Previous Page Next Page 
ఆత్మబలి పేజి 30


    "అవునే అమ్మా! తను చదువుకున్నది, మనం చదువురాని మొద్దులం. తనకన్నీ తెలుస్తాయి; మనకేం తెలుస్తాయి? తను అన్నయ్యను బాగుచేసేదీను, మనం చెడగొట్టేవాళ్ళమూను.." దీర్ఘాలు తీస్తూ అంది కాళి.
    "ఇంత మదమా? నా కొడుకు చెడిపోయినవాడా? నేను చెడగొట్టానా? ఈనాడు ఇది బాగుచేస్తుందా? దీని అంతు తేలుస్తానుండు."
    కోపంతో చిందులు తొక్కింది వర్ధనమ్మ. సమాధానం చెప్పినా ప్రయోజనం లేదని మాట్లాడక ఊరుకొంది ఉమ.
    కాని, ఈ సంఘటన అక్కడితో ఆగలేదు. చిలవలు పలవలతో వార్ధనమ్మ ద్వారా ఉమ మావగారికి చేరింది. ఆయన ముందుగా చలపతిని కేకేశాడు.
    "ఏరా! భార్య చేతిలో కీలుబొమ్మలా చవటలా ఆడుతూ ఇంట్లోవాళ్ళ నెదిరిస్తున్నావటగా!" అని గర్జించాడు. తండ్రి దగ్గర మొదటినుండి భయంతో గడగడలాడే చలపతి వణుకుతూ నిలబడిపోయాడు.
    "ఇంకొకసారి పెళ్లాన్ని వెనకేసుకుని ఇంట్లోవాళ్ళని మాటలన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త."
    చలపతి తలూపి వెళ్ళిపోయాడు. పాతికేళ్ళ కొడుకుని అలా మందలిస్తున్న తండ్రినీ, ఇలా వెళ్ళిపోతున్న కొడుకునీ చూసి ఉమకు కడుపులో తిప్పినట్లయింది.
    ఆ విసురు ఉమ దగ్గరకొచ్చింది.
    "ఏవిఁటి, చదువుకున్నదానివని మహాగర్వాలు పోతున్నావట? ఇంట్లో వాళ్ళందరినీ చేతగానివాళ్ళని వెక్కిరిస్తున్నావుట! మొగుణ్ని చదువురానివాడని ఆటలు పట్టిస్తున్నావుట! ఏం చూసుకొని ఈ అహంకారం? దయతలిచి ముష్టి సంబంధం చేసుకున్నదిగాక ఈ పొగరొకటా? తిని కూచుని ఒళ్ళు కొవ్వెక్కి వాగుదామనుకుంటున్నావా? బుద్ధిగా నోరు మూసుకు పడుండు, లేకపోతే పో!"
    "అదికాదండీ! నేనెవ్వరినీ..."
    "నోరుముయ్యి-నామాట కెదురుచెప్తావా? ఇంకొకసారి ఇంట్లో ఎవరిమాటకయినా ఎదురుచెప్పు చూస్తాను" అంటూ క్రూరంగా చూసి వెళ్ళిపోయారాయన. ఆ రాత్రి ఉమకు అన్నం సహించలేదు. ఎంత నిగ్రహించుకుందామన్నా కన్నీళ్లాగలేదు.
    "ఉమా! ఏడుస్తున్నావా? నాన్నగారు తిట్టినందుకేనా?" బాధగా అన్నాడు చలపతి.
    ఉమ సమాధానం చెప్పలేదు.
    "ఆయన అంతేలెద్దూ! అలా హడావిడి చేస్తారు. వెళ్ళిపోతారు. మనల్ని కాదనుకుంటే సరి!"
    ఆ ఓదార్పు ఉమకు పుండుమీద కారం రాసినట్లయింది.
    "మనను కాదని ఎందుకనుకోవాలి? వాళ్ళమీద ఆధారపడబట్టే గదా, ఇన్ని మాటలు? మీరే బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూంటే ఇంత చులకనయ్యే వాళ్ళమా?"
    వెక్కివెక్కి ఏడ్చింది ఉమ. తల్లి దెప్పిపొడుపులను, కాళి సాధింపు మాటలనూ సహనంతో ఓర్చుకునే ఉమ ఇంత ఆవేదనపడటం అతను సహించలేకపోయాడు. ఏ సమాధానము చెప్పకుండా పుస్తకాల దగ్గర కూర్చున్నాడు. అతని ముఖంలో అంతక్రితం తానెన్నడూ చూడని పట్టుదల కనిపించింది ఉమకు. కన్నీళ్లు తుడుచుకొని "ప్రతీదీ మనమేలుకే!" అనుకొంది.
    చలపతి మెట్రిక్ పరీక్షలకు కట్టాడు. చలపతి నెరిగిన సమస్త జనులూ నివ్వెరపోయేలాగా చలపతి మెట్రిక్ పాసయ్యాడు!
    ఉమ భగవంతుడికి మనసారా నమస్కరించింది. తనకు పి.యు.సి. క్లాసులో వ్యాసరచన పోటీలో బహుమతిగా వచ్చిన మనీపర్స్ ను చలపతికిస్తూ "మీరు పరీక్ష పాసైనందుకు నా బహుమానం" అంది.
    చలపతి దానిని ఆప్యాయంగా అందుకున్నాడు.
    "దీన్నిండా డబ్బునింపి నీకిస్తాను" అంటూ దాన్ని తిప్పి "ఇందులో వెనుక నీ ఫోటో ఉంది" అన్నాడు.
    "అవును. తియ్యటం మరిచిపోయాను చూశారా? తీసెయ్యండి. అది తీసి మీ ఫోటో ఉంచుకోండి" అంటూ ఉమ ఆ ఫోటో తియ్యబోయింది. చలపతి వారించి "వద్దు. అది అలాగే ఉండనియ్యి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూసుకోవచ్చు" అన్నాడు.
    ఆ మాటలకూ, మాట్లాడిన తీరుకూ ముగ్ధురాలయింది ఉమ. ఆమె నిలువెల్లా పులకించింది.
    సంతృప్తితో, చలపతిని పి.యు.సి.కి కూడా కట్టించాలనే ఆలోచనలతో సుఖంగా నిద్రపోయింది ఉమ. నిద్రిస్తూన్న ఉమను చూస్తూ ఎంతసేపో అలా కూర్చుండిపోయాడు చలపతి.


                                      20


    ప్రభాకరం పరిస్థితి నానాటికీ విషమించుతోంది. కుటుంబ భారమంతా శోభ భుజాలమీద పడింది. ఆ భారాన్ని మొయ్యలేకపోతూంది శోభ.
    ఎన్ని చికాకులమధ్య ఉన్నా రావు స్మృతి, రావును గూర్చిన భావన శోభకెంతో ఊరట కలిగించేవి. తన సర్వస్వంగా భావించిన రావులోనే అపోహలు.
    తను డాక్టర్ శేఖర్ ను పిలిపించినట్లూ, డబ్బు అప్పు తీసుకున్నట్లూ రావుకెలా తెలిసిందీ? మూర్తి చెప్పి ఉండాలి.
    ఛీ! మూర్తి ఇంతటివాడా?
    ఒకవేళ చెప్పినా అంతమాత్రానికి రావు తననలా అవమానించాలా? ఒకచోట పనిచేస్తున్న వ్యక్తి దగ్గర అవసరానికి అప్పు తీసుకోవటం అంత అవమానింపదగిన విషయమా? డాక్టర్ శేఖర్ ను పిలిపించటం రావు అహానికి దెబ్బ. అది అతను సహించలేకపోవటం న్యాయమే! కాని తను కారణం వివరిస్తూంటేనూ వినడెందుకు?
    పనికట్టుకు తను అప్పు తీసుకున్న విషయం రావుకు చెప్పిన మూర్తి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడా? ఏమైనా రంగులు పులిమాడా?
    అయినా ఎవరో, ఏదో చెప్పగానే విని తన నవమానించేటంతటి సంకుచిత స్వభావుడా రావు? రావు కనుమానమని మూర్తి చెప్పినది నిజమే కావచ్చు. ఈ నిత్యశంకితునితో తనకు రోజులెలా గడుస్తాయి?
    ప్రేమానుబంధం విచిత్రమైంది. అదొక్కసారి గాఢంగా అల్లుకున్నాక పరిస్థితుల కారణంగా ఒకరిపట్ల ఒకరికి ఎంతటి వైమనస్యం కలిగినా హృదయంలో ప్రేమ మాత్రం మాసిపోదు.

 Previous Page Next Page