Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    "మీ అన్నయ్య పెళ్ళీ?" ప్రమీల ఇంకా చిరునవ్వుతోనే అన్నది. రాధ ఒక్క క్షణం నిర్ఘాంతపోయి చూసి, గట్టిగా నవ్వింది.

    "బలే, నీకెట్లా తెలిసింది.

    "రేడియో వార్తలు."

    "నిజమే, అన్నయ్య వొప్పుకున్నాడు."

    "అయితే కొద్దిరోజుల్లో జరిగిపోతుందన్నమాట."

    "చాలా కొద్దిరోజుల్లో జరిగిపోవచ్చు."

    ఇంకా కొంతసేపు ప్రసంగం ఈ విషయాలమీదనే సాగిపోయాక బయటకు వెళ్ళిన శ్రీపతి ఇంటికి తిరిగివచ్చాడు. వస్తూనే వీళ్ళిద్దరినీ చూసి "స్నేహితురాళ్ళిద్దరూ కలిసినట్లున్నారు. నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోవటం ఉత్తమమనుకుంటాను" అన్నాడు. రాధ అతన్తో మాట్లాడకపోయినా ఆమెతో కల్పించుకొని వ్యంగ్యంగా మాట్లాడటం అతనికి అలవాటైపోయింది.

    ప్రమీలతో కూడా రాధ నిలబడి తలవొంచుకొంది, శ్రీపతి ఒక్కసారి నవ్వి లోపలకు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఒక అరగంట గడిపాక వస్తానని చెప్పి రాధ ఇంటిదారి పట్టింది.

    ఇంటికి వస్తుంటే ఆమె మనసు అన్నగారి పెళ్ళిమీదకు మళ్ళింది. ఎలాగయితేనేం ఒప్పుకొన్నాడు. ఇదంతా తన ప్రభావమేనని అనుకుంటోంది అమ్మ. నిజంగా ఆ రోజు నాయనమ్మ అన్నయ్యని లోపలికి పిలవకపోతే ఎంతమాత్రమూ అంగీకరించేవాడు కాదు. చివరి దశలోవున్న నాయనమ్మ హృదయ విదారకమైన వాక్కులకు అతను చలించిపోయాడు! ఆరోజు తను చూడలేదూ - ముఖం ఎట్లా మారిపోయిందో? అప్పుడు అన్నయ్యను చూస్తే తనకే జాలివేస్తుంది.

    అన్నయ్య పెళ్ళి  ఏ విధంగా జరుగుతుందో ఆమె ఊహించుకోసాగింది. తనకో వదిన వస్తుందంటే గర్వంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగిందామెకు.

    ఇంటికిపోయేసరికి వాసు మంచంమీద పడుకొని పైకప్పుకేసి చూస్తూ కనిపించాడు. గుమ్మంలోనే నిల్చుని తొంగి వాడివైపు చూసింది. వాడికి కాలుపోయిన దగ్గర్నుంచీ వాడి ప్రవర్తనా అది చూస్తుంటే రాధకు భయంగానూ, బెంగగానూ వుంది. రాను రాను వొట్టి వేదాంతిలా మారిపోతాడేమోనని ఆమె అనుమానం. వాడి వదనంలో సంతోష చిహ్నాలు చూసి చాలా రోజులయింది. వాడిలో వాడు యేదో గొణుక్కుంటూ వుండటం వాడి దీర్ఘాలోచనా చాటునుంచి పరికిస్తున్నప్పుడు ఆమె మనసంతా ఏదో కెలికినట్లు అయ్యేది.

    చిన్నగా నడిచి, వాడి ప్రక్కగా వచ్చి నిల్చుని "ఏమిటిరా బాబూ అంత  ఆలోచన?" అంది.

    కొంచెం ఉలిక్కిపడి ఆమెవంక చూసి "కూచో అక్కాయ్ చెబుతాను" అన్నాడు.

    రాధ వాడి ప్రక్కగా మంచంమీద కూర్చుని "చెప్పరా" అంది.

    "మరి....." అని వాడు చేతులు త్రిప్పుతూ కొంచెం సిగ్గుపడుతూనే "నాకో సందేహం వచ్చింది" అన్నాడు.

    "చెప్పు."

    "మరీ, మీరంతా నాకు కాలు లేకపోయినా నావల్ల మీకు ఇబ్బందిగా వున్నా ప్రేమగానే చూస్తున్నారు కదా?"

    ఈ సంభాషణ  వల్ల రాధకు కష్టంతోచి "అయితే?" అంది.

    "అదికాదు మరి! రేపు వదిన వస్తుందనుకో. ఆమెకు కూడా నేనంటే ప్రేమ వుంటుందా?"

    "బాగుంది. ఎందుకు వుండదు? వదినంటే దెయ్యం అనుకొంటున్నావేమిటిరా?" అని రాధ కొంచెం విసుగ్గా జవాబు చెప్పింది.

    "వదిన నాతో మాట్లాడుతుందా?"

    "ఆఁ."

    "నీలాగ కబుర్లు చెబుతుందా?"

    "ఆఁ." అని రాధ కొంచెం కోపంగా "వొరేయి! ఎప్పుడూ ఏదో  ఆలోచిస్తుంటే బుర్ర చెడిపోతుంది. పెద్ద పెద్ద  విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పానా?"

    వాడు దీనంగా "నాకు ఏమీ తోచదాయె. ఏదో ఆలోచన్లతో కాలం గడిపేస్తున్నాను." అన్నాడు.

    "ఏవయినా పుస్తకాలు చదవకూడదా?"

    "పిల్లలు చదవదగ్గవి మనయింట్లో ఏం వున్నాయక్కాయ్!"

    తమ్ముడు చెప్పింది సబబుగానే తోచి అక్కగారు "ఉండు, ఇవాళ అన్నయ్యతో నీకేదయినా పుస్తకాలు పుట్టుకురమ్మని చెబుతాను. సరేనా?" అంది.

    వాసు అంగీకారంగా తల ఊపాడు.

    అలాగే కొన్ని నిముషాలు మౌనంగా గడిపి రాధ ఇంట్లోకి పోయింది.

    సాయంత్రం నారాయణ వచ్చినప్పుడు వంటరిగా వున్న రాధతో అన్నాడు. "పెళ్ళి విషయం ఇంట్లో యేమంటున్నారు?"

    ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడటానికి అతనికి రాధ తప్ప ఇంక ఎవరూలేరు. ఆమె నడిగేందుకయినా అతనికి సిగ్గుగానే వున్నా కొన్ని కొన్ని సందేహాలు తీర్చుకునేందుకు అడగక తప్పలేదు.

    రాధ అతనివంక వింతగా చూసి అంది, "ఏమనుకుంటారు? ఎప్పుడూ లేనిది నాన్నకూడా ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తూన్నాడు. ఎరిగున్నవారితో సంప్రదించి సంబంధాల కోసం గాలిస్తున్నాడు." అన్నది.

    నారాయణకు నవ్వు వచ్చింది. సంబంధాల కోసం తామే చూచుకోవలసి వచ్చినందుకు.

    నిజంగా చిదంబరం అయిదురోజులనుంచీ కష్టపడి తిరుగుతున్నాడు. ఈ సందర్భంలో ఆయన చేసిన త్యాగం ఏమిటంటే, పెళ్ళి జరిగిపోయేదాకా పేకాటను ఆడరాదని నిశ్చయించుకొన్నాడు. ఆయన మనసులో ఒక విషయం వుంది. గంగాధరంగారంటే ఆయనకు వ్యక్తిగత ద్వేషం యేమీ లేదు. గంగాధరంగారే తనతో వైరం తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పుడయినా వీధులో కనిపించినప్పుడు చూసి నవ్వాలని చిదంబరం ప్రయత్నించాడు కూడా. కాని ఆయనే చూడకుండా, కనీసం రెండుమూడుసార్లు భంగపడ్డాడు. కాని ఆయన మనసులో ఎక్కువగా పెట్టుకోలేదు. గంగాధరంగారితో వైరం పెట్టుకోవటం ఏ మాత్రం సుఖంగా లేదు. అందుచేత కొడుకు ఇష్టపడితే ఆయనతో సంబంధ బాంధవ్యాలు పెంపిందించుకొనటం ఇష్టమే.

    నారాయణ తండ్రి మనసులో ఇటువంటి అభిప్రాయం వుండవచ్చునని గ్రహించాడు అందుకనే రాధతో అన్నాడు.

    "చూడు చెల్లాయ్! ఏమయినా సంబంధాలు నిశ్చయించుకుంటున్నారా?"

    రాధ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది.

    అతను మళ్ళీ అన్నాడు. "నా అభిప్రాయం ఏమిటంటే - - నీకూ తెలిసే వుంటుంది. నాన్న పొరబడి గంగాధరంగారి అమ్మాయి విషయం ఏమయినా ప్రయత్నిస్తాడేమో? అటువంటిదేమీ చెయ్యొద్దని చెప్పు."

    "జానకి అంటే నీ కెందుకని ఇష్టంలేదు?"

    "ఇష్టంలేదు, అంతే."

    "నాన్నతో నే చెబుతాలే." అని హామీ ఇచ్చింది రాధ.

    ఆమెను చూస్తూంటే నారాయణ జాలిగానే వుంది. తన పెళ్లి అంటే ఆమె చాలా ఉత్సాహపడుతుందని తెలుసు. ఏమయినా మధనపడుతుందేమో తెలీదు. కాని అలా చేస్తుందని నమ్మకం లేదు. ఏమీ తెలియని పసిపాపలా. నిర్మలజీవిగా ఆమెను నమ్మాడు నారాయణ. రాధకు పెళ్ళియీడు వచ్చిందని అతనికి తెలుసు. కాని పెళ్ళి చేయటం ఎలాగో అర్థం కావటంలేదు. అతనికేమో జీవితంలో ఎక్కువ అనుభవంలేదు. కట్నం తీసుకోకుండా చేసుకునే ఉదార స్వభావులు పరిచాయుల్లోగాని, స్నేహితులలోగాని ఎక్కువగా గోచరించలేదు. తండ్రి ఏమీ పట్టించుకోడు. తన కోసం ఈనాడు శ్రమపడుతున్నాడంటే అది కేవలం  తల్లిమీద భక్తి చేతనే అని నారాయణకు తెలియకపోలేదు. తన తండ్రికి నాయనమ్మ అంటే ఎంత శ్రద్ధాభక్తులు వున్నాయో అతను చిన్నప్పటినుంచీ ఎరిగేవున్నాడు. ముసలావిడ తన దుర్దినం అనుభవిస్తున్న ఆరోజు మాట ఇచ్చినప్పటినుంచి తనకేమీ సుఖంగాలేదు. ఎవరితోనూ స్వేచ్ఛగా, సంతోషంగా మెలగకుండా వున్నాడు. రోజూ సాయంత్రంపూట పార్కుకుపోయి గంటలతరబడి ఆలోచన్లతో గడుపుతున్నాడు.

    రాధ అక్కడనుంచి వెళ్ళబోతూంటే పిలిచి అన్నాడు : "నా గురించి నీకు పూర్తిగా తెలుసుగా అమ్మాయి."

    "అనుకుంటాను."

    "అయితే కట్నం తీసుకొనే విషయంలో నా అభిప్రాయం ఏమిటో నాన్నకు చెప్పు."

    ఆమె కొంచెం చలించి "నేనూ ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాను. పెద్దదాన్నీ అనుభవమున్నదాన్నీ కాదనుకో. దీన్ని గురించి నీ అభిప్రాయం మార్చుకునేందుకు వీలులేదూ?" అన్నది.

    "వీలులేదు" నారాయణ కటువుగా జవాబిచ్చాడు. బయటకు పోదామని గదిదాటి రెండు మూడు అడుగులు వేసేసరికి యెదురుగా డాక్టరుగారు వస్తున్నారు. వెళ్ళిపోబోతున్న వాడల్లా నారాయణ ఆయన్ని చూసి ఆగవలసి వచ్చింది. ఆయనతోపాటు ముసలమ్మగారు వున్న గదిలోకి వెళ్ళాడు.

    తిరిగి బయటకు వస్తున్నప్పుడు డాక్టరుగారిని అడిగాడు. "ఎలా వుందండీ?"

    "సీరియస్ గానే వుంది."

    నారాయణ కొంచెం గాయపడిన హృదయంతో "మరి?" అని అర్థోక్తిలో ఆయన ముఖంవంక చూసి ఆగాడు.

    "నాకు చాతనయినంతవరకూ ట్రై చేస్తాను. రిజల్టు ఏమవుతుందో చెప్పలేను. టై చేయమంటే నే చెప్పినవన్నీ మీరు తీసుకురావాలి."

    నారాయణ కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా తల ఊపాడు.

    ఆయన ప్రిస్ర్కిప్షన్, కొన్ని ఇంజక్షన్ ల పేర్లు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. నారాయణ అడుగులు భారంగా పడసాగాయి. మళ్ళీ డబ్బు ఎంత అవసరమవుతుంది? అక్కడ్నుంచి వస్తుంది? మౌనంగా విశ్రాంతి తీసుకొందామని బయటకువచ్చి జనసమ్మర్థంలో రోడ్డుగుండా పార్కువైపు నడిచాడు.


                       *    *    *

    ఆ రాత్రి ఎప్పటికంటే కొంచెం ఆలస్యంగా ఇంటికివస్తూ చిదంబరం, సరాసరి భార్యవున్న చోటుకుపోతూ "చూడు మరి, నాకేమీ తెలియదని మీరందరూ అనుకుంటారు. ఒక సంబంధాన్ని ఇంచుమించు స్థిరపడే స్థితికి తీసుకొచ్చాను." అని గర్వంగా తల పంకించాడు.

    "ఎక్కడ. "సంతోషంతోనే మరీ బట్టబయలు కాకుండా అడిగింది శారదాంబ.

    "గుడివాడలోనే."

    భార్యను మాట్లాడనీయకుండా మళ్ళీ తనే "అన్ని వివరాలూ అడిగే వచ్చాను. అమ్మకు తిరిగే ఓపికవుంటే ఈ వివరాలు మాట్లాడటం అవన్నీ ఆమే చూసుకొనేది. కాని పరిస్థితి ఇలా వచ్చింది. ఏం చేయను?" అని విచారంగా, నువ్వడగబోయే విషయాలు నాకు నాకు తెలుసు. పిల్లను చూపించకుండా పెళ్ళి చేయటానికి సిద్ధపడే మూర్ఖుడ్ని కాదు నేను అవన్నీ యధావిధిగా జరిపేద్దాం. నువ్వూ, నేనూ వాడూ కలిసి గుడివాడ రేపు వెడదాము" అన్నాడు.

    అంతలో ఆయన కేదో గుర్తుకు వచ్చింది. శరీరమంతా కితకితలు పెట్టినట్లయి మనసంతా సంపుల్ల మానమైంది. ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా, అమాంతంగా శారదాంబ రెండు చేతులు దొరక పుచ్చుకొని బలవంతంగా  దగ్గరకు లాక్కుంటూ "ఈ రాత్రి ఇలా నిల్చుని మన కొడుకు సంగతి మాట్లాడుకొంటూంటే జరిగిపోయిన మధుర స్మృతులేవో గుర్తుకు రావటంలేదూ! ఏమో బాబూ, నాకు మట్టుకు మనసంతా అదోలా అయిపోయింది" అన్నాడు.

    "వదలండి" అని శారదాంబ తల వొంచుకొంది.

    చిదంబరం తన చర్యకు తనే సిగ్గుపడి ఆమెను చప్పున వదిలేశాడు. ఈ విషయం తల్లికి చెప్పాలని ఆయనకు జ్ఞప్తి అయింది. ఇలా కులాసాగా వున్నప్పుడు ఈల వేసుకుంటూ పోవటం ఆయనకు అలవాటు. అమ్మతో చెప్పివస్తాను, అన్నం వడ్డించు" అని ఈలవేసుకొంటూ తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra