నీకు ఇంకొక్క రోజు టైమ్,మిస్తున్నాను. ఆ డైరీలు తీసుకొచ్చి నీ అంతట నువ్వు అప్పజెప్పకపోతే నేను వేయబోయే రెండో ఎత్తు మరింత దారుణంగా వుంటుంది. ఆలోచించుకో!' అంటూ మెట్లు దిగి కారెక్కి వెళ్ళిపోయాడు.
విశాలమైన కోర్టు మెట్లు పరిహసిస్తున్నట్లు నిర్మానుష్యంగా మిగిలిపోయింది.
20
"ఎందుకురా అంత బాధపడతావ్? ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం మనం శాయశక్తులా ప్రయత్నించాం. ఓడిపోతే అదివేరే సంగతి."
"దీనికోసమేనా మనం హిమసమీరను బోనులో నిలబెట్టిందీ! ఫోటోలతో సహా పేపరుకీ ఎక్కించిందీ!! కోర్టులో యక్ష ప్రశ్నలతో వేధించిందీ!!!"
శ్రీహర్ష సమాధానం చెప్పలేదు.
బృహస్పతి తిరిగి అన్నాడు, "....నాకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఒక చిన్న ఈగ- ఆహారానికి ఆశపడి, సాలెగూడులో ఇరుక్కుపోయినట్టు నేను ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాను. నేను చాలా చిన్నవాణ్ణిరా! నా శత్రువుల బలం తల్చుకుంటే వళ్ళు గగుర్పొడుస్తోంది. అసలు వాళ్ళకీ, నాకూ పోలికేమిటి? వాళ్ళతో పోరాటం ఏమిటి?"
"జరిగేదేదో జరక్కమానదు. నువ్వు అనవసరంగా దిగులుచెందకు."
ఈ పరిస్థితుల్లో కూడా ఆ మాటలకి బృహస్పతి మొహం మీద జీవంలేని చిరునవ్వు కదలాడింది. "ఇది దిగులు కాదు.... భయం. సంకల్పనాథ్ రే నాకు ఇరవై నాలుగు గంటలు టైమిచ్చాడు. ఈలోగా అతనికి ఆ డైరీలు అందెయ్యకపోతే.... నువ్వన్నట్టు- జరిగేదేదో జరక్కమానదు."
బృహస్పతి చెబుతున్న దాంట్లో నిజం వున్నట్టు శ్రీహర్ష కొంతసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్ళిపోయాడు. బృహస్పతి ఒంటరిగా మిగిలాడు.
ధాబా నిర్మానుష్యంగా వుంది.
రోడ్డు కిరువైపులా వున్న చెట్లు తాలూకు నీడలు విశాలంగా పరుచుకుంటున్నాయి. నెమ్మదిగా చీకటి పడుతోంది. ఆ వాతావరణం, ఆ చీకటి, ఒంటరితనం అతడి మనసులోని భావాన్నే ప్రస్పుటిస్తున్నట్లు వున్నాయి.
అతనికేం చెయ్యాలో తోచలేదు. ఆలోచన ఒక నిర్దిష్ట గమ్యానికి చేరుకోవడంలేదు.
అతడికి అర్ధంకానిది ఒక్కటే!
తను చెప్పినదాన్ని- సంకల్పనాథ్, అతడి అనుచరులు ఎందుకు నమ్మడం లేదు? తన దగ్గర వారి తాలూకు ఫోటోలూ, డైరీలూ లేవన్న విషయం వారికి నమ్మకం ఎందుకు కుదరడంలేదు.
వాళ్ళు తన చెల్లెల్ని రేప్ చేశారు! కోర్టు తననీ, తన చెల్లెల్నీ అభిశంశిస్తూ తప్పంతా తమదేనన్నట్టు తీర్పు చెప్పింది!! అయినా తను ఊరుకున్నాడు.
తన దగ్గరేకానీ ఆ డైరీలూ, ఫోటోలు ఉన్నట్టయితే ఊరుకునేవాడా?....తనే కాదు. ఏమాత్రం పౌరుషం ఉన్నవాడయినా ఊరుకోడు. వాళ్ళ బండారం మొత్తం బయటపెడతాడు.
దీన్నిబట్టే తెలుస్తోంది కదా- తన దగ్గర సాక్ష్యాలు లేవని! మరి వాళ్ళెందుకీ విషయంలో....
చప్పున బృహస్పతి ఆలోచన అక్కడ ఆగిపోయింది.
అప్పుడు అర్ధమయింది.
వాళ్ళు తనని ఎందుకు అనుమానిస్తున్నారో అవగతమైంది.
నిధి!!!....
ఇప్పుడు తను ఆ డైరీల విషయం కోర్టులో ప్రస్తావిస్తే దానితోపాటు నిధి ప్లాన్ కూడా చెప్పాలి. రాజా విక్రమ్ దేవ్ వారసులు ఆ నిధిని క్లెయిమ్ చేస్తారు. దాన్ని వాళ్ళకి అర్పించుకోవలసి వస్తుంది.
ఇవన్నీ ఆలోచించే - తను కోర్టులో ఆ డైరీల విషయం బయట పెట్టలేదని సంకల్పనాథ్ అనుకుంటున్నాడు. అతడి దృష్టిలో తను చాలా స్వార్ధపరుడు. చెల్లెల్ని రేప్ చేసినవాళ్ళు శిక్షింపబడకపోయినా ఫర్వాలేదు కానీ, డబ్బు వదులుకోవడానికి ఇష్టపడనంత స్వార్ధపరుడు! చెల్లెలి శీలంకన్నా తనకి కోట్ల రూపాయలే ముఖ్యమయినవని సంకల్పనాథ్ నమ్ముతున్నాడు.
బృహస్పతికి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.
చెల్లెలి పరిస్థితే ఘోరంగా వుంది.
ఈ విచిత్రమైన కేసు గురించి దేశమంతా తెలిసిపోయింది. శ్రీహర్ష ఆమెని వివాహం చేసుకోవచ్చు. అది వేరే సంగతి. ఆమె ఒక టీ.వి. ఆర్టిస్టు! ఆమె 'రేప్' లైవ్ ప్రోగ్రామ్ లో జరిగిందని "తామే" కేసు పెట్టారు. అన్ని పత్రికలూ, ప్రముఖంగా ఆ వార్తని ప్రకటించాయి. ఆమె మొహం ఆంధ్రదేశమంతటా పరిమితమే! ఇప్పుడామె ఈ జనం మధ్య ఎలా తలెత్తుకు తిరగ్గలదు? ఎక్కడికి వెళ్ళినా జీవితాంతం గుర్తుపడతారే!
కేవలం రేప్ కాబడిన స్త్రీగా అయితే కనీసం సానుభూతైనా ఉంటుంది. ఇప్పుడలా కాదు, రేప్ జరిగిందని తప్పుడు కేసు పెట్టిన ముద్దాయిలు తాము!!
ఎంత ఘోరమయిన స్థితి!!!
ఒకవేపు ఆవేశం.... మరొకవైపు నిస్సహాయత!
అతడీ ఆలోచనలో కొట్టుమిట్టాడుతుండగానే దూరంగా ఎదో అలికిడి వినిపించింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. మరో నిముషానికి అతడిముందు పొడవుగా ఓ నీడ పడింది.
ఆలోచన చెదిరి అతడు తలెత్తి చూసాడు.
ప్రశాంత నివాళి ఎదురుగా నిలబడి వుంది.
* * *