Home » Dr. dasaradhi rangacharya » Dasarathi Rangacharya Rachanalu - 7


                                       శాలువ

    సర్వర్ కు ఎలా చెప్పడం? ఎలా సమాధానపర్చడం? తల్లికి అది సాధ్యం కాలేదు. ఆమె ఓడిపోయింది - కాదు - మాతృహృదయం ఓడిపోయింది. ఆమె వార్ధక్యపు బరువుకు కుంగిపోయింది. శక్తి ఉడిగింది. పగిలిన ట్రంకుపెట్టెకు తాళ్లుకట్టి వసారాలో పెట్టేరోజు వచ్చేసింది. సర్వర్ పురికొసతో కట్టిన పక్కచుట్ట పెట్టెమీద పెట్టాడు. పళ్లెం, పాందాన్, లోటా పక్కన పెట్టేశాడు. ఆమెకో బురఖా ఉంది. అది పాతబడ్డది. చిరుగులు పడ్డాయి. దాన్ని బాగుచేసింది కోడలు. తెచ్చి అందించింది. బురఖా అవసరం అయిన వయసుకాదు ఆమెది. పరువం దొర్లిపోయింది. వదనంలో వర్చస్సులేదు.
    ఆమె వేసుకునే 'సలీంషాహి' చెప్పులు అరిగిపోయాయి, విరిగిపోయాయి. వాటినే వేసుకుంటుంది. అవి సగం కాళ్లకే వస్తాయి. ఆ చెప్పుల్తో 'సటర్ పటర్' మంటూ ఇల్లంతా తిరుగుతూంది. ఆమె చెదిరిన స్మృతులను కూడగడ్తూంది. సర్దాల్సిన వస్తువులను గురించి ఆలోచిస్తూంది. ప్రయాణానికి ముందు ఒకరకపు భయం ఆవహిస్తుంది. అలాంటి గుబులు పట్టుకుంది ఆమెకు.
    ఆమె గది దాటింది. అంతే మనుమడు తోఖిర్, అతని చెల్లెలు 'జమాల్' గదిలో ప్రవేశించారు. సర్వ్ ప్రారంభించారు. అక్కడ ఉన్నదల్లా విరిగిన సామాగ్రి కుప్ప - దానిమీద సాలీళ్ళగూళ్లు! ఆ కుప్పకు ఈ ముసలమ్మ కాపలా! ధనరాసులకు కాపుంటుందంటారే సర్పం, అలా కాపుంటుందా కుప్పకు. మనవలకు బామ్మను సతాయించాలని సరదా. తమలపాకు తొడిమపడుంది. దాన్ని అందుకుంది జమాల్. 'బేటా! ఏమిటి తీశావు? అది నాకు అక్కరకు వచ్చేది' అనేసింది. అంతదూరం నుంచి కనిపిస్తుందా ఏమన్నా. ఏదో అనాలని అనేసింది.
    'తమలపాకు తొడిమ.....' తొడిమ చూపుతూ అన్నది జమాల్.
    "ఏదీ చూస్తా" అంటుంది. అరచేతిలో వేసికొని కంటి దగ్గరగా పెట్టుకొని చూస్తుంది. అప్పుడు గాని నమ్మకం కుదరదు ఆమెకు. అయినా ఊరుకోదు. 'ఏమిటా వెధవ అలవాటు ప్రతీది అందుకుంటావు" అని గునుస్తుంది.
    ఈ పిల్లలు ఆమె మెడమీది కత్తిలా తయారయ్యారు. తలప్రాణం తోకకు తెస్తున్నారు. మనవలంటే ఆమెకేం ద్వేషంలేదు. డబ్బు దగ్గరున్న దోషం అది. ఉన్నవారి గుండెలు ఎప్పుడూ దడదడలాడుతుంటాయి. వారికి సర్వత్రా దొంగలే కనిపిస్తారు.
    నలుగురు కొడుకులు, ఒక కూతురూ పాకిస్తాన్ వెళ్లిపోయారు. మిగిలినవాడు చిన్న కొడుకు 'సర్వర్' క్లార్కు ఉద్యోగం వెలగపెడ్తున్నాడు. ఇది పాతకొంప. తండ్రి తాతల సొత్తు. ఈ కొంపలో దీపం పెట్టడానికి ఉన్నాడు సర్వర్. కొంప చాలా పాతది. అమ్మ నడుంలాగే వంగింది. దానికి పళ్లులేవు. రాలిపోయాయి. అత్తకింద సంసారం చేయడం సర్వర్ పెళ్ళానికి గిట్టదు. అత్తేమో ఇల్లు వదలనని కూర్చుంది. కోడలు మెడమీద అంకుశంలా నిలిచింది.
