Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    దానికితోడు సంజీవరావు, వైకుంఠం, తురంగరావూ మొదలైన వాళ్ళంతా అతన్ని ఆటపట్టించటం సాగించారు.
    "మాలతిగాలి మళ్లిందేమోయ్" అని ఒకడూ.
    "నిన్న మృత్యుంజయరావూ, నేడు శేఖరం, రేపు ఎవరివంతో?" అని యింకొకరూ.
    "మొత్తంమీద శేఖరం మృత్యుంజయరావుమీద దెబ్బతీశాడు" అని మరొకడూ వేళాకోళం పట్టిస్తున్నారు. ఇదివరకు యితన్నిగురించి ఎలా గుసగుసలాడుకునేవారో యిప్పుడు శేఖరం, మాలతుల గురించి అంత ఉధృతంగా చర్చలు సాగిస్తున్నారు.
    తల్లి మరణించిన దాదిగా ఆవరించిన విరక్తినుండి అతనింకా కోలుకోలేదు. వీటన్నిటినీ ప్రాపంచక విషయాలుగా త్రోసిపుచ్చి ఎంత పట్టించుకోకూడదన్నా లోపలనుండి ఉబికి వస్తూన్న నైజం గుణం అతన్ని చిత్రవధకు గురిచేయకుండా వుండలేకపోయింది.
    తనకి మాలతిమీద ఆశవుండదా! వుండవచ్చు. కాని అది దురాశ అనీ, నెరవేరదనీ తెలుసు. కాని ఒకప్పుడు మాలతివద్ద అతని అంతస్థు చాలా ఉన్నతంగా వుండేది. శేఖరంకూడా అసూయపడేటంతటి దశలో వుండేవాడు. ఇప్పుడాస్థితి తారుమారైపోయింది. శేఖరం తనని ఓడించి చిత్తుచేశాడు. ఆనాడు మంజులతవద్ద శేఖరంవల్ల పరాభవానికి గురి అయాడు. ఇప్పుడిది రెండో పరాభవం. శేఖరం కనిపిస్తే ముఖమెత్తి చూడలేకపోతున్నాడు. చాటుచాటుకు త్రిప్పుకుంటున్నాడు. "నేను వీటన్నిటికి అతీతంగా వుంటాను. నన్ను నేను పరిశుద్ధంగా నిర్మించుకుంటున్నాను. ఎవరెట్లాపోయినా నాకనవసరం" అని ప్రతిక్షణం అనుకుంటున్నాడు. కాని అంతలోనే అది దూదిపింజలా ఎగిరిపోతుంది. అతని గుండెల్లో మంట, అసూయజ్వాలలు ఎగచిమ్ముతాయి. వెంటవెంటనే చచ్చిపోయి మరోజన్మ- అందంగా, ప్రకాశవంతంగా, గొప్పవాడిగా పుట్టి అందర్ని చకచక ఓడించాలని వుండేది. కాని అప్పుడతను పాత మృత్యుంజయరావుగా ఎక్కడో ఓ మారుమూల నిల్చుండి ప్రతి సన్నివేశం అవలోకిస్తూ వుండాలి. తనకు అన్నీవుండాలి. అన్నీ తెలియాలి. తను సర్వజ్ఞుడు కావాలి.    
    గదిలోంచి కదలటం మానేశాడు. ఇప్పుడు జగతి లేదు, తల్లి లేదు, మాలతి లేదు. ఏదన్నా పుస్తకం పట్టుకొని కూర్చుంటాడు చదువుదామని. ఏకాగ్రత కుదరదు. పుస్తకం మూస్తాడు. అటూ యిటూ తిరుగుతాడు. ఆ గదిలో అతనికో స్నేహితుడున్నాడు. గోడమీద వ్యక్తి. గోడమీద బూజులోంచి, ఏదో బొమ్మనుండి, సున్నం పెచ్చులు వూడి బయటకు కనిపిస్తూన్న ఇటుకనుండి దర్శనమిస్తాడు. తర్జనితో బెదిరిస్తాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. ఎగతాళి చేస్తాడు. ఏదో అంటాడు. తికమకపెడతాడు.
    ఎప్పుడన్నా పనిమీద బజారు వెళ్ళినప్పుడు, ఒకటి రెండుసార్లు మాలతీ శేఖరాలు ఏదో షాపింగ్ చేస్తూ కనిపించారు. మృత్యుంజయరావు ముఖం త్రిప్పుకునే లోపలే మాలతి అతనివంక చూసి నవ్వింది. ఆ నవ్వులో నిరాదరణగాని, ఏదో కొత్త విషయం జరుగుతూన్న సూచనగాని, నూతన సత్యాలుగాని లేవు. మామూలుగా, యిదివరకటి మాలతిలాగే నవ్వింది. అతనూ బలవంతాన ముఖంలోకి నవ్వు తెచ్చుకుని, పని వున్నట్లు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    చిలకమ్మగారు యిల్లంతా మరదలి బాధ్యతకు వప్పచెప్పి, మేనల్లుడ్ని తీసుకుని కాశ్మీరుకు బయల్దేరి వెళ్ళింది. తిరిగివస్తూ కలకత్తా, కాశీ అన్నీ చూసి వస్తుందిట. వాళ్లు వెళ్లినప్పటినుంచీ ముసలాయనా, కొడుకూ కలగా పులగంగా యింట్లోనే పడుకుంటున్నారు. నానాభీభత్సం చేస్తున్నారు.
    ఒకరాత్రి అతను ఏకాంతం భరించలేక, నిద్రపట్టక సెకండ్ షో సినిమాకు వెళ్ళాడు. వెళ్ళేసరికి బాగా ఆలస్యమైపోయింది. సినిమా మొదలుపెట్టేశారు. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి, ఖాళీగావున్న చోటును చూసుకుని కూర్చున్నాడు. సినిమా చూస్తున్నాడు. కాసేపటికి అతనికళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. మల్లెపూలు సిగలో తురుముకుని, సువాసనలు విరజిమ్ముతూ ముందువరుసలో కూర్చున్న యుఅతి మాలతిలా కన్పించింది. ఆమెప్రక్క కూర్చున్న యువకుడు శేఖరంలా కనిపించాడు. అతని రక్తం ఘనీభవించినట్లయింది. సినిమా కనబడటం మానేసింది. ఎందుకొచ్చానురా అని తిట్టుకున్నాడు. లేచి వెళ్ళిపోదామా అని ఆలోచనలు చేశాడు. అయినా కదలకుండా కూర్చున్నాడు.
    ఇంటర్ వెల్ లో లైట్లు వెలిగాయి. అతనిగుండె వేగం మందగించింది. అవును, ఆ యిద్దరూ వాళ్ళే. తలలు త్రిప్పి తనను చూస్తారేమోనని కదలకుండా ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నాడు. అతని అదృష్టవశాత్తూ వారిద్దరిలో ఎవరూ వెనక్కి తిరిగి చూడలేదు. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరి భుజం మరొకరికి తాకుతోంది. దృశ్యం అతనికి భరించరానిదిగా తోచింది. 'ఎందుకిట్లా జరిగింది? మాలతి యింత హఠాత్తుగా ఎందుకు దిగజారిపోయింది? శేఖరం ప్రవర్తన, అతని నైజగుణం ఆమెకి తెలియదా? ఆమె విద్యావతి, తెలివిగలది, సంస్కారవతి అనుకున్నాను. ఎందుకిలా అయింది?' మళ్ళీ ఆలోచనలు యింకోరకంగా సాగాయి. 'అసలిందులో తప్పు పట్టటానికేముంది? మాలతి పెళ్ళి చేసుకోవాలన్న తలపులో వుంది. ఆమె ఇంట్లోకూడా ఆమె పెళ్లినిగురించి పట్టుబడుతున్నారు. శేఖరం అవివాహితుడు, అందగాడు. అతన్లో అనేక దోషగుణాలు వుంటే వుండవచ్చు. అది వేరే విషయం. వారిద్దరూ ఒకరిపక్క ఒకరు కూర్చుంటే చిలకా గోరింకల్లా చూడముచ్చటగా వున్నారు. మాలతి అతన్ని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకున్నదేమో. వారిద్దరూ ఒక ఒడంబడికకు వచ్చారేమో. 
    లైట్లారిపోయాయి. శేఖరం చెయ్యి మాలతి భుజంమీదుగా వెయ్యటం అతను చూశాడు. అతనివంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లయింది.
    మిగతా సమయమంతా ఎలా గడిచిందో అతనికి తెలియదు. సినిమా అయిపోయే తరుణం వచ్చేసరికి తాను యిహ అక్కడ వుండకూడదని స్ఫురించి, గబగబా బయటకు నడిచాడు.
    అర్ధరాత్రి సమయంలో చీకటిలో వంటరిగా నడుస్తున్నాడు. ఒకస్థితికి వచ్చాక మనస్సు ఆలోచించటం మానేసింది. కొళాయిచెరువు ప్రక్కగా నడుస్తున్నాడు. ఇరువైపులా మహావృక్షాలు పెద్దభూతాల్లా నిలబడి గాలికి కదులుతున్నాయి. వీధివీధంతా నిర్జీవంగా వుంది.
    కాసేపటికి ఓ పోలీసు ఎదురుగుండా వచ్చాడు. "ఏయ్ మిష్టర్! అర్దరాత్రి పూట ఎక్కడికి పెత్తనాలు? ఎక్కడ్నుంచి వస్తున్నావు?" అని గద్దించి అడిగాడు.
    మృత్యుంజయరావు యీ లోకంలోకి వచ్చిపడి, ఎదురుగుండా పోలీసుని చూసి కంగారుపడ్డాడు.
    "మాట్లాడవేమయ్యా?"
    మాట్లాడకపోతే పరిస్థితి విషమిస్తుందని ఎలాగో గొంతు స్వాధీనం చేసుకుని "సినిమానుంచి వస్తున్నాను" అన్నాడు కంపితస్వరంతో.
    "రుజువేమిటి?" అన్నాడు పోలీసు ఠీవిగా.
    అతను జేబులోంచి టిక్కెట్టు తీసి చూపించాడు. పోలీసు సంతృప్తిపడి, "సరే తొందరగా ఇంటికి వెళ్ళు" అని హెచ్చరించి ప్రక్క సందులోకి తిరిగి వెళ్ళిపోయాడు.
    నీరసం క్రమ్మివేసింది. ఇంకా నయం, ఇంతటితో వదిలాడు. విభ్రాంతి నుంచి తేరుకుని మళ్ళీ నడక సాగించాడు.
    ఓ అయిదునిముషాలు గడిచివుంటాయి. అతని ప్రక్కనుండి ఓ రిక్షా మెల్లిగా సాగిపోయింది. రిక్షా వెనకగా యిద్దరు వ్యక్తులు సైకిళ్ళమీద వస్తున్నారు. అందులో ఒకడు రిక్షాను సమీపించి "ఏయ్! ఆపరా గాడీ!" అన్నాడు దౌర్జన్యంగా.
    రిక్షా ఆగింది.
    "ఎవరు మీరు? ఎందుకు బండి ఆపుతున్నారు?" అంది ఓ స్త్రీకంఠం కంగారుగా లోపలనుండి.
    "నీకోసమే సుందరీ! సినిమా హాలుదగ్గర నిన్ను చూసి ఐస్ అయిపోయానంటే నమ్ము. ఏయ్! రిక్షా వెనక్కి తిప్పరా."
    "ఇదిగో అబ్బాయ్. వాళ్ళెవరో రౌడీలలా వున్నారు. వాళ్ళతో నీకేమిటి? నువ్వు పోనియ్యి" అంది స్త్రీ ధైర్యంగా వుండటానికి ప్రయత్నిస్తూ.
    "అరేయ్. చెప్పినట్లు వినకపోయావా నీ వీపు పగుల్తుంది. జాగ్రత్త. ఊ, వెనక్కి తిప్పు" అని రౌడీ గట్టిగా అరిచాడు.
    రిక్షావాడు భయంతో వణుకుతూ, నోటమాట లేకుండా నిలబడ్డాడు.
    ఆ స్త్రీ యిహ వూరుకుంటే లాభం లేదని సాహసం తెచ్చుకుని "ఎవర్రా మీరు? స్కౌండ్రల్స్. వంటరిగా ఆడది కనిపిస్తే అల్లరి చేద్దామనుకుంటున్నారా? మర్యాదగా వెళ్ళిపోతారా? లేక పోలీసులకి పట్టించమన్నారా?" అంటూ దబాయించింది.
    వాళ్ళలో ఒకడు వికటాట్టహాసం చేసి "అబ్బో! పిట్ట కూతకొచ్చిందే. చూద్దాం, ఎవడు నీకు సహాయమొస్తాడో" అంటూ ఆమెచెయ్యి పట్టుకుని లాగాడు.
    ఆ స్త్రీ కెవ్వుమని కేకవేసింది.
    కొద్దిదూరంలో నడుస్తూన్న మృత్యుంజయరావుకు రాత్రిపూట ఏర్పడిన ప్రశాంతతవల్ల యీ మాటలన్నీ స్పష్టంగా వినిపించాయి. అతనికి ఆ స్త్రీకంఠం మాలతి కంఠంలా స్పురించింది. ఆమె మాలతి అయితే ప్రక్కన శేఖరం ఎందుకుండడు? అర్థరాత్రి సమయంలో ఆమెను వంటరిగా యింటికెందుకు పంపిస్తాడు?
    ఇంతలో ఆ స్త్రీ కెవ్వున కేకవేసింది.
    అంతే, అతనికేదో జరిగింది. అది ధైర్యమో, పిచ్చితనమో, మాలతిమీద అభిమానమో- ఏదో ఒకటి కావచ్చు. మొత్తంమీద అతనో మంచిపని చేశాడు. ఒక్కసారిగా వాళ్ళమధ్యకు దూకి "ఏయ్, ఎవరు మీరు? వంటరిగా వున్న ఆడదాన్ని చూసి నిర్బంధిస్తున్నారా?" అంటూ వాళ్ళమీద కలియపడ్డాడు.
    "అబ్బో. హీరో వచ్చాడ్రోయ్. అరేయ్, నాలుగు తగలనియ్యరా వీడ్ని."
    వాళ్ళిద్దరూ కలిసి అతన్ని చిత్తుగా తంతున్నారు.
    అతనికి తెలియట్లేదు. అయోమయంగా వుంది. వంటిమీద తూట్లు పడుతూన్నట్లుగా వుంది. ఏదో అరుస్తున్నాడు. గాలిలో చేతులు విసుర్తున్నాడు.
    ఆ స్త్రీ ఏదో అంటోంది. అతనికి వినబడటంలేదు.
    వాళ్ళు అతన్ని వదలకుండా తంతున్నారు. ముఖంమీదా, వీపుమీదా, ఛాతీమీదా, ఎక్కడపడితే అక్కడ ఫిరంగిగుళ్ళలా దెబ్బలు పడుతున్నాయి. అతనికి కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళముందు చీకట్లు క్రమ్ముకున్నాయి. కాళ్ళలో బలం నశించి తేలిపోతున్నాయి. హఠాత్తుగా పారిపోదామనుకున్నాడు. ఓపిక చాలలేదు. సహాయం, సహాయం అని అరుద్దామనుకున్నాడు. కాని అప్పటికే తెలివి తప్పిపోతోంది. క్రిందికి జారిపోతున్నాడు. కళ్ళు మూసుకుపోతున్నాయి. బలవంతాన తెరుద్దామని ప్రయత్నించాడు. ఇంతలో ముఖంమీద యింకోదెబ్బ పడింది. అంతే! స్మృతి తప్పి నేలమీద వాలిపోయాడు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra