Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 30

    ఈ విషయమై ప్రశ్నించేందుకు  వెళ్ళగా  శ్రీ గిరిధర్ దంపతులు  ప్రస్తుతం దేశంలో లేరనీ, ఫ్రాన్స్ వెళ్ళారనీ తెలిసింది. వారు తిరిగి రాగానే ఈ పత్రిక తరపున  వారితో  సంభాషణ జరిపి వివరాలను మీ ముందుంచగలం."

    "మైగాడ్, పేపర్లలో  ఫోటోలు, ఇంటర్వ్యూలు వేయించుకోవాలనే ముచ్చట నాకుందిగానీ ఈ రకంగానా? అంకుల్, నాకు పారిస్ ఫోన్ చేసి చెప్పి వుంటే బాగుండేది. ఆ ఆత్మగాణ్ణి  సీన్ నదిలో వదిలేసో, ఈఫిల్ టవర్ మీద నుంచి తోసేసో వచ్చేవాణ్ణి" అన్నాడు గిరి కోపంగా.

    "గిరీ, యిప్పుడు కూడా హాస్యమేనా. ఇప్పుడేం చేయమంటారు అంకుల్!" పద్మజతో ఉత్సాహమంతా చచ్చిపోయినట్లనిపించింది.

    "దానికి బాధపడటం ఎందుకు పద్మా! ఉన్నదున్నట్లు  చెపుదాం. భయం దేనికి ? మనమేం తప్పు చెయ్యడంలేదు" అన్నాడు సీరియస్ గా గిరి.

    "అవునమ్మా, గిరి చెప్పిందే నిజం. ఇలాంటి విషయాలు దాచినా దాగవు. ఇంతవరకూ వచ్చాక యిప్పుడు దాచిపెట్టాలనుకున్నా అది అనుమానాస్పదంగా మారి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే ఆవకాశం ఉంది" అన్నాడు ప్రకాశరావు. "ఈ విషయంలో ముందే మీకు తెలిసి వుంటే  కాస్త ఆలోచించుకోవడానికి  వీలుంటుందని చెప్పడానికి వచ్చాను. ఏ సమయంలోనూ  ఆవేశపడవద్దు. ఈ ప్రెస్ వాళ్ళు దానికి రంగులు పులుముతారు."

    "అలాగే అంకుల్, థాంక్యూ!" మనస్పూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది పద్మజ.

    వారనుకున్నట్లు  ఆ మధ్యాహ్నమే వచ్చాడు ప్రెస్ రిపోర్టరు భూతనాథ్.

    "మిస్టర్ గిరిధర్ ! నేను వర్తమానం పత్రికా విలేకర్ని."  

    గిరిధర్ చిన్నగా నవ్వాడు.

    "ఎందుకలా  నవ్వుతున్నారు?" అడిగాడతను.

    "ఏంలేదు. వర్తమానం పత్రిక్కి  పనిచేసే భూతనాథ్ గారు నా దగ్గర భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని వస్తే తమాషాగా అనిపించింది."

    "అయితే మీరు భవిష్యత్తు గురించి చెప్పగలరన్నమాట."

    "లేదు. నేనేమీ చెప్పలేను" అన్నాడు గిరి సీరియస్ గా.

    "కాని యింతకు ముందు చెప్పారు గదా?"

    "చెప్పింది నేను కాదు. చేసేది నేను కాదు. చెప్పేదీ చేయించేదీ అంతా ఆ పై వాడే" గాలిలోకి చేతులూపుతూ  అన్నాడు గిరి.

    భూతనాథ్ నవ్వాడు. "ఇంతకీ శేఖరం ఆత్మ ఆవహించినపుడు మీరెలా ఫీలవుతారు?"

    "చూడండి భూతనాథ్ గారూ, మీరెప్పుడైనా  భూతాన్ని చూశారా?"

    "లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను."

    "నేను చాలా దురదృష్టవంతుణ్ని మిస్టర్ భూతనాథ్. దెయ్యం పట్టినప్పుడు నేనెలాగుంటానో  చూడాలని నాకెంతో కోరిక. కానీ ఆ కోరిక తీరే దారి కనిపించడంలేదు" బాధగా నటిస్తూ అన్నాడు గిరి.

    "అంటే అప్పుడు మీరెలా ఫీలవుతారో చెప్పలేరన్నమాట."

    "చెప్పలేను. నాకే తెలియదు. నా చెవిలో ఏదో స్వరం అస్పష్టంగా ఏదో చెపుతున్నట్లు వినిపిస్తుంది. అది నేను నాకు తెలియకుండానే రిపీట్ చేస్తాను. ఒక్కోసారి ఆ ఆత్మ నన్ను ఆవహించిందని, ఏదో చెప్పాననీ వీళ్ళు అంటుంటారు. నాకయితే ఏమీ తెలియదు. మత్తుగా నిద్ర పట్టినట్లుంటుంది."

    "ఈ విషయమై మీరు ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుంన్నారు?"

    "ఆ విషయాలు మా ఫామిలీ డాక్టర్ యిక్కడే వున్నారు, ఆయన్ని అడిగి తెలుసుకోండి."

    పక్కనే వున్న డాక్టర్ రామకృష్ణ కల్పించుకుంటూ  "భౌతికంగా గానీ, మానసికంగా గానీ, మామూలు పరిస్థితుల్లో అతనిలో లోపమేం లేదు భూతనాథ్. మేము బాగా పరీక్షించం" అన్నాడు.

    "అయితే దీనికి పరిష్కారం ఏమిటంటారు? మన పాత అద్ధతిలో భూతవైద్యం చేయించాలంటారా?"

    "ఇప్పటి భూతవైద్యుల్లో  నాకు నమ్మకంలేదు. కానీ ఒక్క విషయం శేఖరు మా అందరికీ పరిచితుడు. చాలా మంచివాడు. ఇప్పుడూ ఒకరకంగా  చూస్తే అతను గిరిధర్ కుగానీ, పద్మజకుగానీ ఏ విధమైన హానీ చేయడంలేదు. నేనీమధ్య కొందరు స్పెషలిస్టులను కలసి ఈ విషయం ప్రస్తావించాను. గిరిని హిప్నాటిక్ ట్రాన్స్ లో తీసుకెళ్ళి పరీక్షించాలనుకుంటుంన్నాం. శేఖరం అసలు కోరిక ఏమిటో బయటపడితే  ఏమయినా చెయ్యవచ్చునని  మా ఉద్దేశ్యం. గిరిధర్ కు అభ్యంతరం లేకపోతేనే."

    "నాకేం అభ్యంతరం లేదు. అసలిదంతా  ఏమిటో తెలుసుకోవాలనే నాకూ కోరికగా వుంది" అన్నాడు గిరి.

    "అయితే రేపు పదిగంటలకు మీరు నర్సింగ్ హోంకు రండి."

    "అది అంత అవసరం అంటారా" అడిగింది పద్మజ భయంగా.

    "తప్పదు పద్మజా! ప్రయత్నించనివ్వండి" అన్నాడు రామకృష్ణ. భూతనాథ్ ఈ సంభాషణ అంతా వింటున్నాడు.


                          *    *    *


    భగ్న ప్రేమికుడయిన ఆఫీసర్ ఆత్మతో  సంభాషణం.

    ఇంతకు పూర్వం మేము ప్రకటించిన వార్తల గురించి మా స్పెషల్ కరస్పాండెంట్ భూతనాథ్ పూర్తిగా దర్యాప్తు చేశారు. ఆయన దర్యాప్తులో తెలిసిన విషయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

    శ్రీ గిరిధర్ ఉత్సాహవంతుడైన  యువకుడు. హాస్యప్రియుడు. అతని భార్య పద్మజ డిఫెన్స్ సెక్రటేరియట్ లో ఆఫీసరు. వారిది ప్రేమ వివాహం అనే చెప్పవచ్చు. మరణించిన శేఖరం ఒకప్పుడు పద్మజ తోటి ఆఫీసరు. స్నేహశీలి - మితభాషి.     

 Previous Page Next Page