    అది పాతకొంప. కొంపలా లేదు. గోడులా ఉంది. అందులోకి కోడళ్లు వచ్చారు. వారికి పిల్లలు కలిగారు. ఆమె వెనక్కు జరుగుతూ పోయింది. ఇప్పుడామె ఉన్నది ఇల్లుకాదు. కొట్టిడి. కప్పు కురుస్తుంది. అయినా దాన్నే పట్టుకొని కూర్చుంది. ఎక్కడెక్కడినుంచో తెస్తుంది. ఏవేవో తెస్తుంది. అక్కడ దాస్తుంది. అవన్నీ వెధవ సామాన్లు, పారేయాల్సినవి అని కోడళ్ల అభిప్రాయము.
    అక్కడ విరిగిన ముక్కలున్నాయి. చిలుంపట్టిన తక్కుంది. రంగు రంగుల గాజుముక్కలున్నాయి. కత్తిరించిన బట్టల ముక్కలున్నాయి. పాతబొమ్మలున్నాయి. ఆ బొమ్మలు ఆమె బిడ్డలవి. బిడ్డలకూ అవి పనికిరానివ్వాళ. వీటన్నింటినీ సందుకల్లో పెట్టి దాచింది. జాగ్రత్తగా కట్టిపెట్టింది. పురాతన స్మృతులను భద్రపరచుకున్నంత పదిలంగా భద్రపరచింది.
    వాటిల్లో ఒక జరీ చొక్కా ఉంది. అది ఆమె తండ్రి పెండ్లికి కుట్టించింది. కొన్ని పింగాణీ రికాబీల ముక్కలున్నాయి. ఆ రికాబీలు వాళ్ళమ్మ పుట్టింటినుంచి అరణంగా తెచ్చినవి. వాటిల్లో ఆమె తండ్రి బొంత ఉంది. అతని తాతకు సంబంధించిన చారిత్రాత్మకమైన శాలువా ఉంది.
    ఆమె జీవితపు అన్ని పోరాటాల్లోనూ ఓడిపోయింది. ఇప్పుడు దరిలేని జీవన సముద్రంలో మునకలు వేస్తూంది. అలాంటప్పుడు ఆ శాలువ మీద అభిమానం ఏర్పడింది. అది సముద్రంలో దీవిలా ఉపకరిస్తూంది. మునగకుండా కాపాడుతూంది. ఆమె ఉన్నది చీకటీ కొట్టాడి. అందులో ఈ శాలువ వేయి క్యాండల్స్ బల్బుగా వెలుగునిస్తూంది. ఆ వెలుగులో ఆమె కఠినాతికఠినం అయిన మార్గాన్నయినా పయనించగలదు.
    శాలువతో పట్టేంలేదు. అది అప్పడంలా ముక్కలయింది. అయినా జరీ ఉంది. అందులోంచి కొన్ని సేర్ల వెండి రాగలదు. ఈ విషయం ఒకానొకనాడు సర్వర్ భార్య భర్తతో చెప్పింది.
    మర్నాడు ముసలమ్మ గది వదిలివెళ్ళింది. ఆమె మేనల్లుడు జబ్బుగా ఉన్నాడు. చూచిరావడానికి వెళ్ళింది. పెళ్ళాం మొగుడూ కలిశారు. శాలువ జాగ్రత్తగా తీశారు. దాని స్థానంలో పెళ్ళాం తన పాత దుప్పటి ఉంచింది. జాగ్రత్తగా పెట్టె మూసింది. పెట్టెమీది మూటలు మళ్ళీ మామూలుగా సర్దింది. దానిమీద మూటలు, నల్లమందు డబ్బా, మందుల సీసాలు వగైరా అన్నీ ఉన్నది ఉన్నట్లు ఏర్పాటుచేశారు. దుమ్ముకు తప్ప దేనికీ స్థానచలనం కలిగినట్లు కనిపించదు.
    అన్నిటినీ దింపి, పెట్టె తెరిచి, శాలువను చూచుకొనేంత శక్తిలేదు ముసలమ్మకు. కాబట్టి కోడలు పెట్టిన పాత దుప్పటినే శాలువ అనుకుంటూ బతుకు లాగుతూంది. దాన్ని కాపాడ్డానికి రాత్రిళ్లు నిద్రపోదు. కోడలు మీదికి వంటికాలిమీద లేస్తుంది. కొడుకంటే లెక్కేలేదామెకు. ఏమిటీ పైస పైసకు పరితపిస్తాడు? తానో-శాలువ అమ్మితే సామ్రాజ్యాన్ని కొనేయగలదు. శాలువ ఆమె సర్వస్వం, దాన్ని కాపాడ్డానికి రంగు రంగుల కలలు వాకిటిదాకా వచ్చి నిలిచిపోతాయి. ఏమాత్రం కన్ను మలిగినా శాలువ ఉండదు. అదిపోతే ఆమె అందమైన బాల్యం పోతుంది. సొగసైన కౌమార్యం పోతుంది. వివాహ జీవితపు మాధుర్యం పోతుంది. ఈ ముసలితనపు ముక్కిళ్ళో....ఇన్నిటికోసం ఏడవడానికి కన్నీరేది? ఏడ మిగిలింది? ఎక్కడ ఉంది? అందుకోసమే అయిదుగురు బిడ్డల్ని మరిచింది. వారి సంతానాన్ని మరిచింది. అక్కణ్ణుంచి వచ్చే ప్రతి ఉత్తరంలోనూ తల్లికోసం పరితాపమే ఉంటుంది. వారికేంతెలుసు దేనికోసం తల్లి ఈ ఇంటిని అంటిపెట్టుకొని ఉందో? చిన్నకొడుకు మీద పడిచస్తూందంటారు. అయినా స్వదేశం వదల్లేదనుకుంటారు కాని ఈ కొట్టిడిని నరకంలో పారేయండి. అక్కడా ఆమె హాయిగా ఉండగలదు. అక్కడా ఆమె సందుగను ఆనుకొని జపమాల తిప్పగలదు. అక్కరకు రెండు మూడుసార్లు తప్ప ఆకాశం ముఖం చూడదామె-అది హిందూస్తాన్ ఆకాశం అయితేనేం? పాకిస్తాన్ ఆకాశం అయితేనేం?
    అప్పుడప్పుడు జమాల్ ముసలమ్మ కొంగు పట్టుకొని "అవ్వా! మా ముత్తాత శాలువ చూపెట్టవా?" అని గీమాలుతుంది.
    "చూపిస్తాలే" అని తప్పుకొనేది. ఆమెకు పెట్టె తెరవడం ఇష్టంలేదు. సామాను పరచడం అంటే భయం. ఎంచేతంటే మనవలు సామాను మీద పడ్తారు. ఒకరు రంగుల అద్దాలు లాక్కొని ఉరుకుతారు. ఇంకొకరు మట్టిబొమ్మ అందుకుని మాయం అవుతారు. ఇలా దానం చేయడం మొదలుపెడ్తే ఇన్నింటిని ఎలా కూడబెట్టకలిగేది? ఆ కూడబెట్టడంలో ఉన్న కష్టం ఏమిటో ఆమెకో తెలియాలి. ఇందుకోసం ఆమె అన్ని సుఖాల్ని వదులుకుంది.
    ఇహ మిగిలిన రోజులు ఇలాగే వెళ్ళబుచ్చాలనుకుంది. ఇంతలో పెద్దకొడుకు నుంచి ఉత్తరం వచ్చింది. మనవరాలు పెళ్ళి నిశ్చయం అయింది. ఆమె ఇప్పుడు రాలేకుంటే ఎప్పటికీ రాలేదని రాశాడు కొడుకు. ఆ మూటల కింద ముసల్ది బంగారు ఇటుకలు దాచిందని కొడుకుల నమ్మకం. ముసల్ది గుటుక్కుమంటే సర్వర్ అదృష్టం పండుతుందని వాళ్ళమంట.
    ముసలమ్మకు కొట్టిడిలో సంపద ప్రాణంలా ప్రియమైందేగాని ప్రాణం మాత్రం కాదుగా! ఎవడికి తెలుసు అమాంతంగా కళ్లుమూస్తే పాకిస్తాన్ లో బిడ్డలు పిలుస్తూనే ఉండిపోతారు. అందుకే ఆమె పాకిస్తాన్ వెళ్ళడానికి అంగీకరించింది. దాంతో సర్వర్ అదృష్టం పండింది. పాస్ పోర్టు తయారుచేయించాడు. వెంట వెళ్ళడానికి ఒక మిత్రుణ్ణి వెదికి వెలికితీశాడు. కోడలు గబగబా ముసలమ్మ సామాను బయటపెట్టింది. కోడలుకు ప్రేమ అమాంతంగా పుట్టుకొచ్చింది. మంచినేతివని వనస్పతిలో ఖర్జూరకాయలు వేపి పెట్టింది.
    శాలువ అతి విలువయింది. దాన్ని వెంట తీసికెళ్ళడం బాగనిపించలేదు. అక్కడ కొడుకులు ఆమాటా ఈమాటా చెప్పి లాగేసుకున్నా లాగేసుకోవచ్చు. అందుకే పెట్టెలో పట్టినన్ని పెట్టుకుంది. కొట్టిడికి తాళం పెట్టింది. తాళాన్ని చూస్తే ఆమె కళ్లకు వరదలు వచ్చాయి. ఆమె జీవితపు జయాపజయాలు మూటకట్టి అందులో దాచుకుంది. అందుకే ఆమె గుండె పొంగింది. కోడలు మీదపడి ఏడ్చింది.
    'ఈ కొట్టిడి నీకు అప్పగిస్తున్నాను. నా తరవాత ఇదంతా నీదే' ఈ మాట ఆమె బాగా ఆలోచించే అన్నది. ఎంచేతంటే కోడలుకు నమ్మకం కలగాలని, ఆమె తొందర పడొద్దని!
    'అవ్వా, మా ముత్తాత శాలువ ఏ పెట్టెలో దాచిపోతున్నావు?' తోఖీర్ అడిగాడు. 'వెధవ,  వెళ్ళేప్పుడు సతాయిస్తాడు' అని కొడుకును నాలుగు బాదింది తల్లి. తాను కొట్లోని ఏ వస్తువూ అంటుకోనని ప్రమాణం చేసి చెప్పింది ముసలమ్మకు.
    రైల్లో కూర్చుంటే ఆమె ప్రాణం హాయిగా ఉంది. గదికి ఆలీగఢ్ తాళంవేసి వచ్చింది. అది చాలా లావుపాటిది. ఎంతా మూన్నెల్లేగా అనుకుంది. సంచీలో తాళంచేయి చూచుకుంది.
    బొంబాయి చేరారు. వారంరోజులు హోటల్లో ఉండాల్సి వచ్చింది. ఆఖరుకు అల్లా అల్లా అని అవ్వ ఓడలో కూర్చుంది. సర్వర్ స్నేహితుడు వెంట ఉన్నాడు. అతడు జేబులోంచి ఒక కార్డు తీశాడు. అది ఆమె మనవడు తోఖీర్ రాసింది. మంచి ఉర్దూలో రాశాడు. సర్వర్ మిత్రుడు చదివి వినిపిస్తున్నాడు.
    "ప్రాణసమానురాలైన నాన్నమ్మకు,
    పాదాభివందనములు. ఇక్కడ మేమంతా క్షేమం. మీ క్షేమం తెలియపరచవలెను. ఇంకను విశేషములేమనగా, మా ముత్తాతగారి శాలువ ఎక్కడను కనిపించలేదు. నేనూ జమాల్ గది సాంతం గాలించాం. శాలువ ఎక్కడ దాచిన విషయం తిరుగు టపాలో తెలియజేయవలసినది.
                                                                              మీ సేవకుడు
                                                              తోఖీర్ మీర్జా-అయిదవ తరగతి (అలీఫ్)
                                                                      స్వదస్తూరితో రాసినది."
    సర్వర్ మిత్రుడు ఉత్తరం వినిపించాడు. చూస్తే ముసలమ్మ శాలువ వెదకడానికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆశ్చర్యంతో ఆమె నోరు తెరిచేవుంది. శాలువను పట్టుకొని వ్రేలాడుతున్నట్లు పిడికిళ్లు బిగించి ఉన్నాయి.

                                                                             * * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra