Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    "అమ్మా!" అని పిలిచాడు కలవరపాటును అణుచుకుంటూ.
    జీవకళ నశించివున్న తనకళ్ళను గుమ్మంవైపు త్రిప్పింది ఆ ప్రాణి. ఓ ఆనందపు జీర వ్యాపించింది కనులలో.
    "వచ్చావా?" అంది. ఆ కంఠం ఏదో లోకాలనుంచి పలికినట్లయింది.
    "వచ్చానమ్మా" అని ఆనందాతిరేకంతో గట్టిగా అరుద్దామనుకున్నాడు. కాని అంత ఆప్యాయత ప్రదర్శించటం ఆ అభాగ్యుడికి చేతకాలేదు. తల ఊపుతూ దగ్గరకు నడిచాడు.
    "ఇలా దగ్గరకు రా బబో౧ ఇక్కడ కూర్చో."
    అతనామె చెంతకు వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. అతడామెను చూస్తున్నాడు. అతన్ని ఆమె చూస్తోంది. ఒకరికళ్ళతో ఒకరు లోకాలు చూసుకుంటున్నారు. కృశించిపోయివున్న ఆమె చెంపలమీదుగా కన్నీరు జాలువారుతోంది. ఒకనాటి సౌందర్యవతి శ్రీదేవి- నేడు సర్వ సౌందర్యం నశించి, జీవచ్చవంలా, అస్థిపంజరంలా మంచాన పడివుంది.
    ఆమె తన పుడకల్లాంటి చేతులు, ఎంతో ప్రయత్నంమీద అతని వీపుచుట్టూ వేసి దగ్గరకు లాక్కుంది. తల్లిహృదయంమీద, ఆమెకు ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తేలికగా ముఖం ఆన్చి, అతను వలవల ఏడ్చేస్తున్నాడు.
    "ఏడవకు బాబూ! ఏడవకు. అలా నువ్వేడుస్తూంటే నా కడుపు తరుక్కు పోతోంది" ఆమె ఓ చెయ్యినెత్తి అతనికళ్ళు తుడవటానికి ప్రయత్నిస్తోంది.
    "ఏడవను అమ్మా! నిజంగా ఏడవను" అతను దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నిస్తున్నాడు. "నేను మహాపాపిని. తల్లిని యీ స్థితిలో వుంచి, అక్కడ ఏకాంతంగా బ్రతుకుతూన్న నా పాపానికి నిష్కృతిలేదు. నేనూ యిలాగే కుళ్ళికుళ్ళి చస్తాను" అని అతని అంతరంగం ఘూర్ణిల్లుతోంది.
    "కులాసాగా వున్నావా జయా! నువ్వు కాలం ఎలా గడుపుతున్నావు?" ఆమె మృదుకంఠం అతని చెవుల్లో ధ్వనించింది.
    "నాకేమమ్మా! బాగానే వున్నాను." 
    ఒకక్షణం విరామం. బయట, దూరంగా పిల్లలు అరుస్తున్నారు. పరిసరం లోనే ఎక్కడో కట్టివేసివున్న గేదె ఒకటి తెగ అరుస్తోంది.
    "జగతి- జగతి కనిపించిందా ఎక్కడైనా?"
    ఉద్వేగాన్నాపుకోవటానికి అతను విశ్వప్రయత్నం చేయాల్సివచ్చింది. జగతిని తను కలుసుకున్నట్లూ. ఆమెతో కలిసి కొన్నాళ్ళు నివసించినట్లూ తల్లికి సమస్తం నివేదించివేయాలనుకున్నాడు. కాని ఇంత జరిగినా, ఆమెను నా దగ్గరకు తీసుకు రాలేకపోయావా?' అని ఆమె పుత్రికాశోకంతో తల్లడిల్లితే? నిజం చెప్పటానికి సాహసించలేకపోయాడు "ఉహు" అని గొణిగాడు.
    "దాన్నికూడా ఒకసారి కళ్ళారా చూడాలనుకున్నాను" ఆమె నిట్టూర్పు విడిచింది.
    "అమ్మా!" అన్నాడు మృత్యుంజయరావు ఆశగా. "మనం కాకినాడ వెళ్ళిపోదాం రాకూడదూ? అక్కడ ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి డాక్టర్లతో మంచి వైద్యం చేయిస్తాను."
    "ఇంక నాకు డాక్టర్లెందుకు నాయనా?" అంది క్షీణస్వరంతో తల్లి. "నా పని అయిపోయింది. అవసానదశలో వున్నాను. రోజులలో వుంది నా జీవితం."
    "అలా అనవద్దమ్మా. అలా అనవద్దు. నువ్వు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించుకుంటాను. మనం యివాళే వెళ్ళిపోదాం యిక్కడ్నుంచి, ఈ నరక కూపంలో యిహ వుండవద్దు" అంటూ ఆర్తనాదం చేశాడు.
    ఆమె పెదవులపై శుష్కమందహాసం ఉదయించింది. ఆప్యాయతతో అతని తల నిమురుతోంది. "ఎందుకురా జయా! వృధా ప్రయాస పడతావు? ఇది పరమేశ్వరుడి యిచ్ఛ. అసలు యింతకాలం నాకు జీవితం కల్పించటంలో ఆయన సంకల్పమేమిటో బోధపడకుండా వుంది. డాక్టరుకూడా వచ్చి చూశాడు. నాకు క్యాన్సర్ అని చెప్పాడు. ఇన్నాళ్ళకు భగవంతుడు తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు. నాకు పరమ సంతోషంగా వుంది."
    అప్పుడామె ముఖంలోకి పరిశీలనగా చూశాడు మళ్ళీ. మృత్యుచిహ్నాలు స్పష్టంగా కనిపించాయి. లోలోన దుఃఖాన్ని దిగమ్రింగుకున్నాడు.
    "నిన్ను చూస్తానోలేదో అనుకున్నాను. నా కోరిక నెరవేరింది. ఈ తృప్తిచాలు" ఆమె కళ్ళు మూసుకుంది.
    ఎందుకు తనని చూడాలనుకుంది? తనని చూస్తే తృప్తి ఎందుకు కలిగింది? తనలాంటి అయోగ్యుడిని, అర్భకుడిని తనయుడిగా ప్రేమించి, తృప్తిపడటం ఆమెకెలా చేతనైంది? తనలాంటివాడు తనకు కొడుకుగా వుంటే వాడిని చూసి తను భరించగలడా? అతని మెదడు సతమతమవుతోంది.
    "ప్రయాణ బడలికతో ఉండివుంటావు. స్నానంచేసి బట్టలు మార్చుకూరా. ఈ నాలుగురోజులూ నన్ను విడిచి వుండకూడదు సుమా."
    అతను స్నానాదులకై యింట్లో వున్నంతసేపూ యింట్లోని స్త్రీలూ, పురుషులూ కూడా చెట్టంత కొడుకు వుండి, తల్లిని తమపాలిట పడవేసి, బాధ్యత పట్టించుకోకుండా తిరుగుతున్నందుకు అతన్ని నిందిస్తూనే వున్నారు. ఆమెవల్ల తమకు ఎంత యిబ్బంది కలుగుతున్నదో, యెన్ని పాట్లు పడుతున్నారో ఏకరువు పెడుతున్నారు. అతనన్నిటికి ఊఁ, ఊఁ అంటున్నాడు. వాళ్ళు పెట్టిన తిండి తిని ఊళ్ళో వున్న డాక్టర్ని కలుసుకొనటానికి పోయాడు.
    ఆ డాక్టరుపేరు జగపతి. ఎమ్.బి.బి.ఎస్. ప్యాసయి, ప్రభుత్వోద్యోగం చేయటం యిచ్ఛగించక పట్టణాలలో వుండటానికి మనస్కరించక చాలా సంవత్సరాలుగా ఆ వూళ్ళోనే వుంటూ ప్రాక్టీసు చేస్తున్నాడు. చుట్టుప్రక్కల పది పదిహేను ఊళ్ళనుంచికూడా ప్రజలాయన దగ్గరకే మందు తీసుకొనటానికి వస్తారు. చాలా దయార్ద్రహృదయుడు. డబ్బుగురించి ఎన్నడూ పట్టుబట్టడు. మృత్యుంజయరావు చెప్పింది విని "మీ అమ్మగార్ని పరీక్ష చేశానండీ. మీ తండ్రిగారైన దీక్షితులుగారికీ నాకూ బాగా స్నేహం ఆయనలాంటి ఆదర్శమూర్తి అంత త్వరగా పరమపదించటం, ఆయన కుటుంబానికి ఎనలేని కష్టాలు రావటం చాలా దురదృష్టకరం. ఒకరకంగా జీవితాన్ని సలక్షణంగా సరిదిద్దుకోవటానికి ఆయన నాకు ఒక యిన్స్పిరేషన్ కూడా" అని కొంచెం ఆగి "మీ అమ్మగారికి కేన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయింది. క్షమించండి నిజం చేబుతూన్నందుకు. ఆమెకు యిహ ఏ ట్రీట్ మెంటూ పనిచెయ్యదు" అన్నాడు విచారస్వరంతో.
    "ఆపరేషన్ చేస్తేకూడానా?"
    "శరీరంలో చాలాభాగాలు కేన్సర్ తో నిండిపోయాయి. అదీగాక కాలు కదల్చటానికి ఆవిడకు శక్తిలేదు. ఈ స్టేజిలో అసలు ఆపరేషన్ అనే ప్రశ్నలేదు. ఆమె యిహ కొన్నిరోజులకంటే జీవించదని చెప్పటానికి చింతిస్తున్నాను మృత్యుంజయరావుగారూ!"
    అతను ఉస్సురని నిట్టూర్చి, డాక్టరుగారిదగ్గర సెలవు తీసుకుని యింటిదారి పట్టాడు.
    తర్వాత అతను తల్లికి చేసిన శుశ్రూషలు భూమ్మీద చాలా కొద్దిమంది చేయగలిగినవి. అందులో అతనికి ఎంతో అనందం, తృప్తీ, మనశ్శాంతీ కనిపించాయి. తన స్వంత బలహీనతలనూ, విచారాలనూ ఆ కాసిని రోజులూ మరిచిపోయాడు.
    పుట్టిన యిన్నాళ్ళకు 'నేను చేస్తూన్న మంచిపని యిదే' అని అతనికి పదే పదే స్పురించేది. తల్లీకొడుకులు ఏవేవో విషయాలు మాట్లాడుకునేవారు. నిమిష నిమిషానికీ వారి మైత్రి ప్రబలిపోయింది. వారి బాంధవ్యం పెరిగిపోయింది. ఒకరికొకరు పెనవేసుకుపోయారు. మృత్యుంజయరావు ఆమెనోట్లో ఆహారం కలిపిపెట్టాడు. తల హృదయానికి ఆన్చుకుని మంచినీళ్ళు త్రాగించాడు. ఆమె వాంతి చేసుకుంటే తుడిచాడు. ఆమె బట్టల్ని తనే మార్చాడు. తనే ఉతికాడు. సమస్తం చేశాడు.
    రోజురోజుకూ ఆమె పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. తరచు స్మృతి తప్పిపోతోంది. ఒకసారి కళ్ళు తెరిచి చెల్లెలు భానుమతిని చూడాలని కోరింది. వారు ఒకరినొకరు చూసుకుని పదిహేను సంవత్సరాలు గడిచి వుంటుంది. మృత్యుంజయరావు ఆమెను వెంటనే బయల్దేరి రమ్మని వైర్ యిచ్చాడు. రెండురోజులు గడవగానే భానుమతి, భర్తతో సహా తరలివచ్చింది. పిల్లల్ని తీసుకురాలేదు. అక్కని కౌగిలించుకుని ఏడ్చింది. శ్రీదేవి కళ్ళుతిప్పి చూసింది. చెల్లెల్ని గుర్తుపట్టింది. కాని అప్పటికి మాటకూడా పడిపోయింది. ఆమె కంటి వెంట నీరు కారింది. ఏదో సౌంజ్ఞ చేయటానికి ప్రయత్నించింది. కాని మళ్ళీ స్మృతి తప్పిపోయింది.
    సరిగ్గా మృత్యుంజయరావు ఆ ఊరుచేరిన పదిహేనురోజులకు అతని తల్లి, తన బాధలకు, తన శోక జీవితానికి, తన నరకయాతనలకు, తను అనుభవించిన హింసలకు స్వస్తిచెప్పి వెళ్ళిపోయింది. ఆమెప్రాణం అనంత వాయువులో కలసిపోయింది.
    ఊరినుంచి తిరిగివచ్చిన మృత్యుంజయరావు తన యధాజీవితం ప్రారంభించాడు. అతనికి అక్కడి పరిస్థితుల్లో అనేకమార్పులు కనిపించాయి. ఇంటావిడ చిలకమ్మగారు మొదట మొదట అతను కనిపించగానే లోపలికి వెళ్ళిపోతూండేది. రానూరానూ బయటకు రావటం మొదలుపెట్టింది. వీధిలోకి పెత్తనాలు కూడా సాగించింది. తన తమ్ముడ్నీ, మరదలు దేవమ్మనీ, తండ్రినీ తెచ్చి యింట్లోనే పెట్టుకున్నది పిచ్చివాడూ, ముసిలాడూ బయట వసారాలో పడుకునేవారు. చిలకమ్మగారూ, మరదలూ, పిల్లాడూ తలుపులు వేసుకుని లోపల పడుకునేవారు. మొదట యింటావిడ గొంతు బయటకు వినిపించేది కాదు. వినిపించినా అది చచ్చి స్వర్గంలోవున్న భర్తను గురించిన ప్రశంసతో కూడిన ప్రసంగమై వుండేది. రానురానూ కంఠంస్థాయి పెరగసాగింది. వదినా మరదళ్లు ఒకరికెదురుగుండా ఒకరు కూర్చుని పరిహాసాలు, వినోద ప్రసంగాలు, నవ్వులు, కేరింతలు, లేకపోతే దాసీదానితో ఇరుగుపొరుగుల గురించి బాతాఖానీ. ఇహ వాళ్ళ జీవితంలో ముఖ్యాంగం 'తిండి'యై కూర్చుంది. ఎప్పుడూ చిరుతిళ్ళు చేసుకుని మ్రింగడమే. చేగోడీలు, జంతికలు, కజ్జికాయలు, మినపసున్ని, పెసరట్లు, ఉప్మాలు, ఒకటేమిటి సమస్తం చేసుకోవటం, మెలకువగా వున్నంతసేపు తినటం. ఇంటావిడ రోజు రోజుకూ లావవటం మొదలుపెట్టింది. చీటికీ మాటికీ వగర్పు. ఆయాసం, కాళ్ళ'నొప్పులు మొదలయ్యాయి. డాక్టరు దగ్గరకు వెళ్ళివచ్చింది. 'డయాబెటీస్' అని తిండి తగ్గించమన్నాడుట. ఆవిడ బెంగపెట్టుకుని కష్టంమీద కోరికలు దిగమ్రింగుకుంటోంది. ఆవిడకి కాశ్మీరం చూడాలని ఎన్నాళ్ళబట్టో కాంక్షయట. మేనల్లుడ్ని తీసుకుని విమానంలో కాశ్మీరయాత్ర చేసి రావాలని ఉపాయాలు పన్నుతోంది.
    మాలతి ప్రవర్తనలో కూడా చిత్రమైన మార్పు కనిపించింది మృత్యుంజయరావుకు. మునపటిలా తనతో అంత చనువుగా మాట్లాడటం లేదు. తనంటే ఒకప్పుడు ఆసక్తివుందనీ, అది యిప్పుడు తగ్గిందనీ అతను నమ్మటంలేదుగాని ఆమె మనసులో ఏదో మధనతో వుంటూందనీ, పరధ్యానంతో వుంటూందని గ్రహించాడు. రెండుమూడుసార్లు యింటికి వెళ్ళినా మనసువిప్పి మాట్లాడలేక పోయింది. ఒకసారి ఆమె యింట్లో శేఖరం కనిపించాడు. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆఫీసులోకూడా యిద్దరూ తరచు కలుసుకుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో వెలుగొందుతున్న కాంతీ, ప్రదర్శితమవుతూన్న ఉత్సాహం, పెదవులమీదీ, కనులలోనీ చిరునవ్వూ మృత్యుంజయరావు చూపును తప్పించుకోలేకపోయాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra