Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 3


    శృతి వారించలేదు బయటికి వెళ్తున్న డాక్టర్ సంఘమిత్రని. ఏ ఆలోచనల ఒరిపిడిలోనో నలుగుతూ ఆ విజ్ఞానఖని అప్పుడప్పుడూ అలా వెళ్ళడమూ ఆమెకు కొత్తకాదు.

    ఆ నీరవ నిశీథిలో డాక్టర్ మిత్రా నడుస్తున్నాడు.

    పది... పదిహేను... నిముషాలు గడిచాయి. తనక లక్ష్యంలేని ప్రయాణమనుకున్న డాక్టర్ మిత్రాకి తెలియదు. అతన్ని లక్ష్యంగా పెట్టుకొన్న ఓ గేంగ్ వెంటాడుతున్న విషయం...

    బషీర్ బాగ్ దాటుతుండగా పక్కన ఓ కారు ఆగింది...

    ఆయన తేరుకునేసరికే కారులోంచి నలుగురు వ్యక్తులు దిగడమూ, బలవంతంగా ఆయన్ని లోపలికి లాక్కుని కారు ముందుకి దూసుకుపోవడం చాలా వేగంగా జరిగిపోయింది.

    సరిగ్గా ఇదే సమయంలో...

    నిస్త్రాణంగా ఓ సోఫాలో కూర్చున్న డాక్టర్ శృతి...ఉలికిపాటుగా తలపైకెత్తింది ఏదో చప్పుడు కావడంతో.

    అక్కడ అంతసేపు కదలకుండా పడివున్న కుందేలు అప్పటికి ప్రాణం లేచివచ్చిన ఉత్సాహంతో టేబుల్ పై నుంచి దూకి ఆమె వైపుకి దూసుకువస్తూంది. డాక్టర్ సంఘమిత్ర ప్రయోగం ఫలించిన సాక్ష్యంగా.


                                                          *    *    *    *


    ఉదయం పదకొండుగంటల సమయం.

    భాగ్యనగరంపై మెరుస్తున్న ఎండ శవంపై కప్పిన తెల్లబట్టలా వుంది. వేగంగా పరుగెడుతున్న వాహనాలు పట్టించుకోని శవంపై పుట్టుకొచ్చిన బాక్టీరియా గుర్తుచేస్తున్నాయి.

    పైత్యం ప్రకోపించినట్టు ఓ కాకి కేకపెడుతూ ఆ వేళలో రాజధాని నడిబొడ్డులోని ఓ బిల్డింగ్ పై వాలింది. ఆ బిల్డింగ్ ముఖద్వారంపై డైరెక్టర్ జనరలాఫ్ పోలీస్, ఆంద్రప్రదేశ్ అన్న బోర్డుతోబాటు దాని ప్రాముఖ్యతని పరిరక్షిస్తున్నట్టు ఇద్దరు సాయుధులైన కానిస్టేబుల్స్ గేటు దగ్గరే కాపలాగా నిలబడి వున్నారు.

    రాష్ట్రంలోని పోలీస్ శాఖ కది అత్యున్నతమైన ఆఫీసు కావడంతో పైన కాకి గావుకేకలతోబాటు క్రింద ఖాకీ యూనిఫారాల కదలికలూ ఉధృతంగా వున్నాయి. విశాలమైన ఆవరణలో ఆగుతున్న పోలీస్ వాహనాలు ఇప్పుడు అక్కడొక అతి ముఖ్యమయిన రహస్య సమావేశం జరగబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

    సరిగ్గా పదకొండు పదిహేను నిముషాలకి ప్రభుత్వ వాహనంలో అక్కడి కొచ్చిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కారిడార్ లో నిలబడ్డ పోలీస్ అధికారుల అభివాదాన్ని అందుకుంటూ గంభీరంగా తన చాంబర్ వేపు నడిచారు.

    ఇప్పుడు బూట్లచప్పుళ్ళకి పైన కాకిసైతం కంగారుపడి పైకెగిరిపోయింది.

    ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడి అనాదిగా పదార్ధ లక్షణానికి కరిగే వయసు మొండితనానికి మధ్య జరిగే పోరాటానికి సాక్షిగా నిలబడ్డ రంగు వెలిసిన ఆ పింక్ కలర్ బిల్డింగ్ ఆవరణలోకి అప్పుడే వచ్చి ఆగింది ఓ పోస్టల్ వేన్...

    మామూలుగా ఉత్తరాలను టంచనుగా అందించే పోస్ట్ మేన్ కి బదులు ఆ రోజు వేన్ రావడంతో కానిస్టేబుల్స్ కొందరు ఆశ్చర్యపోయారు.

    అందులో తపాలాశాఖకి చెందిన ముగ్గురు ఉద్యోగులు వున్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసునుంచి వచ్చిన ఆ ముగ్గురు ఉద్యోగులూ వేన్ డోర్ తెరిచి సుమారు నాలుగడుగుల పొడవూ రెండడుగుల ఎత్తు వున్న ప్లయివుడ్ పార్శిల్ ని దించి ఓ వారగా వుంచారు.

    నిజానికి పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంనుంచి ఆ పార్శిల్ ని అలా తీసుకొచ్చి స్వయంగా అందించాల్సిన అగత్యం లేదు.

    పార్శిల్స్ కాస్త పెద్దవిగా వున్నప్పుడు డిజిపి ఆఫీసుకి తెలియచేస్తే చాలు. స్వయంగా పోలీసులే వచ్చి తీసుకువెళతారు... కాని ఈరోజు ఎన్నడూ చూడనంత పెద్ద సైజులో వున్న ఆ పార్శిల్ కాస్త అనుమానాస్పదంగా అనిపించింది.

    అదికూడా కాదు... ఆ రోజు వచ్చిన విఐపి ఉత్తరాల లిస్టు చెక్ చేస్తుంటే సార్టింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ కి ఈ పార్శిల్ వివరాలు కనిపించాయి. బయటికి వచ్చి పరిశీలనగా చూసిన సెక్షన్ సూపర్నంట్ పల్చటి ఇనుపతాళ్ళతో కట్టిన ఆ బాక్స్ సైజుని చూసి మాత్రమే కాదు. కంగారు పడింది.

    దానిపై పంపిన వాళ్ళ చిరునామా లేదు. కాని డైరెక్టర్ జనరల్ పోలీస్, హైద్రాబాద్ అని రాయబడిన ఎర్రని అక్షరాలు ఉన్నాయి. ప్రమాదానికి సూచనగా కనిపించింది ఆ ఎరుపు అక్షరాలు మాత్రమే కాదు దానిపై 'లెదర్ మెటీరియల్' అని కూడా రాయబడింది. 

    పార్శిల్ రిసీవ్డ్ సంతకం చేసిన డిజిపి పెయ్యే మార్గరెట్ బయటికి వచ్చి చూసింది...అప్పటికే పోస్టల్ వేన్ వెళ్ళిపోవడంతో విశాలమైన ఆవరణలో వున్న ఆ పెద్ద బాక్స్ శవం వున్న 'కాఫిన్' లా కనిపిస్తూంది.

    అయిదేళ్ళ సర్వీస్ లో యిలాంటి సదిగ్ధత ఆమెకెప్పుడూ రాలేదు. అసలు డిజిపి ఆఫీసుకి అంత పెద్ద పార్శిల్ రావడమే ఆమె ఊహకందనది.

    పార్శిల్ తెరిపించి చూడాలనుకుంటూ ఆగిపోయింది. ఒకపక్క దేశవ్యాప్తంగా విజృంభిస్తూన్న టెర్రరిజం జ్ఞప్తికిరాగా గబగబా బాస్ చాంబర్ వేపు నడిచింది.

    ఇంకా సమావేశం మొదలుకాలేదు...కాని సమీపంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె వెళ్ళేసరికి డిజిపి హోం మినిస్టర్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాడు...

    ఆమె ముఖకవళికల్ని గమనించగానే "వాట్ హేపెండ్?" అన్నాడు మౌత్ పీస్ పై చేతినుంచి...చెప్పింది తడబడుతూ.

    "ఓహ్...షిట్" సునాయాసంగా తీసిపారేశారు. "డోంట్ మేగ్నిఫై ది సీన్...యూ ఆర్ పియ్యె టు డైరెక్టర్ జనరలాఫ్ పోలీస్ ప్రొసీడ్!"

    మార్గరెట్ బయటికి వచ్చి వెంటనే కానిస్టేబుల్స్ ని పిలిచింది బాక్స్ తెరిపించే ప్రయత్నంగా.

    నిశ్శబ్దం ముసుగేసిన భయంతో అప్పటికే ఆమె ఫాలభాగంపై ముత్యాల్లా చెమట బిందువులు పేరుకున్నాయి.

    పైన చెక్కల్ని వూడబెరికేసరికి లోపల మరో డీల్ వుడ్ బాక్స్ కనిపించింది... "కవరు ఓపెన్ చేయండి చాలు" అప్పటికే తేరుకొని మార్గరెట్ భయ విహ్వలతని కప్పిపుచ్చుకుంటూ అంది.

    పై కవరుకున్న మేకుల్ని లాగుతున్నారు ఓ ఇనుప వూచతో.

    అయిదు నిముషాల ఆరు సెకండ్లు గడిచాయి.

    కవరు తీసేసారు.

    "ఇందులో ఏం వున్నట్టులేదే!" చీకటిగా వున్న పెట్టెలోకి చూస్తూ అన్నాడు కానిస్టేబుల్.

    అప్పటికి గానీ తేలికగా నిట్టూర్చలేకపోయింది. తను అనవసరంగా భయపడ్డాను అనుకుంటూ రెండడుగులు ముందుకు వేసింది.

    ఇక్కడ కానిస్టేబుల్ చేసిన చిన్న పొరపాటు పెట్టెలో ఏముందో తడిమి చూడాలని ప్రయత్నించడం...

    అప్పుడు అతడు పెట్టిన గావుకేక ఎంతవరకూ వినిపించిందీ అంటే డి.జి.పి.తో పాటు తక్కిన సిబ్బందీ ,వాళ్ళతోబాటు బయట రోడ్డుపై వెళ్తున్న జనమూ అటుగా పరిగెత్తుకొచ్చారు.

    కళ్ళు మిరుమిట్లుగొలిపే ఓ మెరుపు...

    మరుక్షణం బుస్ మంటూ తామరాకు డిప్పలాంటి పడగతో త్రాచు పైకి లేచింది.

    అక్కడది ఎంత వేగంగా కదిలిందీ అంటే ఒక్క ఉదుటున బయటికి దుమకడమేగాకుండా రెండో కానిస్టేబుల్ భుజంపై కూడా కసిగా కాటేసింది.

    జనం కకావికలైపోయారు.

    సుమారు అయిదడుగుల పొడవున్న ఆ విషనాగు అరక్షణం ఆలస్యమయితే మార్గరెట్ ఫాలభాగంపై కాటువేసేదే...

    ఓ ఆర్తనాదంతో ఆమె వెనక్కి పరుగెత్తింది.

    అంతదాకా నిశ్శబ్దంగావున్న పరిసరాలు భీతావహంగా మారాయి. నల్లని చారలతో లేత నీలంరంగులో వున్న నాగు క్రోధం, ద్వేషం కలగలిపిన బుసలతో శతృశేషాన్ని కడతేర్చే పాశుపతంలా అటూ యిటూ స్వైర విహారం చేస్తూంది.

    డిజిపి చేష్టలుడిగి చూస్తున్నాడు...అతడి ముప్పయ్యేళ్ళ సర్వీసులో యిలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడం తొలిసారి.

    అదిగో సరిగ్గా అప్పుడు జీప్ లో లోనికివచ్చాడు డిసిపి ప్రసన్న. ముందు అక్కడ జరుగుతున్నదేమిటో అతడికీ అర్ధం కాలేదు. అర్ధంకాగానే రివాల్వర్ అందుకున్నాడు.

    సూటిగా తనవేపే దూసుకొస్తున్న నాగుని క్షణం తేరిపార చూసాడు...కోరల్ని బయటికి సాచిన ఆ పాము అంతవరకూ ఒక అనూహ్యమైన భీభత్సాన్ని సృష్టించిందన్న ఆలోచన స్పురించగానే ప్రసన్న చేతిలో రివాల్వర్ నిప్పులు కక్కింది.

    ఒకటి...రెండు...మూడు...

    విషనాగు పడగ చిట్లిపోయింది.

    నేలకొరిగేక సైతం కసితో ఒంటిని ముడతలుగా చుట్టుకుంటూ తోకతో భూమిని కొడుతూంది.

    ఓ మారణహోమం ఆగింది.

    తుఫాను తర్వాత వెలిసిన ప్రశాంతత అక్కడ...అప్పటికి తేరుకున్న డిజిపి వేగంగా ముందుకొచ్చి వెంటనే యిద్దరు కానిస్టేబుల్స్ కీ ప్రథమ చికిత్స చేయటంలో నిమగ్నమై మరో రెండు నిముషాల వ్యవధిలో హాస్పిటల్ కి పంపేడు...      

 Previous Page Next Page