సిద్దేశ్వరి నవ్వింది. చక్రవర్తి ఆ ప్రశ్నకి జవాబు యిచ్చాడు. "దేవీ ప్రతిరోజూ నాలుగయిదు గంటలపాటూ ఒక పెట్టెలో కూర్చుని దేవుని ప్రార్థిస్తారు. ఆ పెట్టెలో గంటకన్నా ఎవ్వరూ కూర్చోలేరు."
దార్కాకి నవ్వొచ్చింది. బిస్తాలో కుర్రవాళ్ళు ఆడుకునే ఆటల్లో నేలలో తలదూర్చి ఒంటెలా గంటల తరబడి వుండిపోవడం గూడా ఒక ఆట.
"నీ చేతులు గాలిలోకి సాచు నాయనా"
ప్రతిజ్ఞ చేస్తున్నవాడి భంగిమలో దార్కా చేతులు సాచేడు 'అలాక్కాదు' అంటూ ఆమె సరిచేసి "గుప్పెళ్ళు ముయ్యి నాయనా" అంది.
అతడు మూసేడు.
శివుడి విగ్రహం ముందు అగరొత్తి వెలుగుతుంది.
"నాయనా లింగపు నుదుటిమీద అడ్డంగా వ్రాసిన బూడిద చాలా పవిత్రమైంది. లింగం కన్నా అది గొప్పది. నా మహిమవల్ల నేను ఆ పవిత్ర భస్మాన్ని నీ చేతుల్లో సృష్టించదల్చుకున్నాను. ఇప్పటి వరకూ, బాబాలు, ఋషులూ తమ చేతుల్తోనే వాటిని సృష్టించి భక్తులకు ఇచ్చేవారు కానీ ఈ రోజు నా కున్న సమస్త శక్తుల్నీ వినియోగించి ఆ భస్మాన్ని నీ చేతిలోనే సృష్టించబోతున్నాను. ఈ క్షణమే నిన్ను నా శిష్యుడిగా స్వీకరించబోతున్నాను"
సిద్దేశ్వరి అగరొత్తు పొడిని అతడి కుడిచేతి పిడికిలిమీద చల్లింది.
"భగవంతుడి అపూర్వమైన శక్తి నా నుంచి నీకు ప్రవహించబోతూంది. ఈ ప్రపంచంలో పెరిగిపోతున్న పాపులను రక్షించడానికి భగవంతుడి తరపున వచ్చిన ప్రతినిధిని నేను. నా ఆజ్ఞ ప్రకారం నీకు గొప్ప మేలు జరగబోతూంది నాయనా. నీ ఎడమ చెయ్యి విప్పు."
దార్కా కళ్ళు విప్పి తన చేతులవైపు చూసుకున్నాడు. పిడికిళ్ళు మూసుకునే వున్నాయి. కుడి చెయ్యిమీద అగరొత్తులు తాలూకా బూడిద అలాగే వుంది. అతడు తన ఎడమ చేతి పిడికిలిని నెమ్మదిగా విప్పేడు.
అరచేతి మధ్యలో బూడిద -క్షమించాలి. లింగపు నుదుటిమీద రాసే పవిత్ర భస్మం మెరుస్తూ వుంది.
10
కాకతాళీయంగా జరిగే సంఘటనల గురించీ మనుష్యులీద వాటి ప్రభావం గురించీ, కాకతాళీయంగా జరిగే పరిచయాలు ఎంత బలంగా పెనవేసుకుపోతాయన్నదీ, ఇంతకుముందొకసారి ప్రస్తావించడం జరిగింది. శారదకి ప్రొఫెసర్ జయదేవ్ తో జరిగిన పరిచయం అలాంటిదే.
అలాటి పరిచయమే అబ్రకదబ్రకీ, పండిత్ కీ మధ్య జరిగింది. తులసి పంతొమ్మిదో పుట్టినరోజు జరిగిన పార్టీలో ఆమె వాళ్ళిద్దర్నీ ఒక్కొక్కరికి పరిచయం చేసింది. అప్పుడెక్కువ మాటలు జరగలేదు.
మళ్ళీ ఇన్నాళ్ళకి, లైన్స్ క్లబ్ ఫంక్షన్ లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది, కాక్ టైల్స్ మధ్య.
మామూలుగా ఇధ్దరు కలుసుకుంటే సినిమాని గురించో, రాజకీయాల గురించో మాట్లాడుకుంటారు. కానీ పండిత్ లాటి వాళ్ళు కంప్యూటర్ల గురించీ, డాల్డన్ ధియరీ గురించీ మాట్లాడతారు.
అబ్రకదబ్రతో పండిత్ మనిషి మెదడు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు.
"సృష్టి చాలా విచిత్రమైనది. ఈ ప్రపంచాన్ని మానవాతీత శక్తిఏదో నడిపిస్తూందని నమ్మేవాళ్ళు వాదనకి బలం చేకూర్చే విషయం ఒకటుంది. అది 'మెదడు' ఒక చిన్న చీమ మెదడులాంటి కంప్యూటర్ తయారు చెయ్యాలంటే ఎన్నో మిలియన్ల సర్క్యూట్స్ ని అమర్చాలి. దేముడూ అనే వాడు అని నమ్మితే, అతడి అద్భుత సృష్టి మెదడు. మనిషి విలువైన అవయవాల్ని దేముడు అని భద్రమయినచోట అమర్చాడు. ఎముకల వెనుక గుండెనీ, క్రొవ్వు మధ్య కిడ్నీస్ నీ, ఇలా అయితే అన్నింటికన్నా విలువైన మెదడు విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకున్నాడు. ఒక ఇనప్పెట్టెలాంటి స్కల్ లో దాన్ని పెట్టేడు. అది చాలదన్నట్టూ ఆ ఇనప్పెట్టెలో పెరిబ్రోస్సినల్ ద్రవం పోసేడు. ఆ ద్రవంలో తేలుతూ మెదడు రాపిడి నుండి రక్షించబడుతుంది. ఆ ద్రవమే మెదడుని అన్ని వైపులనుంచీ నొక్కుతూ కదలకుండా ఉంచుతుంది.
మనిషి మెదడులాంటి కంప్యూటర్ ని తయారు చెయ్యాలనుకొంటే దానికి ఎలక్ట్రానిక్ సెల్స్ కంటే, అంతకన్నా ఎక్కువ పవరుగల మనిషి నరాల కణాల్ని ఉపయోగించవచ్చనే కొత్త థియరీని నేను ప్రతిపాదిస్తున్నాను"
ఎవరో అడిగేరు "మనిషి మెదడుని తొలగించి ఆ స్థానంలో కంప్యూటర్ ని అమర్చవచ్చంటారా" అని
"అమర్చవచ్చు."
"ఇదేదో చందమామ కథలా వుంది" ఓ మూలనుండి సన్నటి స్వరం.
అందరూ ఘొల్లుమన్నారు. అబ్రకదబ్రకి కూడా నవ్వొచ్చింది.